ఇంగ్లీష్ సాహిత్యంలో ఎప్పటి నిలిచి పోయే ప్రేమ కావ్యం – జేన్ ఐర్

1
3

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

ఇంగ్లీష్ సాహిత్యంలో వచ్చిన ఎన్నో రొమాంటిక్ నవలలో రెండు నవలలు సాహిత్యపరంగా విశేషమైన ఆదరణకు నోచుకున్నాయి. ఒకటి చార్లొటె బ్రాంటి రాసిన జేన్ ఐర్, రెండవది జేన్ ఆస్టన్ రాసిన ప్రైడ్ అండ్ ప్రెజిడీస్. ఎన్ని నవలలు తరువాతి కాలంలో ఇదే ఇతివృత్తంతో వచ్చినా ఈ నవలలు మాత్రం ఎప్పటికీ టాప్ సెల్లింగ్ లిస్ట్‌లో నిలిచి ఉన్నాయి. ఇవాళ జేన్ ఐర్ గురించి చెప్పుకుందాం.

1847లో వచ్చిన ఈ నవల ఆ రోజులో చాలా ప్రొగెసివ్ భావాలతో రాసిన నవలగా చెప్పుకోవచ్చు. రచయిత్రి శైలి ఈ నవల ప్రత్యేకత. అందుకే ఎన్ని సార్లు చదివినా నవల బోర్ కొట్టదు. జేన్ అనే ఒక యువతి బాల్యం నుండి ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకునే వరకు కథ నడుస్తుంది. చాలా మంది ఆ తరువాత వివిధ భాషలలో ప్రేమ కథలు రాసిన రచయితలు ఈ నవలను స్ఫూర్తిగా తీసుకున్నారని మనకు అర్థం అవుతుంది. ఉత్తమ పురుషలో సాగే ఈ రచన అప్పట్లో ఒక ప్రయోగం. జేన్ ద్వారా స్వయంగా ఆమె కథ చెప్పిస్తారు రచయిత్రి. అప్పట్లోని సామాజిక నియమాలు, మతం ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన తీరు, ఇవన్నీ మనం ఆ నవలలో వచ్చే పాత్రల ద్వారా అర్థం చేసుకోవచ్చు. చిన్నప్పటి నుండి జేన్ తాను నిజం అనుకున్న వాటినే నమ్మి ఆచరించే వ్యక్తిగా కనిపిస్తుంది. తాను ఏం చేయాలనుకుంటుందో, తనకు ఏం కావాలో చిన్నతనం నుండే ఒక స్పష్టత, అవగాహనతో ఆమె తన జీవితంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అనాథగా బంధువుల ఇంట్లో బాల్యాన్ని గడుపుతున్నప్పుడు కూడా ఆమెలో ఒక స్పష్టత ఉండేది. ఆ ఇంటి యజమానురాలు ఆమెపై చూపే హింసను భరించడానికి ఒప్పుకునేది కాదు. శిక్షకు కూడా భయపడకుండా ఆ ఇంటి వ్యక్తులను ఎదిరించేది. దాని వలన ఆ ఇంట్లోని వ్యక్తులు ఆమెను ఇంకా హింసించేవారు. తమకు లొంగని ఆమెలోని ధైర్యం కారణంగా ఆమెను ద్వేషించేవారు, చివరకు ఆమెను ఆ ఇంటి నుండి బోర్డింగ్ స్కూలుకి పంపేస్తారు. ఆ ఇంట్లో పని చేసే బెస్సీ మాత్రమే ఆమెపై సానుభూతి చూపిస్తూ ఉంటుంది. ఆ ఇంటి నుండి పంపిస్తూ జేన్ చాలా మోసపూరిత స్వభావం కలది అంటూ ఆమెను వదిలించుకుంటున్న ఆ కుటుంబాన్ని అప్పుడు కూడా ప్రతిఘటించి జీవితంలో మళ్ళీ ఎప్పుడూ వారిని తాను బంధువులుగా అనుకోనని చెప్పి బైటికి వెళుతుంది జేన్. అప్పుడు ఆమె వయసు పది సంవత్సరాలు మాత్రమే.                                                      

