ఇట్లు కరోనా-17

0
3

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

17

[dropcap]లా[/dropcap]క్‌డౌన్ సమయంలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందంటే ఎంత సంబరపడ్డానో తెలుసా.. ఆ ఆనందం ఎంతో కాలం నిలవ లేదు. అత్యాచారాలు ప్రబలిపోయాయ్. మానవ జాతి బతకాలంటే ముందు మహిళ బ్రతకాలన్న స్పృహ తెచ్చుకో, మగవాడు ఏం చేసినా ఒప్పేననే భావన నుండి బయటపడి మానవతను కాపాడుకో.

నేనున్న కాలంలో గమనించిన మరో అంశం సైబర్ నేరాలు. మోసగాళ్ళు, కేటుగాళ్ళు కొత్తగా పన్నుతున్న వలలు ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియా నెట్వర్క్‌లు. వ్యక్తిగత, సామాజిక వికాసం కోసం సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడ్తుందో ప్రైవసీని, సామాజిక వినాశనానికి, నైతిక విధ్వంసానికి కూడా అంతగానే దోహదం చేస్తుంది. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల మాటలకు లొంగిపోయి తమ జీవితాల్ని, కెరీర్‌ని నాశనం చేసుకుంటున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. ప్రేమ, పెళ్లి, బిజినెస్ భాగస్వామ్యం, సినిమాల్లో అవకాశాలు, వీసాలు, ఉద్యోగాల వంటి రకరకాల ఎరలతో వ్యక్తిగత వినాశక చర్యలకు అంకురార్పణ చేస్తున్నారు. అందుకే నా కాలంలో సోషల్ నెట్వర్క్ ఆధారిత నేరాల గురించిన అవగాహన కలిగించేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మహిళా భద్రతా విభాగం, సింబయాసిస్ లా కాలేజ్ వారి సహకారంతో CybHER కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక నెల రోజుల పాటు మహిళలని జాగృత పరచటం ద్వారా ఎన్నో నేరాల నుండి రాష్ట్రాన్ని రక్షించుకున్న వారయ్యారు.

నారదుడి మానస పుత్రులంటూ మీడియా వాళ్ళని పిలుస్తుంటారు కానీ, మానవాళి అత్యవసర గాత్రాలు వారని ఇన్నాళ్ళకి మీరు సంపూర్తిగా గుర్తించగలిగారు. ఈ కష్ట కాలంలో సమాచార చికిత్సతో మిమ్మల్ని మానసిక సన్నద్ధులుగా తయారు చేస్తూ అక్షర కవచాలతో బయోవార్‌ని భయం లేకుండా ఎదుర్కొన్న ఎంతో మంది జర్నలిస్టులు నా బారిన పడ్డారు. ఆర్థిక సహకారాన్ని హార్దికంగా అందిస్తూ బ్యాంకుల సిబ్బంది భారీగానే నాకు బలైనారు. ఇలాంటి unsung heros కాలగర్భంలో కలిసిపోయారు. వారినీ వారి వృత్తి ధర్మాన్నీ గౌరవిద్దాం.

