[dropcap]రో[/dropcap]జంతా చండ్ర నిప్పులు కురిపించిన మార్తాండుడు పడమటి కొండకి ప్రయణమయ్యాడు. ఇంట్లో గోడలు, నేల ముట్టుకుంటే కాలిపోతున్నాయి. ఇదేం విచిత్రం కలికాలం కాకపోతే! నియమం ప్రకారమైతే వర్షాకాలం జరుగుతూ ఉండాలి ఇప్పుడు. ఈ కాని కాలంలో ఎండలేమిటి?
ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చెట్లన్నీ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాయి. దుమ్ము ఎగురుకుంటూ ఇంట్లోకి, కంట్లోకి వచ్చి పడుతోంది. గాలికి తలుపులు విరిగి పోతాయేమో అన్నంత దబ దబా కొట్టుకుంటున్నాయి. సాయంత్రం లక్ష్మి అద్దంలా తుడిచి వెళ్లిన గదుల్లో కాలికి దుమ్ము అంటుకుంటూ చిత్రకారుడు గీసిన పాదాల ముద్రల్లా అడుగుల గుర్తులు పడుతున్నాయి. ఇంతకు గంట ముందే శ్రీవారు విజయ్ ఫోన్ చేసాడు. మా అమ్మాయి తన్మయి ఇంటికి కారులో హైద్రాబాద్ వెళ్ళాడు. అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే పెద్ద వర్షం, గాలులు మొదలయ్యాయిట. అమ్మయ్య అనుకున్నా క్షేమంగా చేరిపోయి నందుకు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇప్పుడు అని మెస్సేజ్ పెట్టా.
మాది మేడ మీద పోర్షన్. హలులో నుంచి చూస్తుంటే చీకట్లో ఊగుతున్న చెట్లు, ఉరుముతున్న ఆకాశం, మిరుమిట్లు గొలుపుతున్న మెరుపులు, ఏటవాలుగా పడుతున్న వాన ధారలు, దృశ్యం చాలా బాగుంది. కానీ, వర్షం ఎప్పుడూ ఇలాగే బాగుంటుందా? వర్షం అందరికీ ఒకేలా బాగుంటుందా? ఉహూ,ఎప్పటికీ అలా వుండదు.
ఆఫీసుల నించి, స్కూళ్ల నుంచి ఇళ్ళకి వెళుతున్న వాళ్ళు, బస్టాండ్, స్టేషన్లలో నిల్చున్న వాళ్ళు, రోడ్ల మీద పళ్ళు, పూలు కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళు, కారిపోతున్న ఇళ్లల్లో వుండే వాళ్ళు వీళ్ళంతా ఈ వానలో ఏం అవస్థలు పడుతున్నారో! వర్షం కొందరికి మోదం, కొందరికి ఖేదం! ఒక్కోసారి ప్రమాదం, ఒక్కోసారి ప్రమోదం!
టీ. వి. పెట్టాను. వేర్వేరు చోట్ల పడుతున్న వర్షాల్లో జలమయాలైన రోడ్లు, కూలిపోయిన చెట్లు, నిరాశ్రితులైన జనం, ఎంత దారుణం! ఎక్కడో బస్ ఆగిపోయిందిట. బస్‌లో పిల్లల ఏడ్పులు, పెద్దవాళ్ళ హాహాకారాలు గోల గోలగా వినిపిస్తున్నాయి. టీ.వి.లో ఆ ఎడతెగని వర్షంలో ఆగిపోయిన బస్‍ని చూస్తూంటే నా ఒళ్ళు ఒక్కసారిగా గగుర్పొడిచింది. ఏ వూరో అది! ముప్ఫై ఏళ్ళ నాటి సంఘటన ఇలాంటి సమయాల్లో ఎప్పుడూ గుర్తొచ్చి నన్ను వణికిస్తూనే ఉంటుంది.
