[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
భానుమతిగారికి ‘అబ్లూటోఫోబియా’ ఉండేదా?
మనుషుల్లో చాలామందికి రకరకాల భయాలు ఉంటాయి. కొందరికి కొన్ని ఫోబియాలు ఉంటాయి. చాలామంది తమకు తెలియకుండానే అలాంటి భయాలతో జీవితం గడిపేస్తారు.
సుప్రసిద్ధ నటి భానుమతికి ‘అబ్లూటోఫోబియా’ ఉండేదా? అవుననే అన్నారు రచయిత శ్రీరంగం నారాయణ బాబు. భానుమతికి పెళ్ళి గాక ముందు ఆయన వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి పొరుగున ఉండేవారు. అసలింతకీ ‘అబ్లూటోఫోబియా’ అంటే ఏమిటి? ఈ ఫోబియా ఉన్నవారు స్నానం చేయాలన్నా, దుస్తులు ఉతకాలన్నా, ఇల్లు శుభ్రం చేయాలన్నా భయపడతారు.
శుభ్రత, పరిశుభ్రత అనేవి ఆధునిక ప్రపంచంలో తప్పనిసరిగా పాటించవలసిన కనీస విధులు. ఎవరైన అపరిశుభ్రంగా కనిపించడం లేదా ఒకరి శరీరం నుంచి చెడు వాసన రావడం వంటివి సమాజానికి ఆమోదనీయం కాదు. అలాంటిది భానుమతిగారికి ఓ భయం… భయం అనేకన్నా ‘అయిష్టత’ అనడం సరైనదేమో… ఉందనడం నమ్మశక్యం కాదు. ఇది నారాయణ బాబు గారి అనుభవం. దాన్ని నా మాటలలో చెబుతాను…
నారాయణ బాబు గారి ఇల్లు మద్రాసులోని శ్రీపురం వీధిలో ఉండేది. కాంచనమాల, టంగుటూరి సూర్యకుమారి కూడా ఆ రోజుల్లో ఆ వీధిలోనే ఉండేవారు. ఆయన స్నేహితుడు సత్యం గారికి వాళ్ళంతా తెలుసు. ఆయన ఒక సాంఘిక చిత్రం తీద్దామనుకున్నారు. నారాయణ బాబు వ్రాసిన కథ ఆయనకు నచ్చింది. భానుమతి పొరుగునే ఉంటారు కాబట్టి ఆ కథని ఆమెకు వినిపించమని సత్యంగారు ఒత్తిడి చేశారు. చివరికి ఓ రోజు ఉదయం 10 గంటలకి భానుమతి ఇంటికి వెళ్ళారు. ఓ ముసలాయన మంచం మీద పడుకుని ఉన్నారు. సత్యం నారాయణ బాబును పరిచయం చేసి, కథ వినిపించడానికి వచ్చామని అన్నారు. భానుమతి తండ్రి దగ్గుతూ, తనకు ఒంట్లో బాలేదని చెప్పారట. ఇంతలో లోపల్నించి “సత్యం గారు, కాసేపు ఆగండి. వస్తున్నా” అంటూ కోకిల స్వరంలో మాటలు వినవచ్చాయి. బయటికి వచ్చిన యువతిని చూసి నారాయణ బాబు విస్తుపోయారట. ఆ అమ్మాయి ఖద్దరు వోణీ, ఖద్దరు జాకెటు ధరించి ఉంది. ఆమె వేసుకున్న జాకెట్టు చేతుల మీదకి మూడువంతుల వరకు ఉందట. సినిమా పరిశ్రమలో పనిచేసే యువతి – ఇంట్లో ఉన్నప్పుడు -ఇలా – పెద్దవాళ్ళలా దుస్తులు ధరిస్తుందని వారు ఊహించలేదు. నేల మీద గోడకి ఆనుకుని వాళ్ళకెదురుగా కూర్చున్నారట ఆవిడ. ఓ ముసలమ్మలా, పిల్లల తల్లిగా ఆమె కూర్చున్న విధానం చూసి నారాయణ బాబు ఆశ్చర్యపోయారట. ఆమె నుదురంతా పట్టేలా పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్నారట. అప్పటికే కొన్ని సినిమాలలో నటించినా, వాళ్ళింట్లో వాళ్ళు ఇంకా కుర్చీలు కొనలేదులా ఉందనుకున్నారు నారాయణ బాబు. అందరూ కింద కూర్చున్నారు. ఓ సినీ నటి ఇలాగే ఉంటుందా? ఆమె ఏ ఆభరణాలు ధరించలేదు. ఆవిడ బోసి