కథా సోపానములు-7

7
6

[box type=’note’ fontsize=’16’] డా. బి.వి.ఎన్. స్వామి ‘కథా సోపానములు’ అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘సంభాషణలు’ ఎంత అవసరమో వివరిస్తుంది. [/box]

సంభాషణలు

[dropcap]భా[/dropcap]వ వినియోగానికి ఉపకరించేది సంభాషణ. వీటి ద్వారా వ్యక్తులు తమ అభిప్రాయాల్ని పంచుకుంటారు. కథల్లో సంభాషణలు అవసరము. పాఠకుడితో కథకుడు చేసే కథనం ఒక సంభాషణ. సంభాషణ అనగానే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగేది అని అర్థం అవుతుంది. వ్యక్తి తనలో తాను సంభాషించుకోవడాన్ని స్వగతం అంటారు. కొందరు సైగలతో సంభాషిస్తారు. మరి కొందరు మౌనంగానే మాట్లాడుతారు. మొత్తానికి సంభాషణ అంటే వ్యక్తీకరణ. అది ఏ రూపాల్లో జరిగినా సంభాషణే అవుతుంది.

ఏకపక్షంగా సాగే కథనం, పాఠకుణ్ణి దూరం చేసుకునేదిగా ఉండరాదు. అప్పుడే పాఠకుడు కథను సాంతం చదువుతాడు. అలా అది రచయిత, పాఠకుడి మధ్య జరిగే సంభాషణ. సందేహాలు రావడం, వాటిని నివృత్తి చేసుకోవడం, సంభాషణల ద్వారానే జరుగుతుంది. మనిషి భావోద్రేకాల్ని మాటల ద్వారా వ్యక్తపరుస్తాడు. ఒక్కోసారి చేష్టల ద్వారా చెపుతాడు. వాటికి ఎదుటి వారు ప్రతిస్పందిస్తారు. ఇది కూడా సంభాషణే. జాతీయ, అంతర్జాతీయ సమస్యల పైనా, గహనమైన తాత్విక విషయాలపైన చర్చలు జరుగుతవి. అవన్నీ సంభాషణలే (డైలాగ్స్). ప్రతీదానికి పరిమితి ఉన్నట్లే, మాటకు కూడా పరిమితి ఉండాలి. అట్లా లేకపోతే జీవితంలో అనర్థాలు, కథ పక్కన పెట్టడాలు జరుగుతవి. పెదవి దాటిన మాట ప్రభువు నీకు, పెదవి దాటని మాటకు ప్రభువు నీవు. కనుక రచయిత అత్యంత జాగరూకుడై సంభాషణల్ని నడపాలి.

సన్నివేశాల్లోను, సంఘటనల్లోను, పాత్రల మధ్య జరిగే సంభాషణల్ని ఆసక్తికరంగా నడపాలి. సంభాషణల ద్వారా నాటకీయతను పండించవచ్చు. ఒక్కోసారి కథ ఆద్యంతము సంభాషణలతోనే సాగుతుంది. కాని ఇది చాలా కష్టంతో కూడుకున్నది. శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి “అరికాలికింది మంటలు” అనే కథను కేవలం సంభాషణలతోనే నడిపించాడు. కొందరు మాట్లాడితే వినాలనిపిస్తుంది. వారు ఎంతో ఎరుకతో మాట్లాడడం వల్ల అది సాధ్యమైతుంది. అంతే ఎరుకతో సంభాషణల్ని రాయాలి. ఎక్కడా అసహజత్వానికి తావు ఇవ్వరాదు. పాత్రోచిత మాటల్ని పలికించాలి. కోపంతో రగిలే మనిషి శాంతి సందేశాలు ఇవ్వలేడు. సంబరాల్లో మునిగి తేలే మనిషి విషాదస్వరాన్ని పలకడు. అనుభవ శూన్యుడైన బాలకుడు, తలపండిన వాడిలా మాట్లాడలేడు. రచయిత అందుకు భిన్నంగా పాత్రలతో మాట్లాడిస్తే కథ అభాసుపాలౌతుంది. కథ చిన్న అంశానికి పరిమితమైనది. కనుక పాత్రలతో సుదీర్ఘ సంభాషణల్ని పలికించకూడదు. ప్రతిదీ సంభాషణల ద్వారా చెప్పలేము. తెలుగు భాషలోని నుడికారాన్ని సామెతల్ని, పలుకుబడుల్ని మాటల మధ్య ఉపయోగిస్తే కథకు మాధుర్యం అబ్బుతుంది. పాత్రల వయసు, సంస్కారము, అనుభవము, చదువు, హోదా మొదలగు లక్షణాల్ని గుర్తు పెట్టుకొని వాటి చేత ఔచితీవంతములైన సంభాషణల్ని పలికించాలి. ఒక్కోసారి మనఃస్థితిని బట్టి కూడా మాటలు వస్తాయి.

