వందేమాతరం-7

0
5

[box type=’note’ fontsize=’16’] భారత స్వాతంత్ర్యపోరాటం గురించి, పలు వైజ్ఞానికాంశాల గురించి నేటి బాలబాలికలకు ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]ని[/dropcap]ప్పులపై కాల్చిన ఎండుమిరపకాయలను గుడ్డతో తుడిచి మూకుడులో (నీటి బానపై పెట్టే మట్టి మూత) ఉంచి నలిపి, పెద్ద ఉల్లిపాయలు తరిగి చింతపడుగుజ్జు నీళ్లు బెల్లం కలిపిన ‘పచ్చిపులుసు’ను తలా కొద్దిగా వారి వారి మూకుడులో పోసి, తలా రెండు ముద్దల జొన్నసంగటి వేసింది. పూజారయ్య తలా కొంత నేయి వేసాడు.

“చంద్రయ్య అన్నా, కలక్టర్ దెబ్బతిన్న పులిలా పారిపోయాడు, ఈసారి జరగబోయే పోరాటమే మన ఆఖరి పోరాటం. మనపై వారు ఏ సమయం లోనైనా ఎటునుండైనా దాడి జరగవచ్చు. మనం సదా సిధ్ధంగా ఉండాలి” అన్నాడు శివయ్య.

“శివయ్య నేను ప్రతిసారి తూటాల కొరకు కొండ దిగి ఎక్కలేక ఇక్కడే కొండపైన రహస్య ప్రదేశంలో కొన్ని తూటాలు దాచి ఉంచాను. రాత్రి వాటిని తీసుకువచ్చాను. వాటిని ఇప్పుడు వాడుకుందాం!” అని తూటాలు శివయ్యకు అందించాడు చంద్రయ్య.

“అన్నా, వృధ్ధుడు అయిన పూజారయ్యను మన పోరాటంలో మినహాయిద్దాం! మన దగ్గర మొత్తం ముప్ఫై తూటాలు ఉన్నాయి. మనం అందరం కలసి ఆరుగురం ఉన్నాం. తూటాలు అందరికి పంచితే ప్రతి ఒక్కరికి అయిదు తూటాల వంతున వస్తాయి, మిగిలినది బాణాలు. వాటిని ఎంత ఎక్కువ సమకూర్చుకుంటే అంతమంచిది. అందరం బాణాలు తయారిలో ఉందాం! అమ్మి వరికూడు వండు, కూరాకు చేయి, మనకు బహుశా ఇదే చివరి భోజనం కావచ్చు” అన్నాడు వేదాంత ధోరణిలో శివయ్య.

మగవాళ్లంతా బాణాల తయారిలో నిమగ్నమై ఉండగా మధ్యాహ్నం భోజన ఏర్పాట్లలో మునిగిపోయింది సుగుణమ్మ.

శివయ్య ఊహించిన విధంగానే కలెక్టర్ మరునాడు తన సైనికులతో పాలెం చేరుకుని గుడారాలు వేసాడు. తన సైన్యాన్ని ఆరు విభాగాలుగా విభజించి కొండ పైకి వారందరిని మోహరించాడు.

కలెక్టర్ యుద్ధవ్యూహాన్ని చూసిన శివయ్య “చంద్రన్నా చూసావా కలెక్టర్ యుధ్ధ వ్యూహం, మెదటి సైనిక బృందం కాల్పులు జరిపిన వెంటనే రెండో సైనిక బృందం కాల్పులు జరుపుతారు. అలా మనం శ్వాస తీసుకోకుండా నిర్విరామంగా మనపై కాల్పులు జరుపుతూ, కొద్ది కొద్దిగా ఒక్కో బృందం ముందుకు జరుగుతూ, కొండ పైకి ఎక్కుతూ మన దగ్గరకు వస్తారు. గొప్పగా పధకం వేసాడు కలెక్టర్, మీరు ఎవ్వరు దాగి ఉన్నరాళ్లు, చెట్లనుండి వెలుపలకు రావద్దు. రావసివస్తే నేలపై పాకుతూ దాడి చేయండి” అంటూ తూటా ముట్టించి కొండకు చేరువగా ఉన్న సైనిక బృదంపైకి విసిరాడు. అది సైనికబృదం మధ్యలో పడింది పేలింది. తమపైన పడిన వస్తువు ఏమిటో తెలుసుకునే లోపు దాదాపు ఆ బృందంలోని వారంతా మరణించారు.

