కొడిగట్టిన దీపాలు-21

0
3

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 20వ భాగం. [/box]

41

మానవ ప్రవృత్తే భలే విచిత్రమయినది. వివిధ రకాల ప్రవృత్తులు, వివిధ మనస్తత్వాలు కలిగిన మనుష్యులు మన చుట్టూరా నివసిస్తారు. తనకి లభించని అదృష్టం సుఖం ఎదుటి వాళ్ళకి ఎందుకు లభించాలి అనే మనస్తత్వం కలవాళ్ళు కొందరయితే, తనకెలాగూ అదృష్టం లభించలేదు ఎదుటివాళ్ళకేనా ఎందుకు అదృష్టం దక్కకూడదు అనే విశాల దృక్పథం గల వాళ్ళు మరికొందరు ఉంటారు. రెండవ కోవకి చెందిన మనిషి సుజాత.

‘తనూ రాజశేఖరం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దంపతుల మవుదామనుకున్నారు. అయితే తమ ఆశలు నెరవేరలేదు. తమలాగే కళ్యాణి రాజేషు ప్రేమించుకున్నారు. వాళ్ళ జీవితం తమ జీవితంలా అవకూడదు. వాళ్ళ ఆశలు – ఆశయాలు అడియాసలవకూడదు. వాళ్ళ ఆశాసౌధాలు కూలిపోకూడదు. వాళ్ళు కన్న కలలు సఫలీకృతం అవాలి,’ అని అనుకుంటున్న సుజాత రాజేష్‌ని, కళ్యాణిని పిలిచింది.

రాజేష్, కళ్యాణి ఆ పిలుపునందుకుని అక్కడికి వచ్చారు. “కూర్చోండి” ఎదురుగా ఉన్న ఉన్న సోఫా చూపించింది సుజాత. ఇద్దరూ కూర్చున్నారు. ఎలా మొదలు పెట్టాలో ఆలోచిస్తోంది. ఆమె ఏఁ మాట్లాడుతుందో అని ఎదురు చూస్తున్నారు శ్రోతలు.

“రాజేష్! కళ్యాణికి నేను తప్ప ఆమె తరపున మాట్లాడ్డానికి ఎవ్వరూ లేరు. అలాగే నీ తరపు నుండి పెద్దలెవరేనా ఉంటే చెప్పు వాళ్ళతో మాట్లాడుతాను.”

ఆమె మాటలు విని ఒక్కో క్షణం రాజేష్ భావోద్వేగానికి లోనయ్యాడు. అతని కళ్ళు చమర్చాయి. “కళ్యాణి తరుపున ఆమె మంచి చెడ్డలు చూసుకోడానికి మీరేనా ఉన్నారు కాని నా తరుపున నా అన్న వాళ్ళెవరూ లేరు, సుజాతగారూ!

నేను ఎక్కడ పుట్టానో, ఎవరికి పుట్టానో ఎలా పెరిగానో నాకు తెలియదు. నాకు జ్ఞానం వచ్చిన తరువాత అనాథ ఆశ్రమంలో పెరిగాను. అందరి బాల్యాలూ ఆనందకరం కాదు. బాధల్లో మగ్గిపోయే బాల్యంలో వెట్టికూలి చేసేవారు, చెత్త కాగితాలు ఏరుకునేవారూ, భిక్షమెత్తుకునేవారు, తల్లుల చేతనే కుప్ప తొట్టెల్లో, ముళ్ళ చెట్లలో వదిలి వేయబడేవారు. ఇలా ఎందరో ఉన్నారు. ఒకరి బాల్యం నేలపై కనిపించని శూన్యం. మరొకరి బాల్యం ఉనికిని కాపాడే అక్షర రూపం. వర్గపోరాటాలు మధ్య నలిగిపోతున్న బాల్యం అందరికీ బాల్యం వడ్డించిన విస్తరికాదు. కొందరికి వడ్డించిన విస్తరయితే మరి కొంతమందికి కప్పివేసిన మట్టి రూపం.

