[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
ఏప్యా సాన్నిభకుంభ శాపిత్ పదా యేపి శ్రియం లెభిరే యేషామప్య వసన్పురా యువతయో గేహేష్వశ్చన్ద్రికాః।
తాంల్లోకోయమవైతి లోక తిలకాన్ స్వప్నేజాతోనివభ్రాతః సత్కవికృత్య కిమ్ స్తుతి శతైరన్ధమ్ జగత్యామ్ వివా॥
(కల్హణ రాజతరంగిణి – 47)
గతంలో, మహా ఐశ్వర్యవంతులు, శక్తిమంతులయిన రాజులు, ఏనుగు కుంభస్థలాలను పాద పీఠాలుగా వాడినవారు, వారి భవనాలలో చంద్రబింబం వంటి వదనం కల యువతులు, పట్టపగలే వెన్నెలలతో అలంకరింపజేసినవారు, జగతికి అలంకారం లాంటివారు ప్రజల విస్మృతిలో పడ్డారు.. ప్రజలు కలల్లో కూడా ఇలాంటి వారు ఉంటారని ఊహించలేరు. అలాంటివారు ఈనాడు ప్రజల సంస్మరణకు గురువుతున్నారంటే, అది కవి వల్లనే. కవి కావ్యాన్ని వేనోళ్ళ వినుతించాల్సిన అవసరం ఏముంది! కవి లేకపోతే ఈ ప్రపంచం అంధకారబంధురమే.
కల్హణుడు కవి గొప్పతనాన్ని ఈ రకంగా వర్ణించటం పలు రకాల అలోచనలకు దారితీస్తుంది.
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.
ఇది పి.బి.షెల్లీ రాసిన కవిత. అందరూ గొప్పగా పొగిడే కవిత. మనం పాఠ్య పుస్తకాలలో చదివే కవిత. అహంకారులైన నృపతులు, అనంతమైన కాలం ముందు ఇసుక రేణువుల్లాంటి వారు. వారి అహంకారం అనవసరం అన్న ఆలోచనను కలిగించే కవిత. గమనిస్తే ఈ రకమైన తాత్త్వికత భారతీయ రచనలలో, ఆలోచనలలో మౌలికమైన అంశం. రాజతరంగిణి రచనలోనే కాదు భారతీయ కావ్య రచనలలో ఇది ప్రధానమైన అంశం. ‘ఒజిమాండియస్’లో నియంతల దురహంకార ప్రదర్శన ఉంది. కల్హణుడి కవితలో రాజుల గొప్పతనం ఉంది, ఐశ్వర్యం ఉంది. వారు జగతికి అలంకారం లాంటి వారయినా ఈనాడు వారు విస్మృతిలో పడటానికి కవి ప్రతిభనే కారణం అని నొక్కి చెప్పటం కనిపిస్తుంది. అంతే అనంతమైన కాల ప్రవాహం గతిని గమనించి, దాన్నుంచి పాఠాలను భవిష్యత్తు తరాలకు అందించే కావ్య ప్రాధాన్యాన్ని గ్రహించి తెలపటం ఉంది. పరోక్షంగా కవి బాధ్యతను స్ఫురింపజేయటం ఉంది. అంత గొప్ప శక్తి కలవాడు కవి. రాజులు గొప్పవాళ్ళు. ప్రజల భాగ్య విధాతలు. కానీ భవిష్యత్తు తరాలు వారిని గుర్తు పెట్టుకోవాలన్నా, వారి గురించి తెలియాలన్నా అది ‘కవి’ వల్లనే సాధ్యం. అందుకే కవి ‘బ్రహ్మ’. గతించిన కాలాన్ని భావితరాల ముందు సజీవంగా నిలపగల పరమాద్భుతమైన శక్తి కవిదే!
కల్హణుడు ఇలా అనటం వెనుక కల్హణుడి కన్నా ముందున్న శాస్త్రాలు, కావ్యాల ప్రభావం ఉంది.
