99 సెకన్ల కథ-29

5
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. ఓ కథ శక్తి ఎంత?

“ఉద్యోగం ఎలా ఉందయ్యా పవన్?”

ఢిల్లీలో విమానం దిగాక కారులో పవన్ ఇంటికి వెళ్తూ శేషయ్య అడిగారు.

ఆదివారం పొద్దుటే సొంతకారులో శేషయ్యగారిని ఇంటికి తీసుకువెళ్తూ, భారత ప్రభుత్వ ఛీఫ్ విజిలెన్స్ కమీషనర్ పవన్ చిన్న నవ్వు నవ్వాడు.

“ఏముంది అంకుల్. ఇక్కడ అధికారులు తప్ప క్రిందిస్థాయి వాళ్ళెవరూ సాయంత్రం పనివేళలు దాటాక పది నిమిషాలు కూడా ఆఫీసులో ఉండరు. రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పుడంటారా, బాస్ ఆఫీసులో ఉన్నంత సేపు సిబ్బంది ఉంటారు. పని ఉంటే, చెప్పి వెళ్తారు… ఇక్కడ ఎవరూ ‘వెళ్తున్నాం’ అని చెప్పనుకూడా చెప్పరు…”

దారిలో ఒక హనుమాన్ మందిర్ కనబడింది. పవన్ కారు ఆపి, మందిరంలోకి వెళ్ళి, నమస్కారం చేసి వచ్చాడు.

“నేనింకా స్నానం చేయలేదు పవన్. అందుకే …”

“ఫరవాలేదు అంకుల్. మీ బాల్య మిత్రుడు, అంటే మా నాన్న నా బాల్యంనుంచి అలవాటు చేసిందిదే.”

కారు పవన్ క్వార్టర్సుకి చేరింది.

పవన్ భార్య పావని అతిథిమర్యాదలు చేసింది. కాలకృత్యాలు తీర్చుకొని అల్పాహారానికికూర్చున్నారు.

పావని చెబుతోంది. “రాష్ట్రంలో పని చేసినప్పుడు పనివాళ్ళు, వంటమనిషి.. ఇలాంటి సదుపాయాలు ఉండేవి….”

అంతలో పవన్ కి ఫోన్ వచ్చింది.

“సర్, నమస్కారం… జెకె రావు ఫైలా? విషయం సీరియస్సే. నేనింకా అధ్యయనం చేయాలి. సమయం పడుతుంది సర్. అర్జంట్ ఫైల్స్ చాలా ఉన్నాయి… ఉంటాను సర్” అంటూ పవన్ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేస్తూ విసుక్కున్నాడు – ‘వీడికి సిఫార్సులు కూడా..’ అంటూ తనలో తను విసుక్కున్నాడు.

“ఏంటయ్యా, అంత విసుక్కుంటున్నావ్ ?”

“మరేం చేయమంటారు?.. జెకె రావు అని ఒక ఐఏఎస్. ఇద్దరం ఒకే బాచ్ వాళ్ళం. నేను కర్నాటకకి, తను ఆంధ్రాకి కేటాయించబడ్డాం. నేను పోర్టు చైర్మన్‌గా పనిచేసే రోజుల్లో అతను ఈ కేంద్ర ప్రభుత్వంలో డెప్యుటేషన్ మీద ఉపరితల రవాణా శాఖలో సంయుక్త కార్యదర్శి. దేశంలో పోర్టుల విషయాలు అతను చూసేవాడు. అందువల్ల మేజరు పోర్టుల చైర్మన్లు అందరూ అతనికే ముందుగా రిపోర్టు చేస్తుంటారు… అహంభావమో, తన అధికార హోదాని చూపించాలనో – అతను నామీద రెండు సార్లు ప్రతికూల వ్యాఖ్యలు రాశాడు. … “

“అదేమిటయ్యా, నువ్వు మీ నాన్నలాగా చాలా నియమబద్ధమైన జీవితం గడిపేవాడివిగదా!”

