కొడిగట్టిన దీపాలు-23

0
4

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 22వ భాగం. [/box]

45

[dropcap]‘సా[/dropcap]మాజిక అంశాల విషయంలో కూడా బాగులేదు. సమాజ పరిస్థితి కూడా అంత సంతోషజనకంగా లేదు. సమాజంలో అనేక మార్పులు. మార్పు అనేది ప్రకృతి సహజం. మార్పుకి లొంగనిది సృష్టిలో ఏదీ లేదు. ప్రతీది మారుతుంది. వృద్ధి క్షయలే మార్పులు.

ప్రకృతి అంతా ఒక వలయం. అందులో ఒక నిర్దిష్ట బిందువు నుంచి వృద్ధి ప్రారంభమవుతుంది. అది వలయపు ఉపరితల బిందువు వరకూ పెరుగుతుంది. అక్కడి నుండి క్షయం ప్రారంభమవుతుంది. తిరిగి ఆరంభ బిందువు వరకూ వచ్చి క్షీణిస్తుంది. అక్కడ అంతరిస్తుంది. అంటే నశిస్తుంది అని అర్థం కాదు. పరిణామం చెందుతుంది. మరో రూపం దరిస్తుంది.

ప్రకృతిలో ఏ పదార్థానికి నాశనం లేదు. మార్పు మాత్రమే ఉంటుంది. అంటే అది రూపం మార్చుకుంటుంది. ఉదాహరణగా తీసుకుంటే కర్ర కాలుతుంది. అది బొగ్గు అవుతుంది. ఆ బొగ్గు బూడిద అవుతుంది. క్రమంగా బూడిద మట్టి అవుతుంది. అలాగే నీరు ఆవిరి అవుతుంది. మేఘ రూపం దాల్చుతుంది. తిరిగి నీరు అవుతుంది. ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి నియమం. దీనిని పరిశీలించడమే కాని మార్చడం అసాధ్యం – అసంభవం.

ప్రకృతి లాగే సమాజంలో మనిషి జీవితం కూడా మారటం సహజం. అలాగే సమాజానికి కూడా మారటం సహజం. మనిషి జీవితంతో పోల్చినప్పుడు సమాజము ఆయువు అనంతం. పరిధి అనంతం. రూపం అనంతం. ప్రకృతి పదార్థాల్లో కనిపించినంత సులభంగా సామాజిక మార్పులు కనిపించవచ్చు. భౌతిక పరిణామాలు కనిపించవు.’ ఇవే మాటల్ని అంతకు మునుపు అనుకుంది. ఇప్పుడు అనుకుంటోంది.

‘ఇదేఁటి నా అలోచన అన్ని వేదాంత ధోరణిలో సాగిపోతున్నాయి’ అని అనుకున్న సుజాత తన పరిసరాలను ఓ పర్యాయం కలయ జూచింది. పరిసరాలలో ఏ మార్పు లేదు. తన ఆలోచనా విధానంలోనే మార్పు అని అనుకుంది. వద్దు అని అనుకున్న కొలదీ ఆమె మెదడు నిండా ఆలోచనా పరంపరలు. సమాజం, సమాజంలో మనుష్యుల తీరు తెన్నులు, అలవాట్లు, ఆచరణలు అన్నీ విషయాలూ ఆమె ఆలోచనలో వచ్చినవే.

ఒకప్పుడు సమాజంలో ఉన్న ఉమ్మడి కుటుంబాల గురించి తీసుకుంటే ఉమ్మడి కుటుంబాలు స్వపరిపాలనా సంస్థలు – వేరు కుటుంబాలు వచ్చిన తరువాతనే ఉమ్మడి అనే మాట వచ్చింది. అంతకు పూర్వం అది ఒక కుటుంబం మాత్రమే. పూర్వం కుటుంబంలో మూడు నాలుగు తరాలు కలిసి ఉండేవి. ఈ తరాలకి పై తరం వాడు యజమాని. ఆ తరంలో ఒకరు పెద్దవాడే యజమాని అవుతాడు.