నా బాల్యాన్ని కుప్ప తొట్టెల్లో – ముళ్ళ చెట్లలో వదిలి వేయబడకుండా ఏ జంతువుకో ఆహారం కాకుండా నా తల్లిదండ్రులు అనాథ ఆశ్రమంలో చేర్పించినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేయాలి,” బాధగా అన్నాడు రాజేష్,

“సారీ రాజేష్ నీ గతాన్ని గుర్తుకు తెచ్చి నీకు బాధ కలిగించాడు.” సుజాత బాధగా అంది.

“లేదు…లేదు…! ఉన్న విషయం చెప్పాను.

ఒక్కొక్క పర్యాయం నాకేఁ అనిపించేదో తెలుసా? నాకు కూడా నా అన్నవాళ్ళు ఉంటే ఎంత బాగుండును అని అనిపించేది. ఆశ్రమంలో ఉన్న నా తోటి వాళ్ళే నా వాళ్ళు అని అనుకుని తృప్తిపడేవాడ్ని.

మిమ్మల్ని చూసిన తరువాత మీరు నాకు తోబుట్టువులా అగుపించారు. మీ మీద ఓ విధమైన ఆత్మీయతా భావం నాలో కలిగింది. అందుచేత మీరన్నా – మీ మాటన్నా నాకు గౌరవమే. మీరు ఎలా చేస్తే అలా నడుచుకుంటానని నేను మీకు హామీ ఇస్తున్నాను.” రాజేష్ ఒకింత బాధతోను, ఒకింత గంభీరతతోనూ అన్నాడు.

అతని వదనంపై కదిలాడుతున్న స్థిరమైన భావాల్ని బట్టి అతను నిజాయితీగా మాట్లాడుతున్నాడు, నిండు మనస్సుతో మాట్లాడుతున్నాడనిపించింది సుజాతకి.

“కళ్యాణీ! మరి నీ సంగతో?”

అంత వరకూ సుజాత చెప్తున్న మాటలు తల వొంచుకుని వింటోంది కళ్యాణి. ఆమె హావభావాలు బట్టి కళ్యాణి అంతరంగం అర్థమయింది సుజాతకి. అయినా ఆమె నోటి వెంబడి ఆమె మనోగత భావాలు వినాలనుకుంది.

“ఏఁ కళ్యాణీ! మాట్లాడవేమి?”

“చెట్టు ఎంత అందంగా కనిపించినా – విస్తరించినా అది తన వేళ్ళను మరిచిపోదు. ఆ వేళ్ళే లేకపోతే చెట్టు ఎంత ఏపుగా – అందంగా విస్తరించి ఉండేదా? వదినా నేను ఏపుగా విస్తరించిన చెట్టునయితే ఆ చెట్టు తయారవడానికి కారణమైన వేళ్ళు నీవు. నీ సహకారమే లేకపోతే నేనింత దాన్ని అయి ఉండేదాన్నా.

నాకు జ్ఞానం వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. నీవే నాకు అమ్మా, నాన్నా, అక్క అన్న, అన్నీ సర్వస్వం నీవే. ఆ దైవం గురించి అందరూ చెప్తుంటారు కాని ఆ దైవాన్ని మనం చూడలేదు. కాని వదినా నీలో ఆ దైవాన్ని చూస్తున్నాను. ఇప్పుడు నీవే నాకు మార్గదర్శివి. మార్గనిర్దేశకురాలివి. మరో పర్యాయం చెప్తున్నాను. ఈ రోజున నేను ఈ స్థితిలో – ఈ హోదాలో నీ ఎదుట ఇలా నిలబడి వున్నానంటే దానికి కారకురాలివి ఇవే. అలాంటి మీ మాట పాటించనా? ఉఁహూఁ! అలా ఎన్నటికీ అలా జరగదు. నీవు మాతో ఏం చెప్పదల్చుకున్నావో చెప్పు వదిన. నీవు చెప్పినట్టు నడుచుకోడానికి రాజేష్, నేనూ సిద్ధంగానే ఉన్నాం,” అంది కళ్యాణి.

