[box type=’note’ fontsize=’16’] పిల్లలన్నా, వారితో సావాసం చేయటమన్నా నాకెంతో ఇష్టం. తరగతి గదిలో, ఆటస్థలంలో, ఇంట్లో, ఎక్కడైనా సరే పిల్లల ఆటపాటలు ఉంటే సందడే సందడి. ఆ సందడి నాకెంతో ఇష్టం. ఉమయవన్ తమిళంలో రాసిన ‘పరక్కుమ్ యానై’ కథలు చదివిన తరువాత అవి బాగా నచ్చి వాటిని మన తెలుగు పిల్లలకు దగ్గరచేయాలనే ఉద్దేశంతో తెలుగులోకి అనువదించాను. అందులోని కథలే మీరిప్పుడు చదువుతున్నది! – రచయిత్రి (అనువాదకురాలు)
~ ~
పన్నెండేళ్ల లోపు పిల్లలకు ఈ పది కథలూ చాలా సరదాగా అనిపిస్తాయి. వీటిలో కల్పన ఉన్నా, పర్యావరణ స్పృహ, సమాజం పట్ల బాధ్యత అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి నీతిని బోధించే కథలు కావు. గంభీరంగా ఉండవు. కాని, చిన్న చిన్న అంశాలతోనే ఎంతో పెద్ద విషయాన్ని పిల్లలకు అర్థమయేట్లుగా, వారు పాటించేటట్లుగా బోధపరుస్తాయి. అదే వీటి విలక్షణత. [/box]
[dropcap]ఒ[/dropcap]కప్పుడు ఇళంజి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఒక రాజు. ఆయన చాలా గొప్ప రాజు, చక్కని పరిపాలనాదక్షుడు. ప్రజలంతా రాజును ఎంతగానో ఇష్టపడే వాళ్ళు. రాజ్యంలో శాంతి, సమృద్ధి, సౌభాగ్యం నిండి ఉండేవి. కాని రాజుగారికి వింత కోరిక ఒకటి ఉండేది. అది ఆయన ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. తన మనసులోనే అలా ఉంచుకున్నాడు.
చాలా సంవత్సరాల అనంతరం, తన సంకోచాన్ని పక్కన పెట్టి రాజు తన మంత్రులతో తన మనసులోని కోరికను గురించి వివరంగా చెప్పాలనుకున్నాడు. వెంటనే మంత్రులందరినీ సమావేశపరచి వారికి తన చిరకాల వాంఛను స్పష్టంగా చెప్పేశాడు. రాజుగారి కోరిక వినగానే మంత్రులందరికీ మనసులో కలవరం కలిగింది – ఎందుకంటే అది చాలా వింతైన కోరిక!
ఇంతకూ ఆ కోరిక ఏమిటంటే, తన గురించి తన రాజ్యంలోని ప్రజలంతా తమ తమ మనసులలో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని! వాళ్ళంతా తనను గురించి వాస్తవంగా ఏమనుకుంటున్నారో తనకు తెలియాలి, కాని, తనకు ఆ విషయం తెలిసినట్లు మాత్రం వాళ్లకు తెలియకూడదు. ఇది ఎలా సాధ్యం?!? “ఇటువంటి విపరీతమైన కోరిక రాజుకు ఎందుకు కలిగింది? అది తీరడానికి మంత్రులు ఏమి చేయగలరు? రాజు గురించి ప్రజలు వాస్తవంగా ఏమనుకుంటున్నారో రాజుకు తెలిసిపోతే, ఇబ్బంది కదా! రాజు ప్రజలకు కఠినమైన శిక్షలు వేస్తారేమో కదా” అని మంత్రులు భయపడసాగారు.
కాలం గడిచిపోతూ ఉంది. ఎవ్వరూ రాజుగారి కోరిక ఎలా తీరుతుందో చెప్పలేకపోతున్నారు. తన కోరిక తీర్చగల వారికి రాజు గొప్ప బహుమతి కూడా ప్రకటించాడు. అయినా ఎవ్వరూ ముందుకు రానే లేదు.
ఒకరోజు రాజు సభలో ఉండగా భటుడు పరిగెత్తుకుంటూ వచ్చి సింహద్వారం వద్ద ఒక వయసు మళ్ళిన వ్యక్తి రాజుగారిని వెంటనే దర్శించుకోవాలని ప్రార్థిస్తున్నాడు అని చెప్పి “లోపలికి పంపించమంటారా?” అని అడిగాడు. రాజు పంపించమని ఆజ్ఞాపించాడు.
