మందు మాన్పించే మల్లిబాబు మరణించాడన్న వార్త తెలుగు రాష్ట్రాలలో గుప్పున వ్యాపించడానికి టీ.వీ. ఛానెల్లు, సోషల్ మీడియాలు పోటీ పడ్డాయి.
ప్రజల్లో శ్వాస మందగించింది. మందుబాబుల భార్యామణులు, అయ్యో.. ఎంత ఘోరమంటూ.. అన్నహారాలు మానేశారంటే.. అతిశయోక్తి గాదు. ఇక మాకు చీకటి బతుకులేనా! అన్నట్టు బాధ పడిపోసాగారు. ఇది అంత తేలికైన విషయమా!.. ఎందరో జీవితాలలో వెలుగులు నింపిన మహానుభావుడు.. నిస్వార్థంగా ఫీజు తీసుకునే నిరాడంబర జీవి. ఇలా అర్ధశతాయుస్సులోనే.. హఠాత్తుగా కన్ను మూయడం.. పలు అనుమానాలకు దారి తీసింది.
మందుబాబులెవరైనా.. అతని మీద కక్షగట్టి విషప్రయోగం చేశారా!.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా..! ఒకవేళ చేసుకుంటే.. ఎందుకు చేసుకున్నట్టు.. పోనీ పక్కింటి వాళ్ళు అంటున్నట్టు అతనిది హార్ట్ ఎటాకేనా!.. అని వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు తెరపడాలంటే.. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాల్సిందే..
ఆ రిపోర్ట్ కోసమే.. నారీమణులంతా మాస్కులు కట్టుకుని.. భౌతిక దూరం పాటిస్తూ.. హాస్పిటల్ ముందు ఎర్రటి ఎండలో నిలబడ్డారు. ఇదే మంచి తరుణము.. మించిన దొరకదన్నట్లు.. టీవీలో ప్రత్యక్ష ప్రసారం కోసం కెమెరామెన్లు తమ సిబ్బందితో పోటా, పోటీగా పరుగులు తీస్తూ వచ్చి ప్రశ్నల వర్షం కురిపించసాగారు.
“అమ్మా.. మీ పేరేంటి? మల్లిబాబు గారంటే మీకెందుకింత అభిమానం” ‘కాస్కోటీవీ’ ప్రశ్న.
“మా ఆయన గజమందుబాబు బాబూ..! మందు క్వార్టర్ విథౌట్ వాటర్ కొడితే ఏ మూలకూ ఆనదాయనకు. నిల్చున్న ఫళంగా నికార్సైన ఫుల్ బాటిల్ లాగించగానే.. గునపం గుప్పిట పట్టుకుని ఇంటి మూలలు కూల్చేసేవాడు. అలా కూల్చడంలో తమ, పర భేదాలు పట్టించుకోడు. దాంతో పక్కింటి వారితో.. కురుక్షేత్ర యుద్ధాలు. స్వయంగా తాపీ మేస్త్రీ గనుక, నిషా దిగగానే.. కూల్చిన గోడలు తిరిగి సరిజేసేవాడు. అయినా తిట్లూ శాపనార్థాలు తప్పవుగదా..! ఆ బాధలు పడలేక మా ఆయనను మల్లిబాబుగారి దగ్గరికి తీసుకు వచ్చాను. పది రోజుల్లో మందు మాన్పించిన మహానుభావుడు” అంటూ ఆకాశం వైపు చూస్తూ.. రెండుచేతులా దండం పెట్టసాగింది.
ఇంతలో మరో ఆవిడ అందుకుంది.. “నా మొగడు మందు కొట్టగానే పిచ్చి లేచిన వాడిలా.. వీధిలో నిల్చోని వచ్చే, పోయే వారిని వెక్కిరిస్తూ.. పాటలు పాడే వాడు. దారిన పోయే వాళ్ళు దుమ్మెత్తి పోసినా.. పూల వర్షమన్నట్లు మురిసి పోయేవాడు. అతణ్ణి ఆపడం ఎవరితరమూ అయ్యేది కాదు. అలాంటి తీస్మార్‌ఖాన్ని మన మల్లిబాబు మందు మాన్పించి మహాపురుషునిగా తీర్చిదిద్దాడు” అంటూ కాస్కో టీవీని.. ఇక మూస్కో అన్నట్టు చూడసాగింది.