యజమాని కుటుంబానికి ప్రభువులాంటి వాడు. మిగతా కుటుంబ సభ్యులు ప్రజల్లాంటి వారు. వీరందరూ యజమాని చెప్పిన విధంగా నడుచుకునేవారు. కుటుంబ ఆస్తులకి అతనే యజమాని, శుభ కార్యాలకు అతనే కర్త, ఇంటి కుటుంబ సభ్యులందరి బాగోగులు అతనే చూచుకునేవాడు. అయితే ఇప్పుడు ఉమ్మడి కుటంబాలెక్కడ? ఇప్పుడు అన్నీ భార్యా భర్త, ఇద్దరి పిల్లల్లో జీవితం గడుపుతున్న చిన్న చిన్న కుటుంబాలే.

ఉమ్మడి కుటుంబంలో కూడా అదే వ్యక్తికి స్వేచ్చ లేకపోవడం లోటుపాట్లు ఉన్నాయి. చిన్న కుటుంబాల్లో పెరిగిన పిల్లల పరిధి సీమితం. వాళ్ళు గిరిగీసుకుని వరిధిలోనే ఉండటం వలన ఒక్కొక్క పర్యాయం సంకుచిత మనస్కులుగా మారే అవకాశం ఉంది. స్వార్థపరులయ్యే అవకాశం ఉంది. అందరిలోనూ కలవలేరు.

ఉమ్మడి కుటుంబంలో వ్యక్తులు సులువుగా అందరితోనూ కలిసిపోగలరు. కుటుంబంలో పరస్పర సహకారం ఉంటుంది. అనుబంధాలు, ప్రేమలు ఉంటాయి. అన్నిటికీ మించి భద్రత ఉంటుంది. ఒక కుటుంబపు మంచి చెడ్డలు యజమాని మానవత మీద ఆధారపడ్డాయి. వ్యవస్థ ఎలాంటిదయినా మనిషి మానవత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది.

కుటుంబ వ్యవస్థను విడిచిపెడితే సమాజంలో సంప్రదాయాల గురించి కూడా మనం ఆలోచించాలి. ప్రతీ సమాజానికి కొన్ని అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలూ ఉంటాయి. అలవాట్లు స్థిరపడితే అచారాలవుతాయి. ఆచారాలు స్థిరపడితే సంప్రదాయాలవుతాయి. సమాజం సంప్రదాయాల బలం మీద జీవిస్తుంది. సంప్రదాయాన్ని, సమాజాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే సమాజంలో చోటు చేసుకున్న వెర్రి వెర్రి పోకడలా మన సంప్రదాయం అని అనుకుని బాధగా మూల్గుతుంది. మనస్సు. భాషను అరువు తెచ్చుకోవడమే కాకుండా మన భారతీయ సంప్రదాయానికి కూడా మనం తిలోదికాలిస్తున్నాం. కట్టూ, బొట్టూ విషయంలో కూడా మన భారత స్త్రీలు పాశ్చాత్య పోకడలకే పరిమితమవుతున్నారు.

సుజాత అలా కూర్చుని ఎంత సేపు ఆలోచిస్తోందో కాని వివిధ రకాల ఆలోచన్లు, వివిధ విషయాల ఆలోచన్లు ఆమె చుట్టురా ముసురుకుంటున్నాయి.

దేశంలో వచ్చిన మార్పులు ఆమెకి ఒకింత ఆవేదన కలిగిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో మనిషి చేసిన ప్రతీ పని వెనుక ఫలాపేక్ష భావన – స్వార్థపరత భావన అధికమవసాగాయి. వక్రమార్గం అనుసరించేనా డబ్బు గడించాలన్న భావనే అధికం. అందుకే పరవతి పలుకుబడి ఉన్న వాళ్ళందరూ వృద్ధాశ్రమాలు స్థాపించేస్తున్నారు. అనాథ ఆశ్రమాలు స్థాపించేస్తున్నారు. కార్పొరేటు స్కూళ్ళు, ప్రైవేటు పాఠశాలలు స్థాపించేస్తున్నారు. అనాథ ఆశ్రమాలను స్థాపించేము అంటూ అవతల దాతల నుండి చందాలు వసూలు చేస్తున్నారు. పాఠశాలలు స్థాపించినవారు ప్రభుత్వం నుండి రాయితీలు పొందుతున్నారు. నాలుగు డబ్బులు వెనకేసుకుని ఎలక్షన్ల సమయంలో ఖర్చు పెడ్తున్నారు.

