ప్రేమించే మనసా… ద్వేషించకే!-2

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]శ[/dropcap]రీరం నిలువునా వణికిపోవటం ప్రారంభించింది. ఇన్నాళ్లు ఏది జరగకూడదు అనుకుందో అది జరిగింది. తనలా తన కూతురు ప్రేమ అనే పిచ్చి వ్యామోహంలో పడలేదు అని సంతోషిస్తున్న సమయంలో ఈ విపరీతం ఏమిటి?

ఒక్కగానొక్క కూతురు కావటం వలన తను గారాబం చేసిన మాట నిజమే. సునీత కోరింది తను ఏదీ కాదనలేదు. అంత గారాబం చేసినా మారుతున్న కాలంలో కూడా తన మాటకు విలువనిచ్చే సునీత అంటే తనకు ప్రాణం. కాని తను ఏది జరగకూడదనుకుందో అదే జరిగింది. ఈ రోజు సునీత నోటి మీదుగా చెబుతున్నదేమిటి?

“మమ్మీ” అంది మెల్లగా సునీత.

“నేను భరించలేను… నేను చస్తే ఈ పెళ్లికి ఒప్పుకోను్ సునీతా” అని పిచ్చిదానిలా అరిచింది సుజాత.

“మమ్మీ… నువ్వు… నువ్వేనా యిలా మాట్లాడుతున్నవ్! నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఏది కావాలంటే అది తెచ్చి యిచ్చే నువ్వేనా యిలా మాట్లాడుతున్నది. ప్రతి నిముషం నా బాగోగులు, నా క్షేమం కోరే నువ్వేనా ఇలా మాట్లాడేది?” అంది ఆవేశంగా సునీత.

“అందుకేనమ్మా! నేను యింత బాధ పడేది! నేను బ్రతికి వున్నది నీ కోసమే. నువ్వు కావాలంటే నా ప్రాణాలయినా ఇస్తాను. కానీ యీ పిచ్చి ప్రేమ జోలికి పోకమ్మా! అదంతా బూటకం. నా మాట వినమ్మా! హైద్రాబాదు సంబంధం నచ్చక పోతే ఇంకో సంబంధం, ఇంకోక సంబంధం చూద్దాం. అంతే కాని…” అంది బాధ మిళితమైన స్వరంతో సుజాత.

“లేదు మమ్మీ! ఇది ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు” అంది సునీత భయం భయంగా సుజాత వంక చూస్తూ.

“సునీతా!” అని ఆవేశంగా అరచింది సుజాత. “నువ్వేం నాకు చెప్పొద్దు! నేను చస్తే ఈ పెళ్లికి ఒప్పుకోను. నీకు తెలియదమ్మనా ఆవేదన” అంది.

“మమ్మీ! నువ్వు ఇందులో యింత బాధపడటానికి కారణం ఏమిటో అర్థం కావటం లేదు. నేను ప్రేమించిన వ్యక్తి అందరిలాంటి వాడు కాదు మమ్మీ! చాలా ఉత్తముడు. సహృదయుడు” అంది సునీత తల్లి వంక ఓరగా చూస్తూ.

“ప్చ్!…. ప్లీజ్ సునీతా ఇంకేం చెప్పకమ్మా” అని చెవులు రెండు చేతులతో మూసుకొని కళ్ల వెంట కన్నీరు కారుతుంటే రెండడుగులు ముందుకు వేసి “నా బంగారు తల్లివి గదూ, ఈ ఒక్క విషయంలో నా మీట వినమ్మా ప్లీజ్ యూ ఫర్‌గెట్ దట్ ధింగ్ ప్లీజ్ సునీతా!” అని ఆవేశంగా పిచ్చిదానిలా అంది.

“నో మమ్మీ, ఐ డోంట్ ఫర్‌గెట్. ఐ విల్ మారీ హిమ్” అంది సునీత.

అంతే సునీత రెండు చెంపలు ఎడాపెడా వాయకొట్టి “అయితే నా మాట వినవా? ఇంకా నేను ఎందుకు బ్రతికి వున్నాను భగవంతుడా?” అని పిచ్చిదానిలా తల కొట్టుకుంటూ రోదించసాగింది.

సునీత కళ్ల నుండి కన్నీళ్లు చెంపలు మీదుగా జారుతున్నాయి. వాటితో సంబంధం లేనట్లు “మమ్మీ ఐ వాంట్ టు నో వన్ థింగ్. అసలు నీ దృష్టిలో ప్రేమించిన రెండు హృదయాలు దగ్గరై ఒకటి కావటం నేరమా? అదే నీ దృష్టిలో నేరమైతే అసలు నేను వివాహమే చేసుకోను. టెల్ మీ మమ్మీ” అని ఆవేశంగా అడుగుతున్న కూతురి వంక ఒక్క నిముషం అయోమయంగా చూసింది సుజాత.

“ప్చ్!… నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదమ్మా! ప్రేమ నేరం కాదు. సృష్టిలో అది తీయనిది. పవిత్రమైన వరం ప్రేమే అనుకున్నాను. ఇప్పుడు కాదు… నీలాగే నేను బాధ్యత, బరువు, సుఖదుఃఖాలు ఏమీ తెలియని వయసులో.”

“ఒక పురుషుడి చేత స్త్రీ ప్రేమించబడటం, రెండు హృదయాలు దగ్గర కావటం, సృష్టిలో అంతకు మించిన వరం, అంతకు మించిన గొప్పతనం మరొకటి లేదని విర్రవీగానమ్మ! పచ్చకామెర్ల దానిలా నా రెండు కళ్లకు తల్లి తండ్రులు, సంఘం కనిపించలేదమ్మా!”