రాజశేఖరుడు వాఙ్మయాన్ని శాస్త్ర, కావ్య భేదంతో రెండు వర్గాలుగా విభజించాడు. కవులను శాస్త్ర కవి, కావ్య కవి అని విభజించాడు. శాస్త్రాన్ని పౌరుషేయం, అపౌరుషేయం అన్నాడు. ఋగ్యజుర్వేదాది వేదాలు, ఇతిహాసం, గాంధర్వాద్యుప వేదాలు, వేదాంగాలు వంటివన్నీ అపౌరుషేయాలు. పురాణం, అన్వీక్షకి, మీమాంస వంటివన్నీ పౌరుషేయాలు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, ఇతిహాసాన్ని ఉపవేదంలో చేర్చాడు. కానీ పురాణ ప్రభేదమ్ ఇతిహాసం అన్నాడు. దీనికి కారణం రాజశేఖరుడు చెప్పిన పురాణ లక్షణాలలో ఉంది. వీటి ప్రకారం ఇతిహాసం అంటే వంశవిధికి సంబంధించినది. అంతటితో ఆగలేదు. ఇతిహాసాన్ని రెండు విధాలుగా విభజించాడు. పరక్రియ, పురాకల్పం. ఇతిహాసం ఏకనాయకమయితే పరక్రియ. అంటే ఒక హీరో/నాయకుడికి సంబంధించిన చరిత్ర పరక్రియ. బహునాయ కాశ్రయమయితే పురాకల్పం. అంటే పలువురు నాయకులకు సంబంధించినదయితే పురాకల్పం. అంటే రెంటిలోనూ వంశవిధి చెప్పినా, దాన్లోంచి ఏకవ్యక్తి కేంద్రీకృతమైనతే పరక్రియ, సందర్భాన్ని బట్టి అనేకులకు ప్రాధాన్యం ఉంటే పురాకల్పం.
ఇక్కడ పురాణానికి, పురాకల్పానికి తేడాను గమనించాల్సి ఉంటుంది. పురా అంటే పూర్వం, ప్రాచీనం. పురాణం లాంటిది. ప్రాచీన కాలం నుంచి జరిగిన అనేక అంశాలను పురాణం వివరిస్తుంది. దాన్లోంచి ఒక వంశానికి చెందిన వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చినా, ప్రాచీనాంశాలలో ఒక వంశానికి చెందిన పలువురి గురించి చెప్పినా అది చరిత్ర అవుతుంది. కావ్యాన్ని, శాస్త్రాన్ని కలిపి చెప్పడం కూడా ఉంది.
‘అలంకార శాస్త్రం’ కావ్యాన్ని రెండు వర్గాలుగా విభజిస్తుంది. ముక్తక కావ్యం, ప్రబంధ కావ్యం లేక మహా కావ్యం. ఈ రెండు రకాల కావ్యాలలో మళ్ళీ అయిదు విభాగాలున్నాయి. శుద్ధ, చిత్ర, కథోత్థ, సంవిధానకభు, ఆఖ్యాత కవనం.
స పునర్ద్విదా! ముక్తక ప్రబంధ విషయత్వే మతావపి ప్రత్యేకం పంచధా।
శుద్ధః చిత్రః కథోత్థః సంవిధానకభూః ఆఖ్యాన కవాంశ్చ (ఇతి)॥
(కావ్య మీమాంస, IX)
చరిత్ర రహితమైతే శుద్ధం. చరిత్రను విపులంగా వివరిస్తే చిత్ర. ప్రాచీన గాథలున్న కవిత అయితే కథోత్థ, సంఘటనలు కలది అయితే సంవిధానకభు. ‘పరికల్పితోతివృత్తః ఆఖ్యానకవాన్’ – పరికల్పిత చారిత్రక గాథలుంటే ఆఖ్యాకం.
