99 సెకన్ల కథ-28

6
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. పద్మిని చూసింది…?

పతిదేవుడు సగం బట్టతల బ్రహ్మాజీకి ఆ సాయంత్రం తాజ్ నక్షత్రాల హోటల్లో అతనికి తెలియకుండా అతి ముఖ్యమైన బంధుమిత్రులతో 30వ జన్మదినోత్సవానికి ఏర్పాటు చేసిన పద్మిని అతన్ని ఆ కళాశాల నుంచే తీసుకెళ్ళాలని బయల్దేరింది. అయిదవుతోంది కాబట్టి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహాశయుడికి క్లాసులు అయిపోయి ఉంటాయి.

పద్మిని ఆ మహిళా కళాశాలకి చేరేసరికి బ్రహ్మాజీ క్యాంటీన్లో ఉన్నాడని మరో లెక్చరర్ చెప్పారు. వెళ్ళేసరికి, సంభ్రమంలో మునిగిపోయింది. అతని విద్యార్ధినీమణులు అతని మొహానికి కేకులు పూస్తున్నారు. “సంతోషం ఈ జన్మదినం” అంటూ పాటలుపాడుతూ అతని చుట్టూ మూగిపోయారు. అతని మీద పడిపోతున్నారు. కేరింతలు, పకపకలు, కోకాకోకాల మూతలులేపి చివ్వున అతని మొహం మీదపడేలా చిందించటాలు….! అందులో ఓ తెల్ల గుంట మళయాళంలో ఏదో మాట్లాడుతూ ఈ ఛాయతక్కువ పి.డి చెవిలో గుసగుసలాడేస్తోంది. తన్మయత్వం కాబోలు –

ఈ పి.డి సగం కళ్ళుమూసుకొని చిరునవ్వులు చిందిస్తూన్నాడు.

తెల్లగా మెరిసిపోతూ సినిమా తారలాంటి తను ఉండగా ఈ సగం బట్టతల, ఛాయతక్కువ పి.డి.కి ఈ గుంటలతో ఆ వికవికలు పకపకలు ఏమిటో అనుకొంటూన్న పద్మినికి ఒళ్ళంతా కుతకుతలాడిపోయింది.

మొత్తం మీద పి.డికి మొహం కడిగించి, తను తెచ్చిన కొత్త బట్టలు తొడిగించి, తాజ్‌కి లాక్కువెళ్ళి, అక్కడ అతన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తేలా జన్మదినోత్సవం జరిపించింది.

ఆ రాత్రి తాజ్ నుంచి ఇంటికొచ్చేసరికి పదిదాటింది.శృంగారశయ్య మీదకి చేరబోతుండగా, బ్రహ్మాజీ చరవాణి మోగింది. ఫోన్ ఎత్తాడు.

అంతే !

“పద్దూ, నువ్వు పడుకో. నేను ఓ గంటలో వచ్చేస్తాను” అంటూ బ్రహ్మాజీ హడావుడిగా పాంటు తొడిగేస్తున్నాడు. పద్మినికి ఒక్కసారి నీరసం వచ్చింది. అతను తయారయ్యేలోపల ఆ చరవాణిలోకి ఓ చూపుచూసింది.

‘కేరళ మీనా’ నుంచి వచ్చిన కాల్ అది. పద్మినికి క్షణాల్లో బల్బు వెలిగింది. సాయంత్రం ఈ పి.డి చెవిలో గుసగుసలాడిన మళయాళీ గుంటని ఎవరో పిలిచారు ‘మీనా ‘అని. అంటే, అదే ఇదా!

“ఏమిటి అంత హడావుడి?” పద్మిని ప్రశ్న.

“మళ్ళీ వచ్చాక చెప్తాను” పి.డి హడావుడిగా కారెక్కేశాడు.