ప్రపంచంలోనే అతి పెద్ద వైద్య కళాశాల క్యూబా లోనే ఉందని ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారుగా. ఇటలీ, జమైకాల్లో మరణాల రేటుని తగ్గించింది క్యూబానే అని తాటికాయలంత అక్షరాలతో రాసుకుంటున్నారుగా. ఆర్మీ ఆఫ్ వైట్ కోట్స్ అని ముద్దుగా పిల్చుకునే క్యూబా డాక్టర్లు ఇప్పుడు ప్రపంచానికి దేవుళ్ళు. కానీ ఇప్పటి డాక్టర్ల కర్మాగారంగా పిల్చుకునే క్యూబా ఒకప్పుడు డాక్టర్లే దొరక్క ఎంత ఇబ్బంది పడిందో మీకు తెల్సా. క్యూబా దేశాధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో, ఉద్యమ చైతన్య నేత్రం చేగువెరాల దీర్ఘదృష్టికి చిహ్నమే ఈ ఆర్మీ ఆఫ్ వైట్ కోట్స్. వైద్య సేవలు, వైద్యం చదువు క్యూబాలో ఉచితం. ప్రైవేట్ వైద్యం అంటూ ఉండదు. పాఠశాల నుండే వైద్యం నేర్పిస్తారు. పేద దేశాలకి ఉచితంగా వైద్యం అందించేది క్యూబానే. పశ్చిమ ఆసియా దేశాల్లో ఎబోలా వ్యాపించినప్పుడు ఆపన్న హస్తం అందించింది క్యూబానే. బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో చక్కటి ప్రతిభ కనబరుస్తూ శాత్రవేత్తల ఉత్పత్తికి బీజం వేసిన క్యూబాని ఇప్పటికైనా ప్రతిదేశం ఆదర్శంగా తీసుకోకపోతే భవిష్యత్తులో భారీమూల్యం చెల్లించక తప్పదన్నది గుర్తించాలి.

ఇక ఆరోగ్యకరమైన విషయాల్ని ముచ్చటిద్దాం.. ఆరోగ్యవంతులౌతారంటే చాలు విన్న ప్రతి దాని వెనకా పడుతుంటారు. అప్పుడెపుడో ఆయిల్ పుల్లింగ్ అంటే అదీ చేసారు. ప్రకృతి వైద్యం అంటూ మూడు ఆకులు, ఆరు కూరగాయ ముక్కలు తిని శరీరం ఎంత తేలిగ్గా ఉందో అని తెగ సంబర పడి, ఆనక ఆరు నెలలు మంచం పట్టారు. జామాకు, నేరేడాకు వేసి, రాగి చెంబులో నీళ్ళు పోసి తెల్లారి తాగితే మంచిదన్నారని, ఓ ఆర్నెల్లు చేస్తారు. ఆ తర్వాత వెన్న తినడం వల్ల కొవ్వు కరుగుతుందని, మటన్-చికెన్ తినాల్సిందేనని అంటే బాక్సులు పట్టుకొని మటన్ షాపుల ముందు క్యూ కడతారు. చిరంజీవులు కావాలంటే చిరుధాన్యాలు తప్పనిసరంటే, ధాన్యపు గింజల చుట్టూ చక్కర్లు కొడతారు. మట్టి పాత్రల్లో వంటలు మంచిదన్నారని ఇల్లంతా నింపేస్తారు. ఎవరో ఏదో చెప్తే చేసేస్తున్నారే గానీ, అసలు మీకేం కావాలో నిర్ణయించుకుంటున్నారా? ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కో రకంగా ఉంటుంది. అందరికీ అన్నీ సరిపడవ్ అన్నది మీకై మీరు గ్రహించరా?