ఈ రకంగా కావ్యాన్ని విభజించటం గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. చరిత్ర రచన భారతీయులకు ఒక సృజనాత్మక ప్రక్రియ. అది కాల్పనికేతర రచన కాదు. నిజంగా జరిగిన గాథను వివరిస్తూ దాని లోని అర్థాన్ని వివరిస్తూ, వర్ణనలు జోడించి, కాలగతిలో ఆ సంఘటన ప్రాధాన్యాన్ని బోధించటం కూడా కావ్యరచనే. అందుకే పలువురు కవులు పురాణం రచిస్తూ కావ్యం అన్నారు. రామాయణ, భారతాలు పురాణాలు, ఇతిహాసాలు అయి కూడా కావ్యాలయ్యాయి. పోతన భాగవతాన్ని పురాణం అనీ, కావ్యం అనీ, శాస్త్రం చెప్పుకున్నాడు. ‘శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితమ్’ అంటుంది స్కాంద పురాణం. శాస్త్రంలో కథ ఉండదు. చరిత్రలో కథ ఉంటుంది, రసం ఉండదు. కావ్యంలో రసం ఉంటుంది. శాస్త్ర విధానంలో తత్వాన్ని, కావ్య విధానంలో రసాన్ని నిర్వహిస్తూ చారిత్రక గాథలను చెప్పటం ప్రతిభావంతుడయిన కవి పని. అలాంటి కవి గతాన్ని సజీవంగా భవిషత్తు తరాల ముందు నిలుపుతాడు. జీవిత తత్త్వం బోధిస్తాడు. మోక్ష మార్గం చూపుతాడు. రసాన్ని ఉద్భవింపచేసి ఆనందాన్ని కలిగిస్తాడు. తన గతంలో వారు అలాంటి పని చేస్తున్నారు. తానూ అదే బాటలో నడుస్తూ అదే పని చేస్తున్నాను అని అంటున్నాడు కల్హణుడు. ఈ కోణం లోంచి చూసినా భారతీయులకు చరిత్ర స్పృహ లేదని అన్న వారికి భారతీయ వాఙ్మయ సృజన దృక్పథం, లక్ష్యం వంటి విషయాల గురించి తెలియదని చెప్పవచ్చు. తెలిస్తే వర్ణనలు, పురాణ గాథలు, నీతి సూత్రాలు, వేదాంత విషయాలు చూసి ఇది ‘చరిత్ర రచన కాదు’ అని తీర్మానించరు. ఇలాంటి తీర్మానలు చేయకుండా ఉండేందుకే కల్హణుడు ఆరంభం నుంచి కవుల గొప్పతనం, కావ్యాల గొప్పతనం నొక్కి చెప్తున్నాడు. రాజతరంగిణి రచనలో తన లక్ష్యం కూడా స్పష్టం చేస్తున్నాడు.
కల్హణుడు కావ్య ప్రాధాన్యం గ్రహించినవాడు. కవి శక్తి తెలిసినవాడు. కాల గమనం గ్రహించినవాడు. విధి లీలలను అర్థం చేసుకున్నవాడు. కవిగా తన బాధ్యతను గ్రహించినవాడు. అందుకే ఏ రాజూ రాయమని అడగకున్నా, ఎలాంటి ప్రోత్సాహం లేకున్నా, రాజాశ్రయం వంటివి స్వీకరించకుండా, వాటన్నింటికీ దూరంగా ఉంటూ నిష్పాక్షికంగా, నిర్మోహంగా, నిజాయితీగా పూర్వగాథలను తన కావ్యంలో పొందుపరిచాడు. ఈ గాథలలో పలువురు నాయకులు. కథలు బోలెడు. వీరోచిత గాథలున్నాయి. విషాద గాథలున్నాయి. జుగుప్సాకరమైన కథలున్నాయి. ధూర్తులు, మూర్ఖులు గురించిన కథలున్నాయి. ప్రతిభావంతులు, తేజోమూర్తుల జీవిత విశేషాలున్నాయి. అద్భుతాలున్నాయి. గ్రహించవలసిన గుణపాఠాలున్నాయి.