మంచి ఆశయంలో అనాథల్ని – బాట తప్పిన బ్రతుకులు గల వాళ్ళని, పేదల్ని ఆదరించాలి. వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి అనే తపనతో నిస్వార్థ బుద్ధితో ఆశ్రమం స్థాపించిన సుజాతలాంటి వాళ్ళకి స్వార్థపరులైన అనాథ ఆశ్రమ స్థాపకులు తీరని మనస్తాపం కలిగిస్తున్నారు. వారు స్థాపించిన ఆశ్రమాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి.

మర్రి ఊడల్లా అవినీతి భూమి అడుగు పొరల్లోకి చాలా లోతుకి చొచ్చుకుపోయి పెకలించడానికి కూడా అసాధ్యంగా తయారవుతున్నా సుజాతమ్మ నిస్వార్థంతో పరోపకార పరచింతనతో ఏర్పాటు చేసిన అనాధ ఆశ్రమం గురించి అందరికీ తెలుసు. నిస్వార్థపరురాలైన ఆమె అంటే అందరికీ గౌరవమే. ఆమె స్థాపించిన అనాథ ఆశ్రమం రోజు రోజుకి అభివృద్ధి పథంలోకి దూసుకుపోతోంది.

మోహను కృష్ణకి మరో ఊరు బదిలీ అవడంతో కుటుంబాన్ని తీసుకుని మరో ఊరు వెళ్ళిపోయాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయి చదువుకుంటున్నారు.

ఇవతల సుజాత జీవితం చరమాంకంలో ప్రవేశిస్తోంది. ఆమెలో శక్తి రోజు రోజుకీ తగ్గిపోతోంది అనేకన్నా సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఆమె మారలేక పోతోంది. సమాజంలో మారుతున్న పరిస్థితులు ఆమెకు చిరాకు పరుస్తున్నాయి. ఒక విధంగా చూస్తే నిరాశా భావం ఆమెను క్రమ్ముకొస్తోంది. ఆమెను కృంగదీస్తోంది.

తొమ్మిది పదులు వయస్సు తనకి దాటిపోయాయి. ‘రేపో, నేడో మృత్యు ముఖంలోకి వెళ్ళివల్సిన దాన్ని, నాతోటి వాళ్ళు ఎందరో ఈ లోకం విడిచి వెళ్ళి ఉంటారు. తనది గట్టి ప్రాణం. ఆయుర్దాయం ఎక్కువ. అందుకే తను ఇంకా బ్రతికుంది’ అనుకుంది. రాజశేఖరం బ్రతికి ఉన్నాడో లేడో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా అతని గురించి తెలియలేదు.

ఎంతమంది చావులో తను చూసింది. ఎంత మందికో తన ఆధ్వర్యంలో దహన సంస్కారాలు కూడా అయ్యాయి. ఇంతమంది చావులు చూసిన తన మీద మృత్యు దేవత కన్నెత్తయినా చూడటం లేదు.

రాజశేఖరం తండ్రిని తను చూడకపోయినా అతని తల్లి చావు చూసింది. ఆ తరువాత తన తండ్రి చావు. పరంధామయ్య గారి దంపతుల మరణాలు, సీతమ్మ మరణం, శేషు మరణం, విశాలగుప్తా దంపతులు మరణం ఎలా ఎన్ని చావులు తను చూసిందో..

