[dropcap]మృ[/dropcap]ణాళిని రచించిన ‘రఫీ ఒక ప్రేమపత్రం’ పుస్తకం పాటల విషయంలో తీవ్రమైన అవగాహన రాహిత్యాన్ని ప్రదర్శించింది. ఇదే రకమైన అవగాహన రాహిత్యం, ప్రణాళికా లోపం పుస్తకం అడుగడుగునా కనిపిస్తుంది. అయితే సామాన్య పాఠకులు ఈ అంశాలను గ్రహించలేరు. పుస్తకం చదివిస్తే మెచ్చుకుంటారు. పైగా తెలుగు సాహిత్యంలో రచయిత పేరును చూసి పొగడే వ్యవస్థ ఒకటి ఉంది. దీనికితోడు సోషల్ మీడియా అభివృద్ది చెందటంతో మంచి భజనబృందాలు ఉన్న రచయిత పుస్తకం విడుదలకు ముందే పొగడ్తలకు గురవుతాయి. అమాయక పాఠకులు ఈ ప్రచారాన్ని నమ్మి పుస్తకాన్ని కొని నిరాశకు గురవుతారు. ‘అందరూ పొగిడే పుస్తకం స్థాయి ఇదే అయితే మామూలు పుస్తకాలింకెంత అధమస్థాయిలో ఉంటాయోన’ని తెలుగు పుస్తకాలకే దూరమవుతారు. పాఠకులు. ఎందుకంటే ఈ ప్రచార వ్యవస్థ ఏర్పాటు చేసుకోలేని రచయితల మంచి పుస్తకాలు ఉన్నట్టు కూడా పాఠకులకు తెలిసే వీలులేదు. కాబట్టి రచయితతో సంబంధం లేకుండా పుస్తకాన్ని విశ్లేషించే విమర్శ వ్యవస్థ తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం అత్యంత ఆవశ్యకమైన అంశం.
‘రఫీ ఒక ప్రేమ పత్రం’ విడుదలకు ముందే మంచి ప్రచారాన్ని పొందింది. ఓ ప్రముఖ దినపత్రికలో పుస్తకంలోని కొన్ని భాగాలు ప్రచురించారు. టీవీల్లో ‘ఇంటర్వ్యూలు’ వచ్చాయి. విడుదలవుతూనే ఫేస్‍బుక్‍లో ‘కొందరు పెద్దలు’ (చలామణి పెద్దలు) పుస్తకాన్ని చదవటానికి ‘జీవితకాలం సరిపోద’ని వ్యాఖ్యానించారు. పుస్తకం అందుకుంటూనే జన్మ ధన్యమైనట్టు ప్రకటించారు. పుస్తకంలో వర్ణించిన ఒకో పాట వింటూ, యూట్యూబ్ లో చూస్తూ మైమరచిపోతున్నట్టు ఏవేవో లోకాలకు వెళ్ళిపోతున్నట్టు రాశారు. సహజంగానే రఫీ ప్రేమికులకు కుతూహలం మరింత పెరిగింది. ఈ పుస్తకం చదవకపోతే ఏదో కోల్పోతామన్న భావన తీవ్రతరమైంది. గతంలోనూ ఓ ప్రముఖుడు ఓ ప్రయాణ పుస్తకం గురించి ఇలానే ప్రచారం చేయటంతో ఆ పుస్తకం బహువ్యాప్తి పొందింది. రచయిత ‘సెలబ్రిటీ’ స్థాయిని అందుకున్నారు. కానీ చదివినవారు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. అంత పెద్దాయన పొగడినప్పుడు తాము పొగడకపోతే తమలోనే ఏదో లోపం ఉందనుకుంటారనీ తామూ భజన బృందంలో చేరిపోయారనేకులు. ఇక్కడే నిజాయితీకల నిష్పాక్షిక విమర్శ ఆవశ్యకత స్పష్టం అవుతుంది. అనవసర పొగడ్తల ప్రచారంతో అమాయకులను ప్రలోభపెట్టే భజన బృందాలను కూడా పాఠకులకు జవాబుదారీ చేయాల్సిన అవసరం తెలుస్తుంది. స్నేహధర్మానికిచ్చిన ప్రాధాన్యం సాహిత్య ధర్మానికి ఇవ్వనందుకు వారినీ దోషులుగా పరిగణించాల్సివుంటుంది.
క్రితం వారం హిందీ పాటల విషయంలోని దోషాలను తెలుసుకున్నాం. ఈవారం, పలు తీర్మానాలు, వ్యాఖ్యలు చేయటంలో అవగాహన రాహిత్యం, అధ్యయన రాహిత్యానికి సంబంధించిన్న కొన్ని విషయాలను ప్రస్తావించుకోవాల్సివుంటుంది. ముందుగా విషయ సేకరణ, విషయాన్ని అందించటంలోని లోపాలను ప్రస్తావించుకోవాల్సివుంటుంది. మామూలుగా స్నేహితులనడుమ మాట్లాడేసమయంలో ఎలా మాట్లాడినా సరిపోతుంది. కానీ, అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరిచేప్పుడు, పుస్తకాలలో తీర్మానాలు చేసేటప్పుడు, లోతయిన అధ్యయయనం, ప్రతి వ్యాఖ్యానం వెనుక దాన్ని సమర్ధించే వివరాలు ఉండటం తప్పనిసరి. ఏదో గాలిలో తీర్మానాలు చేస్తే సరిపోదు. ముఖ్యంగా, ప్రముఖుల గురించి రాసేటప్పుడు ఇది తప్పనిసరి. ఆ విషయంలో ఈ పుస్తకం తీవ్రమైన నిరాశను కలిగిస్తుంది.
