[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]
[dropcap]చో[/dropcap]ర వృత్తి అరవై నాలుగు కళలలో ఒకటిగా గౌరవంతో భారతదేశంలో పూర్వం చూడబడేదట. ఆ విద్యలో ఆరితేరినవారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్న సందర్భాలు మన పాత గ్రంథాలలో దొరుకుతాయి. శూద్రకుడు రచించిన మృచ్ఛకటికం నవలలో అందంగా గోడకు కన్నం వేసిన దొంగ పనితనాన్ని మెచ్చుకునే ఒక ఘట్టం ఉంది. చోర కళను గౌరవంగా చూసిన ఇలాంటి కొన్ని ఉదాహరణలు మనకు దొరుకుతాయి. మనోజ్ బాసు ఈ ఇతివృత్తంతో బెంగాలీలో ‘నిషికుటుంబ’ అనే ఒక నవల రాసారు. అది 1971లో ప్రచురింపబడింది. సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆ నవలకు లభించింది. దాన్నే శ్రీ ఎస్. ఎల్. ఘోష్ గారు ఇంగ్లీషులోకి I COME AS A THIEF అనే పేరుతో అనువదించారు. సాహెబ్ అనే ఒక దొంగ అ కళలో నిష్ణాతుడవడానికి చేసే ప్రయత్నాలు ఆ నవలలో కనిపిస్తాయి.
పుట్టిన వెంటనే గంగ ఒడ్డున వదిలేయబడిన సాహెబ్‌ను ఒక వేశ్య పెంచుకుంటుంది. ఆమె పేరు సుధాముఖి. నది వద్ద దొరికిన అ పసిగుడ్డును తనతో తన ఇంటికి తీసుకుని వెళుతుంది. ఆ బిడ్డకు తానే తల్లి అవుతుంది. సుధాముఖీ వద్దకు విటులను తీసుకువచ్చే ఒక వ్యక్తి ఆ బిడ్డకు తండ్రిగా ఉండడానికి ఒప్పుకుంటాడు. సాహెబ్ తెల్లదొరల రంగులో ఉంటాడు. అప్పట్లో దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. వారి శరీర రంగును పోలి ఉన్న శరీరంతో ఉన్న ఈ బిడ్డపై చాలా మంది దృష్టి పడుతుంది. సాహిబ్ పెంపుడు తండ్రి అతన్ని ఒక దొంగల మూఠా వద్దకు తీసుకువెళతాడు. వాళ్ళు సాహెబ్‌ను వారి నాయకుని వద్దకు పంపిస్తారు. అతని శిష్యరికంలో ఆ కళలో నిష్ణాతుడవుతాడు సాహెబ్. ఆ ప్రాంతాలలో పేరెన్నికగన్న మరో గురువు ఉన్నాడని కాని అతను అందరికీ ఈ విద్య బోధించడని తెలుసుకుని, సాహెబ్ పట్టుదలతో ఆ గురువును వెతుక్కుంటూ వెళతాడు. అతని వద్ద శిష్యరికం చేస్తాడు. చోర కళలో చాలా ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడు. అతనికి ఆ గురువు ఒక పరిక్ష పెడతాడు. నిద్రపోతున్న ఒక యువతి శరీరం మీద అన్ని నగలను చాకచక్యంతో ఆమెకు తెలీయకుండా దొంగతనం చేసుకుని రావడం ఆ పరీక్షలో ఒక భాగం. దీన్ని అతి నైపుణ్యంతో అతను సాధించే తీరును రచయిత వర్ణించే తీరు చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. మనిషి మానసిక స్థితిని, బలహీనతలను అధ్యయనం చేసి జరిపే ఈ చోరీ ఒక ఉత్తమ దొంగలో ఉండవలసిన లక్షణాలను స్పష్టపరుస్తుంది. ఈ చోరీ తరువాత మొత్తం బెంగాల్‌లో అతని పేరు మారుమ్రోగిపోతుంది.
దొంగగా ఉంటూనే అతనిలోని సహజమైన సున్నితత్వాన్ని ఎక్కడా వదులుకోడు సాహెబ్. ఇతరుల పట్ల చాలా దయతో వ్యవహరిస్తూ ఉంటాడు. తనలో ఉన్న మంచితనాన్ని చూసి ఎన్నో సందర్బాలలో అతనే ఆశ్చర్యపోతూ ఉంటాడు. అదే మంచితనం తన చుట్టూ ఉన్న మనుష్యులలో కూడా అతనికి కనిపిస్తూ ఉంటుంది. కరడు కట్టిన దొంగలుగా గుర్తింపు పొందిన వారిలో కూడా దుర్మార్గం పాటు దాగి ఉండే మంచితనం అతన్ని చాలా సార్లు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.
