రామం భజే శ్యామలం-20

0
3

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]రా[/dropcap]మాయణం మిథ్య అయింది. రాముడు ఒక నవలాకావ్యంలో క్యారెక్టర్‌గా మారిపోయాడు. పురాణాల్లో రాజవంశ చరిత్రలన్నీ పుక్కిటి కథలుగా మారిపోయాయి. వందలకొద్దీ రాజుల చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి. వేల కొలది సంవత్సరాలుగా ఉన్న మన చరిత్ర కేవలం నాలుగువేల ఏండ్లలో దారుణంగా బిగుసుకుపోయింది. గొప్ప ధార్మికవేత్త బుద్ధుడు మాత్రమే అయ్యాడు. గొప్పరాజు అశోకుడు మాత్రమే అయ్యాడు. గొప్ప చక్రవర్తి అక్బర్ ఒక్కడే అయ్యాడు. అలెగ్జాండర్ దండయాత్రతోనే భారతీయుల చరిత్ర మొదలైనట్టుగా మనవాళ్లు రాసుకొంటూవచ్చాం.

ఎందుకయ్యా అంటే రామాయణంలో యవనుల పేరు ప్రస్తావన ఉన్నది. భారతంలో యవనుల పేరు ఉన్నది. చివరకు మౌర్య వంశస్తుడైన అశోకుడి శాసనాల్లోనూ యవనుల పేరు ఉన్నది. యవనులంటే గ్రీసు దేశస్థులు కదా.. కాబట్టి అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తిన తర్వాతే రామాయణం రాసుకొన్నారు. భారతం రాసుకొన్నారు. అశోకుడైతే అలెగ్జాండర్ తరువాతే పుట్టాడని చరిత్ర రాసుకొంటూ వచ్చారు. రామాయణం, భారతేతిహాసాల్లో హూణులు, యవనుల గురించి వచ్చిన ప్రస్తావనలు అలెగ్జాండర్ దండయాత్ర తరువాతే జొప్పించారని చెప్పుకుంటూ వచ్చారు. అశోకుడు తన శాసనాల్లో యవనుల గురించి పేర్కొనడంతో అతను అలెగ్జాండర్ తరువాతి వాడని ఒక దృఢమైన సిద్ధాంతాన్ని చేశారు. అందువల్ల రాముడు, రామాయణం పుక్కిటికథగా మారిపోయిందన్నమాట.

నిజానికి రామాయణంతో సహా మన ఇతిహాసాలు.. పురాణాల్లో పేర్కొన్న యవనులకు.. గ్రీకు యవనులకు ఏమైనా సంబంధం ఉన్నదా?

రామాయణం దాకా ఎందుకు.. మహాభారత యుద్ధం నాటినుంచి లెక్కించుకొంటూ వస్తే అలెగ్జాండర్ మనదేశానికి రావడానికి ముందు మన చరిత్ర ఏమిటి? తరువాత చరిత్ర ఏమిటన్నది కొంత లోతుగా చర్చించాలి. ఎందుకంటే.. వివరంగా.. విస్తారంగా చెప్పకపోతే.. దశాబ్దాల తరబడి జరిగిన బ్రెయిన్‌వాష్ తిరిగి ఫ్రెష్‌గా వాష్ కావడం సాధ్యం కాదు. రామాయణంలో కిష్కింధకాండలో యవనుల ప్రస్తావన వస్తుంది. అయోధ్యలో యాగ సమయంలో.. యుద్ధకాండలోనూ ఈ యవనుల ప్రస్తావన వస్తుంది. కిష్కింధకాండలో సీతాన్వేషణకు సుగ్రీవుడు వానరులను ఒక్కో దిక్కుకు పంపిస్తుంటాడు. శతబలుడు అనే వానర నాయకుడి నేతృత్వంలో లక్షమంది వానరులను ఉత్తరదిక్కుకు వెళ్లి అన్వేషించమని ఆజ్ఞాపిస్తాడు. అటువైపు మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, ముద్రక, కాంభోజ, యవన, శక, బాహ్లిక, ఋషిక, సౌరవ, టంకణ, చీన, పరమచీన, నీహార, వరద దేశములలో బాగా వెదికి రమ్మంటాడు.