‘రఫీ ఒక ప్రేమ పత్రం’ ఆరంభంలోనే అయోమయం కలిగిస్తుంది. 1945వ సంవత్సరం బొంబాయిలో ఒక రంగస్థలం అంటూ నాటకీయంగా ఆరంభమవుతుంది. ఈ సంఘటనను 1978లో లండన్లో ప్రసిద్ది చెందిన ప్రదర్శన మందిరంలోని ఘటనతో పోల్చి 1960 దశకంలో మొదలుపెట్టి 1978 వరకూ చేసిన అనేకానేక విదేశీ పర్యటనల్లో ప్రతిసారీ ఇదే అనుభవం (14వ పేజీ) అన్న వ్యాఖ్యతో ముగుస్తుంది. ఇక్కడ అయోమయం ఏమిటంటే 1945 అన్న తేదీని నిర్ణయించటం. రఫీ బొంబాయిలో అడుగు పెట్టిన తరువాత జరిగిన సంఘటన ఇది. సంవత్సరం స్పష్టంగా తెలియదు. రచయిత సంవత్సరాన్ని నిర్ణయించటానికి ఆధారాలు లేవు. అయితే 22-23 పేజీలో ఈ సంఘటనను మరో రకంగా చెప్తారు రచయిత్రి (ఇది సుజాతాదేవ్ పుస్తకంలోనిది). ఇక్కడ ‘ఖాన్ సాబ్’ కచేరీలో పాడి శ్రోతలను ముగ్దులను చేస్తాడు. చివరలో బ్రాకెట్‍లో అదెలా జరిగినా కుందన్ లాల్ సైగల్ కోసం ఏర్పాటు చేసిన వేదిక మీద మహ్మమద్ రఫీ పాడటం మాత్రం నిజం అని తీర్మానిస్తారు. అంటే రచయిత్రి , సైగల్ కచేరీలో కరెంటు పోయినపుడు రఫీ లాహోర్‍లో పాడటాన్ని, ముంబాయిలో ఖాన్ సాహెబ్ కార్యక్రమంలో పాడటాన్ని కలిపి ఆరంభంలో రాసి మధ్యలో ఖాన్ సాహెబ్ కచేరీ రాసి, సైగల్ సభలో కూడా ఇలాగే జరిగింది. ఎపుడు జరిగిందో తెలియదు కానీ జరిగింది, అని పాఠకులకు చెప్తున్నారన్నమాట…
బయోగ్రఫీ రచనల్లో ప్రధాన సూత్రం ఒకటి ఉంది. ప్రఖ్యాత పురుషుల గురించి పలు కధనాలు ప్రచారంలో ఉంటాయి. వాటిల్లోంచి ఎంచుకునే సంధర్భంలో రచయిత విచక్షణను ఉపయోగించాలి. తనకు సరైంది అనిపించిన గాథను ఎంచుకోవాలి. ఎలాంటి అయోమయాన్ని కలిగించకుండా స్పష్టంగా రచించాలి. రచయిత ఆ నియమాన్ని పాటించలేదు. 13వ పేజీలో రాసినట్టు 1945లో సైగల్ పాడే సమయంలో విద్యుత్ విఘాతం వల్ల అంతరాయం రాలేదు. 1945లో జరిగినట్టు రచయిత్రి చెప్తున్న సభ ఖాన్ సాహెన్ సభ. దాన్లో విద్యుత్ అంతరాయం రాలేదు. ఈ రెండు సంఘటనలను కలపటం వల్ల రచయిత్రికే సంఘటనపై స్పష్టమైన అవగాహన లేదని స్పష్టమవుతుంది. అయోమయానికి తావిస్తుంది.
సైగల్ సభలో విద్యుత్ అంతరాయం వల్ల రఫీ పాడటం సంభవించిన సంఘటన డిసెంబర్ 1937న జరిగింది. అది లాహోర్‍లో జరిగింది. దానికి సంబంధించిన పత్రిక ప్రకటన కూడా లభిస్తుంది. రెండు విభిన్నమైన సంఘటనలను కలిపి ఒకటి ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ జరిగింది అనటం అవగాహన రాహిత్యాన్ని సూచిస్తుంది. పైగా ఒక సందర్భంలో జరిగిన సంఘటనను మరో సందర్భంలో జరిగిందని చెప్పటం పొరపాటు అవుతుంది. పాఠకులను తప్పుదారి పట్టించటం అవుతుంది.
164వ పేజీలో ‘1980 మే నెలలో కూడా విదేశీ పర్యటనకు వెళ్ళాడు రఫీ’ అని వ్రాశారు రచయిత్రి. ఈ వాక్యాన్ని 14వ పేజీలో వాక్యం ’1960 దశకంలో మొదలుపెట్టి 1978 వరకు చేసిన విదేశీపర్యటనల్లో’ తో పోల్చి చూస్తే మళ్ళీ అయోమయం కలుగుతుంది. లేదా, 1980లో జరిపిన విదేశీ పర్యటన విఫలమయిందేమో అందుకే రచయిత్రి 1978 వరకూ జరిగిన విదేశీ పర్యటనల వరకు విపరీతమైన ప్రజాదరణ లభించిందని రాశారు అని సర్ది చెప్పుకోవాల్సి వస్తుంది. 1980లో విదేశీపర్యటనకు రఫీ తన అనారోగ్యాన్ని దాచివెళ్ళాడంటారు. ఆ సభ అత్యంత విజయవంతమయింది.దొరికిన సమాచారాన్ని సరిగ్గా పద్ధతి ప్రకారం అందించటంతో పాటు ఒకే పుస్తకంలో రెండు విరుద్ధమైన సమాచారాలు, వ్యాఖ్యలు ఉండకుండా చూసుకోవటం తప్పనిసరి. ఈ పుస్తక రచనలో ఇలాంటి మౌలికమైన జాగ్రత్తలు కూడా పాటించకపోవటం విచారకరం.