నలభై సంవత్సరాలు దొంగగా జీవించిన తరువాత ముసలితనంలో అతను తాను మొదటిసారి దొంగతనం చేసిన ఇంటికి వెళతాడు. నిద్రపోతుండగా ఆ యువతి నగలను తాను దొంగలించిన విషయం అతను మర్చిపోడు. అ యువతి కూతురు ఇప్పుడు పెద్దదయి కటిక పేదరికాన్ని అనుభవిస్తూ కష్టాలు పడడం అతను చూస్తాడు. ఆ అమ్మాయి తన మేనమామ ఇంట బ్రతుకుతూ ఉంటుంది. ఆమె ఉండే ఇల్లు ఆ మేనమామదే. వయసులో ఉన్నప్పుడు అతను దొంగతనాన్ని, మోసాన్ని అసహ్యించుకున్న వ్యక్తి. కాని పరిస్థితుల కారణంగా అతనే ఒక నగ దొంగలించి ఆ గుడిసెలో దాచి పెడతాడు. ఆదర్శాలతో జీవించిన ఆ మంచి వ్యక్తి పరిస్థితుల కారణంగా దొంగగా మారడాన్ని సాహెబ్ చూస్తాడు. అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో తానే ఆ నగను దొంగలించానని చెప్పి శిక్షకు సిద్దపడతాడు. దెబ్బలు తింటాడు. అరెస్టు అవబోయే ముందు అతనికి ఒక యువతి అన్నం పెడుతుంది. అతను చాలా రోజులనుంచి ఆహారం లేక ఆకలితో ఉన్నాడని తెలిసి ఆమె అతనికు ఆహారం ఇస్తుంది. అతనికి తిండి పెట్టిన అ యువతి ఒక పేద విధవరాలు. అమె ప్రియునితో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని చూసి పట్టుకుని ఆమె చుట్టుపక్కల వెలివేసినంత పని చేస్తారు. ఆమె అంటే సాహెబ్‌కు పెద్దగా ఇష్టం ఉండదు. పైగా ఆమె అంటే కొంత కోపం కూడా ఉండేది. ఆమె అతనికి జైలుకు వెళ్ళబోయే ముందు అన్నం పెట్టి ఆకలి తీర్చాలని ప్రయత్నిస్తుంది. గొప్ప సంసార స్త్రీలందరూ దూరంగా ఉన్నప్పుడు అతని ఆకలి తీర్చడానికి ఆమే ముందుకు వస్తుంది. ఇది సాహెబ్‌ను కదిలించే సన్నివేశం. అంత మంది మర్యాదస్తుల మధ్య పతితగా ముద్రించబడిన ఆమెలోని అమ్మతనం అతన్ని కదిలిస్తుంది.
ఒకప్పటి దొంగల జీవితాలకు సంబంధించి పుస్తకం ఇది. వారు వృత్తిని నేర్చుకునే విధానం, అప్పట్లో వారి మధ్య ఉండే గురు శిష్య సంబంధం, దానికి వారు కట్టుబడి ఉండే పద్దతి, అలాగే దొంగతనాలను వారు ప్లాన్ చేసుకునే విధానం అన్నీటిని ఒక శిక్షణా పద్దతిగా రచయిత చెప్పుకుంటూ వెళ్తారు. ఆ వృత్తిలో ఉండిన కొందరి అనుభవాలను కనుక్కుని వారి మధ్య కొన్ని రోజులు ఉండి రచయిత ఈ రచన చేసారని చెప్తారు.
సాహెబ్ అనుభవాలను చివర్లో రచయిత ఇలా చెప్పుకొస్తారు. “దుర్మార్గుడిగా కనిపిస్తూ మంచితనాన్ని ప్రదర్శించే వాళ్ళూ ఎందరో. అలాంటి అన్నుభవాలు సాహెబ్ జీవితంలో ఎన్నో. దుర్మార్గంగా కనిపించే చాలా మంది బ్రతకడం కోసం అలా నటిస్తారు. సమయం వచ్చినప్పుడు వారిలో అనుకోని మంచితనం కనిపిస్తూ ఉంటుంది. మానవ సమూహం మొత్తంలో ఈ గుణం కనిపిస్తూ ఉంటుంది. పైకి కనిపించే మంచి చెడులు వారి నిజ స్వభావాలు కావు. వేశ్యల మద్య పెరిగిన ఒక అనాథ దొంగగా కొన్ని సంవత్సరాలు బ్రతికిన తరువాత కూడా, ప్రపంచాన్ని భయపెట్టే జీవితం జీవించిన తరువాత కూడా అతనిలో మంచితనం కనిపిస్తూనే ఉంటుంది. అతన్ని పెంచిన వేశ్య నుండి, చివర్లో అన్నం పెట్టిన పతిత వరకు అందరూ సమయం వచ్చినప్పుడు అద్బుతమైన మంచితనాన్ని మానవత్వాన్ని ప్రదర్శించిన వారే. దొంగగా బ్రతుకుతూ కూడా తనదైన నీతిని అతను ఆచరిస్తూనే వచ్చాడు. ఈ నవలలోని అన్నీ పాత్రలు నాగరిక ప్రపంచంలో వెలి వేయబడిన వారే. కాని వారంతా మంచివారు. వారిలో కనిపించే మంచితనం సమాజం పట్ల మనలో ప్రేమను కలిగిస్తుంది. వారిలో ఒక సామాజిక భాద్యత కూడా మనం చూస్తాం. ఒకరి పట్ల ఒకరు ప్రదర్శించే సానుభూతి కొన్నిసార్లు మర్యాదస్తుల మధ్య కనిపించదు. ఈ నవలలోని అన్ని దుష్ట పాత్రలను మనం ప్రేమిస్తాం, అదే ఈ నవల గొప్పతనం. భారతదేశంలో చోర కళకు సంబంధించి ఎంతో సమాచారం నిజాయితీగా సేకరించి రాసిన నవల ఇది. ఇంత సమాచారం మనకు చోర కళపై దొంగల సమూహంపై మరొక సాహిత్య రూపకంలో దొరకదు. చాలా వరకు ఈ నవలలో దొంగల జీవితం వాస్తవ జీవితాల ఆధారంగా మలచినదే అని చెప్పవచ్చు. చాలా శ్రమ పడి ఆ సమూహాలలో జీవించి, గమనించి వారిని ప్రశ్నించి సమాచారం సేకరించి రచయిత ఈ నవల రాసారని అర్థం అవుతుంది. అందుకే ఇది అరుదైన నవల. ప్రస్తుతం ఈ పుస్తకం లభ్యం కావట్లేదని సమాచారం. కాని పాత పుస్తకాల గని లో ఇది తప్పకుండా దొరుకుతుంది.