***
అప్పుడు నేను తిరుపతి మా అక్క వాళ్ళింటికి, బి.ఈడి పరీక్షలు రాసి సెలవలకు వెళ్లి బందరు తిరిగి వస్తున్నాను. మా బావగారు రాత్రి తొమ్మిదింటికి బస్సెక్కించారు. ఇవాళ్టి లాగానే వాతావరణం చాలా మాములుగా ఉంది. మధ్యాహ్నం ఎండగా ఉంది. సాయంత్రం వర్ష సూచనలు లేవు. వర్షం వచ్చేట్లుంటే ఆగిపోయే దాన్ని. ఇప్పటిలా రిజర్వేషన్లు చేయించు కోవటం లేదప్పుడు. బస్టాండ్‌కి వెళ్లి ఎక్కేయటమే. ఫోన్లు లేవు. లాండ్ ఫోన్ ఉన్న మాలాంటి దిగువ మధ్య తరగతి ఇళ్లకు రాలేదు. ఫలానా రోజు వస్తున్నానని నాలుగు రోజుల ముందే అమ్మకి ఉత్తరం రాశాను. అప్పుడు ఉత్తరాలు వెంటనే అందేవి కూడా.
బస్సెక్కిన గంటకే వర్షం మొదలైంది. సన్నగా చినుకులు, చల్లని గాలి కిటికిలోంచి తాకుతుంటే హాయిగా ఉంది. లైటు ఆర్పేశారు బస్‌లో. కావలి దాకా వెళ్ళేటప్పటికి బస్సు కదలనని మొరాయించింది. కుండపోత వర్షం. రోడ్లన్నీ జలమయం! లైట్లు వెలిగాయి. అమ్మో ఇప్పుడెలా, అందరూ ఇదే మాట. పిల్లల ఏడ్పులు. పెద్దవాళ్ళ మొక్కులు. కిటికీలన్ని మూసేసారు. కిటికీ అద్దాల మీద దబ దబ పడుతున్న వర్షం, ఖాళీలలోంచి లోపలికి చొరబడుతోంది. ఏది ముట్టుకున్న చల్లగా తగులుతోంది. అందరూ వాళ్ల వాళ్ళ కుటుంబాలతో వున్నారు. నేనొక్కతినే ఒంటరిదాన్ని.
నాలో నెమ్మదిగా భయం ఒళ్ళంతా పరుచుకుంటోంది. నా పక్కన ఎవరో ఒకావిడ కూర్చుంది. వెనకెక్కడో కూర్చున్న వాళ్ళాయన ఆవిడ దగ్గరకు మాటి మాటికీ వచ్చి మాట్లాడుతూ నా వంకే చూస్తున్నాడు. నాకు ఎడం వైపు వరసలో కూర్చున్న అబ్బాయి అదేపనిగా నన్నే గమనిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నా ముందు సీట్లో ఓ మధ్య వయసు జంట కూర్చున్నారు. ఆయన వెనక్కి తిరిగి నా వంకే చూస్తున్నాడు. మెడ నొప్పి పుట్టదా, ఒంటరిగా ప్రయాణం చేసే ఆడవాళ్లను ఇట్టే గమనించి మాటలు కలుపుతారే మగవాళ్ళు, జాగ్రత్తగా ఉండాలి అని ఒదిన చెప్పిన మాటలు గుర్తొస్తూన్నాయి. బైట చలికో, లోపల భయానికో ఒళ్ళంతా ఒణుకుతో కదిలిపోతోంది. చీర కొంగు చుట్టూ కప్పుకున్నాను.
నేను డిగ్రీ వరకు స్త్రీల కళాశాలలోనే చదువుకున్నాను. అక్కడ లెక్చరర్లంతా దాదాపు ఆడవాళ్లే! పాఠాల మధ్యలో ఆడపిల్లలు మగవాళ్ల దురన్యాయలకు ఎలా బలైపోతున్నారో చెప్పిన మాటలన్నీ గుర్తుకు వస్తున్నాయి. నేను చదివిన కథల్లోని, నవలల్లోని చెడు మగ పాత్రలన్నీ నా చుట్టూ చేరి వికటాట్టహాసం చేస్తున్నాయి. బస్సులో ప్రతి మగ మనిషి నా ఒంటరి ప్రయాణాన్ని గుర్తించినట్లు అనిపిస్తోంది.
ఈ ప్రయాణంలో గమ్యం ఎలా చేరాలా అని ఆలోచిస్తారు కానీ నా గురించి ఎవరు పట్టించుకుంటారని అంతలోనే ధైర్యం! అంతులేని ఆలోచనల్లా అంతం లేని వాన!