కాని ముచ్చటగా మూడో ఆవిడ మూస్కో లేదు.. గళం విప్పి తనదైన శైలిలో నటిస్తూ.. చెప్పసాగింది..
“నా మొగడు మొరటోడు. పనీ పాటా ఎరగడు. మందుకొట్టందే నిలబడ లేడు. నా రెక్కల కష్టాన్ని, పీకలదాకా తాగచ్చి మళ్ళీ, మళ్ళీ డబ్బులడిగే వాడు. ఇవ్వకుంటే.. సుత్తి తీస్కోని బోళ్ళు బొచ్చెలు సొట్లు పోయేలా చితగ్గొట్టేవాడు. బాధ భరించ లేక మల్లిబాబుతో మొర పెట్టుకున్నాను. నా పెనిమిటి సొట్లు తీసి.. చక్కగా తీర్చి దిద్ది నా చేతికందించిన మల్లిబాబు అంటే.. మా ఇంటి దేవుడు” అంటూ కన్నీళ్లు పెట్టుకొసాగింది.
ఇంతలో ప్రజలకు సమాధానం చెప్పి పంపించే దిశగా హాస్పిటల్ ప్రాంగణం అరుగు మీద ఏర్పాటు చేసిన మైకు ముందుకొచ్చాడు ముకుందం పోలీసు ఇనస్పెక్టర్.
“మందుబాబుల ఆగడాలు సహించిన వీరపత్నులారా.. రిపోర్ట్స్ వచ్చాయి” అని ప్రకటించగానే నారీమణుల మూతులు మూతబడి చెవులు తెరచుకున్నాయి. అందరిలో ఉత్కంఠ.. ఉత్కంఠ.. ఉత్కంఠ.
ముకుందం తాపీగా తిరిగి చెప్పసాగాడు. “అనాది కాలం నుండి మనిషిలో మార్పు రావడం లేదు. కొందరు రచయితలు తమ పుస్తకాలలో నీతులు వల్లిస్తారు గానీ.. గోతులు తీయడమే వారి వృత్తి. చెప్పేవి ధర్మశాస్త్రాలు.. కూల్చేవి మంది కొంపలు మరో రకం వాళ్ళు. ప్రవచనాలు ప్రక్క వారికే గాని పనికి మాలినవి మనకెందుకనే వారు కోకొల్లలు.
శ్రీరామకృష్ణపరమహంస గారు.. అతిగా బెల్లం తినే ఒక పిల్ల వానికి అలా తినగూడదని చెబుతాడు తాను ముందుగా మానుకొని. అలాంటి మహానుభావులు ఎన్ని నీతులు చెప్పినా మనలో మార్పు రాలేదు.. ‘ఎదుటి వానికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయీ..!’ అని ఒక కవి శ్రేష్ఠుడన్నట్టు.. మన మల్లిబాబు మందుబాబులతో మందు మాన్పించే వాడే గానీ.. అతనికీ అతిగా మందుకొట్టే అలవాటుందన్న విషయం ఎవరికీ తెలియదు. అర్ధరాత్రి తాగి పడుకునేవాడు. రాత్రి తాను కొట్టిన కల్తీ మందు వికటించి తెల్లవారు ఝామున అతని బతుకు తెల్లారి పోయిందని.. పోస్ట్‌మార్టం రిపోర్ట్..” అనగానే మగువలు లిప్తకాలం మ్రాన్పడి.. నెమ్మదిగా జారుకోసారు.
“ప్రతి ఒకడు ఈ ప్రపంచం మారిపోవాలని అనుకుంటాడే తప్ప, తను మారాలని ఎన్నడూ ఆలోచించడు” అంటూ వాపోయాడు ముకుందం.