ఇందులో చీన దేశం పేరు కూడా ఉన్నది. చీన అంటే చైనా అనేనా అర్థం? ఇది మరో ప్రశ్న. యవనదేశం అయోధ్యకు కిష్కింధకు ఉత్తరాన ఉన్నది అని సుగ్రీవుడు చెప్పాడు. ప్రస్తుతం మనం యవనదేశంగా చెప్తున్న గ్రీకుదేశం.. భారతదేశానికి పశ్చిమం వైపున కనీసం ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతోనే ఈ యవన దేశం.. ఆ యవన దేశం వేరని తేలిపోతున్నది. ఆ తర్వాత మహాభారత కాలం నుంచి గుప్తుల కాలం దాకా యవన క్షత్రియుల ప్రస్తావన మన ప్రాచీన గ్రంథాల్లో.. శాసనాల్లో వేల  సందర్భాల్లో కనిపిస్తుంది. యురోపియన్ చరిత్రకారులు వీటిపై ఎలాంటి పరిశోధనా చేయలేదు.

రామాయణంలో ఉన్న యవనులు ఎవరు? భారతంలో ఉన్నవారు ఎవరు? మౌర్యుల కాలంలో ఉన్నవారు ఎవరు.. గుప్తుల కాలంలో కనిపించేది ఎవరు? అన్న అంశాలపై పరిశోధన ఏదీ చేయకుండా.. యవనుడు అంటే అలెగ్జాండర్ కాబట్టి.. అలెగ్జాండర్ రాకతో ఇక్కడికి యవనులు వచ్చారని.. కన్ఫమ్ చేశారు. ఆ వెంటనే అదేదో ఐసీహెచ్‌ఆర్ ప్రాజెక్టులాగా వాల్మీకి, వ్యాసాదులు.. ఎడిటర్లను పెట్టుకొని మరీ.. తమ పుస్తకాలన్నింటిలో.. అదేపనిగా యవనుల పేర్లను చేర్చుకొంటూ పోయారని చెప్పడం నవ్వాలో ఏడ్వాలో తెలియని దుస్థితి. వాల్మీకికి కానీ, ఆయన రామాయణాన్ని ఎడిటింగ్ చేశారని చెప్తున్నాయనకు కానీ అలెగ్జాండర్ రావడంతోనే అర్జెంటుగా రామాయణంలో యవనుల పేరు చేర్చాల్సిన అవసరం ఏమున్నదో.. వాళ్ల పేరు లేకపోతే రాముడికో, సుగ్రీవుడికో వచ్చిన నష్టమేమిటో అర్థం కాదు. రామాయణాన్ని.. 1200 బీసీలో రాశారని వీరే చెప్తారు. అలెగ్జాండర్ వచ్చిన తర్వాత ఎడిట్ చేశారనీ అంటారు. అంతగా ఎడిట్ చేయాల్సిన అవసరం ఏమిటి? అంటే వీరే ఆ పేరును చొప్పించి రామాయణాన్నిప్రాచీనం కాదని నిరూపించే కుట్రచేశారా?

భారతదేశ చరిత్రనిర్మాణానికి అవసరమైన మూల గ్రంథాలు,  పురాణేతిహాసాలను యురోపియన్ చరిత్రకారులు నిర్ద్వంద్వంగా తిరస్కరించడం వల్ల.. మన చరిత్రనిర్మాణంలో ప్రామాణిక దృష్టి  లేకుండాపోయింది. హెచ్‌జీ వేల్స్, ఎఫ్‌ఈ పర్గీటర్, సర్ విలియమ్ జోన్స్  వంటివారు రాసిన వాటినే ఇంతకాలం మనవాళ్లు పట్టుకొని  వేళాడుతున్నారే తప్ప.. మన చరిత్రపై మనం స్వతంత్రంగా పరిశోధించింది ఏమీలేదు. ఇందుకు ముఖ్యమైన ఉదాహరణ గౌతమబుద్ధుడు, అశోకచక్రవర్తి..  వీరిద్దరి కాలాన్ని గుర్తించడంలో యురోపియన్  చరిత్రకారులు చేసిన తీవ్రమైన పొరపాటు.. మొత్తం భారతదేశ చరిత్రను సమూలంగా వక్రీకరించింది. అలెగ్జాండర్.. మౌర్య చంద్రగుప్తుడు కేంద్రంగా గ్రీకు చరిత్రకారులు రాసినవాటిలో ఉన్న పేర్లలో మొదటి రెండు అక్షరాలను పట్టుకొని యురోపియన్ చరిత్రకారులు చేసిన వక్రీకరణ భారతదేశ చరిత్రనే  కుంచించుకుపోయేలాచేసింది. వందలకొద్దీ రాజులు ఈ పరిణామంలో కాలగర్భంలో కలిసిపోయారు. ఇదే పద్ధతిలో రామాయణ కాలాన్ని తేల్చలేక.. తేల్చినది అంగీకరించలేక.. దాన్ని మిథ్యగా మార్చేశారు.