వాళ్ళిద్దరికీ తన మీదున్న గౌరవానికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంది సుజాత. ఆమెకి వాళ్ళు తన పెద్దరికం నిలిపినందుకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తృప్తిగా ఊపిరి పీల్చింది. రెండు క్షణాలు మౌనం అక్కడ రాజ్య మేలింది.

“రాజశేఖరంగారి గురించి, నా గురించి నేను ఏఁ చెప్పకుండానే అన్ని విషయాలు మీకు తెలిసాయి. తెలుసుకున్నారు కదా. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా విధి చేత దూరంగా విసిరి వేయబడ్డామో అదీ మీకు తెలుసు.

విధి ఆడిస్తున్న వింత నాటకాన్ని అలా చూడ్డమే తప్ప మనం ఏం చేయలేము. ఇలాంటి దురదృష్ట జీవితం పగవాళ్ళకేనా వద్దు. అందుకే మీకు చెప్తున్నాను మీరిద్దరూ త్వరగా పెళ్ళి అనే బంధంలో ఒకటవాలి. మా జీవితంలా మీ జీవితం అవకూడదు. అదే నా ఆరాటం – తపన అభిలాష కూడా,” ఇలా చెప్తూ ఆగింది సుజాత.

“నా మీద నాకు సదభిప్రాయం కలిగింది. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నా మనస్సులో ఉన్న మాటనే మీరు బయట పెట్టారు. నేను కళ్యాణిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆరాధిస్తున్నాను. ఇది ఆకర్షణ కాదు. తుచ్ఛమైన కోరిక అంతకన్నా కాదు. మీకూ, రాజశేఖరం గారి మధ్యానున్న పవిత్రమైన ప్రేమలాంటి భావం. నాకు మీరే పెద్దలు. ఓ పర్యాయం నేను పెరిగిన ఆశ్రమ పెద్దలు అంగీకారం కూడా తీసుకుని వస్తాను. మీరు అన్ని ఏర్పాట్లు చేయండి.”

రాజేష్ మాటలకి తృప్తిగా ఊపిరి వదిలింది సుజాత. నిజమే ఏ పనయిన అనుకున్న వెంటనే జరిగిపోవాలి. ఆలస్యమయితే అమృతం కూడా విషంగా మారుతుందంటారు. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయాలి. కళ్యాణి పెళ్ళితో తనకి రాజశేఖరం అప్పగించిన బాధ్యత తీరుతుంది. రాజేష్ తరుపునా ఎవ్వరూ లేరు కాబట్టి ఆ బాధ్యతా తానే వహించాలి అనుకుంది సుజాత.

“మరో విషయం.” ఏంటన్నట్లు రాజేష్, కళ్యాణి సుజాత వేపు చూసారు.

“పెళ్ళి చేసుకుంటారు బాగానే ఉంది. ఆర్థిక మార్గాలు వెతుక్కోవాలి కదా. మన జీవితావసరాలు తీరాలంటే డబ్బు ఉండాలి. మీ భవిష్యత్తుని ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలనుకుంటున్నారు.” ఇద్దరి వేపూ నిశితంగా చూస్తూ అంది సుజాత.

“మా ఫ్యూచర్ ప్లాను మొదటే తయారు చేసుకున్నాం.”

“ఏంటది?”

“సుజాత గారూ! మన భారతదేశం గ్రామాల దేశం. చాలా గ్రామాల్లో ఇప్పటి కూడా కనీస అవసరాలు లేవు. ముఖ్యంగా వైద్య అవసరాలు శూన్యం. సరియైన వైద్య సదుపాయాలు లేక పట్నాలకి వస్తూ పట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక బాధపడున్న నిరుపేదలు ఎంత మందో ఉన్నారు. పట్నం వచ్చేలోపున మార్గమధ్యంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, పట్నం వెళ్ళలేక పల్లెలోనే ప్రాణాలు పోగొట్టుకున్నవారూ, ఇలా ఎందరో బలైపోతున్నారు.