మెడ, బోసి చేతులు, బోసి చెవులు… చూసి నోరు తెరిచారట. ఆవిడ ఒక టీనేజర్‍లా కూడా అనిపించలేదట. ఆవిడ సూటిగా ఆయన కళ్ళలోకి చూసి, “మీరేనా నారాయణ బాబు? మీ కథ నాకు వినిపించరూ?” అన్నారట. నారాయణ బాబు ప్రారంభించే లోపు వీధిలో గట్టిగా హారన్ కొడ్తూ ఓ వ్యాన్ వస్తూ కనిపించింది. ఆ వ్యాన్ మీద స్టార్ కంబైన్స్ వారి బ్యానర్ ఉంది. అది చూసి, ఆవిడ లేడిలా చెంగున లేచి, నవ్వుతూ… “కుక్కల బండి వచ్చింది. నేను వెళ్ళాలి. రోజూ ఉదయం 10 గంటల వరకూ నాకు షూటింగులు ఉండవు. మీరు నాకు పొరుగునే ఉంటారు కాబట్టి ఆ లోపు వచ్చి కథ చెప్పవచ్చు” అన్నారట. ఆ వ్యాన్‌లో వచ్చిన ప్రొడక్షన్ మనిషి తమిళంలో మాట్లాడుతూ వెంటనే షూటింగ్‍కి రావాలని చెప్పారు. ఆమె లేడిలా పరిగెత్తి, వ్యాన్ ఎక్కేసారు. పరదా పద్ధతిలో వలె ఆ వ్యాన్‍కి తెరలున్నాయి. ఆమె తెరలను దించగానే, వ్యాన్ బయల్దేరిపోయింది. ఆమె షూటింగ్‌కి అలా ఓ ముసలామెలా, ఖద్దరు దుస్తులలో వెళ్ళడం చూసి ఆయన విస్తుపోయారట. ఆయనా, మిత్రుడు సత్యం, భానుమతి ఇంట్లోంచి బయటకొచ్చేసారు. సత్యం తన ఇంటివైపు వెళ్ళిపోయారు. నారాయణ బాబు నడుస్తున్నారట. ఇంతలో ఆయన భుజంపై ఓ చేయి పడింది. మరో చేయి ఆయన జేబులోకి! “సిగరెట్లున్నాయా?” అని అడిగాడట ఆ వ్యక్తి. నారాయణ బాబుకి చిరాకు కలిగిందట.. జేబులో కొన్ని బీడీలు తప్ప ఇంకేం లేవని సమాధానం చెప్పారట. “అయినా మీరెవరు?” అడిగారట. ఆ అపరిచితుడు తెలివితక్కువ మనిషిలా, లావుపాటి మందమతిలా అనిపించారట. బదులుగా “నటుడు అద్దంకి శ్రీరామమూర్తి కూడా నన్ను ఇలా అడగలేదు” అన్నారట ఆయన. తన పేరు వెంకటేశ్వర్లు అని చెప్పారట. తాను భానుమతి తండ్రికి దూరపు చుట్టానని చెప్పారట. “నువ్వు మంచివాడివి కాదని మా ఇంట్లో చెబితే, నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టలేవు” అని బెదిరించారట. వెంటనే తన జేబులోని బీడీలన్నీ తీసిచ్చేసారట నారాయణ బాబు. సినిమా రంగంలో రచయిత కావడానికి ఏమేం చేయాల్సొస్తోందనని బాధపడ్డారట! ఆరోజు నుంచి భానుమతి ఇంటికి తరచూ వెళ్ళసాగారట. కథ చెప్పాలని మొదలుపెడితే, వారి సంభాషణ ఎటో మళ్ళేదిట. నవ్వుతూ ఉండేవారన్నా, నవ్వించే వారన్నా ఆమెకు ఇష్టమని ఆయన గ్రహించారట (విషయాంతరమైనా… నాక్కూడా నవ్వుతూ ఉండేవాళ్ళన్నా, నవ్వించే వాళ్ళన్నా బాగా ఇష్టం… ఇప్పటికి కూడా… అది నా బలహీనత. నాలాగే భానుమతి గారికి కూడా అని తెలిసి… కాదు కాదు భానుమతి లానే నాక్కూడా అనిపించి సంతోషం కలిగింది). కథలలో హాస్యమంటే ఆవిడకి ఇష్టం. ఆమెకి అభిమాన రచయిత విశ్వనాథ సత్యనారాయణ అని చెప్పారట. ఆమె వగలాడి కాదు కానీ, ఆకర్షణీయంగా మాట్లాడగలరు. ఆవిడ కుటుంబానికి నారాయణ బాబు నచ్చారు. తమలో ఒకడిగా భావించారు. ఎప్పుడొచ్చినా ఆత్మీయంగా స్వాగతం చెప్పేవారట.