‘విశాలగుప్త దంపతులు జీవిత చరమాంకంలో ఆశ్రమంలోనే గడిపారు. ఇక్కడే ఇక్కడ మట్టిలోనే వారి జీవితాలు కడతేరాయి. విశాలగుప్తా తన ఇంటిని, దుకాణాన్ని కూడా కళ్యాణి పేర వ్రాసాడు. కళ్యాణ్, రాజేషన్లు అక్కడ పెద్ద నర్సింగ్ హోమ్ నిర్మించుకుని పిల్లల్లో ఏ పోరు పొచ్చలూ లేకుండా వారి జీవితం సాఫీగా సాగిపోతోంది. రాధ, మోహన్ కృష్ణ జీవితం బాగానే ఉంది. అయితే అశాంతిగా అసంతృప్తిగా మిగిలిపోయిన జీవితం తనదే.’ అనుకుని నిట్టూర్పు విడుస్తోంది సుజాతమ్మ.

స్వాతంత్ర్య రాక పూర్వం తమలో ఉండే సేవా గుణాన్ని – నిస్వార్థ భావాన్ని దేశ భక్తిని ఇప్పటి సమాజంలో మసలుతున్న మానవుల మనస్తత్వాల్ని సరిపోలుస్తూ బాధపడేది సుజాతమ్మ.

సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆవిడికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మధ్య దేశ రాజధానిలో మిక్కిలి హేయంగా ఓ యువతి మీద జరిగిన గ్యాంగు అత్యాచారమే కాకుండా, దేశంలో రోజు రోజుకీ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలూ, మానభంగాలూ ఆమెను కలవరపాటుకి గురిచేస్తున్నాయి.

ఆడదానికి సమాజంలోనూ, దేశంలోనూ భద్రత గౌరవం లేకుండా పోయాయి. ఆడది బజారులో దొరికే అంగడి బొమ్మగా చెలామణి అవుతోంది. ఆమెను సెక్సు సింబలుగా చూస్తున్నారు. చూపిస్తున్నారు. ఆడది ఆదిశక్తి – సృష్టికి ప్రతిమూర్తి అనే భావం విడిచిపెట్టి ఓ విలాస వస్తువుగా ఆడదాన్ని పరిగణిస్తున్నారు. సమాజంలో ఓ ఉన్నత స్థానం లేదు. చులకన భావం ఇలా అనుకుంటూ బాధపడేది సుజాతమ్మ.

కామాంధులు ముక్కు పచ్చలారని పసి పాపల్ని కూడా వదిలిపెట్టటం లేదు. ముసలి వాళ్ళను కూడా వదలటం లేదు. దాని కారణం ఏంటి సమాజంలో చోటు చేసుకున్న అశ్లీలత, చవకబారు సినిమాలూ.

ఏ భాష పాటలో తెలియని రణగొణ ధ్వనుల మధ్య పాడే పాటలూ – యువతను పెదవారిని పట్టిస్తున్న నేటి సినీమాలూ ఇవన్నీ యువతను హింసా మార్గం వేపు నడిపిస్తున్నాయి. అశ్లీల ద్వందార్థ మాటలు, పాటలు వీటి అన్నిటికీ ఆకర్షితులై వరసా వావి విడిచిపెట్టి ఆడదంటే చాలు అని అనుకుంటూ ఇలా మానభంగాలకి పాల్పడుతున్నారు.

దోపిడీలు – హత్యలు – మానభంగాలూ, ముఠా తగాదాలూ వీటి అన్నిటిలోనూ సమాజం కంపుకొడ్తోంది. ఇలాంటి సమాజంలో మానవత్వం ఉన్న మనిషి మనుగడ సాగించడం చాలా కష్టంగా ఉంది.

అయితే సుజాతమ్మ మనస్సులో ఆశమినుకు మినుకులాడ్తోంది. ఆమె ఆశ అదే ఏనాడేనా రాజశేఖరం తిరిగి వస్తాడు. తను శాశ్వతంగా కళ్ళు మూసుకునే లోపునే తను రాజశేఖరాన్ని చూడగలుగుతుంది. అతడ్ని చూచిన వెంటనే అతని గుండెల మీద తల ఆన్చి తను ఇన్నాళ్ళూ పడ్డ అలసటను పోగొట్టుకోవాలి. అతని సాంగత్యంలో సేద తీర్చుకోవాలి. తన శ్రమను మరిచిపోవాలి.