పద్మినికి మనసు పాడైపోయింది… ఈ రాత్రి తనది కాకుండా పోతోంది. రెండేళ్ళక్రితం పెళ్ళప్పుడే తనకి బ్రహ్మాజీ నచ్చలేదు. డాక్టరేట్ చేశాడు, మంచి భవిష్యత్తు ఉన్నవాడు అంటూ ఆ శేషయ్య తాతగారు అంటగట్టాడు ఈ సగం బట్టతల, ఛాయ తక్కువ మొగుణ్ణి. ఆరడుగులు ఉన్నాడు కదా అని రాజీ పడిపోయింది. మంచివాడే. కాని మితభాషి. ఎప్పుడూ ఏదోఒకటి చదువుతూనే ఉంటాడు. ఆ గుంటల కళాశాలలో ఉద్యోగం. ఆ పి.జి చదివే గుంటలు … అమ్మయ్యో!

భయం. అంతరాత్రి తనకు కారణం చెప్పకుండా ఆ కేరళ గుంట ఫోను విని పరుగెట్టాడు. అక్కడ ఏం జరగబోతోంది???

రాత్రంతా నిద్రపట్టలేదు పద్మినికి. బ్రహ్మాజీ నుంచి ఫోన్ రాలేదు. ‘నేను ఎందుకు చేయాలి? నేనూ ఎమ్మే చదివాను.’ అహంభావం పొడుచుకు వచ్చింది.

సగం రాత్రి దాటాక నిద్రలోకి జారుకుంది.

మెలకువ వచ్చేసరికి అయిదవుతోంది. ఇంకా పి.డి రాలేదు. ఫోనూ రాలేదు.

బెంగ, భయం, అభద్రత …!!!

శేషయ్య గారికి ఫోన్ చేసింది. ఖంగారు ఖంగారుగా జరిగిందంతా చెప్పింది.

“తాతగారు, భయంగా ఉంది.”

“తెల్లవారేదాకా చూద్దాం… బ్రహ్మాజీ మీద నాకు నమ్మకం ఉంది.” తాపీగా చెప్పారు శేషయ్య.

“ఇంకా ఏం నమ్మకం తాతగారూ. ఇక్కడ గుండెలు అంటుకున్నాయి…” ఏడుస్తోంది. శేషయ్య సముదాయించి ఫోన్ పెట్టేశారు. పద్మిని ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది.

ఏడు గంటలకి పిలుపుగంట మోగితే లేచి తలుపు తీసింది. ఎదురుగా జుట్టు రేగిపోయి, నిద్రలేని కళ్ళతో పి.డి.

ఆవేశం పొంగుకొచ్చింది పద్మినికి. ఆమె నోరు విప్పేలోపల..

“సారీ పద్దూ. రాత్రి ఆ మీనా తన చెల్లెలితో కలిసి స్కూటర్ మీద హోటలుకి వెళ్ళి వస్తుంటే రోడ్డు మలుపులో చక్రాలు జారిపోయి ప్రమాదం జరిగింది. మీనా తలకి పెద్ద దెబ్బ. రక్తం పోయింది. ..ఇప్పటిదాకా అపస్మారకస్థితే… నేనూ రక్తం ఇచ్చాను. … వాళ్ళ అమ్మా, నాన్న కేరళ వెళ్ళారు. అందుకే రాత్రి వాళ్ళ చెల్లి ఫోన్ చేస్తే నేను పరుగెత్తాల్సి వచ్చింది. ఆ మీనా ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. అమ్మా, నాన్న ఉదయం విమానంలో వస్తున్నారు… నీ నిద్ర పాడుచేసి ఇదంతా చెప్పటం ఎందుకులే అని ఫోన్ చేయలేదు….”

ఆ క్షణంలో పద్మినికి తన మీద తనకే అసహ్యం. ఒక్కసారిగా గర్వంగా బ్రహ్మాజీని కౌగలించుకొంది. పి.డి స్నానానికి వెళ్ళాక, శేషయ్యకి ఫోన్ చేసింది.