ఒకరోజు ఆయన ఆలస్యంగా వెళ్ళారట. పది గంటలు దాటింది. ‘పోన్లే ఈ రోజు భానుమతి చెల్లెలి పాటలు వినచ్చు’ అనుకున్నారట. భానుమతి కన్నా ఆమె చెల్లెలి గొంతు బావుంటుందనేది నారాయణ బాబు నమ్మకం. అయితే సినీతార కాకపోయినా, గాయని అయ్యే రాత కూడా ఆమె నుదుటిపై లేదులా ఉంది. బయట అప్పటికే ప్రొడక్షన్ వ్యాన్ సిద్ధంగా ఉంది. హాల్లోకి ప్రవేశించారట… అక్కడ ఏమీ లేదు. ఏ ఫర్నీచరు లేని పల్లెటూళ్ళ ఇల్లులా అనిపించిదట… భానుమతి అమ్మగారు ఆవిడ మీద అరుస్తున్నారట “ఇదేం గోలే… వారమైంది నువ్వు స్నానం చేసి! ఇది వేసవికాలం, స్టూడియోలో వేసుకునే ఆ మేకప్‌తో చెమట పట్టి కంపుగొడతావే! స్నానం చెయ్యడమంటే నీకు రోత! కనీసం స్పాంజ్‌తో తుడుచుకోవచ్చుగా? ఛీ… ఛీ… ఛీ… ఏం పిల్లవే… మీ నాన్నమో సద్బ్రాహ్మణుడు. నీ సంగతి తెలిస్తే, అగ్నిపర్వతంలా విరుచుకుపడతారు. నువ్వేమయినా చిన్నపిల్లవా, నాలుగు తగిలించి స్నానం చేయించడానికి? ఇప్పుడే నిర్ణయించుకున్నాను… ఇక నుంచీ నువ్వు స్నానం చేస్తేనే నీకు అన్నం పెడతాను…” అంటూ. “అన్నమైనా మానేస్తాను గానీ స్నానం చెయ్యను… ఈ రోజు నుంచి స్టూడియోలో తింటాలే…” అంటూ భానుమతి కోపంగా బయటకి వచ్చి, నారాయణ బాబును చూసి సిగ్గుపడి, ఆయనతో ఏం మాట్లాడకుండా వ్యాన్ ఎక్కేసారట. వాళ్ళమ్మగారు బయటకు వచ్చి, “దానికేం కథలు చెబుతున్నావయ్యా? స్నానం చెయ్యమని నచ్చజెప్పవయ్యా… వారం రోజుల్నుంచి స్నానం చెయ్యలేదు… దాని ప్రవర్తనతో విసుగొస్తోంది…” అన్నారట. సరేనని చెప్పి, “మీ చిన్నమ్మాయి ఉందా?” అన్నారట. ఆమె కూడా ఇంట్లో లేకపోయేసరికి బయటకొచ్చారట నారాయణ బాబు. మళ్ళీ భుజాల మీద చెయ్యి పడింది. “అరే భాయ్! ఈరోజు నాకు సిగరెట్లు ఇవ్వాల్సిందే… లేదా కొనివ్వు…” అన్నారట వెంకటేశ్వర్లు. వీధి చివర ఓ కొట్లోంచి సిగరెట్లు కొనిచ్చి అతనిని వదిలించుకున్నారట.