మరో తూటాను పెద్ద కొండరాతి కింద తూటా ఉంచి వత్తి ముట్టించి సురక్షిత ప్రదేశానికి చేరుకున్నాడు శివయ్య. తూటా పేలుడు ధాటికి దొర్లడం ప్రారంభించిన బండరాయి వేగంగా కొండ దిగువకు వెళుతూ పలువురి బ్రిటీష్ సైనికులపై దొర్లుకుంటూ వేగంగా వెళ్లి పోయింది. రాయి కింద పడి పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. అది చూసిన సైనికులు భయంతో పరుగులు తీయసాగారు.

శివయ్య తన వారితో కలసి సైనికులను అడవిమృగాల్లా తమ బాణాలతో వేటాడసాగారు. చివరిగా ఉన్న సైనికులు తమ తుపాకీలతో కాల్పులు జరుపగా, శివయ్య పక్షంలో ముగ్గురు నేలకు ఒరిగారు.

***

“బాలలు ఇక్కడ భారతదేశ స్వాతంత్ర్య పోరాట విషయాలు కొన్ని చెపుతాను” అన్న తాత…..

తెలుగునేలపై పోరాటాలలో ద్వారబంధాల రామచంద్రయ్య(1880), గాజులలక్ష్మి నరసశెట్టి (1868), అల్లూరి సీతారామరాజు, తుళువ బసవన్న (1924), ఉయ్యలవాడ నరసింహారెడ్డి, కిత్తూరు రాణి చెన్నమదేవి (1829)గోవిందస్వామి కృష్ణస్వామి(1933), ఐలమ్మ, కొమరయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, టంగుటూరిప్రకాశం, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, వావిలాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, అచంట రుక్మిణి, కడప కోటిరెడ్డి, సంజీవ రెడ్డి, కల్లూరి సుబ్బారావు, పొణకా కనకమ్మ, బెజవాడ గోపాలరెడ్డి, జానకిబాయమ్మ, గౌతులచ్చన్న, తుమ్మల సీతారామమూర్తి, గద్దే లింగయ్య, ముట్నూరి కృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, ముఖ్దుం మొహియుద్దీన్, కట్టమంచి రామలింగారెడ్డి, దామోదరం సంజీవయ్య, వరహగిరి వెంకటగిరి, మీర్ అక్బర్ అలీఖాన్, సంగెం లక్ష్మిబాయమ్మ, పద్మజా నాయుడు వంటి లక్షలాది ప్రజావాహిని స్వాతంత్ర్య పోరాటంలో నిస్వార్ధంగా పాల్గొన్నారు.

బాలలు మొదట స్వాతంత్ర్య పోరాటం జరిపిన కొందరు జాతీయ నాయకుల గురించి తెలుసుకుందాం! పోరాటం మనిషి జన్మహక్కు. మనిషి చేసే ప్రతి పోరాటం వెనుక ఒక ఆశయం ఉంటుంది. ఏది సాధించాలన్న పోరాటం ద్వారానే సాధ్యం అని మీరు ఎన్నడు మరువకండి.

తొలుత 1857లో స్వాతంత్ర సమరంలో మహిళల పాత్ర గురించి కొంత చెప్పుకొవాలి.