కళ్యాణీ నేనూ గ్రామంలోనే ప్రాక్టీసు పెట్టి మా సేవలందిద్దామనుకుంటున్నాం. ఇక డబ్బు అంటారా? వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా వాళ్ళు ఎంత ఇస్తే అంత ఫీజుగా తీసుకుంటాం. కళ్యాణి కూడా ఇదే మాట అంది,” రాజేష్ అన్నాడు.

“మీ ఇద్దరిదీ మంచి ఆలోచన. ఎలాగూ కళ్యాణి నాన్నగారి ఇల్లు స్థలం అక్కడున్నాయి.”

సుజాత మాటలకి క్రొత్త విషయం విన్నట్లు చకితులయ్యారు.

సుజాత అప్పుడు విషయాన్ని వివరించింది. కళ్యాణి తండ్రికున్న ఇల్లు, స్థలం గురించి, వారు గడిపిన జీవితం గురించి, విశాలగుప్త ఆ కుటుంబానికి అందించిన సేవల గురించి, మాధవరావుగారు ఆ ఇల్లు స్థలం విశాలగుప్తా పేరున వ్రాయడం, విశాలగుప్తా ఆర్థికంగా ఎలా ఆదుకున్నాడో వివరించింది. చకితులై వింటున్నారు కళ్యాణి, రాజేష్

“మరో విషయం.

విశాలగుప్త గారి హృదయం చాలా విశాలమయినది. అతనికి పిల్లలు లేరు. తల్లి చనిపోయిన తరువాత కళ్యాణి బాధ్యత తనే తీసుకుంటానన్నారు. అయితే రాజశేఖరం, వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాట ప్రకారం కళ్యాణి బాధ్యత నేనే తీసుకోవల్సి వచ్చింది.

ఇప్పుడు ఆ విశాలగుప్తా గారు మాధవరావు గారు తన పేరున రిజిష్టరు చేయించిన ఇంటిని స్థలాన్ని కళ్యాణికి బహుమతిగా ఇద్దామనుకుంటున్నారు. అంతేకాదు. ఆ దంపతులు పెద్దవాళ్ళయి పోయారు. చుట్టాలున్నారు కాని, ఆస్తిపాస్తులు అనుభవించడానికి ముందుకు వస్తారు కాని వాళ్ళకి సేవ చేయడానికి ముందుకురారు. అతను తన ఇల్లు, షాపు కూడా కళ్యాణికి ఇచ్చేసి. ఆశ్రమంలో శేష జీవితం గడుపుతానన్నారు. కళ్యాణి నర్సింగ్ హోమ్ స్థాపించి గ్రామ ప్రజలకి వైద్య సేవ కళ్యాణి అందించాలని అతని కోరిక,” చెప్పడం ముగించింది సుజాత.

“నిజంగానే ఆ విశాలగుప్త గారి హృదయం ఎంత విశాలమయినది. ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు నేటి రోజుల్లో,” రాజేష్ అన్నాడు.

విశాలగుప్త గారిని చిన్నప్పుడు ఎప్పుడో చూచాయగా చూసిన గుర్తు తనకి. తను చాలా చిన్న పిల్ల. తనూ అక్క శారద ద్వారా విశాలగుప్తా గారు తమ కుటుంబానికి చేసిన సహాయం గురించి వింది.

అక్క శారద గుర్తుకి రాగానే బాధగా మూలిగింది కళ్యాణి మనస్సు, అక్క జీవితం కూడా సంతోషంగా ముగియలేదు. చిన్నప్పుడు ఆర్థిక లేమితో మధ్య తరగతి సగటు అమ్మాయిగా జీవితం గడిపిన అక్క రెండో పెళ్ళి వాణ్ణి పెళ్ళి చేసుకున్నా సంతృప్తికరమైన జీవితం గడపలేకపోయింది. అర్ధాంతరంగా జీవితం ముగించింది.

