[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 51వ భాగం. [/box]
మోహన్ చారిత్రక నవల-3.5
[dropcap]“వ[/dropcap]సభుడు నలబై నాలుగేళ్లు నిరాటంకంగా ద్వీపాన్ని పాలించాడు. ఎన్నో శాసనాలు చెక్కించాడు. ఇతని తరువాత ఇతని మిత్రడు వంకనాసికతిస్సుడు రాజ్యానికి వచ్చాడు.”
“అనురాధపురం రాజధానిగా చేసుకొని వంకనాసికతిస్సుడు ద్వీపం ఉత్తర భాగాన్ని పాలించుతూ ఉంటే అతని సోదరులిద్దరూ మిగిలిన భాగంలో స్వతంత్రమైన రాజ్యాలు స్థాపించి పాలించసాగారు.
“ఈ విధంగా రాజ్యం చీలికలైనప్పుడు కరికాల చోళుడు సింహళ ద్వీపం మీద దండెత్తాడు. వంకనాసికతిస్సుని కుమారుడు గజబాహుక గామణి. ఇతనిని గజబాహువని పిలుస్తారు. ఇతడు సింహళాన్ని పూర్తిగా తన ఏలుబడిలోకి తీసుకున్నాడు, ఇరవై రెండు సంవత్సరాలు పాలించాడు. అంతటితో ఆగక ఇతడు చోళ దేశం మీద దండయాత్ర జరిపాడు.”
“ఈ దండయాత్రకు ఒక వృద్ధురాలు కారణమని చెప్తారు. ఆ ముసలి ఆమె కొడుకును శత్రువులు ఎత్తుకుపోయారు. తనకు కలిగిన విపత్తును తలచుకొని ఆమె ప్రతి రాత్రి ఏడుస్తూ ఉండేది. మహారాజు ఈ విషయం తెలుసుకొని విచారణ జరిపాడు. అందులో ఒక విషయం స్పష్టమయింది. చోళుల దండయాత్రలో సింహళం తీవ్రంగా ధ్వంసమయింది. అతడు తనతో మహాబలవంతుడైన అనుచరుడిని తీసుకొని చోళ దేశం మీద దాడి సలిపి, వారి రాజధానిని కూడా స్వాధీనం చేసుకున్నాడు. చోళల కీర్తిని నాశనం చేశాడు. చివరకు రెండు పక్షాల వారు సమాధానానికి వచ్చి సంధి చేసుకున్నారు. యుద్ధంలో పట్టుబడిన సింహళులను స్వదేశానికి పంపివేశారు.”
“తరువాత దక్షిణ భారతానికి సింహళానికి సత్సంబంధాలు నెలకొన్నాయి”.
“గజబాహువు మరణానంతరం ఆరుగురు రాజులు సుభిక్షంగా పాలించారు. వారిలో మహారాజు తిస్సుడు ధైర్యసాహసాలతో ఇరవై రెండు సంవత్సరాలు పాలించాడు. ఇతడు నేరస్తులను విధించే అంగచ్ఛేదశిక్షను తొలగించాడు. అందుచేతనే ఇతనిని వోహారిక తిస్సుడని అంటారు. ఇతని కాలంలో సింహళంలో మతపరంగా తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డవి.”
“మహాయాన సిద్ధాంతాన్ని మహావంశంలో వేతుల్యవాద మంటారు. దీప వంశంలో దీనిని వితండ వాదమంటారు. అభయగిరి విహారానికి చెందని బౌద్దులు దీనికి అనుకూలంగా వ్యవహరించారు. మహావిహారానికి చెందిన భిక్షువులు దీనిని ప్రతికూలించారు.”
“వోహారిక తిస్సుడు మహావిహారవాసుల మాటలకు చెవి ఒగ్గి, కొత్త సిద్ధాంతాన్ని అణచివేసి, దానిని అనుసరించిన వారిని దేశం నుండి బహిష్కరించాడు. వోహారిక తిస్సుడు చేసిన ఈ పొరపాటు భావి కాలంలో స్పర్థలకు కారణమయింది.”
“వోహారిక తిస్సుని మృత్యువు మనసును బాధ పెడుతుంది. అతని తమ్ముడు అభయనాగుడు వదినగారైన రాణితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఒకరోజు ఆ సంబంధం బయట పడింది. అతడు దక్షిణ భారతానికి పారిపోయాడు.”