ఇంతలో నా వెనక సీట్లో పెద్దాయనకు కళ్ళు తిరుగుతున్నాయిట. వాళ్ళావిడ “కాస్త ఏమన్నా తిని ఎక్కమంటే విన్నారా, మధ్యాహ్న మెప్పుడో తిన్న తిండి. మధ్యలో బస్సాగి నప్పుడు టీ తాగి, బిస్కట్లు కొనుక్కుంటానన్నారు. చూడండి ఇప్పుడేమైందో. అయ్యో! నీరసంతో కళ్ళు తేలేస్తున్నారు” ఆవిడ కంగారు పడిపోతోంది. అక్క వాళ్ళ పాప నా హాండ్ బ్యాగులో పెట్టిన బిస్కట్ పాకెట్ గుర్తొచ్చింది. ఆయనకు పెట్టమని ఇచ్చాను.ఆవిడ కృతజ్ఞతగా చూసి తీసుకుంది. ఆయనకు నాలుగు బిస్కట్లు పెట్టి, మిగిలినవి ఇవ్వబోతే ‘ఉంచండి’ అన్నాను. ఆవిడ కూడా మళ్ళీ అవసర మవుతాయనేమో మాట్లాడకుండా తీసుకుంది. పెద్దాయనకి కాస్త ఓపిక వచ్చింది. నాకు తృప్తిగా అనిపించింది. ఎడమ వరసలో అబ్బాయి నన్ను మెచ్చుకోలుగా చూసినట్లనిపించింది.
రాత్రి రెండింటికి వాన కుండపోత తగ్గి, చినుకుల లోకి వచ్చింది. డ్రైవర్ బస్ ముందుకెళ్లే పరిస్థితి లేదు, రోడ్లు బాగా లేవు అని చెప్పాడు. కలగా పులగంగా అందరూ ఏమేమో మాట్లాడేస్తున్నారు. ‘మధ్యలో ఇలా వదిలేస్తే ఎలా’ అని అరుస్తున్నారు. దారంతా జలమయమైపోతే నేనేం చేయగలను? స్టేషన్‌కి వెళ్లి విజయవాడ దాకా ట్రైన్ ఉంది, వెళ్లి ఎక్కండి” అన్నాడు.
వెనక పెద్దాయన భార్య నా ముఖంలో భయాన్ని, ఒంటరితనాన్ని చూసి, “రామ్మా! రైలు వెళ్ళిపోతే ఎక్కడుండాలో కూడా గతి లేదు. వెళ్లి అందులోనే కూర్చుంటే అది ఎప్పుడు తీసుకెళితే అప్పుడే చేరుకుంటాం”అంది. నేను ఆ పెద్ద జంటనే అంటిపెట్టుకుని, నేను వాళ్ళతోనే వచ్చాను అనే భావన కలగజేస్తూ వాళ్ళ వెంటే వెళ్ళాను. స్టేషన్‌కి ఎలా వెళ్లామో గుర్తు లేదు. విజయవాడ వెళ్లే ట్రైన్ ఉంది. అందరం ఎక్కేసాం. నేను వాళ్ళకు ఎదురు సెట్లో కూర్చున్నాను. ఆవిడ మళ్ళీ ఆయనకు రెండు బిస్కట్లిచ్చింది. వాళ్ళు వెళ్లాల్సింది విజయవాడేనట. వాళ్ళ ముఖాల్లో ఓ నిశ్చింత కనిపించింది నాకు.నేను ఇంకా ముందుకు సాగాలి మరి! తెల్లారింది ఎలాగో!
రైలంతా తడి తడి. టాయిలెట్లన్నీ వాసన. ఎలాగో బ్రష్ అయిందనిపించాను ఆవిడ ఇచ్చిన పేస్ట్‌తో. ట్రైన్ ఆగిపోయింది మళ్ళీ! వర్షం పడుతూనే ఉంది. టీ, కాఫీలు తెచ్చే వాళ్ళమీద పడి జనం అంత కొనేసుకుంటుంటే నాకేం చేయాలో తోచలేదు. ఆ పెద్దావిడే నాకూ కాఫీ తీసుకుంది. టిఫిన్లు ఏవో వస్తున్నాయి. నాకేం తినాలనిపించ లేదు. వాళ్ళు అడిగితే వద్దన్నాను.
బస్‌లో నా పక్కన కూర్చున్నావిడ, వాళ్ళాయన నా పక్కనే కూర్చున్నారు. ఆయన ఆవిడతో ఎక్కువెక్కువగా మాట్లాడుతూ జోకులేస్తూ, నా వంక దొంగ చూపులు చూస్తున్నాడు. ఇక్కడ కూడా వదలలేదు వీళ్లు అనుకుంటూ కిటికీ లోంచి బైటకి చూస్తూ కూర్చున్నాను.