యవన శబ్దం ఉన్నది కాబట్టి.. క్రీస్తుపూర్వం 1200కు తీసుకొచ్చారు. మహాభారత యుద్ధకాలాన్ని ప్రామాణికంగా తీసుకొని.. అక్కడి నుంచి లెక్కలు వేసుకొంటూ వస్తే మన దేశ రాజుల చరిత్ర కచ్చితంగా తేలేది.

దీంతోపాటు.. వివిధ పురాణాల్లో పేర్కొన్న రాజవంశాల కాలగమనాన్ని పరిగణనలోకి తీసుకొని ఉంటే మరింత స్పష్టంగా భారత చరిత్ర పునర్నిర్మాణమయ్యేది. దురదృష్టవశాత్తూ అలా జరుగలేదు. పురాణాలను మన చరిత్రకారులు అసలు లెక్కలోకే తీసుకోలేదు. దీనివల్ల లెక్కలు తప్పాయి.

“the motion calculated by the brahmins during the long space of 4383 years (the period elapsed between these calculations and bailly’s) varies not a single minute from the tables of “cassini” and “mayer” and as the tables brought to Europe by Laubere in 1687 from India under Louis XIV, are older than those of cassini and mayer, the accordance between them must be the result of mutual and exact astronomical observation”

Indian tables give the same annual variation of the moon as that discovered by Tyco-Brahe. a variation unknown to the school of alexandria. and also to the arabs, who followed the calculations of this school. (quoted in Hindu superiority, page 284, by har bilas sarada)

ఇది ఫ్రెంచి చరిత్రకారుడు బైలీ అభిప్రాయం. మన గణాంకాలపై ఈయనకు ఉన్నంత ఆలోచన మనవాళ్లలో కొందరికి లేకపోయింది. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగితే.. 36 సంవత్సరాల తరువాత 3102 కలిశకం ప్రారంభమైంది. కలిశకం ప్రారంభమైన తర్వాత మగధ సామ్రాజ్యాన్ని గిరివ్రజ పురాన్ని రాజధానిగా చేసుకొని అనేక వంశాలు దేశాన్ని పరిపాలించాయి. క్రీస్తుపూర్వం 3102 నుంచి 327 బీసీ దాకా ఈ సామ్రాజ్యాలు కొనసాగాయి. 1534 బీసీలో మౌర్య చంద్రగుప్తుడు రాజ్యం చేశాడు. 327 బీసీలో మహాగుప్త చంద్రగుప్తుడు రాజ్యంచేశాడు. ఎఫ్‌ఈ పార్గిటర్ (ది డైనాస్టీస్ ఆఫ్ ది కలి ఏజ్ రచయిత) కలిశకంలోని రాజుల కాలనిర్ణయాన్ని నిర్ధారించాడు. ఇతని గణాంకాల ప్రకారం మౌర్య వంశపాలన 1598 గా నిర్ధారించారు. ఇక్కడ పార్గిటర్ చేసిన పొరపాటు 3138 నుంచే కలిశక రాజులను లెక్కించడం.. మౌర్య వంశం నుంచి ఆంధ్ర వంశం వరకు 1886 సంవత్సరాల కాలంగా నిర్ధారించారు. కానీ.. మనం జాగ్రత్తగా లెక్కించాల్సిన ప్రామాణిక సూత్రం ఏమిటంటే.. మహాభారత యుద్ధం 3138 బీసీ, కలిశకం 3102 బీసీ, సప్తర్షి శకం 3076 బీసీ.. కానీ యురోపియన్ చరిత్రకారులు కేవలం వారి ఊహపై ఆధారపడి క్రీస్తుకు పూర్వం 1200 సంవత్సరాలుగా చెప్పుకొచ్చారు. కానీ కలిశకం అన్నది ఊహపై నిర్ధారించేది ఎంతమాత్రం కాదు. ఇది కచ్చితమైన ఆస్ట్రొనామికల్ సైన్స్ ఆధారం చేసుకొని నిర్ధారించింది. మన ఖగోళశాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి పరిశోధిస్తే.. శని, గురువు, అంగారకుడు, రవి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఒకేసారి మేష సంక్రమణంలో ప్రవేశించినప్పుడు కలిశకం ప్రారంభమైంది. దీనిప్రకారం 3102 బీసీ ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 2.27.30 గంటలకు కలిశకం ప్రారంభమైంది. అందువల్లే మన లెక్కలు మన రాజుల కాలనిర్ణయాన్ని కచ్చితంగా నిర్ధారిస్తున్నాయి.