లోపలికి వచ్చిన ఆ వయసు మళ్ళిన వ్యక్తి రాజు కోరికను తాను అన్ని విధాల తీర్చగలను అని చెప్పాడు. రాజుకు చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. ఆ ముసలాయన ఇంకా ఇలా చెప్పాడు – “నేను మీతో చెప్పే విషయాలు మీరు మరెవ్వరికీ చెప్పకూడదు. అందుకు మీరు అంగీకరిస్తేనే మీ కోరిక తీర్చగలను. ఈ రహస్యం మీకు, నాకు మాత్రమే తెలిసి ఉంటుంది సుమా”. ఈ షరతుకు రాజు సంతోషంగా అంగీకరించాడు. వెంటనే ఆ వృద్ధుడు తనకు తెలిసిన ఆ రహస్య పద్ధతిని రాజుగారికి చెప్పాడు. మరుక్షణంలో రాజుకు ఈ ప్రపంచంలో తాను అందరి కంటే ఉన్నత స్థానంలో ఉన్నట్లయింది. ఎందుకో తెలుసా? తన జీవిత కాలమంతా ఏ శక్తి కోసం తపించిపోయాడో, ఆ అద్భుత శక్తి అతని చేతిలో ఉన్నది మరి! ఇప్పుడు రాజు ఇతరుల మనసులో ఏమున్నదో తెలుసుకోగలడు. కాని అతనికి ఆ శక్తి ఉన్నదని ఎవరికీ తెలియదు.
రాజు బహుమతి ఇస్తానని ప్రకటించాడు కదా? ఆ వృద్ధుడు బహుమతిని అందుకుంటూ తన మనసులో ‘ఇక ఈ రాజు తన మనశ్శాంతిని పూర్తిగా కోల్పోతాడు కదా!’ అని అనుకున్నాడు. రాజుకు ఇప్పుడు ఆలోచనలు చదివే శక్తి ఉంది కదా? వెంటనే అతని ఆలోచన రాజుకు తెలిసిపోయింది. కాని రాజు ఇంత అద్భుతమైన శక్తిని పెట్టుకొని మనశ్శాంతిని కోల్పోవడం ఏమిటి అని వృద్ధుడి భావాలను పట్టించుకోలేదు.
రాజు తన భవనపు ప్రధాన ద్వారం దాటి బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న రక్షకభటులలో ఒకడు తన మనసులో ‘ఇవాళ ఈ రాజు దుస్తులు, వాటిపై ఉన్న రంగులు ఎంత వికారంగా, ఎంత అందవిహీనంగా ఉన్నాయో’ అని అనుకున్నాడు. అది రాజుకు తెలిసిపోయింది. గిరుక్కున వెనుదిరిగి తన భవనం చేరుకొని ఎంతో అందమైన మరొక చక్కని జతను ధరించి బయటకు వచ్చాడు. కొద్దిదూరం నడుచుకుంటూ ముందుకు సాగుతుండగా మరొక రక్షకభటుడు ‘ఈ రాజు ఎప్పుడూ రాజధానిలోనికి వెళ్లి ప్రజలను కలవడు’ అనుకున్నాడు తన మనసులో. ఆ మాటలు రాజుకు తెలియగానే వెంటనే తాను ఇవాళ నగర పర్యటనకు వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు చేయమని భటులను ఆజ్ఞాపించాడు!
రాజు రథం నగరం నడిబొడ్డుకు రాగానే అక్కడి ప్రజలు రాజుకు స్వాగతం చెప్పాలని చుట్టూ మూగసాగారు. ఈ గలభా, గందరగోళం మధ్యలోనే రాజుకు ఇంకేవో మాటలు కూడా వినిపించసాగినై. ఆ గుంపులో ఒకడు తనకు శాపనార్థాలు పెడుతున్నాడు. రాజు తన భటులతో “ఆ వ్యక్తిని ఇటు తీసుకురండి, అతని సమస్య ఏమిటో అడిగి తెలుసుకుని దానికి పరిష్కారం చేస్తాము” అని చెప్పాడు. కాని అది భటులకు సాధ్యపడలేదు! ఎందుకంటే రాజుగారిని చూడటానికి తండోపతండాలుగా వస్తున్న జనంలో ఎవరు అలా అనుకున్నారో, దురుసుగా ఆలోచించిన ఆ వ్యక్తి ఎవరో ఎలా కనిపెడతారు?
రాజు మనసును ఈ విషయం ఎంతగా కలచివేసిందంటే, ఇక వెంటనే వెనుదిరిగి తన భవనానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాజుకు నిద్ర కరవైంది. రాత్రంతా ఆ వ్యక్తి తనను గురించి అనుకున్న నిందావాక్యాలు, అరుపులు, కేకలు చెవులలో గింగురుమంటున్నాయి. కళ్లు మూసినా, తెరచినా అదే గందరగోళం, అదే అశాంతి!