“కదా అంకుల్ ! కాని ఆ రెండు రిమార్కులూ వదిలించుకోవడానికి నేను చాలా అవస్థపడాల్సివచ్చింది. … కొన్ని మంచి పనులు చేయాల్సి వచ్చినప్పుడు పూర్తిగా రూల్స్ ప్రకారం వెళ్తే చెయ్యలేం కదా అంకుల్ ?… నేను చేసిన పని వెనకాల స్ఫూర్తి ఎలాంటిది అని చూడకుండా నన్నుసతాయించాడు…”

శేషయ్య సాలోచనగా చూశారు. “అతను అవినీతిపరుడా”

పవన్ వేగంగా స్పందించాడు. “అలాంటిదేమీ లేదు అంకుల్. అయినా నన్నుఏడిపించాడు కదా! ఇప్పుడు అతనికి ఆంధ్రాలో ప్రధానకార్యదర్శి అయ్యే అవకాశం వచ్చింది. ఆ ఫైలు – అతను ఢిల్లీలో పనిచేసిన కాలానికి సంబంధించి విజిలెన్స్ అభ్యంతరాలేమైనా ఉన్నాయా – అని తెలుసుకునేందుకు నాకు వచ్చింది. ఏవో చిన్న చిన్న అంశాలు దొరికాయి. ఫైలు తొక్కిపెట్టాను. దానిగురించే ఒక పెద్దాయనతో ఇప్పుడు ఫోన్ చేయించాడు. నేను అడ్డం పడితే తను ప్రధానకార్యదర్శి కాలేడని అతనికి బాగాతెలుసు…”

ఇద్దరూ లేచారు.

పవన్ కాస్సేపు పెరటితోట చూపించాడు. రాజకీయాలు మాట్లాడుకున్నారు.

భోజనాలయ్యాక, శేషయ్యని రామకృష్ణమఠంలో సమావేశాల దగ్గర దింపటానికి కారులోబయల్దేరాడు పవన్ – తన ఏడేళ్ళ మనుమడు ప్రసాదుని వెంట తీసుకొని.

శేషయ్య ప్రసాదుతో కబుర్లు చెబుతూన్నారు.

“ప్రసాదు, మీ నాన్న నీకు చెప్పారో లేదో కాని నీకు హనుమాన్ అంటే ఇష్టం కదా! ఒక హనుమాన్ కథ చెప్పనా?”

“చెప్పండి తాతగారూ” అంటూ ప్రసాదు ఉత్సాహపడ్డాడు.

“…రావణ సంహారం అయిపోయాక, హనుమ సీత దగ్గరకు వెళ్ళి, అప్పటిదాకా సీతను వేధించుకు తింటున్న అక్కడి రాక్షస స్త్రీలను చంపేస్తాను అని ఆవేశపడ్డాడు. సీత వారించింది. ఒక కథ చెప్పింది:

అడవిలో వెళ్తున్న ఒక మనిషిని చూసి పులి వెంటపడింది. వాడు పరుగెత్తి పరుగెత్తి ఒక చెట్టెక్కేశాడు. ఆ చెట్టు పైకొమ్మ మీద ఒక భల్లూకం ఉంది. ‘వీడు మనకి శత్రువు. నేను ఆకలితో ఉన్నాను. వీడిని క్రిందకి తోసెయ్’ అని భల్లూకంతో అంది పులి. ‘శత్రువే అయినా, నా చెట్టెక్కి శరణు కోరాడు కాబట్టి నేనా పనిచేయను ‘ అంది భల్లూకం…! చీకటి పడ్డాక, భల్లూకం నిద్రపోయింది. అప్పుడు పులి మనిషితో అంది – ‘ఆకలితో ఉన్నాను. ఆ భల్లూకాన్ని తోసెయ్. దాన్ని తిని వెళ్ళిపోతాను.’ . .. మనిషికదా. అదే పని చేశాడు. ఆ భల్లూకం క్రింద పడిపోతూ, మెలకువొచ్చి, క్రింది కొమ్మని పట్టుకొని గిరుక్కున మళ్ళీ పైకెక్కి కూర్చుంది. పులి దానికి మళ్ళీ చెప్పింది – ‘ఇప్పుడైనా తెలిసిందా మనిషి సంగతి! వాడిని తోసెయ్. తిని వెళ్ళిపోతాను.’ అప్పుడు భల్లూకం చెప్పింది కదా – ‘అపకారం చేసిన వాళ్ళకైనా ఉపకారం చేయటమే సంస్కారం. నేను అతన్నితోయలేను’.. అని. “

ఏడేళ్ళ ప్రసాదు చప్పట్లు కొట్టేశాడు “భలే భలే” అంటూ.

కారు గమ్యం చేరింది.

అంతే, పదిరోజులు గడిచేలోపే ఆంధ్రాకి ప్రధాన కార్యదర్శిగా జెకె రావు నియామకపు ఉత్తర్వులు విడుదల అయ్యాయి.

2. సగం స్పృహ!