లోవుడ్ అనాథ శరణాలయంలో ఆమె ప్రవేశిస్తుంది. అక్కడ తనకన్నా పెద్దదైన హెలెన్ అనే ఆమ్మాయి ఆమె స్నేహితురాలవుతుంది. అనాథ శరణాలయంలో ఆడపిల్లలందరివీ దీన గాథలే. శరణాలయం పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉంటాయి. అయినా అందులో ఇమిడి పోవాలని ప్రయత్నిస్తుంది జేన్. హెలెన్  మౌనంగా అక్కడ భరిస్తున్న అన్యాయాలని చూసి ఆమెను ఎదురు తిరగమని చెబుతుంది జేన్. కాని హెలెన్ కొన్ని సార్లు పరిస్థితులకు తల ఒగ్గడం మంచిదని ఓపిక చాలా సమస్యలను పరిష్కారం అని చెబుతుంది. భిన్న దృవాలు గల ఈ ఇద్దరు మంచి స్నేహితులవుతారు. ఇద్దరికీ పుస్తక పఠనమే గొప్ప రిలీఫ్. అక్కడే జేన్ వ్యక్తిగా ఎదుగుతుంది. శరణాలయంలో సరయిన తిండి లేక చలికాలంలో తమను కాపాడుకోవడానికి సరి అయిన బట్టలు లేక అక్కడ పిల్లలు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది పిల్లలు అనారోగ్యంతో మరణిస్తారు. హెలెన్ కూడా అలాగే చనిపోతుంది. ఆ తరువాత ఆ శరణాలయ నిర్వాహకుల అన్యాయాలు బైటకు వచ్చి ప్రజలు రెచ్చిపోయి కొన్నిమార్పులు అక్కడ జరిగేలా చూస్తారు. కాని అప్పటికే ఎందరో పిల్లలు నిర్వాహకుల నిర్లక్ష్యానికి బలి అవుతారు. హెలెన్ మరణం జేన్‌ను ఒంటరిని చేస్తుంది. ఆ శరణాలయంలో ఉండలేక పోతుంది. ఆరు సంవత్సరాల శరణాలయ జీవితం తరువాత ఇక అక్కడి నుండి జేన్ గవర్నెస్‌గా ఒక ఉద్యోగం సాంపాదించుకుని బైటపడుతుంది.

ఒక చిన్న ప్రెంచ్ అమ్మాయికి చదువు చెప్పి బాగోగులు చూసుకోవడానికి ఆమె ఒప్పుకుని ఎంతో దూరం ప్రయాణించి థార్న్ఫీల్డ్ హాల్ చేరుకుంటుంది.

ఆ ఎస్టేట్ యజమాని రాచెస్టర్ ఒక నలభై సంవత్సరాల బాచిలర్. ఈ చిన్న పాపకు సంరక్షకుడు. పందొమ్మిది సంవత్సరాల జేన్ ఆ ఇంట్లో పరిస్థితులకు అలవాటు పడడానికి కొంత సమయం తీసుకుంటుంది. రాచెస్టర్ ప్రవర్తన కొంత వింతగా అనిపించినా అతనితో ప్రేమలో పడుతుంది. డబ్బున్న ఒక అవివాహితుడుగా ఎందరో స్త్రీలు అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి ఇద్దరి మధ్య గట్టిపడే అనుబంధాన్ని రచయిత్రి అద్బుతంగా చిత్రిస్తారు. జేన్‌ని రాచెస్టర్ వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాని అదే రోజు అతనికి అంతకు ముందే ఒక భార్య ఉన్న సంగతి బైటకు వస్తుంది. ఆమె అదే ఇంట్లో ఉంటుందని, మతి భ్రమించి ప్రమాదకర వ్యక్తిగా తయారయ్యిందని ఆమె భాద్యత రాచెస్టర్ తీసుకున్నాడని జేన్‌కి తెలుస్తుంది. ఆమెని మోసంతో రాచెస్టర్‌కి కట్టబెట్టారని అర్థం అవుతుంది. కాని జీవితంలో ప్రేమను అనుభవించాలని రాచెస్టర్ జేన్‌ని వివాహం చెసుకోవాలను కుంటాడు. కాని భార్య బ్రతికి ఉండగా వీరి వివాహం చెల్లదు. అక్కడ తాను ప్రేమించిన వ్యక్తిని పొందలేక అతనితో వివాహం కాకుండా ఉండలేక జేన్ ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తన నమ్మకాలను విరుద్దంగా ప్రేమ కోసం కూడా జీవించడానికి ఆమె ఒప్పుకోదు.

ఒక చిన్న పల్లెటురిలో ఉద్యోగం వెతుక్కుని అక్కడకు జేన్ వెళ్ళిపోతుంది. తండ్రి తరుపు చుట్టరికం ఎదో వారితో ఆమెకు ఉందని తరువాత తెలుస్తుంది. ఒక బంధువు ద్వారా కొంత ఆస్తి ఆమెకు అప్పుడు సంక్రమించినా అది అవసరంలో ఉన్న ఆ బంధువులకే రాసి తనను వివాహం చేసుకోవాలని అనుకున్న మరో బంధువుని నిరాకరించి భారతదేశంలో మిషినరీ పనికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకుంటుంది. కాని ఎందుకో ఆమెకు రాచెస్టర్ తనని పిలుస్తున్నట్లు పదే పదే అనిపిస్తూ ఉంటుంది. చివరి సారి అతన్ని కలవాలని ఆమె మళ్ళి అతని ఎస్టేట్‌కు వెళుతుంది. అక్కడ ఆమెకు కాలిపోయిన రాచెస్టర్ ఇల్లు కనిపిస్తుంది. రాచెస్టర్ భార్య అంతకు ముందు కూడా పిచ్చిలో ఆ ఇల్లు కాల్చాలని రాచెస్టర్‌ను చంపాలని కొన్ని సార్లు ప్రయత్నిస్తుంది. ఈ సారి ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఇల్లు కాలి, ఆ మంటల్లోనే ఇంటిపై నుండి దూకి ఆమె మరణీస్తుంది. ఆమెను రక్షించే ప్రయత్నంలో రాచెస్టర్ ఒక చేతిని, కంటి చూపును పోగొట్టుకుంటాడు. అతన్ని జేన్ అప్పుడు వివాహం చేసుకోవడం, ఆ తరువాత ఒక కంటి చూపు రాచెస్టర్ తిరిగి పొంది తనకు పుట్టిన బిడ్డను చూసుకోవడంతో కథ ముగుస్తుంది.

