జ్ఞాపకాల పందిరి-37

75
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నా కంటి.. సంరక్షణలో…!!

[dropcap]స[/dropcap]హాయం ఎలాంటిదైనా, ఆ సహాయం చేసిన వారిని అసలు మరచిపోలేము. కొంతమంది చేసిన సహాయం అయితే నిత్యం తలచుకోవలసిందే! ఆ సహాయం అలాంటిది అయి ఉంటుంది. మనసున్న మనుష్యులు, కృతజ్ఞతా భావం కలిగినవాళ్లు ఖచ్చితంగా అలాగే చేస్తారు. నేను మాత్రం అలాంటి సహాయం అందించిన వారిని అసలు మరచిపోలేను. విషయం కళ్ళది కాబట్టి మరచిపోయే ప్రసక్తే లేదు! చూడాలన్నా, చదవాలన్న, రాయాలన్నా కళ్ళు బాగుంటేనే కదా! ఇప్పటివరకూ నా కంటి విషయంలో నన్ను అప్రమత్తం చేసి,నా కంటి చూపును కాపాడుతున్న కంటి వైద్య మిత్రుల గురించి ఇక్కడ ప్రస్తావించ దలచుకున్నాను.

1983 ప్రాంతమనుకుంటాను, నేను మహబూబాబాద్ ఆసుపత్రిలో పని చేస్తున్న రోజులు. ఉదయం సమయంలో ప్రతి రోజూ, నాకు అప్పటికే పరిచయం అయివున్న ప్రైవేట్ ప్రాక్టిసు వైద్యులు డా. వి. నరసింహా రెడ్డి గారు, నా దగ్గరికి వచ్చి కాసేపు కాలక్షేపం చేసి వెళ్లేవారు. ఆయన జనరల్ ఇంజక్షన్ ప్రాక్టీసు చేసేవారు. ఎప్పుడూ చాలా బిజీగా ఉండేవారు. వైద్యులందరితో సన్నిహిత సంబంధాలు పెట్టుకునేవారు. ముఖ్యంగా నాకు ఒక పెద్దన్నలా వుండి అవసరమైన సూచనలు – సలహాలు ఇస్తూ ఉండేవారు. చిన్నప్పటినుండీ కంటి చూపు సరిగా లేని సమస్యతో బాధ పడుతుండడం వల్ల, ఆయన ఇతరులకు కళ్ళు జాగ్రత్తలు చెబుతూ అవసరమైన సహాయం అందిస్తూ వుండేవారు. లయన్స్ క్లబ్ లో అతి చురుకైన వ్యక్తిగా కార్యకర్తగా పనిచేస్తూ ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, కంటి ఆపరేషన్ల విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చి పేద ప్రజానీకానికి సహాయ పడుతుండేవారు.

డా. వి. నరసింహారెడ్డి

ఆ డాక్టర్ గారు ఒక రోజు ఉదయం ఆసుపత్రిలో నా డిపార్ట్‌మెంటుకు వచ్చారు. ఆ సమయంలో పేషేంట్స్ లేకపోవడంతో, సీరియస్‌గా ఏదో రాసుకుంటున్నాను. నా కళ్ళనుండి అదే పనిగా నీళ్లు కారడం నేను గమనించుకోలేదు. ఆయన రావడమే నన్ను చూసి లేచి నిలబడమని నన్ను తన స్కూటర్ మీద ఎక్కించుకుని, మాట్లాడకుండా, సరాసరి డా. పండరినాథ్ ఆసుపత్రి కాంప్లెక్సుకు తీసుకు వెళ్లారు. అక్కడ వరంగల్ నుండి వచ్చే డా. దేవేందర్ (కంటి డాక్టర్) ప్రాక్టీసు చేస్తున్నారు. అప్పటికి ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం లేదు. నా కళ్ళు టెస్ట్ చేయమని సైగ చేసారు డా. నరసింహా రెడ్డి. డా. దేవేందర్ నా కళ్ళు పరీక్షించి నాకు సైటు ఉందని తేల్చాడు. కళ్లద్దాలు వాడమని సలహా ఇచ్చాడు. అలా మొదలైంది నా కంటి రామాయణం.