ఆ మరునాడు రాజుగారి పుట్టినరోజు సందర్భంగా అత్యంత భారీగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి రాజ ప్రాసాదంలో. సత్సంప్రదాయాలు ఆదేశించిన విధంగా రాజు ఆ రోజున నగరంలో ప్రజలందరికీ బట్టలు పంచిపెట్టవలసి ఉన్నది. రాజభవనపు ద్వారం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ప్రజలను చేరుకుంటూ ఉండగా రాజుకు ఎవరెవరివో గొంతుకలు ఏవేవో ఆలోచించుకోవడం వినిపించింది. ఆ గుంపులో నుండి ఒక గొంతుక ‘పుట్టినదినం పేరు చెప్పి ప్రజాధనాన్ని వృథా చేస్తూ ఇలా బట్టలు పంచిపెట్టడం పెద్ద గొప్ప సంగతేమీ కాదు’ అంటూ రాజును నిందిస్తున్న మాటలు పలుకుతూ ఉన్నది. రాజుకు ఎంతో పరువు తక్కువగా అనిపించి వెంటనే బట్టలు పంచిపెట్టడం ఆపేశాడు. కాని అంతలోనే తన ఆలోచన మార్చుకున్నాడు. ఎందుకంటే, నిలబడ్డవాళ్లంతా ‘రాజు ఇంతసేపు కాళ్ళు నొప్పులు పుట్టేలా నిలబెట్టాడు. ఇప్పుడు బట్టలు ఇవ్వను అంటాడేంటి? ఉత్త చేతులతో వెనక్కి పంపిస్తాడా?’ అనుకుంటూ రాజును నిందించసాగారు. ఆ మాటలు విన్న రాజు నిట్టూర్చి యథాప్రకారం బట్టలు పంచసాగాడు.
అక్కడకు వచ్చిన ప్రజలలో కొందరు రాజు చాలా బలంగా, లావుగా ఉన్నాడని, రాజుగా ఉండేందుకు తగడని అనుకున్నారు. కొందరేమో అతడు తమ రాజు అయినందుకు గర్వపడుతూ భావించి అతని పట్ల ఎంతో గౌరవంగా మెలిగారు. కొందరు రాజుగారు ఇంకా కొంచెం పొడవుగా ఉండి ఉంటే బాగుంటుందని భావించారు. మరికొందరు రాజుగారు చాలా అందగాడని, పరాక్రమవంతుడని మెచ్చుకోసాగారు. ‘రాజుగా ఉండడానికి తగిన శరీర బలం లేనివాడు ఈ రాజు’ అని కొందరు అనుకోసాగారు. ఇంకొందరు ‘ఇంతకుముందు కన్నా ఇప్పుడే ఈ రాజు మెరుగ్గా ఉన్నాడు’ అని భావించసాగారు.
వస్త్రదానం అయిపోగానే రాజు అంతఃపురం ప్రవేశించాడు. ‘రాజు నిన్నటి నుండి ఏదో వింతగా ప్రవర్తిస్తున్నారు; ఈయనకు ఏమైంది?’ అని రాణిగారు తన గురించి అనుకుంటున్న మాటలు రాజుకు తెలిసిపోయాయి. తన గురించి ప్రజలు, రాణి అనుకుంటున్న మాటలు, ఆలోచనలు, అభిప్రాయాలూ రాజులో ఒక అశాంతిని రేపాయి. పిచ్చి పట్టేటట్లు ఉన్నాయి వాళ్ళ మాటలు.
ఈ రోజు తాను జరుపుకున్న తన జన్మదినం ఎంత నీచంగా, అధమంగా ఉన్నదో కదా అని అనిపించసాగింది రాజుగారికి. ఆ వృద్ధుడు తనకు ఇతరుల మనసులను ఎలా చదవాలో నేర్పించిన దగ్గర నుండి ఏ మాత్రం మనశ్శాంతి లేకుండా పోయింది. అతనిప్పుడు ఒక నిశ్చయానికి వచ్చాడు. అది ఏమిటంటే ‘నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారన్న విషయం నేనికముందు లెక్క చేయను. అసలు పట్టించుకోను. అలా పట్టించుకోకుండా ఉన్నందువలననే గతంలో నేను హాయిగా ఉండగలిగాను!’
ఇలా అనుకున్న వెంటనే రాజు ఆ వృద్ధుడిని తన సభకు పిలిపించాడు. తనకు ఇచ్చిన వరం వెనుకకు తీసుకోమని ప్రార్థించాడు. వృద్ధుడు సరే అని తాను ఇచ్చిన శక్తిని ఉపసంహరించుకున్నాడు. ఇప్పుడు రాజు ఎప్పటిలాగా మామూలుగా మారిపోయాడు. వృద్ధుడిచ్చిన ఈ శక్తి రాజు పాలిటి వరంగా కాక అతి పెద్ద శాపంగా మారిపోయింది. ‘నా గురించి ఇతరులు ఏమనుకుంటారో నేనిక ఎప్పటికీ పట్టించుకోను. నా మనస్సాక్షిని నేను గౌరవిస్తాను’ అని రాజు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక అతడు తన శేష జీవితాన్ని నిశ్చింతగా గడిపాడు. స్పష్టమైన మనసు కన్నా మనకు శాంతిని ప్రసాదించేది మరేదీ లేదని రాజు గ్రహించగలిగాడు.
మూలం: ఉమయవన్ రామసామి
తెలుగు: వల్లూరు లీలావతి