పాత్రల గుణగణాలను కథకుడు చెప్పటం కంటే, సంభాషణల పరంగా తెలిసేలా చేయాలి. తక్కువ నిడివి గల మాటలు ఎక్కువ శక్తివంతంగా ఉంటవి. ఉదాహరణకు చలం ‘హంపీకన్యలు’ తీసుకోవచ్చు. ఆసక్తి గొల్పే సంభాషణలతో కథా ప్రారంభం చేయవచ్చు. సహజంగా ఔచితీవంతంగా, వ్యావహరికంగా ఉండే సంభాషణలకు పాఠకుడు ఎక్కువ విలువ ఇస్తాడు. ఎక్కడ సంభాషణల్ని పెడితే కథ రక్తి కడుతుందో తెలసి ఉండాలి. కొందరు సంభాషణలతో ముగిస్తారు. మరికొందరు సంభాషణలతో కథను మలుపు తిప్పుతారు. ఇంకొందరు సంభాషణలతో కథను ప్రారంభిస్తారు.

“The dialogue short story is a fad of our day, a fashionable experiment in literature. Here the characters do all the work reveal themselves, suggest setting, shift scenes and carry the burden of the plot and all by means of Conversation.” – Albriet

సంభాషణ కొనసాగి సంవాదంగా మారాలి. అందులో భాగంగా ప్రశ్నలు, జవాబులు, పాఠకుడికి అందాలి. నిలువు పోగు, అడ్డపోగుల కలనేతతో బట్ట తయారైనట్లు సంభాషణ ద్వారా విషయం తెలవాలి. వాడకట్టు స్త్రీల ముచ్చట్లు విని శ్రీపాద తన కథల్లో వాటిని వాడుకున్నాడు. సహజత్వం కోసం అది ఆయన చేసిన ప్రయత్నం. దేహభాష, మనసు మాట, మూగభాష ఇలా పలురకాలు. ఇవన్నీ కూడా మాట విలువను నొక్కి చెప్పేవే. ఎక్కువ తెలిసిన వాడు ఏం మాట్లాడలేడట. ఇది కూడా మాట ప్రాశస్త్యాన్ని తెలిపేదే. కథకుడు సంభాషణల్ని తెలివిగా కథలో పొందుపరచాలి. మన పురాణ, ఇతిహాస, జానపదాల్లో రాయి రప్ప, దైవం-దయ్యం , భూతం-ప్రేతం, పశువు-పక్షి, అశరీరవాణి-ఆకాశవాణి అన్నీ మాట్లాడుతాయి. మాట పట్టింపు ఉంటది. ప్రతిజ్ఞలన్ని మాటలే. అవే రామ-రావణ యుద్ధాల్ని, కురుక్షేత్రాల్ని సృష్టించాయి. సంభాషణలు కథను ముందుకు, వెనకకు నడుపుతాయి. తుదకు ముగిస్తాయి కూడా.

పాత్రలు మాట్లాడాల్సిన చోట పాత్రలు, కథలోని కథకుడు చెప్పాల్సిన చోట కథకుడు, రచయిత కలగజేసుకోవాల్సిన చోట రచయిత వచ్చి మాట్లాడడం సహజంగా జరగాలి. అప్పుడే కథ ఔచితీవంతంగా ఉంటుంది. కింది మీద అయితే కథ అభాసుపాలు అవుతుంది. మాట అంటే, ఉబుసుపోకకు ఉండేది కాదు. అది కదిలించాలి. కదలాలి. చైతన్యాన్నివ్వాలి. కథలో అలాంటి సంభాషణలే ఉండాలి. కథ నిడివి తక్కువ కనుక పొల్లుమాటలకు ఎక్కువ స్థలము ఇవ్వరాదు. రెండు విరుద్ధశక్తుల మధ్య సంవాదం, పరాకాష్ట స్థాయికి వెళ్ళినపుడు కథలో సంభాషణ శోభిస్తుంది. మాటలు పెట్టాల్సిన చోట మాటలు పెట్టాలి. నాటకంలోని సంభాషణ, కథలోని సంభాషణలకు తేడా ఉంటుంది. మాటలు శక్తివంతమైనవి. ఎక్కడ ఎలా వాడాలో తెలిసి కథలో ప్రయోగించాలి.

ఉదాహరణ

చీమ వేసవి కాలమంతా తిండి పోగుచేసుకుంటూ గడుపుతుంది. గడ్డి మిడతేమో చెట్ల మీద ఎగురుతూ, తుళ్ళుతూ జల్సా చేస్తుంది. చలికాలం వస్తుంది.

చీమకు ఇంటి నిండా గ్రాసం ఉంటుంది. మిడత ఆకలితో నకనకలాడిపోతూ చీమ దగ్గరి కెళ్ళి జోలెపడుతుంది. అప్పుడు జరగుతుంది ప్రముఖ సంవాదం.

చీమ : వేసవిలో ఏం చేశావ్?

మిడత : కూనిరాగాలు తీసుకుంటూ రాత్రీ, పగలు గడిపాను.

చీమ : అలాగా, అయితే ఇప్పుడు భరతనాట్యం చెయ్యి

సోమర్సెట్ మామ్ రాసిన కథకు తెలుగు అనువాదం “చీమ-మిడత” కథలోనిది ఈ సంభాషణ. ప్రాణుల మధ్య జరిగిన ఈ మాటలు, మనుషులకు కూడా వర్తిస్తాయి. ఈ సంభాషణను ఆధారం చేసుకునే కథంతా నడుస్తుంది. రెండురకాల మనస్తత్వాలకు ఈ సంభాషణ అద్దం పడుతుంది.

(మరోసారి మరో అంశంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here