ద్వావింశతి నృపాస్యేతే భవితారో బృహద్రధా:

పూర్ణం వర్ష సహస్రం నైతేషాం రాజ్యం భవిష్యతి: (వాయు, మత్స్య పురాణాలు)

దీని అర్థం ఏమిటంటే బృహద్రధుని వంశము వారసులు 22 మంది రాజులు వేయి సంవత్సరములు రాజ్యం చేస్తారు. ఈ విధంగా మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశ చరిత్రను గమనిస్తే…

బృహద్రధ వంశం 3138-2132   
ప్రద్యోత వంశం 2132-1994
శిశునాగ వంశం 1994-1634 (ఈ వంశంలో క్షేమజిత్ పరిపాలన కాలంలో బుద్ధుడు జన్మించాడు. అజాతశత్రు కాలంలో బుద్ధుడి నిర్వాణం జరిగింది.)
నందవంశం 1634-1534
మౌర్యవంశం 1534-1218
శుంగవంశం 1218-918
కాణ్వ వంశం 918-833
ఆంధ్రవంశం(శ్రీముఖ) 833-327
గుప్తవంశం 327-83
విక్రమార్క జననం 1
పట్టాభిషేకం 82
క్రీస్తుశకం ప్రారంభం 00 (కలిశకం 3102)
శాలివాహన పట్టాభిషేకం క్రీ.శ.78
భోజమహారాజు పట్టాభిషేకం క్రీ.శ.638
మహమ్మద్‌ఘోరీ క్రీ.శ.1193
భారత స్వాతంత్య్రం క్రీ.శ.1947, ఆగస్టు 15.

ఇవీ మన చరిత్రకు సంబంధించిన యథార్థ గణాంకాలు. క్రీస్తుశకం 763లో మగధరాజ్యం వంగదేశానికి చెందిన పాలరాజులకు వశమైంది. క్రీస్తు శకం 763 నుంచి 807 వరకు మొదటి గోపాలుడు ఈ రాజ్యాన్ని పాలించాడు. అప్పటినుంచి దాదాపు 807 సంవత్సరాల కాలంలో అంటే 1193 వరకు ఉజ్జయినిలో భోజరాజు తర్వాత గంగసింహుడి వరకు పదిమంది రాజులు పాలించారు. 1193లో భారత్ ముస్లింల పరమైంది. అప్పటినుంచి ముస్లింలు.. బ్రిటిష్ వారు వరుసగా దేశాన్ని ఏలారు. ఈ విధంగా మహాభారత యుద్ధానంతరం నుంచి 3901 సంవత్సరాల మేరకు రాజవంశాలు.. రాజుల వివరాలు మనకు వరుసక్రమంలో స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే భారతీయులైన చరిత్రకారులు సిద్ధంచేసి ఉంచారు.

