అమ్మ కడుపు చల్లగా-10

0
4

[box type=’note’ fontsize=’16’] ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవలసిన అత్యవసరస్థితి నెలకొని ఉందని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

భారతదేశానికి ముప్పు ముంగిట్లోనే ఉంది:

[dropcap]2[/dropcap]030 ఆటికి  మన తాగునీటి అవసరాలు రెట్టింపు కానున్నాయి. కాగా 2050 నాటికి నదీ పరీవాహక ప్రాంతాలలో సైతం తీవ్రమైన నీటి ఎద్దడి ఎదురుకానున్నదని ‘లివింగ్ ప్లానెట్’ నివేదిక హెచ్చరిస్తోంది. గడచిన 40 సంవత్సరాలలో వ్యవసాయ అవసరాలు, నగరీకరణ వంటి వివిధ కారణాలుగా భారతదేశంలోని 30 శాతానికి పైగా చిత్తడి నేలలు అంతరించిపోయాయని అంచనా.

భారతదేశం వేల జాతుల వృక్ష సంపదకు పుట్టినిల్లు. విత్తన జాతులకు చెందిన మొక్కలూ ఇక్కడ అనేకం. నైసర్గిక స్వభావం రీత్యా ఇక్కడి హరిత సంపదలో వైవిధ్యమూ అపారం. ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోయిన 600 రకాల విత్తనపు మొక్కలలో 10% మన దేశానికి చెందినవీ ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ అంతరించిపోవటం ప్రక్రియ ఇంకా వేగంగా జరిగిపోతోంది.

ఉద్యాన పంటలు విస్తరించటం, పాడి పరిశ్రమ, అక్వాకల్చర్ వంటివన్నీ మొక్కల జాతులు అంతరించిపోవటానికి కొంతవరకు కారణమవుతున్నాయని అధ్యయనాలలో తేలింది. పెరుగుతున్న ఆహార అవసరాలను కాదనలేం. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తులో 30% వృథా అవుతున్నాయని లెక్కలు చెప్తున్నాయి. మన దేశపు ఆహార ఉత్పత్తులలో అది (వృథా) 40% అని అంచనా. ఆ వృథా అవుతున్న ఉత్పత్తులు (40%) చెడిపోయిన అనంతరం హానికారక వాయువుల విడుదలకు కారణం అవుతుండడం మరొక విపరిణామం.

ప్రకృతి మన అవసరాలను పూర్తిగా తీర్చగలదు. ఆ శక్తి ప్రకృతి వ్యవస్థలోనే ఉంది. కాని అత్యాశకు పోయి భవిష్యత్తును గురించిన, పరిణామాలను గురించిన ఆలోచన లేకుండా, వనరులను కొల్లగొడుతూ పోవడం వలన సంభవించిన దుష్పరిణామాలే ఇవన్నీ.

ప్రమాద ఘంటికలు

ఇటీవలే W.W.F. ‘లివింగ్ ప్లానెట్ 2020’ నివేదిక ప్రచురించింది. 120 దేశాలకు చెందిన శాస్త్రజ్ఞులు, నిపుణులు తమ అధ్యయనాలకు సంబంధించిన అమూల్యమైన సమాచారాన్ని అందించి ఆ నివేదిక రూపకల్పనలో సహకారాన్ని అందించారు. గత 50 సంవత్సరాల కాలంలో 4000కు పైగా వెన్నెముక గల జీవుల సంఖ్యలో వచ్చిన వివిధ మార్పులను ‘లివింగ్ ప్లానెట్ – ఇండెక్స్’ పరిగణనలోకి తీసుకుంది. అన్ని జాతుల జనాభా సరాసరి 68% వరకు తగ్గిపోయిందని ఆ నివేదిక వెల్లడించింది.

మంచినీటి ఆవాసాలలోని ప్రాణుల సంఖ్య ఏటా 4% చొప్పున తగ్గిపోతోంది. ‘తీర ప్రాంతాల అభివృద్ధి’ పేరిట చేపడుతున్న చర్యలతో సముద్ర జీవులకూ విపరీతమైన నష్టం వాటిల్లుతోంది. సముద్ర జలాలో 80% పైగా మానవ చర్యల కారణంగా కలుషితమైపోయాయని ఆ నివేదిక వెల్లడి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నదులు, చెరువులు, చిత్తడి నేలల్లో మత్స్య సంపద గణనీయంగా తగ్గిపోయినట్టు లివింగ్ ప్లానెట్ నివేదిక స్పష్టం చేస్తోంది. వ్యవసాయావసరాల నిమిత్తం అడవుల నరికివేత యథేచ్ఛగా సాగిపోతుండడంతో వన్యప్రాణుల సంఖ్యా కోసుకుపోతోంది. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు కారణంగా అడవుల నరికివేత ఆలోచనారహితంగా సాగిపోతుంది. పందుల మేతకై బ్రెజిల్‍లో అమెజాన్‍లో విస్తారంగా అటవీ ప్రాంతాన్ని సోయా బీన్ సాగు కోసం చదును చేసేశారు. ఆగ్నేయాసియాలో పామ్ ఆయిల్ సాగు కోసం భారీ ఎత్తున అరణ్యాల నరికివేత సాగుతోంది. భూమి వినియోగం తీరుతెన్నులు మారిపోయిన కారణంగా భూసారం క్షీణించిపోవటంతో బాటు కాలుష్యమూ పెరిగిపోతోంది. 2030 నాటికైనా పునరుద్ధరణ జరిగేలా సత్వరం చర్యలు చేపట్టాలని ఆ నివేదిక తేల్చి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవలసిన అత్యవసరస్థితి నెలకొని ఉందన్నది నిష్టుర సత్యం. కాగా అరణ్యాలకు, జనావాసాలకు విభజన రేఖలను చెరిపివేసిన పాపానికి పరిహారంగా మానవుడు దిద్దుబాటు చర్యల దిశగా నడుం బిగించక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here