[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందు వచ్చిన గ్రంథాల కంటే భిన్నమైన వస్తురూపాలతో – విలక్షణంగా వెలువడిన గ్రంథాల విశ్లేషణ. తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]
సారాంశం ఒకటే – కరోనా!
[dropcap]21[/dropcap]వ శతాబ్దపు ప్రపంచయుద్ధం కరోనాయే అనుకోవచ్చు. ఆ మహమ్మారి దుష్ప్రభావం మానవాళిని రకరకాలుగా వేధిస్తోంది, పీడిస్తోంది. వాఙ్మయమంతా సమాజ ప్రతిబింబమే కనుక-కవులు, కళాకారులూ, మేధావులూ-‘కరోనా’ని విస్మరించలేదు. అన్ని ప్రక్రియల్లోనూ-ఆ ‘రోగం’ కోణాల్నీ, పార్శ్వాల్నీ సాహిత్యం ప్రతిఫలింపజేసింది. లెక్కకు మించిన కథలూ, పరిమిత సంఖ్యలో సంపుటాలూ, సంకలనాలూ వచ్చినై. కవిత్వమూ వెలువడింది. కవితా సంపుటులూ, సంకలనాలూ ప్రచురితమైనాయి. దీర్ఘ కవితలూ వెలువడినై. ఏ కవి స్పందన ఆ కవిదే! కొందరివి స్వానుభవాలు. కొందరివి విన్నవీ, కన్నవీ అయితే మరికొందరివి చదివినవి. కవులంతా చింతనపరులు కనుక అందరి రచనలూ-కరోనా తెచ్చిన ఛిద్రజీవన విషాదాన్ని స్వాభావికంగా చిత్రించాయి. ఆ రచనల్లో కొన్ని ప్రయోగాత్మకమైనవీ వున్నాయి. అలా వచ్చిన రెండు ప్రయోగాత్మక రచనలు-ఈ సంచికకు ‘ఏరిన ముత్యాలు’.
1. ‘యుద్ధానికి అడుగులు వేద్దాం’. దీర్ఘకవిత. ఆచార్య ఎస్.శరజ్యోత్స్నారాణి, డిలిట్.:
ఎనలేని అధ్యయన, అధ్యాపన అనుభవాల్నీ, లోకజ్ఞతనీ, పరిణతవాణినీ సాధించుకున్న సుప్రసిద్ధ కవియిత్రి, రచయిత్రి, విమర్శకురాలు, సాహితీ విదుషీమణి ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి గారు. కరోనా తన మనసుపై చూపిన ప్రభావాన్నీ, సంవేదననీ ఈ దీర్ఘ కవితగా అక్షరీకరించారు రచయిత్రి. ఇప్పుడు పుంఖాను పుంఖంగా వెలువడుతున్న కరోనా కవిత్వానికి ‘భిన్నంగా, ఇదివరకు ఎవరూ స్పృశించని రీతిలో’ ఈ దీర్ఘకవితని రాశారు ఆమె. ‘ఆమె స్త్రీ సహజమైన సౌకుమార్యంతో, సున్నితంగా కరోనాను ఉద్దేశించి ఒక హితోపదేశం, ఒక గీతోపదేశం చేసినట్లు ఈ కవిత కొనసాగింది’ అన్నారు ఆచార్య టి. గౌరీశంకర్.
