[box type=’note’ fontsize=’16’] “టీకా కార్యక్రమంలో వాక్సిన్ వికటిస్తే దుష్పరిణామాలు సంభవించగలవన్న వాదనలను కొట్టివేయడానికి వీలు లేదు” అంటున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]
[dropcap]స్టా[/dropcap]న్‍ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాలకు చెందిన సాంక్రమిక వ్యాధుల నిపుణులు కొందరు ఇటీవల ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. కోవిడ్-19కు సంబంధించి వివిధ కోణాలలో విస్తృతంగా చర్చించిన అనంతరం వెలువరించిన ఈ తీర్మానం ప్రకారం – వ్యాధిని ఎదుర్కోగల శరీర సామర్థ్యం ఉన్నవారిని వదిలి బలహీనులు, వృద్ధులు వంటి వారికి కరోనా నుండి రక్షించగల చర్యలను చేపడితే క్రమేపీ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. టీకా వచ్చే వరకు నిరోధకత లేని వారికి ప్రత్యేక రక్షణ కల్పించడం ద్వారా వారిని రక్షించుకోవడమే కాక ‘సామూహిక నిరోధకత’ను సాధించగల అవకాశాలను అధ్యయనం చేయవచ్చన్నది శాస్త్రజ్ఞుల ప్రతిపాదన. అయితే –
‘బారింగ్టన్ తీర్మానం’గా చెప్పబడిన ఈ ప్రతిపాదనను సుమారు 30,000 మంది ఆరోగ్య శాస్త్రజ్ఞులు సమర్థిస్తుండగా
80 మంది శాస్త్రజ్ఞులు ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ సిద్ధాంతానికి ఎటువంటి శాస్త్రీయతా లేదని, అందరూ టీకా వచ్చేవరకు చాలా జాగ్రత్తగా ఉండవలసిందేనని వాదిస్తూ ఒక మెమొరాండంను వెలువరించారు. ‘జాన్ స్నో మెమొరాండం’గా పేర్కొనబడుతున్న ఈ మెమొరాండను దాదాపు ఏడు వేలమంది శాస్త్రజ్ఞులు సమర్థిస్తున్నారు.
వాదనలు, తీర్మానాల సంగతి ఎలా వున్నా, కోవిడ్ వాక్సిన్ తయారీకై ప్రపంచంలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థలన్నీ వెనువెంటనే రంగంలోకి దిగాయి. వాక్సిన్ ఫలితాలను పరిశీలించే దశకు చేరుకుని పోటాపోటిగా ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నాయి. అయితే దీర్ఘకాలం పట్టే ట్రయల్స్ ప్రక్రియను కంపెనీలు ఆదరాబాదరాగా పూర్తి చేస్తుండడంపైనే నిపుణల ఆందోళనలన్నీ.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వైరస్‍ను నిలువరించడానికి చేపట్టే టీకా కార్యక్రమంలో వాక్సిన్ వికటిస్తే దుష్పరిణామాలు సంభవించగలవన్న వాదనలను కొట్టివేయడానికి వీలు లేదు. ప్రపంచానికి పలు వాక్సిన్‍లను అందించిన నిపుణులు సైతం ఈ విషయమై తొందరపాటు పనికిరాదన్న అభిప్రాయంతో ఉన్నారు.
ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో పోటీ నెలకొని ఉన్నది. ‘మానవాళి శ్రేయస్సు’ కేంద్రంగా ఏ మాత్రం కాదు. ఆర్థిక ప్రయోజనాలే ఇప్పుడు వివిధ కంపెనీల నడుమనున్న పోటీకి కేంద్రబిందువు కావడమే అన్ని ఆందోళనలకు కారణం.
ఇన్ని ఆందోళనల నడుమ కోవిడ్ వాక్సిన్ విడుదల కావడమే కాకుండా వాక్సినేషన్ ప్రక్రియా ప్రారంభం అయింది. అయితే ఫార్మా కంపెనీలు కొన్ని కోవిడ్ వాక్సిన్ కారణంగా దుష్ఫలితాలు ఎదురైతే వాటికి తాము బాధ్యత వహించనవసరం లేని విధంగా రక్షణాత్మక చర్యల దిశగాను పావులు కదుపుతుండటం మరో కీలకమైన పరిణామం. మన దేశంలో సైతం అతి త్వరలో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నదన్న ప్రభుత్వం – కంపెనీల ప్రకటనల నేపథ్యంలో – ఆచితూచి వ్యవహరించి ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలి. వాక్సినేషన్‍ను త్వరగా అందించాలన్న ఆరాటంలో విపరిణామాలను ఏమార్చకుండా జాగ్రత్త వహించాలి.