ఇక తనకి వేణు అనే అన్నయ్య ఉండేవాడని వింది. ఆ అన్నయ్య ఇంట్లో మనస్పర్థల కారణంగా ఇల్లు వదిలి వెళ్ళాడు అని వింది. ఇప్పటి వరకూ అతని సంగతే తెలియలేదు. ఇక రాజశేఖరం అన్నయ్యో! స్వాతంత్ర్య పోరాట సమయంలో గుంపులో ఒకడిగా వెళ్ళిన అన్నయ్య జాడ ఇప్పటి వరకూ తెలియకుండా ఉంది. అందరిలోనూ తన ఒక్కదాని జీవితం సుజాత వదిన దయ వల్ల ఇప్పటికి సవ్యంగా సాగుతోంది.

“కళ్యాణీ! ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన్లు నాకు తెలుసు. మనకి కలత కలిగించే అలోచన్లకి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. మరిచిపోలేకపోయినా మరిచిపోయినట్లు నటించాలి. భూత కాల స్మృతుల్ని ఒక దగ్గర పెట్టి తాళం వేసేసి వర్తమాన పరిస్థితుల వేపు దృష్టి పెట్టాలి. ఇదేనమ్మా మానవ జీవితం. ఈ జీవితంలో కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి. ఆశలుంటాయి, ఆశయాలుంటాయి. కలలు ఉంటాయి. ఆ కలలు నెరవేరనపుడు మనస్తాపం కూడా ఉంటుంది.” గీతోపదేశం చేస్తున్నట్లు అంది సుజాతతో కళ్యాణి.

రాజేష్ కళ్యాణి సుజాత చెప్పినది విన్నారు. ‘ఈవిడ చెప్పినదాంట్లో ఆవిడ అనుభవించిన మనోవేదన ఉంది’ అని అనుకున్నాడు రాజేష్.

42

కళ్యాణీ – రాజేష్‌ల వివాహం పెద్ద ఆర్భాటం అట్టహాసం లేకుండా నిరాడంబరంగా జరిగింది. రాజేష్ పెరిగిన ఆశ్రమ అధికార్లు, పెద్దలు, ఇవతల సుజాత నడుపుతున్న ఆశ్రమంలోని వాళ్ళూ అందరూ ఆ పెళ్ళికి వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించారు. అక్షింతలు వేస్తూ, విశాలగుప్తా మాధవరావు ఇల్లు స్థలం తన పేరున రిజిష్టరు చేయబడిన దస్తావేజులుతో పాటు, తిరిగి తను కళ్యాణి పేరున రిజిష్టర్ చేసిన కాగితాలూ తీసుకువచ్చి కళ్యాణికి రాజేష్‌కి పెళ్ళి కానుకగా ఇచ్చాడు.

తమ కాళ్ళకి నమస్కరించిన ఆ దంపతుల్ని నిండు మనస్సుతో ఆశీర్వదించారు విశాలగుప్తా అతని భార్య. ఆ దంపతులే పెళ్ళి పెద్దలు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసారు ఆ దంపతులు.

“బాబాయ్! మీ గురించి విన్నాను. చిన్నప్పుడు ఎప్పుడో నేను చూసి ఉంటాను గుర్తులేదు. మీరు మా కుటుంబానికి చేసిన మేలు జన్మజన్మలకి గుర్తుంచుకోవల్సింది. మీరు ఎంతో గొప్పవారు,” అంది కళ్యాణి విశాలగుప్తతో. “అవును నిజమేనండి. మీలాంటి మనుష్యులు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు,” రాజేష్ అన్నాడు.