డా. దేవేందర్

1994లో నేను జనగామకు బదిలీ కావడం వల్ల, హనంకొండలో ఇల్లు తీసుకుని ఉండేవాడిని. జనగాంలో పరిచయం అయిన కంటి డాక్టరు డా. గిరిధర్ రెడ్డి, అప్పుడప్పుడు నా కళ్లు పరీక్ష చేసి తగిన సూచనలు చేస్తుండేవారు. అప్పటినుండి గిరిధర్ నాకు కుటుంబ కంటి డాక్టరు అయ్యారు. తరువాత కంటికి సంబంధించి అప్పుడప్పుడు ఆయన పిలిచి మరీ పరీక్షలు చేసేవారు. నన్ను బాగా ఇష్టపడే వ్యక్తుల్లో ఆయన ఒకరయ్యారు. ఇద్దరం మంచి స్నేహితులుగా మారాము. అలా మా ఇంట్లో అందరికీ ఆయనే కంటి డాక్టరు.

డా. గిరిధర్‌తో నేను

రెగ్యులర్ కంటి పరీక్ష కొంచెం అశ్రద్ధ చేస్తున్న సమయంలో డాక్టర్ గిరిధర్ నాకు ఫోన్ చేసి ఒకరోజు ఖచ్చితంగా రమ్మని చెప్పారు. నాకోసం ఆయన అంత శ్రద్ధ తీసుకుంటుంటే నేను అశ్రద్ధ చేయడం నాకే సిగ్గనిపించింది. అందుచేత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పిలిచిన రోజున ఆయన క్లినిక్‌కు, సాయంత్రం పూట నా క్లినిక్ మానుకుని కంటి పరీక్ష కోసం వెళ్లాను. కాసేపు బాతాఖానీ కబుర్లు అయిన తరువాత నా కంటి పరీక్ష చేసిన డాక్టర్ గిరిధర్ కాస్త ఖంగారుగా “సార్.. మనం రేపు హైదరాబాద్‌కు వెళ్ళాలి, అపాయింట్‌మెంట్ తీసుకుంటున్నాను” అన్నాడు. పరిస్థితి నాకు అర్ధం కాలేదు. “విషయం ఏమిటి?” అని అడిగాను. “కొంచెం రెటీనా ప్రాబ్లెమ్ వచ్చింది, మనం రెటీనా కంటి వైద్యురాలిని కలవాలి” అన్నారు. నిజానికి నాకు అదేమిటో అర్థం కాలేదు. తానే, మరో డాక్టర్ దగ్గరికి తీసుకువెళుతున్నారు కనుక ఆయన కూడా వస్తానన్నందుకు దైర్యంగానే వున్నాను.

మరునాడు ఇద్దరం డా.గిరిధర్ కారులోనే హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్‌కు వెళ్ళాము. అందులో కంటి విభాగం చాల పెద్దగా వుంది. రెటీనా విభాగం అధిపతి డా.మల్లికా గోయెల్. రిసెప్షన్‌లో రిజిస్టర్ చేసుకుని ఆవిడ పిలుపు కోసం విశ్రాంతి హాలులో కూర్చున్నాం. అవన్నీచూస్తే కంటి వైద్యం ఇంతగా అభివృద్ధి చెందిందా? అని ఆశ్చర్య పోయాను. అంచెలంచెలుగా, పరీక్షలు జరిగాయి. అందరూ ఎంతో మర్యాదగా, జాగ్రత్తగా పరీక్షలు చేస్తున్నారు. నాకు ఆ వాతావరణం బాగా నచ్చింది. ఆసుపత్రి అంటే భయపడేట్టు లేదు, పరీక్షలన్నీ పూర్తి అయినాక, అన్ని రిపోర్టులతోనూ నా ఫైల్ మేడం మల్లికా గోయల్ దగ్గరకు చేరాక నాకు పిలుపు వచ్చింది. ఆవిడను చూడగానే మంచి వైద్యురాలిలా నా మనస్సులో ముద్రపడింది. ఆవిడ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. నా సమస్యను ‘రెటీనల్-వెయిన్ అక్లూసన్’ (Retinal vein occlusion) అని తేల్చారు. అంతమాత్రమే కాదు, గ్లకోమా (Glaucoma) కూడా ప్రారంభ దశలో ఉన్నట్టు నిర్ధారించారు. డాక్టర్ మేడం కంటిలో ఇంజక్షన్ ఇచ్చి,లేజర్ ట్రీట్మెంట్ చేశారు. బి. పి/షుగర్, ఎప్పుడూ నియంత్రణలో వుండాలని చెప్పారు.