అతను వస్తాడు. తప్పకుండా వస్తాడు. వస్తాడన్న నమ్మకం తనకుంది. ఆ ఆశతోనే తను జీవిస్తోంది. తన జీవన యాత్ర సాగిస్తోంది.

“అమ్మా! ఉదయం నుండి అలా ఆలోచిస్తూనే కూర్చున్నారు. తిండి కూడా తినలేదు. రండమ్మా” అంటూ ఆశ్రమ వాసులు పిలిచారు. ఈ మధ్య ఆలోచనతోనే గడుపుతోంది.

“మీ ఆరోగ్యం సరిగా లేదు. బి.పి., షుగరు ఉన్నాయి. వేళకి తిండి తినాలి. టెన్సను పడకూడదు.” క్రొత్తగా ఆశ్రమంలోని రోగుల్ని చూడ్డానికి వచ్చిన శ్రీధర్ అన్నాడు. మోహను కృష్ణ స్థానంలో శ్రీధర్ వచ్చాడు.

46

ప్రపంచంలో ఏ పనిలోనేనా కష్టం ఉంటుంది. సుఖం ఉంటుంది. మానవ జీవితంలో ఈ కష్టాలు, ఆపదలు పరీక్షల్లాంటివి. అందుకే అన్నారు కష్టసుఖాలు, చిరునవ్వులు, కన్నీళ్ళతో కూడుకున్నదే మానవజన్మ అని. కష్టాలు అనుభవించిన తరువాత మనిషిలో నిశ్శృహ, నిరాశ పేరుకుపోతాయి. ఇటువంటి పరిస్థితిలో దేని మీదా ఆసక్తి అనేది ఉండే ఉండదు. తన జన్మ నిరర్ధకం అని అనిపిస్తుంది. వైరాగ్య భావం కలుగుతుంది. ఆ వైరాగ్యభావం క్షణికమే. వెను వెంటనే తన బాధ్యత – తను చేయవల్సిన పని, తన కర్తవ్యం గుర్తుకు వస్తాయి.

జర్నలిస్టు చైతన్యలో కలగా పులగంగా ఉన్న రకరకాల భావాలు. అన్ని పనుల్లో కష్టమైన జర్నలిస్టు పని మాత్రం చాలా కష్టం. అనేక సమస్యలకి సమాధానం వెతుక్కోవల్సి వస్తుంది. సమస్యలకి సమాధానం రాబట్టుకోవల్సిఈ జర్నలిస్టుగా అనేక ఆపదలు ఎదురవుతూ ఉంటాయి. శత్రువులు పెరుగుతారు. దాడులు జరుగుతాయి జర్నలిస్టుల మీద. అయినా జర్నలిస్టు తన పని నిర్వర్తించడంలో వెనకంజ వేయకూడదు. నేడు భ్రష్టు పట్టిపోయిన రాజకీయ వ్యవస్థను, సమాజంలోని పేరుకుపోయిన కుళ్ళుని సరిచేయడానికి జర్నలిష్టు ప్రయత్నిస్తాడు.

నేటి రాజకీయాలు స్వార్థపరంగా – హేయంగా – అసహ్యం కలిగే విధంగా మారిపోయాయి. నేడు రాజకీయాల్లో స్వార్థపరులే అందలం ఎక్కుతారు. పైసా ఖర్చుపెట్టి, రూపాయి సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు.

కళారంగంలో కోట్లకి కోట్లు సంపాదించి అవకాశాలు తగ్గిపోయిన తరువాత ప్రజాసేవ చేస్తాను అంటూ అలాగ కూడా కోట్లు సంపాదించాలన్న కోరిక గల కొంతమంది సినీ హీరోలు రాజకీయాల్లోకి దిగుతున్నారు. డబ్బుతోపాటు పరువు ప్రతిష్ఠ అధికారం కూడా వస్తుందని వాళ్ళ ఆలోచన.