“నన్ను అలా పొగడ్తల్లో ముంచేయకండి. ఇప్పటికే ఆ బరువు మోయలేకుండా ఉన్నాను. అయినా ఒక మనిషికి మరో మనిషి ఆపద సమయంలో సహాయం చేసుకోకపోతే ఎలా? మనం సామాజిక మనుష్యులం. సమాజంలో ఒకరి తోడ్పాటు మరొకరికి అవసరం,” విశాలగుప్తా అన్నాడు.

తన కాళ్ళకి నమస్కరిస్తున్న నూతన దంపతులపై అక్షింతలు వేసి తన ఆశీస్సులు వారికి అందించిన సుజాత ‘అమ్మయ్య! ఇప్పుడు నా మనస్సు తేలిక పడింది. బరువు – బాధ్యత నుండి విముక్తి పొందాను’ అని అనుకుంటూ తృప్తిగా శ్వాస వదిలింది.

ఆమె కనుకొలుకుల్లో కన్నీరు నిల్చింది. ఆ కన్నీరు ఆనందం వల్ల వచ్చిందో – దుఃఖం వల్ల వచ్చినవో చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా ఉంది. ఎందుకంటే ఆమె హృదిలో కళ్యాణి పరాయి సొత్తు అయిపోయింది. ఇప్పుడు ఆమె మీద తనకి ఎటువంటి అధికారం లేదు. తన నుండి దూరంగా వెళ్ళిపోతోంది అన్న బాధతో పాటు తనకి అప్పగింపబడిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాను అన్న సంతృప్తి కూడా ఆమె వదనంపై కదలాడాయి.

తండ్రి ద్వారా తనకి లభించవల్సిన స్థిరాస్తిని విశాలగుప్తా గారు కళ్యాణికి అప్పగించారు. అయితే గ్రామంలో వచ్చి ఉండడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకూ కళ్యాణి రాజేష్ ఉన్న దగ్గరకే తన మకాం మార్చాలి.

కళ్యాణిని తీసుకుని రాజేష్ బయలుదేరుతూంటే కళ్యాణి దుఃఖం అపుకోలేక సుజాత గుండెల మీద తల ఆన్చి వెక్కివెక్కి ఏడుస్తోంది. సుజాతకి కూడా దుఃఖం వస్తోంది. అయితే తనూ ఏడుస్తే కళ్యాణిలో మరింత బేలతనం వస్తుంది. ఆమె దుఃఖం మరింత ఎక్కువవుతుంది. అందుచేత తను బింకంగా ఉండాలి అని అనుకున్న సుజాత కళ్యాణి జుత్తుని ముని వ్రేళ్ళతో సరిచేస్తూ ఓదారుస్తోంది.

ఎంత చదువుకున్నా పెళ్ళయి అత్తవారింటికి మొదటిసారిగా వెళ్తున్న ఆడపిల్లల్లో ఈ బేలతనం సహజం అని అనుకుంది సుజాత. రాధ పెద్ద అనుభవజ్ఞురాలిలా భర్త దగ్గర ఎలా నడుచుకోవాలో కళ్యాణికి చెప్తోంది. ఊఁకొడ్తోంది కళ్యాణి రేలు ఎక్కేముందు.

‘నీకేఁ భయం లేదు. నేనుండగా’ అన్నట్టు రాజేష్ కళ్యాణి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అగ్గి పెట్టెలా ఉన్న రేలు బోగీలు ప్లాటుఫారం దాటే వరకూ కళ్యాణ్ రాజేష్‌లకు చేతులు ఊపుతూనే ఉన్నారు ఫ్లాటుఫారం మీదున్న సుజాత, రాధ, మోహన కృష్ణ, పిల్లలు, విశాలగుప్తా దంపతులు, ముఖ్యులయిన ఆశ్రమవాసులూ. వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికి వెళ్ళిన వారంతా భారమైన మనస్సులో స్టేషను బయటకు వచ్చారు.