తనకన్నా ముందు పంచతంత్ర కథలు, కథాసరిత్సాగరం, బృహత్కథ వంటి వాటిని ప్రజలు స్వీకరించి, ఆదరించటం గమనించాడు. రామాయణ, భారతాల సంగతి చెప్పనవసరం లేదు. ఇంకా కాళిదాసు కావ్యాలు, చరిత్ర కావ్యాలు ప్రజల ఆదరణ పొందటం చూశాదు. వాటన్నిటినీ అర్థం చేసుకున్నాడు. తన బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వహించాడు.
వన్ధ్యః కోపి సుధాస్యందాస్కందీ స సుకవేర్గుణాః।
యేనాయ తి యశఃఅ వాయః స్థైర్యం స్స్వయ పరస్సచ॥
కోన్యః కాలమతి క్రాంతం నేతుం ప్రత్యక్షతాం క్షమః।
కవి ప్రజాపతీం స్త్యక్త్వో రమ్య నిర్మాణ శాలినః॥
న పశ్యాత్సర్వ సంవేద్యాన్భావాశ్రుతి భయాయది।
తదన్య దివ్య దృష్టిత్వే కిమివ జ్ఞాపకం కవేః॥
(కల్హణ రాజతరంగిణి 3, 4, 5)
కవి సునిశిత దృష్టి అమృత ప్రవాహమంత మధురమైనది. అలాంటి దృష్టికి ప్రణామాలు. అతని దృష్టి వలన అతని కీర్తి మాత్రమే కాక, ఇతరుల కీర్తి కూడా సజీవమవుతుంది. గడిచిపోయిన కాలాన్ని పునఃసృష్టి చేయగలవారు కవిబ్రహ్మలే. ఇందుకు వారే సమర్థులు. కవి ప్రతిభ ఎలాంటిదంటే అతని దివ్యదృష్టితో, ప్రతిభతో ఎన్ని నిగూఢ విషయాలను, సామాన్యుల దృష్టికి అందని విషయాలను సాక్షాత్కరింపజేస్తున్నాడు. ఇది కాక అతని దివ్యదృష్టికి మరో ఉదాహరణ అవసరం లేదు.
ఇదీ కల్హణుడు రాజతరంగిణి రచనకు ఉపక్రమించేందుకు ప్రాతిపదిక. గత కాలాన్ని సజీవంగా నిలపటం. ఆ గాథలను తెలపటం వల్ల మానవ జీవితంలోని పద్ధతిని, విధి విధానాన్ని వివరించటం. మహాభారతం లాగే, క్షణ భంగురాలయిన ప్రాణుల జీవిత చైతన్యాల గురించి తెలుసుకున్న తరువాత తన కావ్యంలో శాంతరసానికే పెద్ద పీట ప్రాధాన్యం అని స్పష్టం చేశాడు. తరువాత రాజతరంగిణి లోని తరంగాల ఘోషను వినిపించటం ప్రారంభించాడు.
కల్హణుడి రాజతరంగిణి 1148లో ముగుస్తుంది. అది సంధికాలం. కశ్మీరంలో తురుష్క ప్రాబల్యం ఆరంభమయింది. వారు ప్రధాన అధికారాలు ఆక్రమించకున్నా, రాజును, రాజు ఆలోచనలను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. శక్తివంతమైన రాజుల స్థానాన్ని బలహీనమైన రాజులు నింపుతున్నారు. రాజ్యాధికారాన్ని ఐశ్వర్యాన్ని తృణప్రాయంగా భావించిన మహానుభావులు అదృశ్యమై, రాజ్యాధికారం కోసం ఎంతటి నీచమైన పనికైనా సిద్ధపడే నీచులు తెరపైకి వస్తున్నారు. ధర్మం తప్ప మరొకదానికి విలువనివ్వని వారు తెర వెనక్కి వెళ్ళి, అధర్మమే ఆదర్శంగా కలవారు రంగప్రవేశం చేస్తున్నారు. ఇదంతా కల్హణుడు ప్రత్యక్షంగా చూశాడు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందాడు. ఒకప్పుడు ఈ భూమిపై మహామహా వ్యక్తులు నడయారంటే భవిష్యత్తు తరాలు నమ్మటం కష్టమని గ్రహించాడు. అందుకే భవిష్యత్తు తరాలు కలలో కూడా ఊహించలేనటువంటి మహానుభావుల గురించి తెలిపేవారు, వారిని సజీవంగా నిలిపేవారు కవులేనని గ్రహించాడు. కవిగా తన ధర్మం నిర్వహించాడు.