30వ పేజీలో 1947లో ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన సంబరాలకు రఫీకి ఆహ్వానం అందిందని, రఫీకి మూడు నిమిషాలు పాడే అవకాశం లభించిందని రాశారు. ‘రఫీ మై అబ్బా’ అనే పుస్తకంలో రఫీ కూతురు ‘యాస్మిన్ రఫీ’ ఈ విషయం రాసింది. ఈవిషయమై ఏకాభిప్రాయంలేదు. 1947 సంబరాలలో ఎర్రకోటనుండి బిస్మిల్లహ్ ఖాన్ షెహనాయీ వినిపించారు. కొందరు రఫీ ఢిల్లీ ఎర్రకోట నుండి పాడింది జనవరి 26, 1950న, ప్రధమ గణతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంలో అంటారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చే సమయానికి రఫీ ఎవరికీ అంతగా తెలియదు. అప్పుడప్పుడే జుగ్నూ సినిమాలో నూర్జహాన్ తో కలసిపాడిన పాట ప్రాచుర్యం పొందటం వల్ల రఫీ పేరు తెలుస్తోంది. 1948లో మహాత్మాగాంధీ మరణం తరువాత గాంధీ గురించి పాడిన పాటతో రఫీ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆగస్ట్ 15, 1948న జవహర్లాల్ నెహ్రూ చేతులమీదుగా రఫీ గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఫలితంగా 1950లో ప్రథమగణతంత్ర దినోత్సవానికి డిల్లీకి ఆహ్వానం అందింది అంటారు. ఈనిజం నిరూపణకు రఫీ అభిమానులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
46వ పేజీలో బర్మన్ దాదాకి ఎప్పుడూ రఫీయే అభిమాన గాయకుడు అని తీర్మానించారు రచయిత్రి. ఇది పొరపాటు. ఎస్టీ బర్మన్ ఎప్పుడూ ఏ గాయనీ గాయకుడి వైపు మొగ్గు చూపలేదు. గీతాదత్‌కు పాట పట్ల శ్రద్ధ తగ్గుతోందనిపించగానే ఆషాకు ప్రాధాన్యం ఇచ్చాడు. చివరికి లతా మంగేష్కర్‌తో వివాదం వచ్చినప్పుడు, ఆశాభోస్లేతో పాడించాడు తప్ప లతాకు లొంగలేదు. లతాతో దోస్తీ కుదిరిన తరువాత ఆశాను కాబెరే పాటలకు దాదాపుగా పరిమితం చేశాడు. ఎస్డీ బర్మన్‌కు కిషోర్ కుమార్ పట్ల పుత్ర వాత్సల్యం ఉంది కానీ అది ఆయన ప్రొఫెషనల్ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అదే పేజీలో గురుదత్ సాహిర్, బర్మన్, రఫీ ఈ నలుగురు కలిసి సృష్టించిన మేజిక్ మరే సినిమాలోనూ పునరావృత్తం కాలేదు అని వ్యాఖ్యానించారు. ఈ వాక్యం వల్ల వారు ‘ప్యాసా’ తరువాత కూడా కలిసి పనిచేశారు కానీ అంత మేజిక్ సృష్టించలేకపోయారు అన్న అర్థం వస్తుంది. ఇది పొరపాటు. ప్యాసా సినిమా తరువాత సాహిర్, ఎస్డీ బర్మన్‍లు కలిసి పనిచేయలేదు. కాబట్టి మేజిక్ పునరావృత్తం అయ్యే అవకాశమే లేదు.
48వ పేజీలో ‘ఆరాధన’లో కిషోర్ కుమార్ పాడిన పాటలు ఆర్డీబర్మన్ రికార్డు చేసిన కథను ప్రస్తావించారు. ఇది ప్రచారంలో ఉన్న కథ. ఇటీవలే కొందరు ఎస్డీ బర్మన్ అభిమానులు ఆరాధన పాటలు రికార్డయిన తేదీలను, డైరీలను బహిరంగం చేసి ఈ కథ పొరపాటని నిరూపించారు. ఆరాధన పాటలన్నీ ఎస్డీ బర్మన్ రికార్డు చేసినవే అని స్పష్టం చేశారు. అంతేకాదు, పలు సందర్భాలలో తన ఇమేజీ పెంచుకోవటం కోసం కొందరు కావాలని ప్రచారంలోకి తెచ్చిన పొరపాటు కథనాలలో ఇదొకటని నిర్ధారించారు.