తొమ్మిది చిన్నచిన్న పరిచ్చేదాలుగా సాగిందీ దీర్ఘకవిత. మొదటగా – పిలిచి మౌనంగా వున్న ‘స్నేహసింధువు’ని, ‘అందరి బంధువు’ని – ఏమిటి కారణం అని ప్రశ్నిస్తుంది కవయిత్రి. కరోనాని ఉద్దేశించి ‘అందరి కళ్ళుగప్పి/మా దేశంలో ప్రవేశించావు/ఏ వీసాతో వచ్చావు?” తినేనోళ్లు పది!/ బ్రతుకంటే భయంలేదు’ అని ఉద్ఘాటిస్తుంది. తర్వాత ‘సామాజికదూరం’ పరిస్థితీ, పర్యవసానం ప్రతిఫలించాయి. ‘సామాజికదూరం అంటే అంటరానితనం అంటూ/ప్రబోధిస్తుంటే/మానవుల నడుమ దూరం పెరగక తప్పదు’ అని ఉన్నదానితోనే బాధపడుతుంటే, కొత్త దూరాల్ని కొలిపిస్తున్నావన్న సంవేదనని ఆవిష్కరించారు. రెండు పరిచ్చేదాల్లో పూర్తిగా-గతంలోనూ వర్తమానంలోనూ మన సామాజిక అస్తవ్యస్తత, సంకీర్ణత, సంక్లిష్టతల్ని పునరుల్లేఖిస్తూ-మారని మనుషుల ప్రవృత్తికి పరాకాష్ఠనీ అడుగుబడుగు వర్గాలపై చిన్న చూపునీ, దళితులపై దౌర్జన్యకాండల్నీ చూపుతూ ‘కరోనా ఏ ఒక్కరినీ చిన్నచూపు చూడదు’ అన్నారు వ్యంగ్యాత్మకంగా! ఆ తర్వాత-కరోనా సమయంలో వివిధ పథకాల ద్వారా, పద్దతుల ద్వారా, వాహికలద్వారా- ఆపన్నులకు ఎవరెవరు ఏఏ సహాయసహకారాలు అందించారో వివరంగా చెప్పారు. అందులో-రాష్ట్ర ముఖ్యమంత్రుల నుండి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ‘జైన్ సమాజం’, ‘మమతల పాలవెల్లి ఎస్పీ అమృత’ వరకూ అనేకులు చోటుచేసుకున్నారు. 14.5.20న రాము భౌతికకాయాన్ని బంధువులు వీథికి నెట్టేస్తే ముస్లింమిత్రులు హిందూపద్దతిలో దహనం చేసి మానవత్వాన్ని చాటుకున్న సన్నివేశాన్ని కవిత్వపరం చేశారు. చివరికి – ‘సూక్ష్మజీవివని గంతులేస్తున్నావో/నీ అంతరార్థం అర్థం కాకపోయినా/ఏ జీవికైనా కొంతకాలమే! ఆటలాడవద్దు మాతో’ అని హెచ్చరించారు! వలస బతుకుల వెతలూ, కతలూ ఒక పరిచ్చేదంలో వచ్చాయి.
‘కాలంతో పుట్టిన మనిషి కాలం చేయక తప్పదు’ అనే సత్యవాక్కుతో ‘ఓ మనిషీ! మానవత్వపు సిరులతో మనుగడ సాగించు!’ అని సందేశిస్తూ సంపుటిని ముగించారు.
కవితావస్తువు ఈనాటి సామాజికాంశం. అందునా ‘ప్రపంచీకరణం’ పొందిన మహమ్మారి కనుక గాఢమైన నిబద్ధతతో తమ మనసులోని మాటని…. కర్తవ్య స్పృహతో దీర్ఘ కవిత్వంగా ఆవిష్కరించారు శరత్ జ్యోత్స్నారాణిగారు. వారికి హృదయపూర్వక అభినందనలు!! (ఫోన్ నెం : 99892 30203)
***
2. అవలోకనం: 126 రచయిత్రుల కరోనా డైరీ: సంపాదకులు: జ్వలిత:
రచయిత్రిగా, కవయిత్రిగా, విమర్శకురాలిగా సాహితీలోకానికి జ్వలిత సుపరిచితురాలు. సామాజిక సేవా కార్య నిర్వాహకురాలు.