నాకు చిరాగ్గా ఉంది. అసలు ఇంటికి వెళతానా, అమ్మ వాళ్ళను చూస్తానా అనిపిస్తోంది. ఈ రైలెప్పటికి కదులుతుంది? విజయవాడ ఎప్పుడు వెళుతుంది? అక్కడ నించి నేనెప్పుడు బందరు వెళతాను? ఎలా వెళతాను? తల పగిలిపోతోంది. అన్నట్లు మర్చిపోయాను. బస్సులో ఎడమ వరసలో కూర్చున్న అబ్బాయి మేం కూర్చున్న బోగీ లోనే కిటికీ దగ్గర సింగిల్ సీట్లో కూర్చున్నాడు. ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. పిల్లలు రైలంతా తిరుగుతూ ఆడుకుంటున్నారు. ఆకలేసినప్పుడు ఏడుస్తున్నారు. పిల్లలు ఏడుస్తుంటే తల్లులు బాదుతున్నారు. తినటానికి ఏమీ అమ్మి రావట్లేదు. అక్క తిరుపతిలో ప్రత్యేకంగా చేయించి ఇచ్చిన జంతికలు, లడ్లు గుర్తొచ్చాయి.ఇవి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ల పోతేనేం. పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. బాగ్ లోంచి తీసి ఓ తల్లికి, పెట్టమని ఇచ్చాను. అయిదారేళ్ళవయసు పిల్లలు ఓ పదిమంది దాకా వున్నారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చారో! కలిసిపోయి ఆడేసుకొంటున్నారు.
అంచెలంచెలుగా నడుస్తూ, మధ్య మధ్యలో ఆగిపోతూ మంద మందంగా ప్రయాణిస్తూ మొత్తం మీద రాత్రి ఏడింటికి రైలు విజయవాడ చేరుకుంది. చాలా మంది విజయవాడ వాళ్లే! వాళ్ళ ముఖాలు కళ కళ లాడిపోతున్నాయి. కుంభవృష్టి కురుస్తూనే ఉంది. ఆటోలు, రిక్షాలు ఎంత అడిగినా లెక్క చేయకుండా ఎక్కేస్తున్నారు. పెద్ద జంటలో ఆవిడ “అమ్మా, ఈ రాత్రి మా ఇంట్లో ఉండు.రేపు పొద్దున్నే వెళుదువు గాని”అంది
ఎవర్నీ నమ్మాలనిపించట్లేదు. వాళ్ళెవరో ఏమిటో, ఎలాగోలా ఇల్లు చేరుకోవాలి. రాలేనని చెప్పేసాను. వాళ్ళు వెళ్లిపోయారు.
ఇద్దరు ఆడవాళ్లు ఇద్దరు మగవాళ్ళు ఆటోలో బస్టాండ్‌కి వెళుతున్నారు. వస్తారా అనడిగారు. వెంటనే ఎక్కేసా. ఆటోలో ఆ అబ్బాయి కూడా ఉన్నాడు. ఓ సారి కళ్ళు కలిసాయి.
బస్టాండ్‌లో మిగతా ముగ్గురు నాగాయలంక వెళ్లే బస్ కోసం వెళ్లిపోయారు. నేనూ, ఆ అబ్బాయే ఉన్నాం. లోపల భయంగా ఉంది నాకు. ఏడుపు వచ్చేస్తోంది.
“ఎక్కడికి వెళ్ళాలి మీరు” అడిగాడు.
“బందరు, మీరు?” ధైర్యాన్ని నటిస్తూ అడిగా.
“నేనూ అక్కడికే. బస్సు ఉందేమో చూద్దాం రండి” అన్నాడు. అప్పటికి ఎనిమిదయింది టైం. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. వాన కురుస్తూనే ఉంది.
“బస్ కదులుతోంది రండి” అన్నాడు.
బస్‌లో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. మేం ఇద్దరమే! ఈ అబ్బాయి ఎలాంటివాడో! వెళ్లాలా వద్దా, ఇంకో బస్ చూద్దామంటే ఇందులోనే ఎవరూ లేకపోతే తరవాత బస్ ఉంటుందా. ఈ డ్రైవర్ ఎలాంటి మనిషో! దేవుడా,ఇంటికి సవ్యంగా వెళతానా, అనుకుంటూ భయపడుతూనే ఎక్కేసాను.
