[dropcap]ఈ[/dropcap] రోజు మరో మంచి లఘు చిత్రం. పది నిముషాల నిడివి గల “ద బ్రెడ్ ఎండ్ ఏలి” చిత్రం. దీనికి దర్శకుడు ప్రముఖ ఇరానీయ అబ్బాస్ కియారొస్తొమి. ఇది ఇతని తొలి చిత్రం.
ఎలాంటి సంభాషణా లేని చిత్రం. ఎక్కువ భాగం నిశ్శబ్దమే. కొన్ని సంగీత అభివ్యక్తులు మాత్రం వున్నాయి. ఒక సరదా అయిన డాన్స్ కి సూటయ్యే సంగీత నేపథ్యంలో ఓ మధ్యాహ్నం వేళ ఓ సందులో ఓ అబ్బాయి. బహుశా అది అతని యూనిఫాం కావచ్చు. చేతిలో రొట్టె పేకెట్టు ఉంది. ఏదో కాగితపు ఉండో మరొకటో నేల మీద ఉంటే దాన్ని తన్నుకుంటూ నడుస్తున్నాడు. ఆనందంగా. అక్కడి వీధులు విచిత్రంగా అనిపిస్తాయి మనకు. చిన్న చిన్న సందులు, గొందులు; తప్పిపోతామేమో అనిపించేలా వుంటాయి అవి. అన్నీ దాదాపు ఒకలానే. జీవితంలో లాగా. అలా కొన్ని నిముషాలు అతన్ని అలా నడుస్తూ చూస్తాము. ఇల్లు దగ్గర పడింది. అక్కడో కుక్క బ్రెడ్డు వాసన పసిగట్టి మొరుగుతూ మీద మీదకు వస్తోంది. అబ్బాయి భయపడి వెనక్కు పరిగెడతాడు. చాలానే దూరంగా వెళ్ళి నిలబడి నిస్సహాయంగా చూస్తుంటాడు, తననెవరన్నా ఇల్లు చేరేదాకా సాయం వస్తారేమోనని. అబ్బే. నిద్ర వస్తోంది, ఆవలింతలు వస్తున్నాయి, భయంగా వుంది, చిరాకుగా వుంది, నిస్సహాయంగా ఉంది. ఆ చిన్న పిల్లవాడి హావభావాలు అన్నీ చక్కగా వున్నాయి. అన్నట్టు ఇతను శిక్షణ పొందిన నటుడు కాదు. సరే, వెనక నుంచిఎ అటూ ఇటూ వెళ్తున్నవారు కనిపిస్తుంటారు. కానీ ఈ సందులోకి రారు. కాసేపటికి ఒకతను ఓ గాదిద మీద కూర్చుని, మిగతా గాడిదలను పరుగెత్తించుకుంటూ వెళ్ళి పోతాడు. కాసేపటికి ఒకతను అట్నించే సైకిల్ మీద వెళ్ళి పోతాడు. ఇతనికి ఎలాంటి సాయమూ లేదు. అంతలో ఓ పెద్దాయన నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంటాడు. ధైర్యం వస్తుంది. ఇప్పుదు మళ్ళీ ధైర్యాన్ని సూచించే సంగీతం. ఆ పెద్దాయనకు చెవుల్లో హియరింగ్ ఏడ్స్ ఉంటాయి. బధిరత్వం కేవలం వయసుకే పరిమితమైన సంగతి కాదు, ఒక రకంగా మెటఫర్ కూడా. అయితే ఒక చోట ఆ పెద్దాయన వేరే సందు మలుపులో తిరగడం తో కథ మళ్ళీ మొదటికి వస్తుంది. సంగీతం ఆగిపోయింది. మళ్ళీ అయోమయంగా చూస్తాడు అబ్బాయి. ఇల్లు దగ్గరే. అక్కడ నీడన ఆ కుక్క కూర్చుని ఇతన్నే చూస్తుంది. ఆ కుక్క ఏ గోడకు ఆనుకుని కూర్చుందో దాని ఎదురుగా వున్న గోడ వారగా నెమ్మదిగా నడుస్తాడు. భయం భయంగా. దగ్గర దాకా రానిచ్చి కుక్క మొరుగుతుంది. ఆ క్షణంలో అతనికి life surviving skill స్ఫురిస్తుంది. ఎవరు నేర్పుతారు ఇవన్నీ? కూర్చుని, బ్రెడ్ ముక్క తుంచి కుక్క వైపు విసురుతాడు. అది మొరగడం మానేసి బ్రెడ్ తింటుంది. అబ్బాయి నెమ్మదిగా నడక మొదలు పెడతాడు. ఈ సారి కుక్క మొరగకుండా వెనకే నడుస్తుంది తోక ఊపుకుంటూ. కోపం పోయి ఆనందంగా వున్న సూచన. కొన్ని క్షణాల్లోనే అబ్బాయీ కుక్కా పక్క పక్కనే నడుస్తూ కనిపిస్తారు. నేపథ్యం లో విజయాన్ని సూచించే సంగీతం. దాని చివర్న ఆర్మీ లో లాంటి సంగీతం వినిపిస్తుంది. ఇల్లు వచ్చింది. తలుపు తడతాడు. ఒకామె తలుపు తెరిచి అబ్బాయి లోపలి కెళ్ళాక వొకసారి సందులో అటూ ఇటూ చూసి తలుపు వేసుకుంటుంది. కుక్క ఆ తలుపు దగ్గరే కూర్చుంటుంది. మనిషికీ కుక్కకీ మధ్య వొక వారధిని చిన్న రొట్టె ముక్క వేసింది కదా అనిపిస్తుంది. ఇంతలో సందు చివరి నుంచి మరో అబ్బాయి వస్తున్నాడు. చేతిలో ఏదో తినే వస్తువు వున్న పాత్రతో. అతను దగ్గరకు రాగానే కుక్క మొరుగుతుంది.
ఎవరి జీవితం వారిది. ఎవరి పోరాటం వారిదే. ప్రకృతి మనిషికి కావలసిన instincts ఇచ్చింది. లేదంటే ఇవన్నీ పిల్లలకు ఎవరు, ఎప్పుడు నేర్పుతారని?
Institute for intellectual development of children and young adults కోసం తీసిన చిత్రమిది. అయితే పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. ఇక సినిమాని సినిమాగా చూసేవాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది, మరోసారి చూసేలా చేస్తుంది.
చిన్న పిల్లల చేత నటింపజేయడం సులువు కాదు. ఈ అబ్బాయి అన్ని రకాల హావభావాలు సునాయాసంగా పలికించాడు.
ఆ నిశ్శబ్దాలు, మధ్య మధ్య వచ్చే pieces of music ను మరింత emphasize చేస్తాయి.
తప్పకుండా చూడండి. యూట్యూబ్ లో వుంది.
https://youtu.be/lOCPBv9o-LY