ఈ డైరీ లాంటి సాహిత్య సృజనకూ, ప్రచురణకూ ఆలోచన రావటమే ఒక అ-పూర్వమైన విషయం. ఇది సాధారణ ప్రయత్నంకాదు. ‘పుక్కిటి బంటి కష్టంలో మోకాటిబంటి రికార్డు’ అని ఆమె అన్నారు. అక్షర సత్యం ఇది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి వినూత్న వస్తురూప ప్రయోగం ఇది.
ప్రపంచీకరణం పొందిన కరోనా మహమ్మారి మానవాళి జీవనాన్నీ, జీవన సరళినీ అతలాకుతలం చేసేసింది. దాని దుష్ప్రభావం ఒక్కొక్క రంగం మీద ఒక్కో తీరున పడింది. అవన్నీ అవిరళమైన వెతలూ, కతలూ. అంతటా నిరాశా, నిస్పృహ, భయం, ఉత్కంఠ, అలజడి, ఆందోళన, అసహాయత. ఆ విషమ సందర్భంలో ‘మీ హృదయ కవాటాలు తెరవండి. ఇన్నాళ్ళూ మీరేం చేశారో చెప్పండి. తద్వారా నిస్తేజంగా వున్న మనుషుల్ని ఉత్తేజితుల్ని చేయండి’ అంటూ తోటి రచయిత్రులకు అందరికీ పిలుపునిచ్చారు జ్వలిత. తత్ఫలితంగా అక్షరయాన్, కథయిత్రుల లేఖిని, నరసం, రాజ్యపథం, దబరకం, ప్రరవే, తెలంగాణ జాగృతి, రుంజ, కవయిత్రుల వేదిక, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక వేదిక వంటి వివిధ గ్రూపులకు చెందిన రచయిత్రులు కదిలారు. కలాన్నీ, హార్దిక, ఆర్థిక చేయూతని అందించారు.
ఈ రచనలో పాల్గొన్న వారి అందరి ప్రవృత్తి మార్గం సాహిత్యం, వృత్తిపరంగా భిన్నభిన్నమైన రంగాలకు చెందినవారు. దీనివలన ఎవరి వైయక్తికమైన అనుభవాల్నీ, అనుభూతిని అధ్యయనాన్నీ, పరిశీలననీ, కార్యక్రమాన్నీ, నిర్వహణ విధానాన్ని వారుగా చెప్పగలిగారు. ఫలితంగా కరోనా వివిధ కోణాలూ, పార్శ్వాలూ అక్షరీకరణం చెందాయి. అనన్యమైన వైవిధ్యం ఆవిష్కరింపబడింది. రచయిత్రులందరూ కలిసి కరోనా కాలపరిచ్ఛేదంలోని సంభవాల్నీ, సంఘటనల్నీ, మానవ స్వభావాల, సంబంధాల వైచిత్రినీ గాఢమైన రచనగా అందించారు. వీటిలో అనూహ్యమైన ఘటనలూ వున్నై. అంతర్జాల వాడకం నుంచీ, ఆపన్నులకు స్నేహహస్తం అందించిన విధివిధాన నిర్వహణ విశేషాల వరకూ అన్ని చోటుచేసుకున్నాయి. ‘డైరీ అంటే నిజం మాత్రమే’ అన్నారు డా॥ అమృతలతగారు. అవును. అది సత్యవాక్కు! ఈ డైరీ ఆవిష్కారం ఒక సాహసం. ఒక సాహిత్యావసరం. ఒక సామాజిక చారిత్రక ప్రయోజనం! ఈ డైరీలోని ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క అక్షరాన్ని చదవటం నిస్సందేహంగా ఒక జీవితకాలపు సంవేదనానుభవం! తప్పకుండా పుస్తకాన్ని కొని చదవండి! సంపాదకురాలికీ, ప్రతి ఒక్క రచయిత్రికీ అభినందనలు, శభాకాంక్షలు! (జ్వలిత, ఫోన్ నెం: 99891 08943)