[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]
[dropcap]నా[/dropcap] ఫ్లయిట్‌లో నాతో ప్రయాణం చేసిన ముఖ్యుల జాబితా – ప్రఖ్యాత సింగర్ రావు బాలసరస్వతిగారూ, ప్రొడ్యూసర్స్ కె.ఎల్. నారాయణ గారూ, కె. ప్రతాప రాఘవ గారూ (ఈయనే శత వృద్ధులు అని చెప్పాగా), పి. సాంబశివరావు గారూ, భగీరథ గారు, ఎమ్.ఎస్. రాజు గారూ, శివాజీ రాజా, తరుణ్, శివకృష్ణ గారూ, నారాయణరావు గారూ, కృష్ణవేణి గారూ, కైకాల సత్యనారాయణ గారూ, సుద్దాల అశోక్ తేజ గారూ, పి.జె.శర్మ గారూ (సాయికుమార్ తండ్రి), బి. గోపాల్ గారూ, శీనూ వైట్ల గారూ, వెంకటేష్ గారూ, మాడా, బ్రహ్మానందం గారూ, అల్లరి నరేష్, పేకేటి రంగా గారూ, మురళీమోహన్ గారూ, డా. డి.వి.ఎన్. రాజు గారూ, ప్రొడ్యూసర్ అనురాధాదేవి (కృష్ణవేణి గారి అమ్మాయి… కృష్ణవేణి గారంటే మీర్జాపురం రాజా గారి భార్య, ‘కీలుగుర్రం’, ‘మన దేశం’ లాంటి వాటిలో హీరోయిన్, నిర్మాతగా మన తెలుగు దేశానికి ఎన్.టి.ఆర్.ని ‘మన దేశం’ ద్వారా నటుడిగా అందించిన ఘనత గల ఆవిడ), రాజేంద్రప్రసాద్ గారూ, చోటా కె నాయుడు గారూ, శ్రీకాంత్, బాబూ మోహన్, కోట శ్రీనివాసరావు గారూ, చలపతిరావు గారూ, భాస్కర రాజు గారూ, శేఖర్ బాబు గారు, కృష్ణంరాజు గారూ, కోదండరామిరెడ్డి గారూ, మంచు మనోజ్, సురేష్ కొండేటి, చార్మీ, పూరీ జగన్నాథ్, సత్యానంద్ గారు, సింగీతం శ్రీనివాసరావు గారూ, తమన్, మారుతీ, ఇంకా కొంతమంది సీనియర్ టెక్నీషియన్స్, నాకు పేర్లు తెలియని వర్ధమాన కళాకారులూ వున్నారు!
ముగ్గురం కూర్చునే సీటులో నా పక్కన డి.వి.ఎన్. రాజు గారు (దాట్ల వెంకట నరసింగరాజు గారు), పేకేటి రంగా (పేకేటి శివరాం గారి అబ్బాయి, ఆర్ట్ డైరక్టర్, మా ‘బాస్’, ‘ఎవరే అతగాడు’ సినిమాలకి కూడా ఈయనే ఆర్ట్ డైరక్టర్) కూర్చున్నారు.
డా. డి.వి.ఎన్. రాజు గారితో నేను కబుర్లలో పడితే 60 ఏళ్ళ సినిమా చరిత్రని తిరగతోడాము, ఈయన ‘ఇంటిగుట్టు’, ‘సింహబలుడు’ లాంటి సినిమాలు ఎన్.టి.ఆర్.తో తీసారు. మిగిలినవీ చాలా మంచి సినిమాలే. ఆయన సావిత్రి గారికొచ్చిన వ్యాధి గురించి చెబుతూ ” ‘Muscular dystrophy’ అనే ఈ వ్యాధి కోట్లమందిలో ఒక్కొళ్ళకి వస్తుంది, ఆ ఒక్కరూ మన సావిత్రి కావడం మన దురదృష్టం” అన్నారు. ‘కండరాలు హారతి కర్పూరంలా హరించుకుపోతాయి. ఎముకలు రబ్బరులా మెత్తబడిపోతాయి. దానికి మందు ఇప్పటికీ కనిపెట్టలేద’ని చెప్పారు. ఈయన నిర్మాతే కాదు, ఆ తరం ఇండస్ట్రీ ప్రముఖులకి చాలామందికి వైద్యమూ చేసారట! జయలలిత తల్లి సంధ్యకి కూడా ఈయన వైద్యం చేసారట. డాక్టర్ గారూ ఆనాటి నుండి ఈనాటి వరకూ రెండే కార్లు వాడుతున్నారట… అప్పుడు అంబాసిడర్ కారూ, ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ మారుతీ కారూ, ఇప్పటికీ అదేట!