49వ పేజీలో ‘శంకర్ – జైకిషన్’ గురించి ప్రస్తావిస్తూ ‘వీళ్ళకు రఫీ మొదట్లో అభిమాన గాయకుడు కాదు. దానికి ముఖ్య కారణం రాజ్‍కపూర్ ప్రాపకంతో వారు సినిమా రంగానికి రావటం, రాజ్‍కపూర్‍కి ముకేష్ కంఠంలా, మరొకటి నప్పదని అందరూ నిర్ద్వద్వంగా అంగీకరించడమే’ అని తీర్మానించారు. ఇది కూడా ప్రచారంలో ఉన్న అపోహనే. 1949 నుండి 1959 అంటే ఒక దశాబ్దంలో శంకర్ జైకిషన్ మొత్తం 38 సినిమాలలో 330 పాటలు రూపొందించారు. వీటిలో రాజ్‍కపూర్ నిర్మించిన/నటించిన సినిమాలు మొత్తం తొమ్మిది మాత్రమే. ఈ తొమ్మిది సినిమాల్లో రఫీ ఆరుపాటలు ముఖేష్ 22 పాటలు (సొలోలు, డ్యూయెట్లు కలిపి) పాడేరు. కానీ ఈ దశాబ్దంలో శంకర్ జైకిషన్ రూపొందించిన 330 పాటల్లో ముకేష్ 31 పాటలు, రఫీ 40 పాటలు పాడారు. అంటే రాజ్‍కపూర్ సినిమాలలో ముకేష్‍తో పాడించినా, మిగిలిన రాజ్‌కపూరేతర 29 సినిమాలలో ముకేష్‌తో 9 పాటలు, రఫీతో 34 పాటలు పాడించారన్నమాట. కాబట్టి ఆ సమయంలో రఫీకన్నా ముకేష్‌నే ఎక్కువ అభిమానించారనటం ఏరకంగానూ సబబు కాదు. శంకర్ జైకిషన్ ముకేష్ కన్నా రఫీకే ఎక్కువ పాటలు ఇచ్చారు. కానీ రాజ్‍కపూర్ పాటలు హిట్ అవటం, ముకేష్ రాజ్‍కపూర్ స్వరంలా ఎదగటం వల్ల, శంకర్ జైకిషన్‍లు రాజ్‍కపూర్ ఆస్థాన సంగీత దర్శకులు అవటం వల్ల వీళ్ళేదో ముకేష్‍కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు అనిపిస్తుంది. గమనిస్తే రాజ్‍కపూర్ నటించిన ‘చోరీ చోరీ’ లో ఒక్క ముకేష్ పాట లేదు. రాజ్ కపూర్ పాటలన్నీ మన్నాడే పాడేడు. శ్రీ 420లో సైతం రాజ్‍కపూర్‍కు మన్నాడే ఒక పాట పాడేడు. ’బూట్ పాలిష్’ సినిమాలో ముకేష్ పాట లేదు. నిర్మించింది రాజ్‌కపూరే అయినా దాన్లో ఆయన నటించలేదు, . అంటే ముకేష్‌ని అవసరాన్నిబట్టి వాడేడు తప్ప అభిమానాన్నిబట్టి కాదు. 1960 దశకంలో రఫీ తప్ప మరే గాయకుడూ కనబడని సమయంలో, రాజ్‌కపూర్‌కు రఫీతో “తుం హి తుం హో మేరే జీవన్ మే” అనే పాట పాడించారు శంకర్ జైకిషన్. కాబట్టి రఫీ అభిమాన గాయకుడు కాదు అనటం కుదరదు. ఆ మాటకొస్తే 330 పాటల్లో 159 పాటలు లతా సోలోలే. ఆస్, పట్రాణి, పూనమ్, మయూర్ పంఖ్, ఔరత్ వంటి సినిమాల్లో ఒక్క మగ పాట కూడా లేదు. అన్నీ లతావే. కాబట్టి మగగొంతును అవసరాన్ని బట్టి వాడేరు తప్ప ఎవరిపై ప్రత్యేక అభిమానం లేదు. ఉన్నా అది మన్నాడే పైన తప్ప ముకేష్ పై కాదు. 1960 తరువాత రఫీ తప్ప మరో గాయకుడు ఎవరికీ కనబడలేదు హిందీ సినీపాటల ప్రపంచంలో.
50వ పేజీలో ‘కాలాన్ని బట్టి, ప్రేక్షకులు, శ్రోతలు, హీరోలను బట్టి తమ బాణీలను మార్చుకున్న సంగీత దర్శకులు శంకర్ జైకిషన్. అలా మారలేక మార్చుకోలేక అస్త్ర సన్యాసం చేసిన వారు నౌషాద్, ఒ.పి నయ్యర్, ఎస్.డి బర్మన్ వంటివారు, అని తీర్మానించారు. ఇది అస్సలు ఆమోదయోగ్యం కాని వ్యాఖ్య. హిందీ సినీ ప్రపంచం గురించి ఎలాంటి పరిజ్ఞానంలేనివారు చేయాల్సిన వ్యాఖ్య. జైకిషన్ మరణంతో సినీ పరిశ్రమంతా ఒకటై శంకర్‍ను అణచి వేసింది. అయినా శంకర్ ఒక్కడే శంకర్ జైకిషన్ పేరిట 1986లో శంకర్ మరణం వరకూ సినిమాలకు సంగీతదర్శకత్వం వహించారు.కానీ 1971 తరువాత శంకర్ జైకిషన్‌కు పూర్వ వైభవంలేదు. నౌషాద్‍కు 1960 చివరి ప్రాంతానికే సినిమాలు లేని పరిస్థితి వచ్చింది. నౌషాద్ తేరె పాయల్ మెరె గీత్( గోవింద హీరో, 1989 ), గుడ్డు( షాహ్ రుఖ్ ఖాన్ హీరో,1995 ) తాజ్ మహల్ (అర్బాజ్ అలి , పూజా బాత్ర, 2005) వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇది ఏరకంగానూ అస్త్రసన్యాసం కాదు. ఒ.పి నయ్యర్ సినిమాలు తక్కువగా ఒప్పుకునేవాడు. రఫీ, ఆశాలలో విభేదాలు అతని కెరీర్‍ను దెబ్బతీశాయి. ఆయన నీరాజనం(1988) , అందాజ్ అప్నా అప్నా(1994), నిశ్చయ్(1992) , జిద్(1994), జై భవాని(2000) వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం అందించారు. అంటే అస్త్ర సన్యాసం చేయలేదు. కాబట్టి మారుతున్న కాలంతో పాటు మారలేక అనటం, అస్త్ర సన్యాసం అనటం అంత సబబు కాదు. ఎస్డీ బర్మన్ అయితే మరణించేకన్నా ముందు ‘మిలీ’ సినిమాలో “బడీ సూని సూనీ” పాటను రికార్డుకు సిద్దం చేశాడు. ఆ పాటను ఆయన మరణం తరువాత మీరా బర్మన్ రికార్డు చేసిందంటారు. ఆర్డీ బర్మన్ తానే రికార్డ్ చేశానంటాడు. ఎస్డీ అభిమానులు ఎస్డీ పాటలన్నీ ఎస్డీనే రికార్డ్ చేశాడంటారు. జుగ్ను, అభిమాన్, తేరె మేరె సప్నె, షర్మిలి, ప్రేమ్‍నగర్, సగీనా, చుప్కే చుప్కే వంటి సినిమాల్లో అద్భుతమైన పాటలను రూపొందించాడు ఎస్డీబర్మన్. ఇవన్నీ 1970 నుండి 1975 నడుమ విడుదలయినవి. ఎస్డీ బర్మన్ 1975లో మరణించాడు. కాబట్టి కాలాన్ని బట్టి మారలేక పోవటం అన్నది, అస్త్ర సన్యాసం అన్నది ఎస్డీ బర్మన్‍కు అస్సలు సరిపోదు. ఆయన కాలాన్ని తనకనుకూలంగా మార్చుకున్నవాడు. అసలీ వ్యాఖ్యనే తప్పు. సరైన పరిజ్ఞానం లేకుండా చేసిన తీర్మానం ఇది.