“తాతగారు, నా పెళ్ళికి ముందు మీరు నన్ను బ్రహ్మాజీలో చూడాల్సింది ఇది అని చెప్పారే – ఆత్మ సౌందర్యం! అది ఇప్పుడు చూశాను…”

శేషయ్య నవ్వారు. “అతను వివేకానందీయుడమ్మా.”

2. పెళ్ళి పిల్ల తేల్చేసింది!

ఆ హోటల్లో ముందుగా రిజర్వు చేసిన ఒక టేబుల్ మీద శేషయ్య కూర్చున్నారు.

రామకృష్ణ మఠం సేవా కార్యక్రమాల్లో చేయూతనిస్తామన్న ఒక పెద్దమనిషి కోసం నిరీక్షిస్తున్నారు.

పక్క టేబుల్ మీద అప్పటికే అయిదుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

“..అరేయ్, నేను ఈ బాస్ గాడి బాధపడలేనురా. ప్రతి పనికీ వంకలు పెడుతూనే ఉన్నాడు. చిన్న కంపెనీ అయినా సరే, మంచి కంపెనీకే పోతాను…’ తన నిర్ణయాన్ని ప్రకటించాడు ఓ యువ సాఫ్ట్.

“నా విషయంలో మరీ ఛండాలంగా ఉంది బాస్. రాత్రి పదింటి దాకా మీటింగులతో చంపుతున్నాడు. మా అమ్మా, నాన్నా ఒకటే గోల పెళ్ళిగురించి. ఇలాంటి టైమింగ్స్ ఉంటే ఎవడొస్తాడ్రా నా కోసం?” ఓ సాఫ్ట్ పడుచు బెంగ.

“ఎవడూ దొరక్కపోతే నేనొస్తాలే సుబ్బలక్ష్మి” అంటూ ఇంకొకడు చలోక్తి విసిరాడు. అంతే!

“నువ్వా ! నువ్వు నన్నేం భరించగలవురా! నా ప్యాకేజీలో సగం కూడా లేదు నీ ప్యాకేజీ” మళ్ళీ సాఫ్ట్ పిల్ల అంటించింది. వాడు చిన్నబుచ్చుకున్నాడు.

నాలుగోవాడు అందుకున్నాడు: “ఈ కంపెనీలో అస్సలు పని సంస్కృతి లేదు బాస్. బాస్ సతాయిస్తుంటే పైవాడికి చెప్పుకోటానికి వీల్లేదు. బాసుకి తెలీకుండా పైవాడికి మెయిల్ పెట్టకూడదా! నాన్సెన్స్…”

“ఆ పక్క కంపెనీలో చూడు. మెస్ కూపన్లు, సూపర్ మార్కెట్లో సరుకుల కూపన్లు… ఛత్.. వెధవ కంపెనీలో వచ్చి పడ్డాంరా. ఎలాగైనా వదిలేస్తారా..” ఇది ఇంకో సాఫ్ట్ ఆశావాది ఆరాటం.

“లేదురా, మనం పదిమందిమీ కలిసి మూకుమ్మడిగా వదిలేస్తే, దెబ్బతో మేనేజిమెంటుకి తెలిసొస్తుందిరా…” పెళ్ళి పిల్ల అయిడియా ఇచ్చింది.

శేషయ్య అంతా వింటున్నారు. నవ్వుకున్నారు.

వాళ్ళవైపుకి తిరిగారు.

“ఫ్రెండ్స్, మా వాళ్ళ కంపెనీలున్నాయి. చేరతారా ?!”

ఆ యువ బృందం అంతా ఇటు తిరిగారు.

అందరి కళ్ళల్లో ఆశ.

“సర్, నిజంగానా?”

శేషయ్య ‘అవును ‘ అన్నట్లుగా తలూపారు.

అంతే ! ఆ అయిదుగురూ తమ కుర్చీల్ని ఆయన దగ్గరకి లాక్కున్నారు.

“ఏ కంపెనీలు సర్?” అందరూ ఒకేసారి అడిగారు.

ఆయన రెండుమూడు పెద్ద కంపెనీల పేర్లు చెప్పారు.

