అలనాటి అపురూపాలు-41

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

డబ్బింగ్ సినిమాల సంగీతపు రారాజు – స్వరకర్త ఎం. రంగారావు:

తెలుగువారై ఉండి, కన్నడ చిత్రసీమలో విశేషంగా రాణించిన సంగీత దర్శకుడు ఎం. రంగారావు గురించి ఈ వారం తెలుసుకుందాం.

వీణ రంగారావుగా సుప్రసిద్ధులైన ఎం. రంగారావు కాకినాడలో 26 ఏప్రిల్ 1922నాడు జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన అనంతరం, చిన్ననాటి నుంచి వీణ వాయించటంపై ఉన్న ఆసక్తి కారణంగా, పై చదువులు ఆపేసారు. తన తల్లి అలివేలమ్మ గారి నుంచి వీణ వాయించటం నేర్చుకున్నారు. పుట్టుక తోనే స్వర జ్ఞానం అబ్బిందేమో, ఎనిమిదేళ్ళ వయస్సుకే వీణపై శాస్త్రీయ సంగీతాన్ని అద్భుతంగా వాయించగలిగారు. పైగా ఆయన ఏకసంథాగ్రాహి. ఏ గీతాన్నయినా ఒక్కసారి నేర్చుకుంటే, దాన్ని వీణపై అవలీలగా వాయించేవారు.

1942లో ఆయన బెంగుళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఇంజన్ ఇన్‍స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. రెండేళ్ళ తరువాత, ఉద్యోగానికి రాజీనామా చేశారు, మద్రాసు వెళ్ళి వీణలోనూ, సంగీతంలోనూ తన అభిరుచిని కొనసాగించాలనుకున్నారు. అంతకుముందే ఆయన ప్రతిభ గురించి విని ఉండడంతో, మద్రాసులో చిత్రపరిశ్రమలో ఆయనకి ప్రవేశం సులువుగా దొరికింది. ‘త్యాగయ్య’, ‘స్వర్గసీమ’, ‘యోగి వేమన’ వంటి చిత్రాలలో వినిపించే వీణానాదం ఆయన వాయించినదే. ఆ సమయంలో రంగారావు ఘంటసాలకి సన్నిహితులయ్యారు. ఘంటసాల ఆర్కెస్ట్రాలో చేరడమే కాకుండా – అప్పట్లో ఘంటసాల సంగీత దర్శకత్వం వహిస్తున్న ‘కీలు గుర్రం’, ‘మన దేశం’, ‘లక్ష్మమ్మ’ – చిత్రాలకు సహాయ సంగీత దర్శకులుగా పనిచేశారు రంగారావు.

తర్వాత కొద్ది కాలానికి బాంబే ఫిల్మ్స్ డివిజన్ వారి నుంచి అవకాశం వచ్చింది. ఆ గొప్ప అవకాశాన్ని స్వీకరించాలా వద్దా అని కొద్దిగా సంశయించారు. స్వరకర్త ఆదినారాయణ ఆయనను బొంబాయి వెళ్ళకుండా ఆపి, తన వద్ద సహాయకునిగా నియమించుకున్నారు. రంగారావు – ఆదినారాయణ గారి వద్ద – ‘తిలోత్తమ’ (1951), ‘మాయలమారి’ (1951), ‘పరదేశి’ (1953), ‘అనార్కలి’ (1955), ‘అన్నదాత’ (1954) –  వంటి సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. అదే సమయంలో రంగారావు సుప్రసిద్ధ సంగీత దర్శకులు టి.వి.రాజు గారికి కూడా సన్నిహితులయ్యారు. ఆయన సంగీతం దర్శకత్వం వహించిన ‘పిచ్చిపుల్లయ్య’ (1953) సినిమాకు సహాయకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాకి పని చేస్తుండగా, తమిళ చిత్రం ‘యేష్ముది మన్నన్’ కు సంగీతం చేసే అవకాశం లభించింది. ఎం.ఎస్. విశ్వనాథన్ గారి సన్నిహితుడు రామమూర్తి… టి.కె. రామమూర్తి ఈ సినిమాకి రంగారావుకి సహాయకుడిగా వ్యవహరించారంటే గొప్ప విషయమే! ఇద్దరూ కలిసి నాలుగు పాటలకి సంగీతం కూర్చారు, కానీ ఆ సినిమా ఆగిపోయింది.