అలాగే శంకర్ జైకిషన్ రఫీ స్వరాన్ని నానా బాధలు పెట్టి నాశనం చేశారన్న అపకీర్తి మూటగట్టుకున్నారనటం ఆమోదయోగ్యం కాదు. ఒక్కసారి 1960 నుండి 1970 నడుమ శంకర్ జైకిషన్ రఫీల హిట్ పాటలను గమనిస్తే ఈ వ్యాఖ్యానం అర్థరహితం, అనృతం అని స్పష్టమవుతుంది. అలాగే ‘గమ్ ఉఠానేకె లియె’ పాట కోసం కష్టపడటం, ‘దిల్ కే ఝరో కేమె’ పాట పాడటాన్ని విమర్శించటం, పాడితే గొంతులోకి రక్తం వస్తుందని అనటం హాస్యాస్పదమే కాదు సత్యదూరం కూడా. ‘హైపిచ్’ పాటలకు రఫీ పెట్టింది పేరు. అలాంటి రఫీ ‘గమ్ ఉఠానే’ పాడేందుకు కష్టపడటం, ‘దిల్‍కే ఝరో కోం మే’ పాట పాడితే రక్తం పడటం హాస్యాస్పదమే కాదు అవమానం కూడా. ఎందుకంటే ఈ పాట 1965-66 (1966 జనవరీలో షూటింగ్ జరిగింది) ప్రాంతంలో రికార్డయి ఉంటుంది. అది రఫీ ఉచ్చదశ కాలం. 1964లో రఫీ ‘దిల్‍కే ఝరోకోం మే’ కన్నా కష్టమైన పాట ‘ఆ గలే లగ్‍జా’ పాటను ‘ఏప్రిల్ ఫూల్’ సినిమా కోసం పాడేడు. తరువాత ‘మహ్వ’ పాట హైపిచ్ లోనే పాడేడు. హాథి మేరే సాథి లో నఫ్రత్ కీ దునియాకో హై పిచ్ పాట పాడేడు. చివరికి సరగమ్ లో ‘ముఝె మత్ రోకో’, ‘కహాన్ తెరా ఇన్సాఫ్’ ‘హమ్ కిసీసే కమ్ నహీ’ లో ‘క్యాహువా తేరా వాదా’ వంటివీ హైపిచ్‍లో పాడి మెప్పించాడు. ప్రిన్స్ లో మద్‌హోష్ హవా పాట కూడా హైరేంజ్ లో పాడిన పాట..ఎన్ ఈవెనింగ్ ఇన్ పేరిస్ లో దీవానేక నాం తొ పూచో చివరలో ఆలాపన హైపిచ్ లోదే…కాబట్టి ఈ కథనం అంత సబబు అనిపించదు. రఫీఅంటే గిట్టనివారు కల్పించిన కథ అనిపిస్తుంది. దీనిబదులు యాస్మిన్ రఫీ ప్రస్తావించిన, ఊపిరిబిగబట్టి పాడించి చంపేస్తారా? అని రఫీ అడిగినట్టు చెప్పిన కథ కాస్త మెరుగనిపిస్తుంది.కాబట్టి రఫీ హైపిచ్‍లో పాడలేకపోవడం, శంకర్ జైకిషన్ అరిపించడం సత్యదూరం, అర్దవిహీనం.
