[box type=’note’ fontsize=’16’] ఆంధ్ర అనే మాట ఏర్పడ్డ విధము గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]
[dropcap]మ[/dropcap]నము నివసించే రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. ఎంతమందో మహానుభావుల త్యాగాల వల్ల పొట్టి శ్రీరాములుగారు ఆమరణ నిరాహారదీక్ష అనంతరము అంధ్ర రాష్ట్రము ఏర్పడింది. ఆ ఆతరువాత తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ తరువాత మళ్లా ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణా విడిపోయి ప్రత్యేక రాష్ట్రముగా ఏర్పడటం అందరికి తెలిసిందే. మొదట్లో మన తెలుగువాళ్లను కూడా మద్రాసీలని పిలిచేవారు. మనకంటూ ప్రత్యేక గుర్తింపు లేదు. అందుచేతనే మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడిపోవాలని మన నాయకులు కృషి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు.
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ అనే మూడు ప్రాంతాలుగా ఉండేది. ప్రస్తుతము తెలంగాణా విడిపోయినాక రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలు ఆంధ్ర ప్రదేశ్‌గా ఉన్నాయి. ఆంధ్రులమైన మనము అంధ్రప్రదేశ్ లోని ఆంధ్ర అనే పదము అర్ధము ఏమిటి?, ఆ పదము ఎలా వచ్చిందో తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము. మనము మాట్లాడే భాష తెలుగు కాబట్టి మనలను తెలుగువారు అంటున్నారు. మన తెలుగు నేలను త్రిలింగ దేశము అని కూడా అంటారు. ఇవన్నీ మనకు తెలిసినవే. దక్షిణాది భాషలలో తెలుగు ప్రాచీనమైనది. ఎంతో ఘన చరిత్ర కలిగినది. ఎంతమందో ప్రముఖులు మెచ్చుకొన్న భాష ప్రస్తుతము ఆంధ్ర అనే పదము అర్ధము తెలుసుకుందాము.
‘ఆంధ్ర’ పదం ఎంతో పురాతనమైనా దాని అర్థ వివరణ ఇప్పటికీ పలువురికి ప్రశ్నార్థకముగానే మిగిలి ఉన్నది. ‘ఆంధ్ర’ పదమునకు సంస్కృతమున అర్థం దక్షిణ దిక్కు అని, తెలుగు భాషయని, ఇంకొక అర్థం జాతి అని, పలు సమాధానములు కలవు. ఇన్ని రకముల వివరణ ఎలా సాధ్యము, అందునా వీటిలో అసలైన అర్థం ఏమిటి? ఈ విషయమును జాగ్రత్తగా పరిశీలిస్తే కాలక్రమములో ఈ అర్థములు అన్ని ‘ఆంధ్ర’ పదముకు సంబంధించినవే అని తెలుసుకోవచ్చును. అది ఏవిధముగానో పరిశీలిద్దాము.
మొట్ట మొదటి సారి ‘ఆంధ్ర’ పదము ఛాందగ్యోపనిషత్తు-ఐతరేయ బ్రాహ్మణములలో ఉదహరింపబడినది. దీనిని బట్టి చూస్తే ఈ పదము అత్యంత పురాతనమైనదని తెలుస్తుంది. ఒక కథనం ప్రకారము, అజిగర్తుడను బ్రాహ్మణ పుత్రుడిని, రాజా హరిశ్చంద్రుని యాగ మానవ బలిపశువుగా నిర్ణయిస్తే, కాపాడమని ఆ కుమారుడు విశ్వామిత్రుని శరణు కోరుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన నూరుగురు కుమారులలో ఎవరైనా ఒకరు బ్రాహ్మణ పుత్రుని బదులుగా వెళ్ళమని ఆదేశిస్తాడు. వందమందిలో యాభై మంది తండ్రి ఆజ్ఞకు అభ్యంతరము