“…మొన్న ఇలాగే ఏలూరులో తిరుమల ఎక్స్ ప్రెస్ ట్రైనులో సెకండ్ క్లాస్ ఎక్కానండి. నా బెర్త్ మీద ఒక 50 ఏళ్ళావిడ ముసుగుతన్ని పడుకొంది. లేపి మరీ చెప్పాను. ఆవిడ ఆ బెర్త్ తనది అంటూ వాదించింది. పైగా, ‘విశాఖపట్నం నుంచి వస్తున్నాను, ఇప్పుడు లేపుతావా?’ అంటూ గదమాయించింది… నేను టిటిఈని పిలిచి నా టిక్కెట్టు చూపించి అడిగాను. టిటిఈ – ఆవిడగారి బెర్తు అది కాదని, ఆవిడ బెర్త్ పక్కనున్న సెకండ్ క్లాస్ కోచిలో ఉందని తేల్చేశాడు. బెర్త్ నంబరు ఒకటే. కాని కోచ్ వేరు…”

అంతా నవ్వారు.

30 ఏళ్ళ జర్నలిస్టు శంకర్రావు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైనులో తృతీయశ్రేణి కోచిలో ఎక్కి తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. తన బెర్తుకి ఎదురుగా కూర్చున్న పశువిజ్ఞాన శాస్త్రం ప్రొఫెసర్ పరమేశం కుటుంబంతో తనకు మొన్న ఏలూరులో ట్రైనులో జరిగిన అనుభవాన్ని పంచుకుంటున్నాడు.

ట్రైన్ రేణిగుంట దాటింది.

“అక్కడితో అవలేదండి. ఆవిడ ఇంకా లేవకుండా నీలుగుతోంది. ఆవిడ నాకన్నా పెద్దది. పైగా పెద్ద ఆఫీసరుట. నేను ఆ కోచిలో అందరికీ వినబడేలా గట్టిగా చెప్పాను – ‘నేర్చుకోవాలమ్మా. ట్రైన్ ఎక్కకముందే టిక్కెట్టుని ఒకటికి రెండు సార్లు చూసుకొని, తెలియకపోతే నాలాంటి వాళ్ళని అడిగి తెలుసుకొని ఎక్కాలి. చదువుకున్నదానిలా ఉన్నావు. ఇలా ఎక్కేసి, పైగా డబాయింపా!…’ దాంతో ఆవిడ సిగ్గుపడిపోయింది…”

పరమేశం నవ్వాడు. కాని ఆయన భార్యకి నచ్చలేదు.

“మీరు చాలా స్మార్ట్. లేకపోతే కోచిలో ప్రయాణీకులందరికీ అలా మనోవికాసం కలిగించే పని చేస్తారా?” అన్నాడు పరమేశం. శంకర్రావుకి కాలర్ కొంచెం లేచింది.

“ఒక జర్నలిస్టుగా నా బాధ్యత అది. మేం ఎక్కడున్నా, మన చుట్టూ ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అని స్పృహతో గమనిస్తూ ఉండాలి సర్…”

“ఏమైనా మీరు మేధావులు సర్” అన్నాడు పరమేశం.

“అలా చాలా మంది అంటుంటారనుకోండి. కాని స్పృహ అన్నది జర్నలిస్టుకి ఉండితీరాల్సిన మౌలిక లక్షణం సర్…”

“బాగా చెప్పారు” 70 ఏళ్ళ పరమేశం మరోసారి శంకర్రావుకి కాలర్ లేపాడు.

ట్రైన్ కాళహస్తి దాటింది. అంతలో టిటిఈ వచ్చాడు.

శంకర్రావు ప్రొఫెసరుతో మాట్లాడుతూనే తన ఫోను చూసుకోమని టిటిఈకి టిక్కెట్టు చూపించాడు.

టిటిఈ రెండు సార్లు ఆ ఫోను చూసి, “మీరు టిక్కెట్టు చూస్కున్నారా?” అని శంకర్రావుని అడిగాడు.

శంకర్రావు ప్రొఫెసరు మీదనుంచి తన దృష్టిని టిటిఈ మీదకు మళ్ళించాడు.

“అదే చెబుతున్నాను స్వామి. టిక్కెట్టు చూసుకోకుండా ఎక్కేవాళ్ళ వల్ల…”

టిటిఈకి చిరాకు వచ్చింది.

“ఈ టిక్కెట్టు ఈ ట్రైనుది కాదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్సుది” అరిచినంత పని చేశాడు.

మేధావి జర్నలిస్టు శంకర్రావు – “అవును. ఇది వెంకటాద్రే కదా!”

“కాదు.”

“మరి?”

“నారాయణాద్రి.”

శంకర్రావు నోట మాట ఆగిపోయింది.

“గూడురులో దిగిపోండి” అంటూ టిటిఈ వెళ్ళిపోయాడు.