తరువాత ఎడిటర్ జోషి నిర్మాణంలో జి.వరలక్ష్మి నటించిన ‘పసుపు కుంకుమ’ (1955) చిత్రానికి సంగీతం అందించే అవకాశం లభించింది. అనిశెట్టి అందించిన గీతాలకు రంగారావు చక్కని సంగీతం అందించారు. ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, జిక్కీ, రావు బాలసరస్వతి ఈ పాటలను పాడారు. తరువాత రంగారావు ‘గీతాంజలి’ పేరిట సొంత ఆర్కెస్ట్రాని ఏర్పాటు చేసుకున్నారు. తన సొంత ఆర్కెస్ట్రా తోనే అర్ధాంగి, సక్కుబాయి, అంతా మనవాళ్ళే, నిరుపేదలు, ఏది నిజం చిత్రాలలోని అన్ని పాటలకు సంగీతం సమకూర్చారు. ‘సుమంగళి’, ‘ఇవన్ అవనేదాన్’ వంటి తమిళ చిత్రాలకు కూడా సంగీతం అందించారు. ‘భక్త కనకదాస’, ‘స్వర్ణగౌరి’ అనే కన్నడ చిత్రాలకు – సుప్రసిద్ధ కన్నడ సంగీత దర్శకులు ఎం.వి.రాజుకి సహాయకుడిగా వ్యవహరించారు. భక్త కనకదాస చిత్రానికి సంగీతంలో జాతీయ అవార్డు కూడా లభించింది. భక్త కనకదాస చిత్ర నిర్మాతలలో ఒకరైన డి. ఆర్. నాయుడు రంగారావుగారి నైపుణ్యాన్ని గుర్తించి తన చిత్రం ‘కావేరి’కి సంగీత దర్శకత్వం చేయవల్సిందిగా కోరారు. ఈ చిత్రం విడుదల కాకముందే పాటలు జనాదరణ పొందాయి. కన్నడంలో శ్రీకాంత్ అనే చిత్రం నిర్మించిన శ్రీకాంత్ ఫిల్మ్స్ యజమాని, నిర్మాత మధుభాయ్ పటేల్ – తెలుగులో హిట్ అయిన ‘పిడుగు రాముడు’ సినిమాని తమిళంలో డబ్ చేస్తూ, సంగీతం అందించవలసిందిగా రంగారావుని కోరారు. అప్పటికే రంగారావు డబ్బింగ్ సినిమాల సంగీతపు రారాజుగా ఉన్నారు. కన్నడంలో వందకు పైగా డబ్బింగ్ సినిమాలకు సంగీతం కూర్చారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం స్వరం నచ్చటంతో, కన్నడ చిత్రాలలో బాలుగారితో ఎక్కువగా పాడించారు. రంగారావు గారి వల్లే బాలూకి కన్నడ చిత్ర సీమలో పేరు ప్రఖ్యాతులు లభించాయంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పటికే లబ్ధప్రతిష్ఠులైన సంగీత దర్శకులు తెలుగు చిత్రసీమని ఏలుతున్నందున రంగారావు తెలుగులో అంతగా సినిమాలు చేయలేకపోయారు. తెలుగువారైన రంగారావుగారు కన్నడ చిత్రసీమలో గొప్ప పేరు తెచ్చుకోవడం, ఉత్తమ సంగీత దర్శకుడిగా మూడు సార్లు రాష్ట్ర అవార్డు అందుకోవడం విధిలీల!

రంగారావు ఎం. శ్యామలా దేవిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు (ఎం. మహంకాళి రావు, ఎం. రామకృష్ణారావు), ఇద్దరు కుమార్తెలు (సత్యవాణి, నాగలక్ష్మి) ఉన్నారు. ఆయన మరణించిన అయిదు నెలలకి, 1991లో రిపబ్లిక్ డే రోజున వారి భార్య శ్యామల కూడా మరణించారు.

వారు పనిచేసిన సినిమాలు, పొందిన అవార్డుల వివరాలకు ఈ క్రింది లింక్ చూడవచ్చు.

https://en.wikipedia.org/wiki/M._Ranga_Rao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here