అయినా హర్రీ, వర్రీ, కర్రీ లనే మూడింటి వల్లే కదా మీ మనిషి ఆరోగ్యం దెబ్బ తినేది. పరుగులతో పనులు చేస్తారు. ముందు టైమ్ సెన్స్ ఉంటే హర్రీ ఎందుకవుతుంది? అత్యాశ లేకపోతే వర్రీలో ఎందుకు పడతాం? ఇక కర్రీల విషయానికొస్తే జిహ్వ చాపల్యంతో అతిగా ఉప్పు, కారం, మసాలాలతో సుష్టుగా భోం చేస్తే, ఊబకాయంతో ఉసూరనకుండా ఉంటారా? నిజం చెప్పాలంటే ‘స్పర్ధయా వర్ధతే విద్యా’ అనుకుంటూ ఉండాలి కదా. ఆరోగ్యకరమైన పోటీ దేశాల మధ్య ఉండాలి కానీ, అవతలి వాడిని పడదోసి ఎదగాలని అనుకోకూడదు కదా. వ్యాక్సిన్ జాతీయ వాదం వెర్రి తలలు వేస్తుండడాన్ని నేను చూసాను. వ్యాక్సిన్‌ని రూపొందించి తొలి ఘనతను సాధించి జాతి గౌరవంగా డాన్ని ప్రతిపాదించాలని చూస్తున్న దేశాధినేతలు ఎందరో! ఇక్కడ నేను నీకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 1950-1960 ల్లో అంటువ్యాధుల నివారణలో పోలియో వ్యాక్సిన్ తయారీలో విశేష ప్రావీణ్యం ఉన్న ఛుమకోవ్ ఆధ్వర్యంలో అటు రష్యా, ఆల్బర్ట్ సబిన్ నేతృత్వంలో ఇటు అమెరికా పోటీ పడ్డాయ్. అమెరికన్ పరిశోధనా విభాగం ఒక ఫార్మా సంస్థ చేసిన తప్పిదం వల్ల సబిన్‌కి చెక్ పెట్టింది. ఛుమకోవ్ తన మిత్రుడైన సబిన్‌ను తమ దేశ ఆహ్వానంతో తమ పరిశోధనల్లో భాగం పంచుకొనేలా చేసాడు. ఈ ఇద్దరి సమష్టి కృషి వల్ల వచ్చిన పోలియో వ్యాక్సిన్‌ని ఛుమకోవ్, ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలా అయితే కరోనా వాక్సిన్‌ని తన కుమార్తెకే వేసి పరిశీలించాడో, తన పిల్లలకి అలాగే ఇచ్చి పరిశోధించాడు. ఛుమకోవ్‌కి అత్యంత ప్రతిష్ఠాకరమైన లెనిన్ అవార్డునిచ్చి గౌరవించింది సోవియట్ యూనియన్. సబిన్ సహకారంతోనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యి పోలియో వ్యాక్సిన్‌ని ప్రపంచానికి అందించగలిగానని, తమ దేశం సబిన్‌కి ఋణపడి ఉందని బహిరంగంగా ప్రకటించాడు ఛుమకోవ్. గొప్ప సత్యమేమిటో తెలుసా, సబిన్ పోలియో వ్యాక్సిన్ కి పేటెంట్ తీసుకోకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థకే సర్వహక్కులూ ఉండేలా రాసిచ్చి ప్రపంచంలోని ప్రతి పిల్లవాడికీ అతి తక్కువ ధరలో ఈ వ్యాక్సిన్ దొరకడానికి కారణం అయ్యాడు. చూసావా, ఇద్దరు మేధావుల మధ్య కలిగిన మిత్రత్వం ఎంత గొప్ప ఆవిష్కరణకు కారణమయ్యిందో. అలాంటి ఆరోగ్యకరమైన సహకారం, పోటీ తత్వం ఇప్పుడు కూడా అత్యవసరం.

మీకు తెలుసా… ప్రతీ మనిషికీ ఓ డిగ్రీ ఉంటుంది. అది మామూలే, కానీ ప్రతీ ఇంటికీ ఓ డిగ్రీ వచ్చేసిందనే సంగతి మీకు తెలుసా, అదే బియస్సీ డిగ్రీ. బి-అంటే బీ.పీ. యస్-అంటే షుగర్. సి-అంటే కొలెస్ట్రాల్. అసలు ఈ మూడూ లేని కుటుంబాన్ని మీరు చూడగలుగుతారా? ఎంత విషాదం ఇది! నిజానికి మీకున్నదల్లా జబ్బు కాదు, భయం. ఎక్కడ చస్తామో అన్న భయం. ఎవడు మూడు యాభైలు బతికేది? ఎంత బాగా బతికినా ఎప్పుడో అప్పుడు చావవలసిందే కదా. చావుని మించిన తెగింపు దేనిలో ఉంది? మీ భయాన్ని ఆసరా చేసుకునే కదా ఇన్ని ఆసుపత్రులు బతుకుతున్నాయి? హాస్పిటల్ అంటే జబ్బులు పోవాలి గానీ, డబ్బులు పోతున్నాయేంటీ! ఇది నువ్వు అంగీకరించిన వ్యవస్థేనా? నరకానికి నకళ్లుగా మారిన ఈ స్థితిని పునః సమీక్షిద్దాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here