స్వీయపోషణ

1
3

[dropcap]”తా[/dropcap]తగారూ! నాకు కొన్ని అనుమానాలున్నాయి. తీరుస్తారా! కొన్ని ఈ తెలుగు పదాలకు అర్థాలు తెలీట్లేదు.” అంటూ మనవడు వాసు, ఒక నోట్ బుక్ తీసి తాత గారి ముందుంచాడు. దాన్లో కొన్ని తెలుగు పదాలు వ్రాసి ఉన్నాయి.

తాత తారకయ్య గారు వాడికేసి నవ్వుతూ చూస్తూ “మనవడా! ఈ పదాలకు అర్థాలు నాకూ బాగా వస్తాయో రావో, ఆలోచించి చెప్తాను.” అనగా మనవడు “ఉండండి తాతగారూ! మీకు రాకపోడమేంటీ! నవ్వుతాలుకు అంటున్నారు కానీ” అంటుండగా,

“అయ్యగారండీ! పెద్దమ్మగారు కోవెలకని వెళ్లారు! ఈరోజు రాత్రికి వంట చేయను కూరల్లేవండీ! ఉదయం సూచుకోలేదు. మీరు చినబాబు గారికి ఏదో చెప్తున్నట్లున్నారు, నేనే వెళ్ళితెచ్చుకోనా?” అంటూ వచ్చింది వంటామె వనమ్మ.

మనవడి అనుమానం తీర్చను ప్రయత్నిస్తున్న తాతగారు “వద్దులే తల్లీ! నేనే వెళ్ళి తెస్తాను. వాసూ! నీవూ నాతో రా! నీ సందేహాలకు నడుస్తూ అర్థాలు ఆలోచించి చెప్తాను. వెళ్తూ మాట్లాడుకుందాం.” అంటూ వంటామె ఐచ్చిన గుడ్డ సంచీ పట్టుకుని బయల్దేరారు తారకయ్యగారు. వాసు కూడా తాతగారితో కలసి బయల్దేరాడు, అలా నడిచేప్పుడే తాతగారి వద్ద చాలా విషయాలు నేర్చుకోవచ్చనీ, అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవచ్చనీ వాడికి బాగా తెల్సు.

వారు కూరగాయల మార్కెట్ సమీపించారు. తాతగారు ఎప్పటిలా మార్కెట్‌లోకి కాక మరో వైపుకు నడుస్తుండగా “తాతగారూ! ఇలా వెళ్తున్నారేంటీ! మనం వచ్చింది కూరలకు కదా! మరి మార్కెట్ దాటి అలా ఎక్కడికి వెళుతున్నారు?” అంటూ అడిగాడు వాసు తాతగారిని.

“వాసూ! కూరలకే మనం వచ్చింది. ఐతే కొనే అంగడి మార్చుదామని చూస్తున్నాను. మార్కెట్ లోపల అన్నీ నిన్నటివీ, మొన్నటివీ ఉంటాయి. తాజా కూరల కోసం చూస్తున్నాను.” అంటూ మార్కెట్ బయట కొద్ది దూరంలో ఉన్న ఒక పెద్ద వేపచెట్టు వద్ద కెళ్ళారు తాత గారు. అక్కడ ఒక ముసలాయన, చిరిగిన పంచతో, ఎముకలగూడులా పైకి కనిపిస్తున్నాడు. అతడి ముందు ఒక గోతంమీద కొద్దిగా కూరలు,ఆకుకూరలూ కుప్పలుగా పెట్టి కూర్చుని ఉన్నాడు. అంతా అతడి కేసి చూస్తూ, నవ్వుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఎవ్వరూ అతగాడి వద్ద కూరలు కోననే రాలేదు.

తారకయ్య గారు అక్కడ నిల్చుని ఆ ముసలాయనకేసి చూసి నవ్వారు. “ఏం బావున్నానా నరసయ్యా! ఈ రోజు ఏమి కూరలు తెచ్చావు?” అంటూ పలకరించి క్రిందకు వంగి ఆ గోతం మీది కూరలు చూడసాగారు. చక్కగా నిగనిగా మెరిసే వంకాయలు చూడగానే వాసుకు నోరూరింది. “తాతగారూ మన వంటామె గుత్తొంకాయ కూర చాలా బాగా చేస్తుంది, ఆ వంకాయలన్నీ కొనేయండి!”అన్నాడు.

తాతగారు వాసును చూసి “తప్పక తీసుకుందాం వాసూ!” అంటూ అక్కడున్న ఆకుకూరలూ, కాయకూరలూ తీసుకుని సంచీలో వేసుకున్నారు.

“అదేంటి తాతగారూ! తూకం వేయకుండానే తీసుకుంటున్నారు! ఈ తాత దగ్గర అసలు తూకమేయను త్రాసు, తూకం రాళ్ళేలేవు!” అన్నాడు.

తారకయ్యగారు పెద్దగా నవ్వారు. “అదా! ఈ తాత వద్ద త్రాసులేక పోయినా వాటి వెలకు తగ్గట్లు కుప్పలు పెడతాడు. ఒక్కో కుప్పా ఎంత చెప్తాడో ఖచ్చితంగా దానికి తగినట్లే వాటి తాజాదనం, రుచీ ఉంటాయి. ఈ నరసయ్య మనసే ఒక త్రాసు.” అంటూ తాతగారు అసలు బేరమాడాకుండా పర్స్ లోంచీ డబ్బు తీసి అతడికి యిచ్చి, నవ్వుతూ “వస్తాను నరసయ్యా! మళ్ళా రేపు వస్తాను.” అంటూ నడిచారు.