చెపితే ఆగ్రహించిన విశ్వామిత్రుడు స్వార్థబుద్దితో తన ఆదేశాన్ని పాటించక “అంధులు” గా ప్రవర్తించారు కాబట్టి వారు దేశ దిమ్మరులై వింధ్య పర్వత దక్షిణ దేశమున వశిష్ఠ పుత్రులు ఉండే ప్రాంతాలలో ఉంటూ, మాంస భక్షణ చేయు మనుషులతో ఉంటూ స్వార్ధ ప్రవృత్తి గల జాతీయులుగా జీవించమని శపిస్తాడు అని వాల్మీకి రామాయణము లోని బాల కాండలో ప్రస్తావించబడింది. ఆ విధముగా విశ్వామిత్రని యాభై మంది పుత్రులు వింధ్య పర్వత దక్షిణ ప్రాంతములలో నివాసము ఏర్పరచుకున్నారు. వారిలో ఒక కుమారుని పేరు “ఆంధ్ర”గా కొందరు చెబుతారు. పౌండ్ర, పుళింద, శబర, జాతులుగా స్థిర పడ్డారు. ఈ అన్ని జాతులలో ‘ఆంధ్ర’ జాతి ఇప్పటికి బాహుళ్యంలో ఉన్నది. ఇక ఈ ఆంధ్ర జాతి వింధ్య పర్వత దక్షిణ ప్రాంతములలో నివసించుట వలన, ‘ఆంధ్ర ప్రాంతము’ అంటే దక్షిణ ప్రాంతముగా ప్రసిద్ది చెందింది సంస్కృత వ్యవహారమున. ఇక్కడ గమనించవలసిన విషయము ఏమిటీ అంటే బ్రహ్మర్షి వశిష్ఠ-అరుంధతిల ఆశ్రమము చిరకాలము నుండి అంతర్వేది మహాక్షేత్రమునందు భాసిల్లుటయే గాక, సప్త ఋషులు నడయాడిన ప్రదేశములుగా ఈ కృష్ణా-గోదావరీ తీర ప్రాంతములు ప్రశస్తి చెంది ఉన్నవి.
ఇప్పటి తెలుగు మాట్లాడే ఆంధ్ర-తెలంగాణమే కాకుండా ఈ ఆంధ్ర జాతి ఎంతో బహుళ వ్యాపకమైనది. అనగా 2500 సంవత్సరముల మునుపే, ప్రస్తుత మధ్యప్రదేశ్ ఛత్తీస్‌ఘర్ ప్రాంతములోని వారిని కోసలాంధ్రులుగా, కళింగాంధ్రులుగా, బేరారాంధ్రులుగా (విదర్భ), మూలకాంధ్రులు (మహారాష్ట్రలోని నాసిక్ నుండి వాషిమ్ వరకు), ఉత్తరాంధ్ర లోని అస్మాకాంధ్రలు, తెలంగాణ-మరాఠ్వాడ ప్రాంతములలోని అసికాంధ్రులు, వేగినాటి-వెలనాటి ఆంధ్రులు (గోదావరి, కృష్ణా, గుంటూరు), పాకనాటిఆంధ్రులు (ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు), రేనాటాంధ్రులు (రాయలసీమ) వ్యాప్తి చెంది ఉన్నారు.
ఈ ఆంధ్ర జాతీయులు 2000 ఏళ్ళ మునుపు వరకు ముఖ్యముగా సంస్కృత-ప్రాకృత భాష వ్యవహారములో ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ప్రాంతముల లోని ఆంధ్రులు 2300 ఏళ్ళ క్రిందటనే తెలుగు భాషా ప్రయుక్తముగా మారటము మొదలు పెట్టి ముఖ్యముగా ఆంధ్రదేశముగా పేరుగాంచటము మొదలైంది. ఆ విధముగా తెలుగు భాషయే ఆంధ్రముగా ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ కారణము గానే, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లలోని ప్రజలకు తెలుగు తో పాటుగా సంస్కృతము కూడా సులభముగా నేర్చుకోవటం వల్ల ఇచ్చటి పండితులు, కవులు సంస్కృతాంధ్రములలో నిష్ణాతులుగా ప్రసిద్ధి కెక్కారు. తర్వాత కాలములలో (2000–1500 ఏళ్ళ మునుపే) విశాల ఆంధ్ర జాతీయులు వేరు వేరు భాషా ప్రయుక్తులు మార్పుచెందుట మొదలవటము వలన, కేవలం తెలుగు మాట్లాడువారు మాత్రమే ఆంధ్రులుగా గుర్తింపబడటం మొదలయింది.