చిప్స్ పేకెట్ ఒకటి, బిస్కట్ ప్యాకెట్ ఒకటి ఆ అబ్బాయి నేను కూర్చున్న సీట్లో పెట్టాడు. “ఇవి తినండి. బస్సెక్కిన దగ్గర్నుంచి మీరేం తినలేదు. ఇంటికి వెళ్లిపోతున్నారుగా.ఇంక దిగులేముంది?తినండి” అన్నాడు.
“వద్దు” అన్నాను
మాట్లాడకుండా వెళ్లిపోయాడు. నా కన్నా రెండు వరసల ముందు కూర్చున్నాడు ఆ అబ్బాయి.
చాలా నీరసంగా ఉంది నాకు. అయినా తినాలనిపించ లేదు. కిటికీ సగం తెరిచి ఉంచాను. విరిగి పడిన చెట్ల కొమ్మలు, నీళ్లు నిండిన రోడ్లు, ఆ నీళ్ళల్లో పడవలా మా బస్సు. డ్రైవర్ చాలా నేర్పుగా నిదానంగా తీసుకెళుతున్నాడు. ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూడలేదు.
బస్ బందరు చేరేటప్పటికి రాత్రి పదకొండు గంటలైంది. జలదిగ్బంధంలో బస్టాండ్! మేం దిగేటప్పటికి ఒకే ఒక్క రిక్షా ఉందక్కడ. రిక్షా అతనికి నిజాం పేట అడ్రెస్ చెప్పాను. పాతిక రూపాయలన్నాడు. మాములుగా అయితే నడిచి వెళ్లే దూరం.
“నీకు దారి తెలుసా?” అడిగాను.
“ఎందుకు తెలీదమ్మా? రోజూ ఎంతమందిని తీసుకెళ్లటం లేదు? ఈ నీళ్లలో రిక్షా కదలటమే కష్టం. అందుకే అంత అడిగాను” అన్నాడు.
రిక్షా ఎక్కాను. “జాగ్రతగా తీసుకెళ్లు” అన్నాడు ఆ అబ్బాయి. మంచివాడే అనుకున్నా అప్పుడు. మీరెక్కడకి వెళ్ళాలి, ఎలా వెళతారు అని అడగాలని తోచలేదు.
రిక్షా అతను సముద్రంలో రిక్షాను లాగలేక లాగలేక తీసుకెళుతున్నాడు. సరిగ్గా తీసుకెళ్తాడా! వీధి లైట్లు వెలగట్లేదు. అంతా చీకటిమయం. రిక్షా పక్కకి పడిపోతుందా. నేను నీళ్లలో పడిపోతానా. భయంతో శరీరం గడ్డ కట్టుకుపోతోంది. ఈడేపల్లి ఆంజనేయస్వామి గుడి, తర్వాత శక్తి గుడి కనిపించాయి ఆ చీకట్లోనే. అమ్మయ్య! సరైన దార్లోనే తీసుకెళుతున్నాడు. దగ్గరకొచ్చేసాను. ఊపిరి పీల్చుకున్నాను. రిక్షా గంగానమ్మ గుడి సందులోకి వచ్చింది. ధైర్యం వచ్చేసింది. గంగానమ్మకు రిక్షా లోంచే దణ్ణం పెట్టేసుకుని రేపు కనిపిస్తానని చెప్పుకున్నాను. ఇంటి దగ్గరకొచ్చాక ఆపమన్నాను. ఆ రోజుల్లో పాతిక రూపాయాలంటే చాలా ఎక్కువ. కానీ,ఆ అంధకారంలో అర్థరాత్రి నీళ్లు నిండిపోయిన రోడ్లలోంచి నన్ను క్షేమంగా ఇంటికి చేర్చాడు. నేను యాభై రూపాయలు చేతిలో పెట్టాను. చిల్లరకోసం జేబులో వెతుకుతున్నాడు.