ఒక రోజు కాస్త ముందే వెళ్ళారట నారాయణ బాబు. భానుమతి ఎదురొచ్చి పలకరించి, లోపలికి తీసుకువెళ్ళారట. మరుసటి రోజు నుంచి మూడు రోజుల వరకూ షూటింగ్ లేదని నవ్వుతూ చెప్పారట. ఆయన కథలు వినడానికి ఎంతో తీరిక ఉందని అన్నారట. ఆ తరువాతి మూడు రోజులు నవ్వులతో, చక్కని భోజనంతో, ఎన్నో కప్పుల కాఫీతో గడిచిపోయాయట! భానుమతి తన సహజ ప్రవర్తనతో, మాటల్లో చలాకీగా ఉన్నారట.
నాల్గవ రోజున తన ఇంట్లో కాఫీ పొడి అయిపోవడంతో, కాస్త కాఫీ పొడి చేబదులు తీసుకునేందుకు భానుమతి ఇంటికి వెళ్ళారట నారాయణ బాబు. ఆయన వెళ్ళేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉందట. భానుమతి తండ్రి నిప్పులు కక్కుతున్నారట – “ఈ వెధవ అనాచారపు ఇంట్లో నేనుండను. మీ ఖర్మ మీది. అనుభవించండి” అని చెప్పి బయటకి వెళ్ళిపోయారట. ఆమె అమ్మగారు “ఛీ ఎంత తప్పు మాట. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? లోకంలో ఇంతమందిని ఆడపిల్లలని చూశాను. ఎవరూ ఇలా లేరు. ఇదేం పాడు పీడ మాకు” అన్నారట. భానుమతి చెల్లెలు తల వంచుకుని కూర్చున్నారు, ఆమె ముఖం నెత్తురు చుక్క లేదట! వెంకటేశ్వర్లు నేల మీద తల వంచుకుని కూర్చున్నారు, ప్రపంచం అంతమైపోయినట్టుగా. భానుమతి ఇల్లు విడిచి వెళ్ళిపోయి రామకృష్ట అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్నారని నారాయణ బాబుకి తెలిసింది (ఆ సమయంలో ఆమె ‘కృష్ణ ప్రేమ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాకి ఆయన సహాయ దర్శకులు. ఆవిడ తన ఆత్మకథలో ఈ పెళ్ళి గురించి వివరంగా రాశారు). బాధను వ్యక్తం చేస్తూ మాట్లాడిన వెంకటేశ్వర్లు… “దానికి స్నానం చెయ్యడమంటే ఇష్టం ఉండదు. మేం బ్రాహ్మణులం, ‘మడి, తడి’ పాటించేవాళ్ళం… మాకెంతో ఇబ్బందిగా ఉండేది. దాన్నయినా భరిస్తాం గానీ, అది లేచిపోయి… ఎవర్నో పెళ్ళి చేసుకుంది…” అన్నారు. ఆ కుటుంబమంతా బాధలో ఉండడం గమనించి నారాయణ బాబు కాఫీ పొడి అడగకుండానే వెనుదిరిగారట.
ఎందుకు కొందరికి నీళ్ళంటే అసహ్యమో అని ఆలోచించారట. కొందరికి కాలిన అగ్గిపుల్లలంటే అసహ్యం (దీన్ని నేనూ నమ్ముతాను…. ఎందుకంటే తల మీద కాకుండా మరెక్కడయినా వెంట్రుకలు కనబడితే నాకు నచ్చదు). ‘పాపం భానుమతి’ అనుకున్నారాయన. ఆమె ఎన్నడూ విలాసంగా లేరు, డబ్బు కోసం గానీ, బంగారం కోసం గానీ ప్రాకులాడలేదు. అందంగా కనబడడానికీ ప్రయత్నించలేదు. ఇరుగుపొరుగు ఇళ్ళకి వెళ్ళలేదు. తినడానికి ఇంట్లో వాళ్ళు రాళ్ళు పెట్టినా, ఏ ఫిర్యాదు చేయక, పాయసంలా తినేవారు. బాగా సంపన్నుడికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. కానీ ఆమె ధనానికి పేదవాడైనా, మంచితనంలోనూ, బుద్ధిలోనూ గొప్పవాడిని ఎంచుకుని పెళ్ళి చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేస్తామన్నప్పుడు ఆమె పెట్టిన ఒకే ఒక షరతు పెళ్ళికొడుకు బ్రాహ్మణుడై ఉండాలని. కానీ నిజంగా పెళ్ళి చేసుకునే సమయం వచ్చినప్పుడు ఆమె ఓ వ్యక్తిని ఎంచుకుని, ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ కుటుంబం ఒంగోలుకి వెళ్ళిపోయింది. వెంకటేశ్వర్లు జాడ కూడా తెలియలేదు. పిమ్మట ఆ కుటుంబం గురించీ ఎవరికీ ఏమీ తెలియలేదు.