80వ పేజీలో మహ్మద్ రఫీ ఏకఛత్రాధిపత్యాన్ని దించేయడానికి కంకణం కట్టుకున్న సంగీత దర్శకుడు రాహుల్ బర్మన్ అనటం, ఆ పేరాలో ఇతర వ్యాఖ్యలు హాస్యాస్పదం. రాహుల్ దేవ్ బర్మన్ కంకణం కట్టుకున్నాడని చెప్పుకున్న కాలంలో అతను నెంబర్ వన్ సంగీత దర్శకుడు కాదు. అది శంకర్ జైకిషన్, ఎస్డీ బర్మన్ వంటి దిగ్గజాల కాలం. రాహుల్ దేవ్ బర్మన్ అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. 1970 తరువాతనే అతను తండ్రి ఎస్డీ బర్మన్ నీడ నుండి బయటకు వచ్చాడు. అదీగాక ఒక్క సంగీత దర్శకుడు కంకణం కట్టుకుంటే అణగిపోయేంత లిల్లీపుట్ కాదు రఫి. రఫీని కిషోర్ కుమార్ దాటటానికి నాంది 1969లో పడినా అది 1971 తరువాతనే సాధ్యమయింది. సినీ ప్రపంచంలో ఉన్నత స్థాయిలో వున్నవారిని దించేసేందుకు కుట్రలు ఎప్పుడూ జరుగుతూనేవుంటాయి. 1970 దశకం ఆరంభంలో రఫీ వెనుకపడటానికి దారితీసిన కారణాలు అనేకం. కానీ ఆర్డీ బర్మన్ తొలి హిట్‍లు ఛోటే నవాబ్, తీస్రీ మంజిల్, ప్యార్ కా మౌసం , అభిలాష, వారిస్, మేల వంటి సినిమాలలో రఫీదే అగ్రస్థానం. నిజానికి 1970లో లక్ష్మీప్యారే స్థాయి ఆర్డీబర్మన్‍కు లేదు. కాబట్టి ఆర్డీబర్మన్ రఫీని దించాలని కంకణం కట్టుకున్నాడనటం అర్థం లేనిది. రఫీ వెనకబడటం వెనుక పలు కారణాలున్నాయి. అవి రాయటం ఓ పెద్ద వ్యాసం అవుతుంది. టూకీగా చెప్పాలంటే ట్రెండ్ మారింది. రఫీ స్వరంగా నిలిచిన నాయకులు, నిలిపిన సంగీత దర్శకులు తెరమరుగయ్యారు. కొత్తతరం ముందుకు వచ్చింది. ఆ తరం నాయకుల స్వరంగా కిషోర్ కుమార్ నిలిచాడు. దీన్లో ఆర్డీ ఒకడు కంకణం కట్టుకుని సాధించింది లేదు. ఎలాగైతే శంకర్‍ను అణచివేయాలని ప్రయత్నించారో అలాగే రఫీని దెబ్బ తీయాలని కొన్నాళ్ళుగా జరిగిన కుట్రల ఫలితం రఫీ వెనుకబటడం.
92-95 పేజీల నడుమ ‘టాండెమ్’ గీతాల ప్రస్తావన వస్తుంది. ఈ పాటలను వివరిస్తూ లత వెర్షన్ కన్నా రఫీ వెర్షన్ హిట్ అని చెప్తూ ‘అజీ రూఠ్ కర్ అబ్’ పాటలో ‘లతా గొంతు బాగా కీచుగా ఉండి, చికాకు కలిగించేలా ఉంటుంది’ అని వ్యాఖ్యానిస్తారు రచయిత్రి. బహుషా ఇలా వ్యాఖ్యానించటం వల్ల వ్యక్తిగత అహం సంతృప్తిపడివుండవచ్చు. కానీ, ఇలాంటి వ్యాఖ్య బహిరంగంగా చేయటం వ్యాఖ్య చేసినవారి వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. అది రచయిత్రి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. కానీ ఈ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పటం వల్ల అభిప్రాయంతో విభేదించాల్సి వస్తుంది. ఈ అభిప్రాయం విన్న తరువాత రచయిత్రి పాటలను వినే విధానాన్ని, అర్థం చేసుకునే విధానాన్ని గురించి సందేహించాల్సి వస్తుంది.
‘స్వరం’ విషయం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు ఆడ, మగ స్వరాల్లో రేంజ్, పిచ్ వంటి విషయాల్లో తేడాలుంటాయి. నూర్జహాన్, షంషాద్ బేగం వంటి శక్తివంతమైన స్వరాలు. వాటి శృతే ఉచ్చస్థాయిలో వుంటుంది. గొంతెత్తితేనే హై పిచ్ అనిపిస్తుంది. కానీ లత వంటి ‘పీల’ స్వరాలు ‘హైపిచ్’కి వెళితే ‘కీచు’ అనిపిస్తాయి. కానీ ‘కీచు’ అనిపించే స్వరంతో హైపిచ్‍కి వెళ్ళటమే కాదు శ్రుతి తప్పకుండా భావస్ఫోరకంగా పాడటం, అంత ఉచ్చస్థాయిలో అలంకారాలు అత్యద్భుతంగా పలికించటం ఒక్క లతా మంగేష్కర్‍కే సాధ్యం. ఆరంభం ఉచ్చ స్థాయిలో ఉండే నూర్జహాన్, షంషాద్ బేగంలు కూడా అంత ఉచ్చస్థాయి కి వెళ్ళలేదు. ఇలాంటి పాటలు పాడలేరు. ఆడవాళ్ళు, మగవాళ్ళు పాడే పాటలను రూపొందించటంలోనే తేడా ఉంటుంది. మగవాళ్ళు వెళ్ళినంత సులభంగా హైపిచ్‍కు ఆడవాళ్ళు వెళ్ళలేరు. అలాగే మగవాళ్ళు హైపిచ్‍లో పాడితే ఉండేంత అందంగా ఆడవాళ్ళు పాడితే ఉండదు. అందుకని