“మరి ఈ సీట్లో ఎవరూ ఎందుకు రాలేదు?” అనుకుంటున్నాడు శంకర్రావు.

“నేను వచ్చినా గంద! ఈ పక్క కానాలో మా బావగాడుంటే కబుర్లు చెప్పుకుంటండాం” అంటూ ఇంకో ఆసామీ ప్రత్యక్షం అయ్యాడు.

శంకరుడు మళ్ళీ అవాక్కయ్యాడు.

క్షణాల్లో తన బాగ్ పట్టుకొని టిటిఈ కోసం పరుగెత్తాడు – ప్రొఫెసరు పరమేశం వంక కూడా చూడకుండా.

వెతగ్గా వెతగ్గా ఆ టిటిఈ ఎక్కడో ప్రథమశ్రేణి కోచిలో ఉన్నాడు.

ట్రైన్ గూడూరులోకి ప్రవేశించబోతోంది.

శంకర్రవు ఆ టిటిఈకి తన జర్నలిస్టు హోదా అంతా చెప్పుకున్నాడు. ఎలాగైనా సాయం చేయమన్నాడు. తెల్లారితే ఆఫీసులో మీటింగు, బాసుల కేకలు … అన్నీ గుర్తుకొచ్చి, టిటిఈ ని వదలటం లేదు.

టిటిఈ విసుక్కున్నాడు.

“నన్నేం చేయమంటావయ్యా! ఒక్క బెర్తు కూడా ఖాళీ లేదు. సెకండ్ క్లాసులో ఒక్క పైబెర్త్ ఉంది. పాసింజరు ఈ గూడూరులో ఎక్కాలి. ఎక్కకపోతే ఇస్తా. ఒకవేళ గూడూరులో పాసింజరు వచ్చి ఎక్కితే, అక్కడే క్రింద బెర్తులో పాసింజరు గుంటూరులో దిగిపోతారు. అక్కడ్నుంచి ఇస్తా. అందాకా నిలబడే ఉండు. కాని అప్పుడైనా నువ్వు ఇంకో జనరల్ టిక్కెట్టు కొనివ్వాలి నాకు.”

ఆ గూడూరు శాల్తీ రాకుండా ఉంటే బాగుణ్ణు ఏడుకొండలవాడా అని మొక్కేస్తూ, ఆ ఖాలీ బెర్తు దగ్గరే ఎవరో పడుకున్న క్రింద బెర్తు మీద చివరగా కూర్చున్నాడు.

ట్రైన్ గూడూరు నుంచి బయల్దేరిపోయింది.

శంకర్రావుకి చమటలు పట్టేస్తున్నాయి.

టిక్కెట్టు చూసుకున్నాడు కాని, ట్రైన్ చూసుకోలేదు. మన స్పృహ సగమే పనిచేసినట్లుంది !

తనకు ఉందనుకుంటున్న జర్నలిస్టు బుర్ర ఉపయోగించి, హైదరాబాదులో సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకుడు సుభాష్ గౌడుకి ఫోన్ చేసి చెప్పాడు తన గోడు. దాంతో గౌడు తన సిబ్బందికి చెబితే, అతను ఒంగోలులో జనరల్ టిక్కెట్టు కొని తెచ్చి ఇచ్చాడు.

‘అందుకే పదిమందితో మంచిగా ఉండాలి అంటారు. గౌడ్ ఎంత సాయం చేశాడు!’ అనుకున్నాడు శంకర్రావు.

తన బాగుని పైబెర్త్ మీద పెట్టాడు.

టిటిఈ వచ్చి లైటు వేశాడు. టిక్కెట్టు రాస్తూ శంకర్రావుని మందలించాడు – “ఇంకెప్పుడూ ఇలా టిక్కెట్టు చూసుకోకుండా ట్రైన్ ఎక్కటం చేయకండి.”

టిటిఈ వెళ్ళిపోయాక, శంకర్రావు పైబెర్తు ఎక్కబోతుంటే, క్రింద బెర్తులో పడుకున్న మనిషి పలకరించారు.

శంకర్రావు తల తిప్పాడు.

“బాబూ, నువ్వు మొన్న ఏలూరులో తిరుమల ఎక్స్ ప్రెస్సులో ఎక్కి నాకు మంచి మాటలు చెప్పావు కదా!… ట్రైన్ ఎక్కే ముందు కోచ్, బెర్తు నంబరే కాదు, ట్రైన్ నంబరు కూడా చూసుకోవాలి బాబూ…” అంది 50 ఏళ్ళ మొన్నటి ప్రయాణీకురాలు !!!

(వాస్తవ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here