ఒకరోజు నారాయణ బాబు పేరిట ఆంధ్రప్రభ ఆఫీసుకి ఒక ఉత్తరం వచ్చింది. ఆ సంపాదకులు, ఆ ఉత్తరాన్ని నారాయణ బాబుకు అందజేశారు. ఆ ఉత్తరం రాసింది వెంకటేశ్వర్లు. బర్మా నుంచి రాశారట. “నేను బావున్నాను” అని చెప్పి “భానుమతి ఎలా ఉంది?” అని ఉత్తరంలో అడిగారట. నారాయణ బాబు ఆ ఉత్తరానికి జవాబు రాస్తూ “ఆవిడ బానే వుంది. ఈ మధ్యే నీళ్ళు పోసుకుంది” అని రాశారట. నీళ్ళు పోసుకుంది అంటే ఆయన ఉద్దేశం గర్భం దాల్చారని. దానికి వెంకటేశ్వర్లు జవాబు రాస్తూ… “భానుమతి నీళ్ళు పోసుకుందంటే నేను చచ్చినా నమ్మను. స్నానం అంటే పడడు ఆమెకు” అన్నారట.
తాను నవ్వలేక చచ్చానని నారాయణ బాబు నాతో అన్నారు (నేనూ కూడా నవ్వలేక చచ్చా… ఇది రాస్తుంటే).
***
గమనిక:
రామకృష్ణ ఓ బడిపంతులు గారి అబ్బాయి. బందరులో జన్మించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కాలేజీ చదువులు పూర్తి చేయలేకపోయారు. ఆయిన ఆయన ఆసక్తి లలిత కళలపై ఉండడంతో, సినిమాల పట్ల ఆకర్షితులయ్యారు. వేల్ పిక్చర్స్ వారి పి.వి.దాసు గారిని కలిశారు. శ్రీధర్ అనే బంధువు సాయంతో రామకృష్ణ ఆ స్టూడియోలో సౌండ్ ఇంజనీరింగ్ విభాగంలో చేరారు. తరువాత ఆయన విభాగం మారి, హెచ్.ఎం.రెడ్డి గారి బృందంతో దర్శకత్వ విభాగంలో చేరి ‘మాతృభూమి’ సినిమాకి పని చేశారు. ఎడిటర్ రాజన్ వద్ద ఎడిటింగ్‌లో నైపుణ్యం పొందారు. తన తమిళ స్నేహితుడు హెచ్.వి.బాబుకు ఆయన తీసే తెలుగు సినిమాల సంభాషణ విషయంలో సాయం చేశారు. హెచ్.వి.బాబు దర్శకత్వంలో తీసిన ‘కృష్ణ ప్రేమ’ చిత్రం షూటింగ్‍లో భానుమతిని కలిశారు. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్. పైగా అప్పటికే పెద్ద స్టార్! అయితే ప్రేమకి హద్దులు లేవని అన్నట్లుగా, వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్ని రోజులకి ‘కృష్ణ ప్రేమ’ కాస్తా ‘రామకృష్ణ ప్రేమ’గా మారింది. ఆ తరువాత భానుమతి కుటుంబం అభ్యంతరాలు చెప్పినప్పటికీ, ఈ జంట పెళ్ళి చేసుకుని ఒకటయ్యారు. 1945లో వీరికో బాబు జన్మించాడు. అతనికి భరణి అని పేరు పెట్టారు.
భౌతికంగా మరణించి, కళలో నిలిచిన నటి రాజసులోచన:
కళాకారులు భౌతికంగా జీవించి, మరణించినా, వారి కళారూపం శాశ్వతమై, వారి కీర్తి ప్రతిష్ఠలను చిరకాలం నిలిచేలా చేస్తుంది. భౌతికంగా మనకి దూరమైనా, నాట్యం ద్వారా, సినిమాల ద్వారా గుర్తుండే నటి రాజసులోచన.