పారిశ్రామిక వేత్తగా కోట్లకి పడగలెత్తి ఇంకా ప్రజాసేవ అనే ముసుగులో డబ్బు, అధికారం సంపాదించవచ్చు అన్న ఆలోచనతోనే కొంత పారిశ్రామిక వేత్తలు రాజకీయాలోకి అడుగుపెడుతున్నారు.

కార్పొరేటు విద్యా సంస్థలు నడుపుతూ రెండు చేతులారా డబ్బు సంపాదిస్తూ అక్రమంగా అయినా, సక్రమంగా అయినా డబ్బు సంపాదిస్తూ ఆ డబ్బుతో ఎలక్షన్లలో టికెట్టు సంపాదించి గెలిచిన తరువాత మరింత సంపాదించాలన్న తలంపు గల విద్యా సంస్థలు అధిపతులు.

వ్యాపార రంగంలో బాగా సంపాదించి ఉన్న సంపాదనతో తృప్తి పడక రాజకీయాల్లో దిగి ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచిన తరువాత పదవి సంపాదించి డబ్బు ఇంకా సంపాదించాలన్న ఉబలాటం గల వాళ్ళే అగుపడుగున్నారు. పైన చెప్పిన వాళ్ళందరూ కోట్లకి పడగలెత్తిన వాళ్ళే.

రూపాయి సంపాదించడానికి కూడా నానా హైరానపడిపోతూ నిస్వార్థ ప్రజా సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఎలక్షన్లలో నేటి రోజుల్లో కష్టం. ఎందుకంటే వీళ్ళ దగ్గర కోట్లు ఉండవు. ఎలక్షన్ల సమయంలో ఓటుకి డబ్బు వెదజల్లడానికి, మద్యం సరఫరా చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులుండవు.

అందుకే నేటి రాజకీయాలంటే తనకి అసహ్యం. జర్నలిస్టు కాబట్టి అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొవాలి. నేటి రాజకీయ నాయకులు క్షణ క్షణం రంగులు మార్చే ఊసరవెల్లులు. ఏ ఎండకా గొడుగు పట్టే స్వార్థపరులు. గంటకో చొక్కా మార్చిన విధంగా రోజుకో పార్టీ మారుస్తారు. ఏ పార్టీలోకి వెళ్తే తమ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచిస్తూ గోడ మీద కూర్చుని, అవకాశం వస్తే తమకు అనుకూలమైన పార్టీలోకి దూకడానికి సిద్ధంగా ఉండే గోడ మీద పిల్లులు అని అనుకుంటాడు చైతన్య.

పదవీ కాంక్ష మహా చెడ్డది. అది మానవుడ్ని అంధుడ్ని చేస్తుంది. వివేకాన్ని చంపిస్తుంది. అహం పెంచుతుంది. అధికార మదంతో చేయకూడని తప్పులు కూడా చేయిస్తుంది. ఎన్నో అరాచకాలు సృష్టిస్తారు. అమాయకుల్ని తమ అధికార మదంతో అణచి వేస్తారు ఈ నాయకులు.

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరు అవ్వాలని తరుచూ పోరాటాలు జరుగుతన్నాయి. చల్లారుతున్నాయి. అలాగే సెపరేట్ ఆంధ్ర ఉద్యమం వచ్చింది చల్లారింది. అలా ఉద్యమాలు వస్తూనే ఉన్నాయి చల్లారుతూనే ఉన్నాయి. కొంతమంది పదవులకి దూరమైన రాజకీయ నిరుద్యోగులందరూ అలా మాటిమాటికీ పోరాటం చేస్తున్నారు. కాని సఫలీకృతం అవలేకపోతున్నారు.

విభజన పోరాటం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. విభజన కూడా జరిగిపోయింది.