డా. మల్లికా గోయల్

అప్పుడప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి పరీక్ష చేసేవారు. గ్లకోమా గురించి డా. గిరిధర్ చూసుకునేవారు. అలా కొన్నాళ్ల పరీక్షల తర్వాత సంవత్సరానికి ఒకమారు రమ్మని చెప్పారు. లోకల్‌గా గిరిధర్ పర్యవేక్షణలో కంటి చుక్కల మందు వాడడం కొనసాగుతూనే వుంది, ఇది జీవితాంతం జరుగుతుండవలసిందే! సర్జరీ చేస్తే సమస్యలు వుంటాయని, అందుచేత ఎప్పటికీ చుక్కల మందు వాడాలని చెప్పారు. ఎడం కన్ను చూపు అరవైశాతం పోయింది. ఉన్నది కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. రెండు పూటల కంటిలో చుక్కలమందు వేసే బాధ్యత నా శ్రీమతి అరుణ తీసుకుంది. ఎప్పుడు మిస్ అయిన సందర్భాలు లేవు.

డా. గిరిధర్, ప్రాంతీయ కంటి వైద్య శాలలో పని చేస్తుండడం వల్ల, తర్వాత సూపరింటెండెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించడం, ఆయన క్లినిక్‌లో సరిపడినన్ని పరికరాలు, పరివారం లేకపోవడం, నాలాంటి వారికి సమయం కేటాయించలేక పోవడం వల్ల నేను మరో డాక్టరును వెతుక్కోక తప్పలేదు. ఈ నేపథ్యంలో నాకు అంతకుముందే కొద్దిగా పరిచయం వున్న,సమర్థుడైన కంటి వైద్యుడు డా. ప్రవీణ్‌ను ఎంచుకోక తప్పలేదు.

డా. ప్రవీణ్

ఆసుపత్రి అన్ని అవసరమైన హంగులతోను, మంచి సదుపాయంగా వుంది. హనంకొండ -విజయ టాకీస్ దగ్గర అందరికీ అందుబాటులో ఉండేలా సౌకర్యంగా వుంది, కాకతీయ కంటి ఆసుపత్రి. అది నా దృష్టిలో ప్రాంతీయ అపోలో ఆసుపత్రి. అక్కడే పరీక్షలు చేయించుకుంటూ వచ్చాను. డా. ప్రవీణ్ గారి, కంటి చుక్కల మందు, రెండు పూటలకు బదులు, ఒకేపూట, అది కూడా రాత్రి పూట వేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ లోగా ఎడమకన్నుకు శుక్లాల సమస్య వచ్చింది. అన్ని పరీక్షలు చేసి, కేటరాక్టు -సర్జరీ విజయవంతంగా చేశారు. షుమారు పదిహేనువేల రూపాయల ఖర్చును ఊహించిన నేను, ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కరలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అదే ‘హెల్త్ కార్డు’. దాని ఉపయోగం అంతా -ఇంతా కాదు!

అయితే ఫిబ్రవరి నెల (2020) నుండి కరోనా మహమ్మారి కోరలు చాచి విజృంభించడంతో మళ్ళీ కంటి పరీక్షలు చేయించుకునే అవకాశం కలగలేదు. అత్యవసరం అయితేనే ఆసుపత్రికి రావాలని డాక్టర్ చెప్పడంతో, ఇంటిపట్టునే కాలక్షేపం చేయవలసి వస్తుంది.

ఈ నా కథనంలో ప్రత్యేకత, డా. నరసింహ రెడ్డి, డా. గిరిధర్ (రెడ్డి) గార్ల ప్రత్యేక సహాయం. అప్పుడు నరసింహారెడ్డి గారు కలగజేసుకోకుంటే, సైట్ పెరిగిపోయి ఉండేది. గిరిధర్, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హైద్రాబాద్ తీసుకెళ్లకుంటే, గుడ్డితనమే కాదు, ప్రాణ హాని కూడా కలిగి ఉండేదేమో. అందుకే, వీరిద్దరినీ ఎన్నటికీ మరువలేను. వారికి నేను చేసిన సహాయం కంటే, వారు స్నేహానికి ఇచ్చిన విలువ బహుగొప్పది, ప్రశంసనీయమైనదీ!

నేను ఈ రోజున ఏదైనా చదవడం, రాయడం చేస్తున్నానంటే వారి చలవే మరి! మిత్రులారా మీకు వందనం!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here