“ఇంకా, కొన్ని కంపెనీలకు నేను మానవ వనరుల సలహాదారుని కూడా…”

వాళ్ళ కళ్ళల్లో ఆశ. అయినా ఏదో శంక.

“మాకు సహాయం చేయాలని మీకెందుకు అనిపిస్తోంది సర్?”

“పాపం, మీరంతా ఉద్యోగ కష్టాల్లో వుండటం విని అనిపిస్తోందయ్యా.”

వెంటనే వాళ్ళు తమ తమ వీపుమోత సంచీల్లోంచి లాప్ టాప్‌లు తీస్తున్నారు.

“అవెందుకు తీస్తున్నారు?” శేషయ్య ప్రశ్న.

“సర్, మీకు మా సి.వి, అంటే – యోగ్యతల వివరాలు ఇవ్వాలి కదా!”

“ఆ ఆ.. ఇద్దురుగాని. ముందుగా నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి.”

అంతా ఒకరినొకరు చూసుకున్నారు.

“ఓకే” అన్నారు.

“మీ బాస్ అసమర్థుడా? అంటే, పని చేతకానివాడు, లేదా, పనిరాని వాడా?”

“నో సర్. వాడు చాలా సమర్థుడు. వాడి అర్హతలు కూడా పెద్దవే.”

“మీ జీతాలు సరిగ్గా ఇవ్వరా ? తక్కువిస్తారా?”

“తక్కువే గాని. ఠంచన్‌గా నెల చివరికి మా బాంకు అకౌంటులో పడిపోతూంటాయి సర్.”

“ఇప్పుడు నాకు తెల్సిన కంపెనీలు కొన్నింటిలో జీతాలు ఎక్కువే. కాని ఖచ్చితంగా నెల చివరికిస్తారని గ్యారంటీ లేదు… కొన్నింటిని ఒకటి రెండు కుటుంబాలు నడుపుతున్నాయి. అంటే, మీ క్రింద పనిచేసేవాడు మీ కంపెనీ చైర్మన్‌కో, సి.ఇ.ఓ.కో బంధువై ఉంటాడు… మరో కంపెనీలో ఈ గోల లేదు. జీతాలు ఫరవాలేదు. కానీ, ఏ క్షణంలోనయినా కారణం చెప్పకుండా ఇంటికి పంపించేయొచ్చు….”

ఆ సాఫ్ట్ కుర్రకారుకి చెమట పట్టేసింది. శేషయ్యని మధ్యలో ఆపేశారు.

“సర్, అన్నీ ఇంతేనా?”

“ఇంకో బహుళ జాతి కంపెనీ ఉంది. అందులో మీరు చేసే పని ఇప్పుడు చేస్తున్న దాంట్లో నాలుగో వంతు ఉంటుంది. అంటే, మీ పని విభాగాలు చిన్నవిగా ఉంటాయి…”

“ఇంక మేమెప్పటికి ఎదుగుతాం సర్?” అనుకుంటూ అందరూ మొహాలు మొహాలు చూసుకున్నారు.

పెళ్ళి పిల్ల అడిగింది.

“మంచి కంపెనీ ఏది సర్?”

శేషయ్య అందరివంకా చూసి, చిరునవ్వుతో చెప్పారు.

“ఒక్కటే ఉంది.”

“చెప్పండి, చెప్పండి” అందరూ ఉత్కంఠతో అడిగేశారు.

“ప్రతి కంపెనీ ఎదిగిపోవాలనే అనుకుంటుంది.. అలాంటి ఏ కంపెనీలో మీరు ఒదిగిపోయి ఎదగటానికి కష్టపడగలరో అదే మీకు మంచి కంపెనీ.”

“అంటే, మేం ఎక్కడ బాగా అడాప్ట్ కాగలగితే అక్కడ?”

శేషయ్య నవ్వారు. ఆయన ఎదురుచూస్తున్న పెద్ద మనిషి వచ్చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here