కల్హణుడి కావ్యం ప్రాచుర్యం పొందింది. కల్హణుడు 1148 వరకూ కశ్మీరు చరిత్రను తన కావ్యంలో పొందుపరిచాడు. అతని మరణం తరువాత నెమ్మదిగా కశ్మీరం తురుష్కుల పాలనలోకి వచ్చింది. రాజతరంగిణి గాథలు విన్న తురుష్కరాజు జైనులాబ్దీన్ రాజతరంగిణిని పర్షియన్ భాషలోకి అనువదింపచేశాడు. అయితే అతనికి సంతృప్తి కలగలేదు. ఎందుకంటే కశ్మీరు ఆవిర్భావం నుంచి 1148 వరకూ కశ్మీరు రాజుల చరిత్ర లభిస్తోంది. తరువాత రాజుల గురించి తెలియటం లేదు. తెలుసుకోవాలనిపించింది. అది తెలుసుకోవాలంటే కల్హణుడిలా ఎవరయినా పరిశోధించి, గత గాథలను సేకరించి, చరిత్రను పునర్నిర్మించి దానికి తన కావ్యం ద్వారా ‘ప్రతిసృష్టి’ చేయాలి. అతని ఆస్థానంలో ఉన్న ‘జోనరాజు’ ఇందుకు సమర్థుడని భావించాడు. ఫలితంగా రాజతరంగిణిని కల్హణుడు వదిలిన కాలం నుంచి కొనసాగించమని అభ్యర్థించాడు.
ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సి ఉంది. కల్హణుడి రాజతరంగిణి రచనకూ, జోనరాజు రాజతరంగిణి రచనకూ దారితీసిన పరిస్థితులలో తేడా ఉంది. కల్హణుడికి ప్రేరణ తనలోంచే వచ్చింది. తనలో కలిగిన ఆవేదన ఫలితం రాజతరంగిణి రచన. కల్హణుడి ఆశయం వేరు. లక్ష్యం వేరు. ప్రతిభ వేరు. ప్రేరణ వేరు. జోనరాజుకు ప్రేరణ సుల్తాన్ నుంచి వచ్చింది. అతని ప్రధాన ఉద్దేశం కశ్మీరు చరిత్ర రచనను కొనసాగించటమే అయినా లక్ష్యం సుల్తాన్‍ను సంతోషపరచటం! ఇది దృష్టిలో, రచనలో, భావ వ్యక్తీకరణలో ఎంతో తేడానిస్తుంది. కల్హణుడి తరువాత రాజతరంగిణి కొనసాగించిన వారెవరూ కల్హణుడి అంత స్వేచ్ఛగా రాజతరంగిణిని రచించే పరిస్థితులు లేవు. కల్హణుడు స్వయం ప్రేరేపితుడు. మిగతావారంతా సుల్తానుల అధీనులు. కల్హణుడు తన బాధ్యతగా, కర్తవ్యంగా, ఆత్మసంతృప్తి కోసం రచించాడు. ఇతరులు సుల్తానుల ప్రీత్యర్థం రచించినవారు. ఆయా రాజతరంగిణులను విశ్లేషించే సమయంలో ఈ ప్రధానమైన తేడాను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
(ఇంకా ఉంది)