ఇక్కడ మరో విషయము ఏమిటి అంటే, విశ్వామిత్రుడు మహర్షి కాక మునుపు యమునా తీరమున గల సాళ్వదేశ చంద్రవంశ రాజు (గాధి రాజ పుత్రుడు). చంద్రగిరిని పాలించిన ‘సాళువ’వంశ రాజులు (సాళువాభ్యుదయం – యాదవ రాజులు, వారి వద్ద మంత్రి-సేనాధిపతులుగా పనిచేసిన తుళువ-తుర్వాస వంశస్తులే తరువాతి కాలమున హంపి-విజయనగర చక్రవర్తులుగా కీర్తి గడించారు.వీరిలో సాళువ నరసింహా దేవరాయ, శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యులు. పాకనాటి ఆంధ్రులే మహామల్ల(లు)(పురం లేక మహాబలిపురంను పాలించిన) గా కీర్తి గడించిన ‘పల్లవ రాజవంశీయులు’ కూడ. మహాభారతమున యమునాతీర ప్రాంతమునకు చెందిన ‘చాణూర-ఆంధ్ర మల్లుల’ జాతీయులే. యమునా తీర ప్రాంతవాసి అగు ఆపస్తంభ ఋషి రచించిన గృహ్య సూత్రములు ఆచరించు జాతీయులు స్మార్త సాంప్రదాయమున జీవనము సాగించుచున్నారు. ఈ స్మార్త సాంప్రదాయమాచరించు ‘వైదిక బ్రాహ్మణులను’ గమనించిన వీరు ఇప్పటికీ ఆంధ్ర-తెలుగు రాష్ట్రములందే గాక మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌ఘర్, ఒడిస్సా రాష్ట్రాలలో కూడా గత 2000 – 1500 సంవత్సరముల నుంచి నివసించు చున్నారు.
పురాతన 17 మహాజానపద రాజ్యములలో, వింధ్యపర్వత దక్షిణ ప్రాంతములో గల ఏకైక అస్మాక (అస్సాక) మహాజానపద రాజ్యమే (గోదావరీ – కృష్ణా నదీ తీర సంస్కతియే ప్రస్తుత మహారాష్ట్ర, ఉత్తర-మధ్య కర్నాట, ఆంధ్ర ప్రాంతములలో) పెద్ద మహాజానపదము, మరియు బహుళాంధ్రలకు 2500 ఏళ్ళకు పైగా అవిచ్ఛిన్న రాజ్యముగా పరిఢవిల్లుతూ ఉన్నది. బింబిసార మౌర్య మొదటి సారిగా ఈ అస్మాక మహాజానపదమును ఆక్రమించినను, తదుపరి శాతవాహనుల రూపేణ మరల అవిచ్ఛన్న అస్మాకాంధ్రము పునరుధ్ధరింపబడినను, కాలక్రమేణ తిరిగి విచ్ఛిన్నమగుచు చివరకు తెలుగు భాషా ప్రయుక్తముగా మాత్రమే ‘ఆంధ్రము’గా మిగిలి ఉన్నది. అందుకనే, ‘ఆంధ్రము” అంటే ‘జాతి’ సమూహముగా మొదలై వింధ్య పర్వత ‘దక్షిణ’ ప్రాంతమంతా అస్మాకాంధ్రలుగా బహుళంగా విస్తరించి చివరకు ‘తెలుగు’ భాషా ప్రయుక్తులుగా ఉభయ తెలుగు రాష్ట్రములకు పరిమిత మయినారు.
అందువలన, ‘ఆంధ్రము”అంటే జాతి మరియు ‘తెలుగు భాష’ అని అర్థములు సమంజసమే. నన్నయ్య గారు మహాభారతమును ‘ఆంధ్రీకరించినారు’ అన్నప్పుడు ‘తెలుగు’ లోకి అనువాదం చేసారు అనే అర్థం వస్తోంది కదా. అయితే ‘దక్షిణం’ అనే అర్థం అసమంజసము గానే అగుపిస్తుంది. ఇప్పటికీ తెలుగు మాట్లాడే ఆంధ్ర జాతీయులు తూర్పు-ఈశాన్య కర్నాటక, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఒడిషా, దక్షిణ ఛత్తీస్‌ఘర్ (మహా కోసల), విదర్భ-మరాత్వాడ ప్రాంతములో అనాది కాలము నుండి ఇప్పటి వరకు కూడ జీవిస్తున్నారు. తెలుగు వారి (ఆంధ్రుల) జానపధ కధలు అన్నీ ఎప్పటినుంచో ‘ఉజ్జైని’లో మొదలైన కధలు ఇప్పటికీ ’కంచి’లో ముగుస్తున్నయి. కాబట్టే అలా వచ్చినదే మన తెలుగు వారి (ఆంధ్రుల) నానుడి “కధ కంచికి మనము ఇంటికి’.