“వద్దు, ఏమీ ఇవ్వక్కరలేదు. జాగ్రత్తగా వెళ్ళు” అన్నాను. దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు. తలుపు తీసిన అమ్మ ఆశ్చర్య పోయింది. “వర్షంలో బయలుదేరలేదనుకున్నాం” అంటూ నాన్నను లేపింది. అంతా విని అడుగడుగునా ఆశ్చర్యపోతూ “నిన్న రాత్రి బయలు దేరిన దానివి ఇన్ని ఇబ్బందులు పడి ఇప్పటికైనా ఇంటికి క్షేమంగా చేరావు. అంతే చాలు.” అన్నారు అమ్మానాన్నలు. అమ్మ వేడి వేడి పాలు ఇచ్చి తాగి పడుకోమంది.
పక్క మీదకి వాలాక ప్రయాణం అంతా కళ్ళముందు కదిలింది నాకు. ఆ ఒంటరి ప్రయాణం, భయానక వాతావరణంలో మనసు బలహీనమై అనేకమైన అనుమానాలు చుట్టుముట్టటం సహజం. ఏమైనా పెద్ద సాహస యాత్ర చేసి భద్రంగా ఇంటికి చేరాను అనుకుంటుంటే ఎందుకో ఆ అబ్బాయి గుర్తుకొచ్చాడు. నా పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. మనసు తేలిక పడి నిద్రలోకి జారుకున్నాను.
రెండేళ్ల తర్వాత నాన్నగారు నేను విజయవాడలో ఓ స్కూల్లో ఇంటర్వ్యూకి వెళ్లి బస్టాండ్‌లో బందరు బస్సు కోసం చూస్తుంటే బస్సులో అబ్బాయి కనిపించాడు. మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చాడు. ‘గుర్తు పట్టారా’ అన్నాడు.
నేను నవ్వుతూ తలుపాను. నాన్నకు పరిచయం చేశాను.
“ఆ రోజు ఆ గాలివానలో దీని ప్రయాణం తలచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది బాబూ! నీ గురించి చెప్పింది. బందరులో ఎక్కడుంటారు బాబు?” అడిగారు నాన్న.
“బందరు కాదండి, గుడ్లవల్లేరులో ఉంటున్నాం. అక్కడ బాంక్ మానేజర్‌గా చేస్తున్నాను” అన్నాడు.
“గుడ్లవల్లేరా, మరి ఆ రాత్రి..” ఆశ్చర్యపోయాను.
“మీరు అడగలేదు. మాది బందరు కాదని చెపితే వెంటపడుతున్నాననుకుని, అనుమానపడి మరింతగా భయపడతారని నేనూ చెప్పలేదు. ఆ రోజు తిరుపతి నుంచి విజయవాడ దిగి పని చూసుకుని మా ఊరు వెళ్ళాలి. వర్షంవల్ల కుదరలేదు. బస్సులో ఒక్కరే ఉన్నారని బందరు వచ్చేసాను. ఆ రాత్రి బందరు బస్టాండ్‌లో ఉండి మర్నాడు ఊరు చేరుకున్నాను,” అన్నాడు.
ఆ రాత్రి ఆ చలిలో బస్టాండ్‌లో ఉండిపోయాడా! కృతజ్ఞతగా చూసాను. నాన్నగారు “ఒకసారి ఇంటికి రా బాబూ” అని ఆహ్వానించారు.
తర్వాత నెలలోపలే విజయ్ వాళ్ళ అమ్మా నాన్నలతో మా ఇంటికి రావటం, మా పెళ్లి జరిగిపోయాయి. ఆ వర్షం కురిసిన రాత్రి కలిపిన బంధం మాది.
***
టైం పన్నెండయింది. నిద్ర రావట్లేదు. వర్షం బీభత్సంగా కురుస్తూనే ఉంది. ‘దేవుడా, ఏ ఆడపిల్లకు నాలాంటి భయంకర పరిస్థితి కల్పించకు.’ అని అనుకుంటుండగా ఫోన్ మోగింది.
ఈ టైం లోనా అని చూసా.
‘విజయ్’.
“నిద్ర పోలేదా?ఇప్పుడు చేసావేమిటి?” అన్నాను.
“నిద్ర రావట్లేదు. వర్షం పెద్దగా కురుస్తోంది ఆ రోజులా. నువ్వూ పడుకునుండవని చేశా” అన్నాడు.
“అవును విజయ్,నిద్ర రావట్లేదు,” “ఆ వర్షం కురిసిన రాత్రి గుర్తొస్తోంది కదూ నీక్కూడా. గుడ్ నైట్” అంటూ ఫోన్ పెట్టేసాడు.