ఈ మధ్య ఎలక్షనులో పోటీ చేస్తున్న వాళ్ళ చరాస్తి, స్థిరాస్తులు డబ్బు, వెండి బంగారు నగల వివరాలు వింటూ ఉంటే ఇంత సిరిసంపదలు మన దేశంలో ముఖ్యంగా మన ప్రజా నాయకుల దగ్గర ఉందా అని ఆశ్చర్యం కలుగుతోంది.

వినోబా భావే భూదాన యజ్ఞం ఆరంభించి భూమి ఉన్న వాళ్ళ దగ్గర నుండి భూమిని సేకరించి, నిరుపేదలకి పంచిపెట్టి భూదానోద్యమం నడిపారని తను విన్నాడు. వినోబా భావే వంటి నిస్వార్థ ఉద్యమ నాయకులు ఇప్పుడు ఉండడం కష్టం. ఒకవేళ ఉంటే ఈ కోట్లకి పడగలెత్తిన ప్రజా సేవకుల నుండి కోట్లు వద్దు, లక్షలు వద్దు, వేలు వద్దు, వందలయినా పేదవాళ్ళకి ఇవ్వండి అని ఉద్యమం చేస్తే బాగుండునేమో అని అనిపిస్తుంది.

అయితే అలా జరగటం లేదు. ఎలక్షనులో నిలబడిన వాళ్ళు కొంతమంది తమ దగ్గరున్న డబ్బుతో మద్యం బాటిళ్ళకి, బిర్యానీ పేకట్లకి, ఓట్లు కొనడానికి ఖర్చు పెడ్తున్నారు. గెలిచిన తరువాత తాము ఖర్చు పెట్టిన దానికి పదింతలు సంపాదిస్తారు.

ఎలక్షన్లు ముందు అనేక సబ్సడీలు ప్రకటిస్తున్నారు. రుణ మాఫీ చేస్తామంటున్నారు. నిరుద్యోగ సమస్య తీరుస్తామంటున్నారు. నిరుద్యోగులకీ ఉద్యోగాలు ఇస్తామని హామీలిస్తున్నారు. ఒకవేళ గెలిచిన తరువాత ఈ హామీలు నెరవేరుస్తారు అనే భ్రమలో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఈ ప్రజా నాయకులు గెలిచిన తరువాత ప్రజలకిచ్చిన హామీలు గాలిలోకి వదిలేస్తున్నారు.

మరో విషయం ప్రజలకి ఈ ప్రజా నాయకులు ఎలక్షన్ల ముందు ఇలా హామీలు గుప్పిస్తున్నారు. ఒక వర్గానికి ఈ సబ్సిడీలు ప్రకటించడమంటే మరో వర్గాన్ని వంచించడమే. ప్రజా నాయకులు తమ జేబుల్లో నుండి రూపాయి తీసి ఖర్చు పెట్టారు. ఇదంతా ప్రజాధనమే. అందరికీ చెందిన డబ్బును ఒక వర్గానికి ఖర్చు పెట్టడమంటే మరో వర్గాన్ని వంచించడమే కదా! మరో విషయం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వెనకబడిన కులాలకి కొన్ని సంవత్సరాల వరకూ రిజర్వేషను సదుపాయం కలిగించేరు. దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే అయినది మరొకటి అయింది. ఓట్ల కోసం ఆ రిజర్వేషన్లు పొడిగిస్తూనే ఉన్నారు. దీని వలన అర్హులకి ఆ ఫలాలు అందటం లేదు. అనర్హులు ఆ ఫలాలు అనుభవిస్తూనే ఉన్నారు. చైతన్య ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి.

“చైతన్యా! ఏంటిరా నీ ఆలోచన్లు?” రాజయ్య అక్కడికి వచ్చి అన్నాడు.

“ఏఁ లేదు తాతయ్యా! అసలే నేను జర్నలిస్టుని కదా! నాకు ఎదురయిన అనుభవాలు గురించి ఆలోచిస్తున్నాను.” చైతన్య అన్నాడు.

“ఏంటో నీ జీవితం? నీ జీవితం నాకే అర్థం కాకుండా పోతోంది.” రాజయ్య దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here