రాఘవగారి అబ్బాయి నాతో వాళ్ళ నాన్నగారికి 102 అని చెప్పాడు… నిజంగా శతాయుష్షు తెలుగు సినిమాతో కలిసి నడుస్తున్నట్టు అనిపించింది! “మంచి కథ చెప్పు తల్లీ… మళ్ళీ సినిమా తీస్తా” అని రాఘవ గారు అంటే నా ఒళ్ళు పులకించింది, ఆ తరం వారి అంకిత భావానికి! రాఘవ గారి మీద ఇండస్ట్రీ జోక్ ఒకటుంది. హీరోతో అగ్రిమెంట్ సంతకం చేయించేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్ రెండు ఇడ్లీ ఒక వడా, నో ఎక్స్‌ట్రా చెట్నీ అని కూడా అక్కడ వుండేదిట! వీటిల్లో నిజం ఎంతో మనకి తెలీదు గాని చిరంజీవి లాంటి హీరోనీ, గొల్లపూడి గారి లాంటి కమేడియన్నీ, కోడి రామకృష్ట గారి లాంటి డైరక్టర్‌నీ మన ఇండస్ట్రీకిచ్చిన గొప్ప మనిషి!
ఫ్లయిట్ ఎంత కళకళలాడిపోయిందో… అంత గోల గోలగా నవ్వులతో ఫెళ్ళుమంది. విమానం పైకి ఎగరగానే చలపతిరావు గారు లేచి అందరి సీట్ల దగ్గరికీ వచ్చి మమ్మల్ని పలకరించారు! నేనంటే ఈ విలన్ గారికి చాలా గౌరవం! నా నవలలకి అభిమాని! “సినిమా పుట్టినప్పటి నుండీ నువ్వు ఇలా తిరుగుతూనే వున్నావ్” అని రాజు గారు జోక్ చేసారు! నా ‘రేపల్లెలో రాధ’, ‘మధుమాసం’ రెండు నవలా చిత్రాలలో చలపతిరావుగారి ముఖ్యమైన వేషం! మనోజ్ పంచే, కండువా ధరించి ఎక్కి, వాళ్ళ నాన్న అక్కడ లేనందువల్ల ‘పెదరాయుడి’ డైలాగ్స్ కొడ్తే, అంతా ‘పిల్లరాయుడు’ అన్నారు. డా. రాజశేఖర్ (జీవిత పక్కన లేకుండా) లేచి నిలబడి చాలా స్టాండప్ కామెడీ చేసి నవ్వించారు! చార్మీ లేచి ఎమ్.ఎస్. రాజు గారి ఒళ్ళో కూర్చుని ‘డాడీ’ అనడం లాంటి కామెడీలు చేస్తూనే వుంది! మాకు పాత సినిమా కబుర్లలో పడి కాలం ఎలా గడిచిందో తెలీలేదు. 11.30 amకి చెన్నైలో ఫైవ్ స్టార్ ‘లీ మెరీడియన్’ హోటల్‌లో దిగాము. అంతమంది సినీతారలని చూసి ఆటోగ్రాఫ్‌లు తీసుకునేవాళ్ళూ, పలకరించుకునేవాళ్ళతో కోలాహలంగా వుంది అక్కడంతా.
రాఘవగారూ, నేను ఒక కారులో ఎయిర్‌పోర్ట్ నుండి వెళ్ళేటప్పుడు దారంతా మద్రాసు గొప్పతనం గురించి చెప్తూనే వున్నారు! పెద్దవాళ్ళందరికీ మదరాసు మధురోహలు గుప్పుమన్నాయి.
మేం వెళ్ళగానే “రండి… రండి” అని స్వాగతం చెప్పిన పెద్దలు గొల్లపూడి గారూ, గణేష్ పాత్రో గారూ, కె. విశ్వనాథ్ గారూ, రావి కొండల రావు గారూ… అందరం ఒకర్ని చూసి ఒకరం ఆత్మీయంగా పలకరించుకుంటూ వుండగా, నేను తుళ్ళిపడి “అయ్యో… నా సూట్‌కేస్ కనబడటం లేదు అంకుల్!” అన్నాను.