రాజసులోచన తండ్రి పేరు భక్తవత్సలం నాయుడు, తల్లి దేవకి అమ్మాళ్. ‘పిళ్ళారచెట్టి భక్తవత్సలం నాయుడు రాజీవలోచన’ (ఆమె అసలు పేరు) అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రాలోని బెజవాడలో (ఇప్పటి విజయవాడ) తమ మేనమామ ఇంట 15 ఆగస్టు 1934 నాడు జన్మించారు. ఆమె తండ్రి మద్రాస్ అండ్ సదరన్ మరాట్టా రైల్వే (ఎం అండ్ ఎస్.ఎం.)లో సీనియర్ అధికారి (బ్రిటీషు పాలనలో, భారతదేశంలోని రైల్వేలన్నీ బ్రిటన్‍లో నమోదయిన ఇంగ్లీషు కంపెనీల ఆధీనంలో ఉండేవి. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా, మన ప్రభుత్వం రైల్వేలని జాతీయం చేసింది. ఆ తరువాత సదరన్ రైల్వే ఏర్పడింది). వాళ్ళ నాన్నగారు ఎం అండ్ ఎస్.ఎం. జనరల్ మేనేజర్‍కి పి.ఎ.గా ప్రమోట్ అవడంతో, వారి కుటుంబం మద్రాసుకు చేరి, ట్రిప్లికేన్‍లో స్థిరపడింది.
ఇక్కడ అధికారులు ఆమె పేరును రాజసులోచనగా నమోదు చేశారు! అంతే, ఆమె ఇప్పటి వరకూ అదే పేరుతో కొనసాగారు. రాజసులోచన ట్రిప్లికేన్‍లోని సియస్‍ఎం స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభించి, అయిదవ తరగతి వరకు ఆ పాఠశాల లోనే చదివారు. ఆరో తరగతి నుంచి నేషనల్ గరల్స్ హైస్కూల్‍లో చేరారు. అక్కడ బోధనా మాధ్యమం తమిళం. సూల్లో చదివేడప్పుడు నాటకాలు ప్రదర్శించాలని ఎంతగానో కోరుకునేవారామె. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోరేమోనని సంశయం. ఆమె అనుకున్నట్టుగానే అమ్మానాన్నలు అంగీకరించలేదు. బదులుగా సంగీతం నేర్చుకోమని శాసించారు. ఆమెకి సంగీతమన్నా, చదువన్నా ఆసక్తి కలగలేదు. ఆమె ధైర్యం చేసి, తాను భరతనాట్యం నేర్చుకోవాలనుకుంటున్నట్టు తల్లిదండ్రులకు చెప్పారు. గత్యంతరం లేక, ఆమె తల్లిదండ్రులు 1947లో ఆమెను సరస్వతి గాన నిలయంలో నాట్యం నేర్చుకోడానికి చేర్పించారు. నాట్యమంటే బాగా ఆసక్తి ఉండడంతో, రెండేళ్ళలో పూర్తిగా నేర్చుకుని ఫస్టు క్లాసులో పాసయ్యారు. ఆమె అరంగేట్రం 18 జూన్ 1949 నాడు జరిగింది. ఆ సమయంలో మద్రాసు హైకోర్టులో ప్రసిద్ధ న్యాయవాది అయిన టి.ఎల్. వెంకట్రామ అయ్యంగారు… ఆమెను గొప్ప నాట్యకళాకారిణి అవుతావని ఆశీర్వదించారు (టి.ఎల్. వెంకట్రామ అయ్యంగారు – విద్యాశంకర్, డి.కె. పట్టమ్మాళ్, కల్పగం స్వామినాథన్, ఎస్. శ్రీనివాస రావు, కనకమ్మ శర్మ వంటి వారికి సంగీతంలో శిక్షణ నిచ్చారు. ఏప్రిల్ 1928లో, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ విద్యావేత్తలను, సుప్రసిధ్ధ సంగీత కళాకారులతోనూ ఒక ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించింది. సరైన, ఆధునిక పద్ధతులలో సంగీత విద్యను కొనసాగించడానికి అకాడమీకి సాంకేతిక సలహా లివ్వడం ఈ కమిటీ బాధ్యత. టి.