సాధారణంగా గాయనిలు హైపిచ్‍కి వెళ్ళినప్పుడు ‘ఫాల్సిట్టో’ స్వరాన్ని వాడతారు. హైపిచ్ సరిగ్గా పాడలేని గాయకులు కూడా ఫాల్సెట్టో వాడతారు. లత కానీ, రఫీ కాని ఎప్పుడూ ఎంత ఉచ్చస్థాయిలో నైనా తమ స్వరంలోనే పాడేరు తప్ప ఫాల్సెట్టోలో పాడలేదు. పైగా లతామంగేష్కర్ స్వర పరిధులను దాటి మరీ పాడింది. ‘ఆ అబ్ లౌట్ చలే’ (జిస్ దేశ్ మె గంగా బహతీహై) లో లత ఆలాపన ఎంత ఉచ్చస్థాయిలో ఉంటుందంటే ‘నభూతో నభవిష్యతి’ . అంత ఉచ్చస్థాయి ఆలాపనలో కూడా ఆమె భావాన్ని పలకటం, ఊపిరిని నియంత్రించటం పరమాద్భుతం. ఒక రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోయినట్టు దూసుకుపోతుంది ఆమె స్వరం. ఇక అంతకన్నా ఉచ్చస్థాయిలో పాడటం మానవ స్వరానికి సాధ్యం కాదు. ఉజాలా సినిమాలో ‘ఝూంత మౌసం మస్త్ మహీనా ’ ‘యాల్లా యాల్లా’ అని ఉచ్చస్థాయిలో రాగయుక్తంగా అరుస్తూ పాడటం ఈ లతకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు. ‘రాణీ రూప్ మతి’ సినిమాలో ‘అజా భవర్’ పాటలో క్లిష్టమైన తాన్‍లతో ఉచ్చస్థాయిలో పాడటం గొప్ప గొప్ప సంగీత విద్వాంసులను సైతం ఆశ్చర్యపరచింది. మెప్పించింది. ఈ పాటలో ఆమె మన్నాడేని సైతం దాటి ముందుకు వెళుతుంది. ఇంకా, రసిక్ బల్మా, ఓ బసంతీ పవన్ పాగల్, సజన్ సంగ్ కాహే నెహా లగాయే, తుం ముఝే యూన్ భులాన పావోగే వంటి అనెకానేక పాటల్లో హై పిచ్ లో లతా గొంతు పోయిన అత్యద్భుతమయిన పోకడలు, పలికించిన భావాలు శాస్త్రీయ సంగీత విద్వాంసులను సైతం ఆశ్చర్యపరిచాయి. ఇక ‘అజీ రూఠ్ కర్’ పాట విషయానికొస్తే ‘అజీ’ దగ్గరి నుంచి పాట పాడటంలో చమత్కారం చేస్తుంది లత. పాట అలంకారాలలో కణ స్వరాలని ఉంటాయి. ఇది పక్క స్వరాన్ని తాకి ఆగకుండా మరో స్వరానికి దూకటం. అలా దూకుతున్నప్పుడు ఆ స్వరం ధ్వనించదు. భావించటం జరుగుతుంది. ఈ పాటలో కణ స్వరాలను పలికిన తీరు పరమాద్భుతం. ఇక ‘అజీ లాఖ్ పర్దోమె ’ అని ఉచ్చస్థాయిలో ‘పర్‍దో’ అన్నప్పుడు ఆమె గొంతు తీగలు సాగిన రీతి, అంత ఉచ్చస్థాయిలో ఊపిరిబిగపట్టి కణస్వరాలు, మరోసారి మీండ్ అంత అధ్భుతంగా పలికించగలగటం మరెవ్వరికీ సాధ్యం కాదు. ఇదే లాఖ్ పర్దోమె అని రెండోసారి అన్నప్పుడు భిన్నంగా అంటుంది. ఇది ప్రతి చరణంలోనూ గమనించవచ్చు. This is glorious singing. పైగా నాయిక మనసులోని ప్రేమ భావాన్ని చిలిపితనాన్ని ఆమె స్వరం అంత ‘హైపిచ్’ లోనూ ప్రదర్శిస్తుంది. ఇది మామూలు గాయకులు పాడలేని విధానం. అందుకే ఆమె సమకాలికులెవ్వరూ ఆమె ముందు నిలవలేకపోయారు. ఇంకా జియావొ జియ కుఛ్ బోల్‌దో, ఎహెసాన్ తెరా వంటి పాటలు వింటే, అలాంటి ‘మగగొంతు’ పాటలను, మగవారి స్థాయిలోనే పాడటం వంటి కష్టమైన పనిని లత ఎంత సులువుగా సాధించిందో స్పష్టమవుతుంది. ఇలాంటి పరమాద్భుతమైన గాన సంవిధానం ఎవరికైనా కీచుగా అనిపించి చికాకు కలిగిస్తే అది వారి వ్యక్తిగత స్థాయి. ఎవరి ‘రుచి’ వారిదే.
103 వ పేజీలో రఫీకీ ఏ సహాగాయకుడితోనైనా కనిపించని వైరం చిరకాలం నడిచిందంటే అది తలత్ మహమూద్ తోనే అన్న వ్యాఖ్య కనిపిస్తుంది. నిజానికి రఫీకి ఎవరితోనూ వైరం లేదు. చివరికి తలత్ మహమూద్‍తో కూడా. తలత్ హీరో అవ్వాలనుకోవటం అతని కెరీర్‍ను ప్రధానంగా దెబ్బతీసిన విషయం. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి మైకులు చిన్న శబ్దాన్ని కూడా గ్రహించటం వల్ల తలత్ గొంతులోని వణుకు స్పష్టమయింది. దాంతో సంగీత దర్శకులు తలత్ మహమూద్‍ని వాడటం తగ్గించారు. పైగా రఫీ ‘హైపిచ్’ పాటలు ప్రజాదరణ పొందటం తలత్ డిమాండ్‍ను దెబ్బతీసింది. అంతే తప్ప వారిద్దరి నడుమ వైరం లేదు. ఒకవేళ తలత్ వైరం పూనినా రఫీ ఎలాంటి వైర భావన ప్రదర్శించలేదన్నది కాదనలేని సత్యం.