వాసుకు తాతగారి ప్రవర్తన వింతగా తోచింది. “అదేంటి తాతగారూ! మీరెప్పుడూ బేరమాడకుండా ఏదీ కొనరు కదా! నేను చూస్తూనే ఉంటాను మీతో వచ్చినప్పుడల్లా! ఇలా తూకం లేకుండా, బేరం లేకుండా కొన్నారేంటీ!” అని అడిగాడు.

“వాసూ! ఈ తాత వయస్సెంత అనుకుంటున్నావ్! కనీసం 75 పైన ఉంటుంది. అంటే నాకంటే పెద్ద వాడన్నమాట. గుడికెళ్ళినా, బస్ స్టాండ్లవద్దా, రైల్వే స్టేషన్లవద్దా, ఇంకా రోడ్ల కూడళ్ళలో, సిగ్నళ్ళ వద్దా కారు ఆగినపుడూ ఎంతో మంది, కాళ్ళూ చేతులూ బావున్న వారు, బాగా బలంగా వయస్సులో ఉన్నవారూ అడుక్కోడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ తాత తనకున్న చిన్న స్థలంలో, గుడిసె చుట్టూతా కూరల పాదులూ, ఆకుకూరలూ పండిస్తూ, పక్కనే పారుతున్న గోదావరి నదీ జలాలు కుండతో మోసుకుని తెచ్చి ఆ మొక్కలకు పోసి, సహజంగా పండిస్తున్నాడు. అడుక్కోకుండా తన స్వయంశక్తితో బ్రతుకుతున్నాడు. ఈతని భార్య తెలీని వ్యాధి సోకి చనిపోయింది. ఇద్దరు మగ బిడ్దలు, పెళ్ళిళ్ళై తమ జీవనమార్గం చూకుకోను వెళ్ళిపోయారు. ఈ తాత ఒక్కడే నిజాయితీగా, ధైర్యంగా స్వశక్తితో బతుకుతున్నాడు. అంతే కాక తన ఇంటిపక్కనే ఉన్న ఒక పేద అవిటి తాతకు తన స్వార్జితంలో తాను సంపాదించిన సొమ్ముతో తాను తినే తిండి పెట్టి పోషిస్తున్నాడు. నీవు ఇందాక అడిగావే ‘కొన్నిమాటలకు అర్థాలు బాగా తెలీలేదనీ నీ నోట్ బుక్‌లో వ్రాసి వున్న మాటలు చూపావు! సోమరితనం, స్వయంపోషణ అంటే పూర్తి అర్థం ఏంటో నీకిప్పుడు బాగా అర్థమైందా వాసూ! నీకు ఊరికే అర్థం చెప్తే మనస్సుకు ఎక్కదని ఇలా చూపాను. ఇప్పుడు బాగా అర్థమైందా! మూడు రోజుల నాడు ఇక్కడ ఈ నరసయ్య తాతను చూసి మాట్లాడాను. ఆరోజు నుండీ నీవు ఉదయం స్కూల్ కెళతావుకదా! అందుకని ఈ నారసయ్య వద్దే నేను తాజా కూరలు కొంటున్నాను వాసూ! మనం ఎక్కడైన ఎప్పుడైన బేరమాడే వద్ద ఆడాలి. ఇలాంటి వారి వద్ద మనకు అవసరమైన దానికన్నా ఎక్కువగానే కూరలుకొని, ఎక్కువ సొమ్ము ఇచ్చి కొనాలి. ఈ నరసయ్య ఊరికే ఇస్తే ఏమీ తీసుకోడని కూడా నాకు తెలిసింది. నిన్న ఇంట్లో చేసిన ఇడ్లీలు మిగిలితే తెచ్చి ఇవ్వబోగా ‘ఉచితంగా వద్దు బాబుగారూ ! వీటి వెలకు తగిన కూరలు తీసుకుంటేనే ఈ ఇడ్లీలు తీసుకుంటాను’ అన్నాడు. నాలుగు ఇడ్లీలు ఇస్తే వాటిలో రెండు తీసుకెళ్ళి ఆ అవిటి తాతకు ఇవ్వడమూ చూశాను. ఎంత నిజాయితీనో చూడూ. అంత పేదరికం లోనూ ఉచితంగా అంటే అపరిగ్రహం అన్నమాట అలా తీసుకోక ఉన్నది పక్క నున్న మరో అవిటి వ్యక్తికి కూడ ఇవ్వడం ఎంత గొప్ప నైజం? ఇలాంటి వారికి మనం ఇలా సాయం చేయాలి. మనం ఎవరికైనా రోజూ తిండి పెడతామా! ఇతడూ ఏరోజు కారోజు నూకలుకొని వండుకుంటూ మరో అవిటి జీవిని పోషిస్తున్నాడు” అని చెప్తుండగా, నడుస్తున్న వాసు చిత్రంగా వెనక్కు తిరిగి ఆ నరసయ్య తాతకేసి చూసి, “తాతగారూ! నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఈ తాత! ఈమారు నా పుట్టినరోజుకు ఇతడికీ, ఆ అవిటితాతకూ కొత్త పంచెలు, చొక్కాలు, నా కిడ్డీ బ్యాంక్ డబ్బుతో కొని బ్రతిమాలి ఇద్దరికీ ఇస్తాను. మీరూ నాతో వస్తారుగా” అంటున్న మనవడిని ప్రేమగా చూస్తూ, “అదిరా వాసూ! మనం చేయవలసింది. మనం చదువుకున్న వారి వద్దే కాదు, లోకంలో ఎవరి వద్దయినా పాఠాలు నేర్చుకోవాలని తెలీడం లేదూ!” అన్నారు మనవడి కేసి చూస్తూ తాతగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here