“నీ బాధ్యత నీవు తీర్చుకున్నావు. ఎందుకు బాధపడ్డావు అమ్మాయ్!” ఇంటికి వచ్చిన తరువాత విశాలగుప్తా సుజాతతో అన్నారు.

“చేసిన తప్పును సగమైనా సరిదిద్దుకున్నాను.” అంది సుజాత.

“నీవేఁ తప్పు చేశావు? అందరికీ ఉపకారం చేయడమే కాని, అపకారం చేసే స్వభావం నీది కాదు అమ్మాయ్!”

“లేదండి నేను జీవితంలో సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశాను. ఆనాడు కాలేజీలో చదువుకుంటున్న రాజశేఖరాన్ని నా వాడియైన మాటల తూటాల్తో రెచ్చగొట్టి ఉండకపోతే అతను స్వాతంత్ర్య పోరాటం వేపు అడుగులు వేసి ఉండేవాడు కాదు. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగంలో స్థిరపడి తన వాళ్ళను ఆదుకుని ఉండేవాడు. ఆ తరువాత పెళ్ళి చేసుకుని పిల్లా పాపలో చక్కగా ఉండేవాడు.

నేను రెచ్చగొట్టడం వల్ల ఫలితం ఏఁటయిందో తెలుసా? అతని కుటుంబం ఛిన్నాభిన్నం అయింది. తండ్రి చనిపోయాడు. కుటుంబం వీధిన పడింది. అన్నదమ్ముడింట్లో అశాంతితో అతని తల్లి జీవచ్ఛవంలా బ్రతకవల్సి వచ్చింది. అనారోగ్యంతో కన్ను మూసింది. తమ్ముడు ఇల్లు వదిలి వెళ్ళాడు. శారద జీవితం అశాంతిగా ముగిసింది. ఆ కుటుంబంలో ఇన్ని అనర్థాలు జరగడానికి మూల కారకురాల్ని నేను కాదూ!” ఆవేదనగా నుదురు కొట్టుకుంటుంది సుజాత.

“అమ్మాయ్! నేను ఒక్క మాట చెప్తాను విను. మన చేతులో ఏదీ లేదు. మనం నిమిత్తమాత్రులం అంతే. రామాయణమే తీసుకో. రాముడుకీ సీతకీ పెళ్ళి అయిందని సంతోషించారు అందరూ. ఆ తరువాత వాళ్ళ జీవితాల్లో ఇంత విషాదకరమైన సంఘటనలు జరుగుతాయని అనుకున్నారా?

ఇక భారతమే తీసుకో, పంచపాండవులు ద్రౌపదితో సహా అరణ్యవాసం చేయవల్సి వస్తుందని, రాజ్యాధికారం దక్కదని, ఇన్ని కష్టాలు పాలవుతారని అనుకున్నారా?

అలాగే సత్య హరిశ్చంద్రుడు. ఇలా ఎందరో కష్టాలు పాలయ్యారు. ఇదంతా విధి విలాసం. మన నుదుటిని ఎలా వ్రాసి ఉంటే అలా జరుగుతుంది. మొదట మన పని మనం చేయడమే. ఫలితం వేపు దృష్టి పెట్టకుండా,” విశాలగుప్తా సుజాతకి కర్మ సిద్ధాంతం వివరిస్తున్నాడు. అతను చెప్తున్నది వింటూ గాఢంగా నిట్టూర్పు విడిచింది సుజాత.

***

కళ్యాణి వ్రాసిన ఉత్తరాన్ని పదే పదిసార్లు చదువుకుని గాఢంగా నిట్టూర్పు విడుస్తోంది సుజాత. ఆ ఉత్తరంలో వున్న విషయం ఆమెను ఒకింత మనస్తాపానికి గురి చేసింది. ఆనందాన్ని కూడా ఇచ్చింది.