105వ పేజీలో “ఇలా రఫీ, తలత్‍ల మధ్య ప్రతికూలమైన వాతావరణమే ఎక్కువ కనిపిస్తుంది”. ఇలా తీర్మానించటానికి ఆధారంగా చూపిన సంఘటన సజ్జూద్ హుస్సేన్ బాణీని మదన్మోహన్ కాపీ కొడితే అతడు మదన్ మోహన్‍ని నిలదీయడం దీన్లో తలత్, రఫీల నడుమ ప్రతికూల వాతావరణం ప్రసక్తి లేనేలేదు.
110వ పేజీలో ‘శరారత్ లో శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో ‘అజబ్ హై దాస్తా(న్) తెరీ యె జిందగీ…. పాటను రఫీతో పాడించటానికి కిశోర్ పాడలేని పాట కాదేమోకాని ఇంతకు ముందే చెప్పినట్టు రఫీ కంఠంలోనే ఈ పాట బాగుంటుందన్న జైకిషన్ విజ్ఞతకు చేతులెత్తి నమస్కరించాల్సిందే’ శంకర్ జైకిషన్ విజ్ఞత విషయంలో వ్యాఖ్య సరైనదే. అయితే ఈ పాట రఫీ స్వరంలో ఉండటానికి కారణం, ఆ సినిమాలో ముందుగా హీరో వేరే అనుకున్నారు. అప్పుడు రికార్డయిన పాట ఇది. ఇంతలో కిశోర్ కుమార్ హీరోగా రావటంతో రికార్డయిన ఈ పాటను అలానే ఉంచి మిగతా పాటలు కిశోర్ స్వరంలో రికార్డు చేశారు. అందుకు కిశోర్ కుమార్ కూడా ఒప్పుకున్నాడు. రఫీ గానం అలాంటిది! రఫీపట్ల కిశోర్ కుమార్‌కున్న గౌరవం అలాంటిది.
125 పేజీలో ‘తీస్రీ మంజిల్’లో షమ్మీ ఉండబట్టే ఆర్.డి బర్మన్ రఫీకే అన్నిపాటలు ఇచ్చాడు. అర్‍డి అర్దమనసుతో రఫీని తీసుకున్నా… అన్న వ్యాఖ్య సత్యదూరం. ఆర్డీ బర్మన్ తొలి సినిమా ‘ఛోటేనవాబ్’ లో కూడా రఫీనే పాడాడు. షమ్మీ కపూర్ సినిమాలో రఫీని అర్ధ మనసులో తీసుకునే ప్రసక్తి లేదు. అసలు షమ్మీ కపూర్ అంటే శంకర్ జైకిషన్ సంగీతం ఉండాల్సిందే. నిజానికి ముందు ఈ సినిమాలో హీరో దేవ్ ఆనంద్ అనుకున్నారు. అప్పుడు ఎస్డీ బర్మన్ ను సంగీత దర్శకుడనుకున్నారు. కానీ మర్డర్ సినిమా అని ఎస్డీ ఆర్డీని రికమండ్ చేశాడు. శమ్మీకపూర్ రంగప్రవేశం చేయటంతో శంకర్ జైకిషన్ లను సంగీత దర్శకులనుకున్నారు. దర్శకుడు విజయ్ ఆనంద్‍కు ఎస్డీ బర్మన్ తో ఉన్న అనుబంధం వల్ల యువ ఆర్డీబర్మన్‍కు అవకాశం వచ్చింది. కానీ అతడీ బాణీలు శమ్మీ కపూర్‍కు నచ్చాలి. అది నిబంధన. అందుకోసం ఆర్డీబర్మన్ శమ్మీకపూర్ కోసం ఎలాంటి బాణీలు సృజించాలో జైకిషన్ వద్ద సలహాలు తీసుకున్నాడు. అంటే ఆర్డీబర్మన్ ఎంపికనే అర్థమనసుతో చేసిన ఎంపిక కాబట్టి ఆర్డీ రఫీని అర్థమనసుతో ఎంపిక చేశాడనడం అర్థం లేని విషయం. ఆ కాలంలో ఆర్డీబర్మన్ నాన్ ఎన్టీటీ. మహమ్మద్ రఫీ హిమాలయ శిఖరం!
నటులతో రఫీ అనుబంధం వివరించే అధ్యాయంలో దిలీప్ కుమార్, ప్రదీప్ కుమార్, జాయ్ ముఖర్జీ, బిశ్వజిత్, శశికపూర్, ధర్మేంద్ర, దేవ్ ఆనంద్, గురుదత్, సునీల్ దత్, జానీవాకర్, జితేంద్ర, రాజ్‍కుమార్, రిషికపూర్, రాజ్ కపూర్, అశోక్ కుమార్ వంటి వారి ప్రసక్తి ఉంది. వీటిలో జూబ్లీ స్టార్ ’రాజేంద్ర కుమార్’ ప్రసక్తి లేకపోవడం పెద్ద లోపం. శమ్మికపూర్ లాగే రాజేంద్రకుమార్ రఫీ స్వరం ఆధారంగా తనూ కెరీర్ నిర్మించుకున్నాడు. ’తెరీ ప్యారీ ప్యారీ సూరత్ కో’ ’హుస్న్ వాలే తెరా జవాబ్ నహీ’ ’బహోరోఫూల్ బర్సావో’, మేరే మెహబూబ్ తుఝే వంటి పరమాద్భుతమైన పాటలు రఫీ ఆయనకు పాడేడు. అలాగే మహమూద్‍కు రఫీ పాడిన పాట ‘హమ్ కాలేహైతో’ మహమూద్‍ను అగ్రశ్రేణి హాస్యనటుడిగా నిలిపింది. వీరి ప్రస్తావన ఉంటే బాగుండేది.
(ఇంకా ఉంది)