ఎల్. వెంకట్రామ అయ్యంగారు ఈ కమిటీలో సభ్యులు. మద్రాస్ మ్యూజిక అకాడమీ మూడవ అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు). అరంగేట్రం తర్వాత ఆమెకి విద్యాభ్యాసమంటే ఆసక్తి పూర్తిగా పోయింది, బడికి వెళ్ళడం మానేశారు. శాస్త్రీయ నృత్యంతో పాటు, రాజగోపాల్ అనే వ్యక్తి వద్ద పాశ్చాత్య నృత్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత, నాట్యం నేర్చుకోడానికి వచ్చే విద్యార్థులకు తమ ఇంటివద్ద నృత్య శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. మద్రాసులోని ఆర్మేనియన్ రోడ్డులో ఒక అమ్మాయి ఉండేది. రాజసులోచన వాళ్ళింటికి నడుచుకుంటూ వెళ్ళి నాట్యం నేర్పించేవారు. ఒకరోజు ఆమెను పరమశివం అనే వ్యక్తి చూశారు. ఆయన కొద్ది కాలం పాటు తాత్కాలికంగా సైన్యంలో పని చేసి, తర్వాత ప్రగతి స్టూడియోలో స్టోర్ కీపర్‍గా చేరారట. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు, పెద్దలకీ విషయం తెలిపారు. ఆయన పెద్దగా నచ్చకపోయినా వారి వివాహానికి ఆమె తల్లిదండ్రులు అంగీరించారు. డి.ఎం.కె. పార్టీ ఆలోచనా విధానంలో వారి వివాహం జరిగింది. పురోహితుడు లేడు, మంత్రాలు లేవు. వారికి హిందూ మత ఆచారాల పట్ల విశ్వాసం లేదు. ఇద్దరూ దండలు మార్చుకోడంతోనే వారి పెళ్ళి పూర్తయింది. ఇటువంటి వివాహాలకు పార్టీలోని ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. రాజసులోచన పెళ్ళికి ఎం. కరుణానిధి హాజరై దీవెనలు అందించారు.
ఆమెకి త్వరలోనే సినిమా అవకాశాలు వచ్చాయి. అందుకు సుప్రసిద్ధి కన్నడ రంగస్థల, సినీ దర్శకులు, హెచ్.ఎల్.ఎన్. సింహకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. కన్నడంలో ప్రముఖ నిర్మాత గుబ్బి వీరన్న తీసిన ‘గుణసాగరి’ (తమిళంలో ‘సత్యశోధనై’) చిత్రంతో ఆమె సినీరంగంలోకి ప్రవేశించారు. 1950లలో విడుదలనైన ‘పెన్నరసి’తో తమిళ చిత్రసీమలో ప్రవేశించారు. అదో కాస్ట్యూమ్ డ్రామా. ఎ.పి. నాగరాజన రచన, ఎం.ఎ.వేణు నిర్మాత, కె. సోము దర్శకత్వం. కోయంబత్తూరులోని సుప్రసిద్ధ సెంట్రల్ స్టూడియోలో చిత్రీకరించారా చిత్రాన్ని. ఆమె పాట, నాట్యం అందరినీ ఆకట్టుకుంది, ఆమె కీర్తి ప్రతిష్ఠలు చాలా దూరం వ్యాపించాయి. రాజసులోచన ఎన్నో భాషలలో వందలాది చిత్రాలలో నటించారు. అన్ని సినిమాలను ఇక్కడ పేర్కొనలేము కాని, చరిత్ర సృష్టించిన కొన్ని చిత్రాలను చెప్పుకోవచ్చు. కల్ట్ ఫిల్మ్ ‘పరాశక్తి’లో ఆమె హీరోయిన్‍గా ఎంపికయ్యారంటే చాలామంది నమ్మరు. కాని అప్పటికే గర్భం దాల్చడంతో, ఆ సినిమాను విరమించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఆ పాత్రకి తెలుగు నటి జూనియర్ శ్రీరంజనిని ఎంపికజేశారు.