“మళ్ళీ పోయిందా?” అన్నారు మారుతీరావుగారు, ఆయనతో నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా నా సూట్‍కేస్ వారం రోజులు మిస్ అయి దొరకటాన్ని గుర్తు చేస్తూ.
ఇలోగా రూమ్స్ ఎలాట్ అయ్యాయి. నా సూట్‌కేస్ గురించి మేనేజర్లు వాకబు చేస్తూ వుండగా, రాఘవ గారి అబ్బాయి “హమ్ ఏక్ షహర్ కా హై… ఇస్ లియే ఢూంఢ్ కే లాయా హై” అని పట్టుకొచ్చి ఇచ్చారు!
హీరో రాజశేఖర్ జోక్ చేస్తూ, “అయినా, నేనూ మా కోడి రామకృష్ణగారూ మీ ఎదురుగా వుండగా, సూట్‍కేస్ ఇంకెవరు దొబ్బేసారని భయపడ్డారూ? మేం కనిపించకపోతే భయం పడాలి!” అన్నారు.
జీవిత ఇద్దరు చిన్నపిల్లలతో చాలా హడావిడిగా కనిపించారు! కె. విశ్వనాథ్ గారూ, గొల్లపూడి గారూ, కోడి రామకృష్ణ గారూ, సింగీతం గారూ కబుర్లలో పడ్డాం… గొల్లపూడి గారు కోడి రామకృష్ణ గారు తనని ఎలా ఒప్పించి మొదటిసారి వేషం వేయించారో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో చెప్తుంటే, విశ్వనాథ్ గారు తనకి ఎలా స్క్రిప్ట్ రాయడం ఎగ్గొట్టి వెళ్ళిపోయారో చెప్పుకొచ్చారు. గణేష్ పాత్రో గారితో ‘పావలా’, ‘కొడుకు పుట్టాలా’ నాటకాల గొప్పతనం గురించి నేను మాట్లాడితే సంతోషించారు. కోట శ్రీనివాసరావు గారు, దూరదర్శన్ వాళ్ళు తన ‘ఇల్లు అలికిన ఈగ’ నాటకం పోగొట్టారని బాధపడ్డారు… One of the best comedy plays ఈనాటికీ అది.
అందరం లంచ్‍కి బఫేకి వెళ్ళాం. గొల్లపూడి గారి మనవరాలు శివానీ వచ్చింది. హీరో బాలకృష్ణ గారొచ్చి పలకరిస్తే ఫోటోలు దిగాం.
మా రామానాయుడు గారు “రమణీ, వచ్చావా? నేనేం తినాలో చెప్పు” అన్నారు. “మీరు ఇక్కడ కూర్చోండి” అని ఆయన ప్లేటులో నేను ఆయన తినదగ్గవి పెట్టుకొచ్చి, ఆయనతో కూర్చుంటే, జయసుధ, రాజేంద్రప్రసాద్ గారూ, శ్రీకాంత్ ఇంకా చాలామంది మా దగ్గరకొచ్చి ఆయన కోసం పలకరించి వెళ్ళారు. మేం అందరం కబుర్లు ఎక్కువా, భోజనం తక్కువగా చేసాం.
ఏ.సీ. రూమ్స్ ఇచ్చినా సత్యానంద్ గారూ, గొల్లపూడి గారూ, విశ్వనాథ్ గారూ, గణేశ్ పాత్రో గారూ, వడ్డేపల్లి క్రిష్ణ గారూ, తోటపల్లి సాయినాథ్ గారూ, మాడా గారూ, రావి కొండల రావు గారూ అందరం లాబీలోనే కూర్చుని సాయంత్రం దాకా కబుర్లు చెప్పుకున్నాం!
“దీన్నే లాబీయింగ్ అంటారు” అని సత్యానంద్ గారు తన సహజ బాణీలో జోక్ పేల్చారు! విశ్వనాథ్ గారు మహా చిలిపి అని నన్ను ఆట పట్టిస్తుంటే అర్థమయింది. భలే రొమాంటిక్ కూడాట!
(సశేషం)