[dropcap]కో[/dropcap]నేటి రాయుడవని
కష్టాల ఇక్కట్లు తొలగించి
కోరిన కోర్కెలు తీర్చుతావని
తిరుమల క్షేత్రాన్ని దర్శించాలని
పరుగు పరుగున పయనమయ్యాము స్వామి!
చెట్లు పుట్టలు గుట్టల మధ్య నుండి
ఏడుకొండల దారుల వెంట వడివడిగా నడుస్తూ
నీ నామ సంకీర్తనలు ఇష్టంగా ఆలపిస్తూ
అలసట ఎరుగక ..నీ సమ్మోహన రూపాన్ని
కనులారా వీక్షించాలని
తరలి వస్తున్నాము స్వామి!
తిరువీధుల చేరినంతనే
మది నిండా సంబరాలహేల
ఎప్పుడెప్పుడు నీ సుందర దరహాసాల మోముని చూడాలని
రెప్పలార్పక..రెండు చేతులు జోడించి
“గోవిందా ..నారాయణా..మురారి..” అంటూ
పారవశ్యంతో పలవరిస్తూ కదులుతున్నాము స్వామి!
పసిడి కాంతులతో విరాజిల్లుతున్న స్వామి
..వైకుంఠాన్ని వీడి ఇలలో జనులను సంరక్షించగా
సప్తగిరులపై రమణీయ శోభతో నిలిచిన ‘జగతినేలే రారాజు’ని
తన్మయంగా కాంచినంతనే..ఈ మానవజన్మ ధన్యమయ్యేను..కదా స్వామి!
‘సిరిపతి’గా ఇలలో వైభవంగా వర్ధిల్లుతున్న.. ..శ్రీవేంకటేశ్వరా నమో..నమో!!
శ్రీనివాసా..
శ్రీధరా..
ఏడుకొండలవాడా..
ధరణీనాయకా..
దినకరతేజా.. నమో..నమో!!