విమర్శకులు, సినీ ప్రియుల అభిప్రాయంలో బాగా విజయవంతమైన రాజసులోచన చిత్రాలలో ముఖ్యమైనది, ఎస్.ఎస్. రాజేంద్రన్‍తో నటించిన ‘థయ్ పిరంధాల్ వళి పిరక్కుమ్’. ఈ సినిమాని తమిళ పండితుడు, నిర్మాత అయిన ఎ.కె. వేలన్ నిర్మించి దర్శకత్వం వహించారు. కె.వి. మహదేవన్ అందించిన అద్భుతమైన సంగీతంతో సినిమా ఘన విజయం సాధించింది. ‘అముదం తేనెం ఎథర్కి నీ అరుగినిల్ ఇరుక్కెయిలే’ పాట సూపర్ హిట్ అయింది, ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాని ‘మంచి మనసుకు మంచి రోజులు’ పేరుతో రీమేక్ చేశారు. కథానాయకుడిగా ఎన్.టి.రామారావు నటించారు. ఆ సినిమాకి ఆమె భర్త సి.యస్. రావు దర్శకత్వం వహించారు. రాజసులోచన దక్షిణ భారతదేశపు సూపర్ స్టార్స్… ఎం.జి. రామచంద్రన్, శివాజీ గణేశన్, ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కుమార్, ఎస్.ఎస్. రాజేంద్రన్, ఎ.పి. నాగరాజన్, ఎం.ఎన్. నంబియార్‍లతో నటించారు.
‘గులేబకావళి’, ‘వనంగాముడి’, ‘నల్లవన్ వాళవాన్’, ‘మాంగల్యం’, ‘రంగూన్ రాధా’, ‘పెన్నరసి’, ‘కావలై ఇళ్ళద మణితన్ మణితన్’, ‘ఎల్లం ఇంబ మాయం’ (అన్నీ తమిళ సినిమాలు); ‘పెళ్ళినాటి ప్రమాణాలు’, ‘రాజమకుటం’, ‘జయభేరి’, ‘శాంతినివాసం’, ‘మహాకవి కాళీదాసు’, ‘ఇద్దరు మిత్రులు’, ‘టైగర్ రాముడు’, ‘వాల్మీకి’, ‘తాత మనవడు’ (దర్శకులు దాసరి నారాయణ రావు తొలి చిత్రం, సూపర్ హిట్) (అన్నీ తెలుగు); ‘బేదర కన్నప్ప’, ‘వాల్మీకి’ (కన్నడ); ‘చోరీ చోరీ’ (హిందీ, రాజ్ కపూర్ – నర్గీస్ – ఎవిఎం సినిమా. ఇందులో ప్రముఖ హిందీ నటులు భగవాన్ సరసన నటించారు); ‘మనస్సాక్షి’ (మలయాళం) – చిత్రాలు ప్రస్తావించదగ్గవి. ఆమె నటించిన పలు భాషా చిత్రాలలో ఆమె స్వయంగా డైలాగులు చెప్పారు. ఇది ఆసక్తికరమైన విషయం… ముఖ్యం నేటి తరం హీరోయిన్‌లు గమనించాల్సిన అంశం.
వాస్తుశాస్త్రంలో అభినివేశం ఉండడంతో, మాడపాక్కంలో తమ ఇంటిని ఆమే స్వయంగా డిజైన్ చేసుకున్నారు. కాలేజీ చదువు చదవలేకపోయానన్నదే ఆమెకుండిన ఏకైక బాధ!
మొదటి భర్తతో విడిపోయి, ప్రముఖ దర్శకులు సి.ఎస్. రావును వివాహం చేసుకున్నారు. వారిద్దరి శ్రీ, దేవి అనే కవల కుమార్తెలు కలిగారు. దేవి చక్కని నృత్యకళాకారిణి. చెన్నైలో ఉంటారు. మరో కూతురు, కొడుకులు, మనుమలు అమెరికాలో ఉంటారు.
ఎన్నో అవార్డులు గెల్చుకున్న రాజ సులోచన ‘పుష్పాంజలి నృత్య కళాకేంద్రం’ పేరిట నాట్య శిక్షణాలయాన్ని 1961లో మద్రాసులో స్థాపించారు. 1986లో ఆ సంస్థ రజతోత్సవం జరుపుకుంది. కళాకారులు నశిస్తాయి, కళ కలకాలం ఉంటుంది. సినీనటులు విగతజీవులవుతారు. సినిమాలు నిలిచిపోతాయి. జీవితం చిన్నదే, కళ శాశ్వతమైనది.