రాణి రుద్రమదేవి, విజయలక్ష్శి పండిట్, అవధూత్, రాణి బేగం హజ్రత్ మహల్ వంటి పలువురు మహిళలు 1857కు ముందే స్వాతంత్ర్య సమరానికి నాంది పలికారు. మరెందరో నారీమణులు చరిత్రకు అందని త్యాగధనులు శౌర్యశీలులు, సాహసవంతులు. వీరంతా మన పోరాటయోధులకు దారిదీపాలు అయ్యారు.

మహిళలు సమాజాన్ని జాగృతి పరచడంలో తమ వంతు స్వాతంత్ర్యపోరాటం, సాహిత్య పలురంగాలలో, సేవలు సమర్ధవంతంగా నిర్వహించిన వారి గురించి తెలుసుకుందాం!

1861 సెప్టెంబర్ 24న మేడమ్ కామా జన్మించింది. 1885ఆగస్టు 3న రుస్తుం కె.ఆర్.కామాతో వివాహం జరిగింది. కామా, దేశభక్తుడు. వీరసావార్కర్ మరికొందరు దేశభక్తులు కలసి మూడువన్నెల జండాను రూపొందించి, 1905లో బెర్లిన్ నగరంలో ఎగురవేశారు. తిరిగి 1907లో వంగదేశంలొ ఎగురవేశారు. 1909 మే 1న వందేమాతరం పత్రికను స్ధాపించారు ఈమె. అలుపు ఎరుగని నిరంతర పోరాటాలు జరిపి 1836 ఆగస్టు 13న భరతమాత ఒడిలో శాశ్వత నిద్రకు ఒరిగి పొయారు.

సరోజిని నాయుడు, ఈమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేవారు. దండి సత్యాగ్రహంలో గాంధిజీ వెంట ఈమె నడిచారు. ఆ సమయంలో, గాంధీ దంపతులను, అబ్బాస్ త్యాబ్జీని అరెస్టు చేసాక సత్యాగ్రహానికి ఈమె నేతృత్వం వహించారు. స్త్రీల స్వేచ్ఛా, విద్యావకాశాల కొరకు నిర్విరామ పోరాటం చేసారు. ప్రముఖ స్వాతంత్రోద్యమ యోధురాలు ఉషా మెహతా గాంధేయవాది. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో, కొన్నినెలలపాటు రహస్య రేడియో కార్యక్రమాలు నిర్వహించారు.

దేశం కోసం తమ సర్వస్వాన్ని, ప్రాణాలను అర్పించిన మహానీయులు ఎందరో. బీహార్ కేసరి కుపన్ సింహా, అజీముల్లాఖాన్, విలాఖాయత్ అలి, బక్ష్మిష్ అలి, కాలేఖాన్, ముందర్, నవాబ్ ఆలి బహదూర్ మొదలగు వేలాది దేశభక్తులు బ్రిటీష్ పాలకులను ఎదిరించారు.

స్వేచ్ఛా, స్వాతంత్ర్య పోరాటంలో నౌరోజికి దన్నుగా అరవింద్ ఘోష్, సతీష్ చంద్రముఖర్జీ, బిపిన్ చంద్రపాల్ వంటి పలువురు మద్దతు పలికారు. అప్పుడే వందేమాతరం నినాదం పుట్టింది.

1908లో లొకమాన్య బాల గంగాధర తిలక్ స్వాతంత్రమే నా జన్మ హక్కు అనే నినాదించారు. ఫలితంగా నాటి ప్రభుత్వం ఆరు సంవత్సరాలు శిక్ష విధించింది. 1916లో లక్నో జాతీయ కాంగ్రెసు సభలో హోమ్ రూలు జాతీయ పతాక ఎగురవేయబడింది.

దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం పోరాటం సాగించిన గాంధీ పాక్షిక విజయాలు పొందారు. ఇదే తరహా పోరాటాన్ని భారతదేశంలో జరిపి దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని స్వదేశానికి తిరిగివచ్చారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here