ఈ రాజవంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. గ్రీకు దేశ యవనులకు భారత యవనులకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా తేలుతున్నది. మౌర్యవంశం నవనందుల హతం తరువాత 1534 బీసీ లో మౌర్య చంద్రగుప్తుడు స్థాపించాడు. ఇతని కుమారుడు బిందుసారుడు 1500 బీసీ లో రాజ్యానికి వచ్చాడు. ఇతని కుమారుడే అశోకుడు. అశోకుడు 1472 బీసీలో పట్టాభిషక్తుడయ్యాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే.. బిందుసారుడు వేరు.. బింబిసారుడు వేరు. బిందుసారుడు మౌర్య చంద్రగుప్తుడి కుమారుడు. అంతకుముందే.. మగధను ఏలిన ప్రద్యోతవంశంలోని క్షేమజిత్తు కుమారుడు. ఈ బింబిసారుడి కాలంలోనే బుద్ధుడు సన్యాసం స్వీకరించాడు. క్షేమజిత్తు కాలంలో బుద్ధుడి జననం జరిగింది. అజాతశత్రు కాలంలో బుద్ధుడి నిర్యాణం జరిగింది. బుద్ధుడి నిర్యాణం జరిగిన 335 సంవత్సరాల తరువాత అశోకుడు మగధకు పట్టాభిషక్తుడైనాడు. అలెగ్జాండర్‌కు, మౌర్య చంద్రగుప్తుడికి ఎలాంటి సంబంధం లేదు. వీరి తర్వాత 1200 సంవత్సరాల తర్వాత కానీ అలెగ్జాండర్ భారత్‌పైకి రాలేదు. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ గుప్త చంద్రగుప్తుడి కాలంలో దాడిచేశాడు. అలాంటప్పుడు రామాయణ కాలం నాటినుంచి అశోకుడి వరకు యవనులు, హూణులు గ్రీకు దేశస్థులు ఎలా అవుతారు? వాస్తవానికి గ్రీకుల చరిత్ర మొదలైందే క్రీస్తుపూర్వం 800 ప్రాంతంలో. ఇది మనం చెప్తున్నదేం కాదు.. గ్రీకు చరిత్రకారులు చెప్తున్న మాటే. మరి ఎప్పుడో క్రీస్తుపూర్వం ఏడువేల ఏండ్లకు పూర్వం జరిగిన రామాయణ కాలంలో.. క్రీస్తుపూర్వం 15వ శతాబ్దం నాటి అశోకుడి కాలంనాటి యవనులు గ్రీకుదేశస్థులని ఎలా అనగలం? ఈ పదాన్ని పట్టుకొని అలెగ్జాండర్ దాడి తర్వాతే రామాయణంలో యవనులు, హూణుల ప్రస్తావన చేశారని గుడ్డిగా నమ్ముతూ వచ్చారు. అశోకుడిని ఏదోవిధంగా క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో ఇరికించడానికి నానా తంటాలు పడ్డారు. అంటియోఛన్ అనే పేరే అంతియోకో (అశోకుడు) అని టాలమి అనే పేరే తురమ అని.. అర్థం చేసుకొని.. అశోకుడిని చాలా చాలా ముందుకు తెచ్చి పడేశారు. అందువల్లే అతని శాసనాల్లో యవనులన్న పేరు ఉన్నదని నిర్ధారణకు వచ్చారు.

ఏ చిన్న పదం దొరికినా.. దాన్ని పట్టుకొని అటులాగి.. ఇటు లాగి.. ఏదోవిధంగా భారతదేశ చరిత్రను, నాగరికతను తక్కువచేసి చూపడం.. మిగతా ప్రపంచంముందు చిన్నచేసి చూపించడం అన్నవి యురోపియన్ చరిత్రకారులు చేస్తే.. ఈ దేశంలో రాజ్య ప్రాపకంకలిగి చరిత్రకారులైపోయిన మహానుభావులు యురోపియన్ చరిత్రకారుల రాతలకు మరింత మసాలా జోడించి విశ్లథం చేశారనడానికి ఈ ‘యవన’ శబ్దం ఒక్కటి ఉదాహరణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here