“అభయనాగుడుకి ఒక బంధువు సహాయం చేశాడు. కొదరు తమిళులు వెనుక నిలబడ్డారు. అతడు సింహళం మీదికి దండెత్తి, అన్నను చంపి, రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. విధవయైన రాణిని పెళ్లి చేసుకొని ఎనిమిది సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు.”
“వోహారిక తిస్సుడికి సిరినాగుడన్న కుమారుడు, విజయుడన్న మనుమడు ఉన్నారు. వీళ్లు ఒకరి తరువాత ఒకళ్లు మూడు సంవత్సరాలు రాజ్యం చేశారు. లంబకణ్ణ వంశానికి చెందిన ఇద్దరు తిరుగుబాటు దారులు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. రాజ్యం ఒడిదుడుకులలో పడింది. సిరినాగుడి కుమారుడు గోఠాభయుడు. ఇతడు మహాసాహసి. ఇతడు పదమూడేళ్లు రాజ్యం చేశాడు.”
“ఇతని కాలంలో సంప్రదాయ విరుద్ధమైన వేతుల్యవాదం తిరిగి ప్రాముఖ్యతకు వచ్చింది. అభయగిరి విహారానికి చెందిన బిక్షకులు దీనిని బలపరిచారు. గోఠాబయుడు ఈ సిద్ధాంతాన్ని నిషేధించాడు. దీనిని అనుసరిస్తున్న అరవై మంది భిక్షువులను దోషులుగా పరిగణించి వాళ్లను దేశం నుండి బహిష్కరించాడు.
“సంఘ మిత్రులు వేతుల్యవాద సిద్ధాంతాన్ని అనుసరించిన వారు. వీరు రాజాదరాన్ని పొందారు. గోఠాభయ మహారాజు పుత్రులైన జేట్ఠ తిస్సనకు, అతని సోదరులైన మహా సేనులకు వీరు గురువులు. మనం ఇప్పుడు జేట్ఠ తిస్సమహారాజుగారి పాలనలో ఉన్నాం.”
“ఇదీ సింహళ దేశ రాజ చరిత్ర – శ్రమణా! మీకు తెలియనిది లేదు. నేను పెద్ద వాళ్లనుండి వినన సంగతులు మీకు సంక్షేపంగా తెలిపాను”.
శ్రమణుడు కళింగ భూపతి చెప్పిన విషయాలు చాల శ్రద్ధగా విన్నాడు.
వేతుల్య వాదులను జేట్ఠ తిస్సమహారాజు ఆదరించాడా?
మహా విహార వాసులైన భిక్షువుల గతి ఏమయింది? కళింగ భూపతిని ఈ ప్రశ్నలు వేయకముందే అతని లేచిపోయుడు. నాలుగు దినాలయి చెప్తున్న సింహళ రాజచరిత్రను విశ్రాంతి మందిరంలోనున్న పరిచారకులలో ఒకడు పొంచి వింటున్న సంగతి శ్రమణుడికి తెలుసు. కళింగ భూపతికి తెలుసు. గతం గురించి తెలిసినా వర్తమానం గురించి తెలియకుండా పోయింది.
రాత్రి కొద్దిగా వర్షం తగ్గింది.
మరునాడు ఉదయం శ్రమణుడు కాల్యాలు తీర్చుకొని, స్నానాదులు ముగించి త్రిరత్నాలు స్తుతి చేసి వీథిగదిలో ఉన్న రోగిని పరీక్ష చేస్తుంటే మహారాజుగారి అంగరక్షకుడు యశోనిధి వచ్చాడు. అతడు చాల సంకట స్థితిలో ఉన్నట్లుంది. అతని జుత్తు చెదిరిపోయింది. నిద్ర లేక కళ్లు లోతులకు పోయి ఎరుపెక్కాయి. రోగి వెళ్లిపోయిన తరువాత అతడేదో శ్రమణుడితో చెప్పడానికి ప్రయత్నించాడు. ఎవరో పరిచారకుడు కనిపిస్తే ఆగిపోయాడు. పరిచారకుడు కనుమరుగైన వెంటనే అతడు శ్రమణుడి చెవిలో రెండు మాటలు గొణిగాడు.
“వనిత మృత్యువు, వనిత మృత్యువు.”
పిమ్మట వర్షంలో తడుసుకుంటూ యశోనిధి వెళ్ళిపోయాడు.
(సశేషం)