ఆ ఉత్తరంలో చివర శేషు చనిపోయాడన్న సమాచారం ఆమెకి మనస్తాపం కలిగించింది. ‘పాపం శేషు తనకి సంక్రమించిన ఆస్తిని చక్కగా సద్వినియోగం చేసుకోకుండా డబ్బునే కాదు తన జీవితానే పాడుచేసుకున్నాడు. అన్నిటికి మూల కారణం డబ్బు. అది మనిషి అభివృద్ధికి తోడ్పడుతుంది. మనిషి నాశనానికి కూడా తోడ్పడుతుంది. శేషు ఎంత దురదృష్టవంతుడు. జీవిత చివరి క్షణాల్లో నా అన్నవాళ్ళు లేకుండా దిక్కులేని చావు చచ్చాడు’.

పెళ్ళికి వచ్చిన రాధ ఇంకా సుజాత దగ్గరే ఉంది.

“అక్కా ఎవరి దగ్గర నుండి ఆ ఉత్తరం,” అని రాధ అడిగింది సుజాతను.

“కళ్యాణి వ్రాసింది,” ముక్తసరిగా జవాబిచ్చింది సుజాత.

“కళ్యాణి ఏమని వ్రాసింది? కులాసాయేనా?” తిరిగి రాధ అడిగింది.

శేషు చనిపోయినట్టు కళ్యాణి వ్రాసిన ఉత్తరంలోని విషయాలు రాధకి చెప్పడానికి సుజాతకి ఇష్టం లేదు. అందుకే రాధకి ఈ విషయం చెప్పలేదు. 

“కళాణి బాగానే ఉంది.” ముక్తసరిగా అంది సుజాత.

ఇంతలో పిల్లలు తగవులాడుకోడంతో రాధ మరి అక్కడ ఉండకుండా అచటి నుండి కదిలిపోయింది.

’అక్క మనసు కళ్యాణి పెళ్ళి అయి వెళ్ళిపోవడం వల్ల బాగా లేదు. మూడీగా ఉంది. అంతేకాదు రాజశేఖరం గారు ఏం అయ్యారో ఇప్పటి వరకూ తెలియకుండా పోయింది. అందుకే అక్క మనస్సు బాగులేదు. అశాంతిగా ఉంది ఆమెకి” అనుకుంది రాధ.

అలా వెళ్తున్న రాధ వేపు చూసి గాఢంగా నిట్టూర్పు విడిచింది సుజాత. ‘నుదుటిని, ఎర్రని బొట్టు, కళ్ళకి కాటుక తల నిండాపూలు మెడలో తళతళ మెరుస్తున్న మంగళ సూత్రాలు, కాళ్ళకి మట్టెలు, వీటన్నిటితో రాధ సంతోషంగా ఉంది. పిల్లా పాపలో సుఖమైన జీవితం గడుపుతోంది.

రాధ మోహను కృష్ణల జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంది. శేషుకి విడాకులిచ్చి మోహన్ కృష్ణని పెళ్ళి చేసుకుని రాధ ఓ మంచి పని చేసింది. లేకపోతే…? లేకపోతే ఊహించడానికే ఆ ఊహ భయంకరంగా ఉంది.

పిల్లా పాపలో ఇంత సంతోషంగా ఉండేదా? విడాకులు ఇయ్యకుండా ఉంటే శేషు భార్యగా లోకం ఎదుట చెలామణి అయ్యేది. శేషు ఇప్పుడు చనిపోయాడు. రాధకి వైధవ్యం అంటగట్టి ఆమెకి పుస్తెలు తెంపేసేవారు. గాజులు పగలగొట్టేవారు. బొట్టు చెరిపేసేవారు..! అమ్మో! వైధవ్యంలో రాధ మొహాన్ని ఊహించడానికి చాలా బాధగా ఉంది. అలా జరగనట్టయితే రాధ ముఖం తను చూడగలదా? ఆ భగవంతుడి దయవల్ల అలా జరగలేదు. అంతే చాలు.’ రాధ గురించి ఆలోచిస్తోంది సుజాత.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here