జేన్ ఐర్ ఒక చక్కని ప్రేమ కథ. విలువలు భాధ్యతలు జీవితంలో అతి ముఖ్యమని నమ్మే పాత్ర జేన్. ఆమెకు రాచెస్టర్  మధ్య ఉన్న అనుబంధాన్ని రచయిత్రి వర్ణించిన తీరు నవలకు ప్రాణం. నాకు ఎందుకో యద్దనపూడి గారి రచనలు ఈ నవల ప్రభావంతో రాసినవి ఏమో అనిపించింది. అంతగా ఈ నవలతో కనెక్ట్ అవగలరు తెలుగు పాఠకులు. రాచెస్టర్‌కు జేన్‌కి మధ్య వయసులో చాలా తేడా వుంటుంది. వారి ఇద్దరి మధ్య నడిచే సంభాషణ, తన ఆత్మాభిమానం కోసం జేన్ పడే తాపత్రయం యద్దనపూడి కథానాయికలను నాకు చాలా సార్లు గుర్తుకు తీసుకువచ్చింది. ఆ నవలను యద్దపూడి గారు కాపీ కొట్టారనే నింద వేయను కాని హీరో హీరోయిన్ల మధ్య పెరిగే అనుబంధంలో చాలా సార్లు జేన్ ఐర్ అంశ యద్దనపూడి గారి నవలలో నాకు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ప్రేమను పూర్తిగా ఇంగ్లీష్ నవలలు శారీరికం చేసిన తరువాత కూడా జేన్ ఐర్ నవల పాపులారిటీ యూరోపియన్ దేశాలలో తగ్గలేదు అంటే ప్రేమ పట్ల మానవ సమాజంలో ఒకే రకమైన భావాలు ఉంటాయని, అవి కాలక్రమేణా పరిణామం చెంది  గాడి తప్పాయని అర్థం అవుతుంది. జేన్ పాత్ర ఇంగ్లీష్ నవలా నాయికలలో చాలా బలమైన గొప్ప పాత్ర. సొంత వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పాత్రల గురించి చెప్పుకునేటప్పుడు ఈ పాత్ర ప్రస్తావన ఎప్పుడూ వస్తుంది. డబ్బుకి, హంగులకు, ఏ మాత్రం లొంగక ప్రేమకు పెద్ద పీఠం వేసి చివరకు రాచెస్టర్‌ని మనస్పూర్తిగా వివాహం చేసుకుని ఇరువురి జీవితాలను ఆనందమయం చేసుకునే జేన్ పట్ల గౌరవం కలుగుతుంది.

రాచెస్టర్ వద్ద ఉద్యోగం కోసం వచ్చినప్పటి నుండి జేన్ అతన్ని మాస్టర్ అనే పిలుస్తుంది. కాని అతనికి ఎక్కడా లొంగదు. అతనికే కాదు తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ఎన్ని ఆకర్షణలకు కూడా లొంగకుండా తన మనసును అన్ని ప్రలోభాలనుండి తప్పించుకుని తనను తాను కాపాడుకుంటుంది. ఇతరులను సంతృప్తి పరుస్తూ వారి మెప్పు కోసం ఆమె చిన్నప్పటి నుండి బ్రతకలేదు. మొదటి నుండి చివరి దాకా చాలా స్పష్టతతో నిర్ణయాలు తీసుకుంటుంది. విడాకులు అమలులో లేని ఆ కాలంలో వివాహం అయి ఒక భార్య ఉన్న రాచెస్టర్‌పై ఎంత ప్రేమ ఉన్నా అతనితో ఉండడానికి జేన్ ఇష్టపడదు. అలా అని సౌకర్యవంతమైన జీవితాన్ని అండను ఆశించి తనను కోరి వివాహం చేసుకుంటానని ప్రతిపాదించిన పాస్టర్‌తో కలిసి పని చేయడానికి ఒప్పుకుంటుంది కాని అతన్ని వివాహం చేసుకోదు. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో అన్నది ఆమె అభిమతం కాదు. రాచెస్టర్ అన్ని పోగొట్టుకుని అనాకారిగా మరొకరి దయా దాక్షణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు అతను జేన్ పట్ల ప్రేమ ఉన్నా ఆమె భవిష్యత్తు కోసం ఆమెకు దూరం ఉండాలని చూసినా జేన్ అతన్ని కోరి వరిస్తుంది. అతని భార్యగా ఉండడమే తన నిర్ణయం అని చెబుతుంది. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పాత్రల్లో జేన్ పాత్ర గుర్తుండి పోతుంది. పోయిటిక్ ఫీల్‌తో ఈ నవల సాగిపోతుంది. ఇది చదవడం ఒక చక్కని అనుభవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here