“నాకు కళ్లు మూసినా తెరిచినా కనిపించింది ఒక్కటే ప్రేమ! ప్రేమ! ప్రేమ!”

“నా కోసం రేయింపగళ్లు ఆర్తిగా ప్రేమగా తన హృదయంలో దాచుకునే వ్యక్తి ఎదురు చూస్తున్నాడనే తప్ప నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి, అనుక్షణం నా బాగోగులు కోసం ఆరాటపడే తండ్రి ఉన్నాడని మచ్చుకైనా గుర్తు రాలేదు.”

“సునీతా! యిన్నాళ్లు… ఈ యిరవై ఏళ్లు… నాలో… నాలో నేనే కుమిలిపోతున్నా… నా గుండెని పిండుతున్న బాధ ఉందమ్మా! అసలు నీకు చెప్పవలసిన అవసరం వస్తుందని నేను కలలో కూడా అనకోలేదు. కాని ఈ రోజు చెప్పక తప్పటం లేదు.”

“ఐ వాంట్ టు టెల్” అని ఒక్క నిముషం తన ఉనికిని మరచిపోయిన దానిలా అచేతనంగా కుర్చీలో వెనక్కి వాలిపోయింది. ఆమె కళ్లు గతం తాలూకా జ్ఞాపకాల దొంతరలు తిరగవేస్తున్నట్లు తీక్షణంగా శూన్యంలోకి చూడసాగాయి.

***

“సుజీ నువ్వు నిన్న కాలేజీకి రాలేదు కదూ! ఒక్క నిముషం క్లాసులో కూర్చోలేకపోయాను తెలుసా? ఇలా నాతో చెప్పకుండా ఇంకోసారి కాలేజీ ఎగగొట్టను అని మాట ఇవ్వు!” అని చేయి చాచి అడుగుతున్న సుదర్శన్‌ని చూసి నవ్వాపుకోలేకపోయింది. సుదర్శన్ ముఖం మాడిపోయింది.

“అవున్లే సుజీ నాలాంటి పిచ్చి ప్రేమికుడిని చూస్తే నీకు నవ్వులాటే.” నిష్ఠూరంగా అని చెట్టు క్రింద నుంచి లేవబోయాడు.

నవ్వుతున్న సుజాత గభాలున పైకి లేచి సుదర్శన్ చెయ్యి పట్టి లాగింది కూర్చోమన్నట్లు.

“ప్లీజ్! సుదర్శన్, నువ్విలా నేను కాలేజీ మానేసినప్పుడల్లా బాధపడితే ఎలా చెప్పు? మా బాబాయి కొడుక్కి ఒడుగు అయితే వెళ్లాను. నాకు ముందు తెలియనే తెలియదు. అప్పటికప్పుడు నాన్నగారు బయలుదేరమన్నారు” అని చెబుతున్న సుజాత కళ్లు కోటికాంతులు నిండుకున్నాయి.

తనని ఒక్క రోజు కూడ చూడకుండా వుండలేని సుదర్శన్‌ని చూస్తూంటే ఎంతో గర్వం అనిపించింది. తనెంత అదృష్టవంతురాలు!

“సుజీ నాకు ఒక్కటే భయంగా వుంటుంది. ఆగర్భ శ్రీమంతురాలువి నువ్వు. అందులోకి నిష్ఠ నియమం గల అగ్రకులం. నేను చూస్తే…………”

“ప్లీజ్ సుదర్శన్. ఇంకోసారి నువ్వా మాటలు అనవద్దని ఇప్పటికి లక్షా తొంభై సార్లు చెప్పాను. నాకు కావలసింది నువ్వు. అంతే కాని నీ కులం… నీ డబ్బు… హోదా కాదు… మా డాడీ ఒప్పుకుంటే సరి… లేకపోతే వేరే మార్గం ఉండనే ఉంది.” అలా చెబుతున్న సుజాత కళ్ళల్లో వెలుగుతున్న నిశ్చలకాంతి చూసి సుదర్శన్ మనసు కుదటపడింది.

***

హాల్లో తండ్రి పరమేశ్వరరావుగారు వంటవాడి మీద పెద్దగా కేకలు వేస్తున్నారు.

వంటవాడు చేతులు రెండు మడిచి కట్టుకొని తల వంచి నేలచూపులు చూస్తున్నాడు.

“ఏమిట్రా నువు చేసింది. గోత్రం అన్నీ చెప్పావు… మా యింటి నియమం నిష్ఠ అన్నీ తెలుసు! నీ కెంత ధైర్యం రా! దాని నెవతినో తెచ్చుకున్నావట… పెళ్ళాం పోయినాకే – ‘పెళ్లాం పోయింది, ఈ వయసులో నాకు పెళ్లెందుకు బాబు… మీ లాంటి పెద్దవారి యింట వంట చేసుకుని బ్రతికితే చాలు’నన్న వాడివి…. ఇలాంటి వెధవ వేషాలు వేస్తావా? తక్షణమే పో! ఏదో ఒంటరి వాడివి కదా అని పెరటిలో గది ఖాళీగా ఉంటే ఇస్తే!… మూట ముల్లు సర్దుకో” అని కోపంగా కేకలు వేస్తున్నారు.

“అయ్యగారు… అయ్యగారు… అంత మాట అనకండి” అని వంటవాడు ప్రాధేయపడసాగాడు.

“ఛస్!…. ఇంకో నిముషం నా కళ్ళముందు ఉండవద్దు. ఇక్కడ నుండి తక్షణమే పో” అన్నారు కోపంగా పరమేశ్వరరావుగారు.

“అయ్యా! ఈ ఒక్కసారి క్షమించడయ్యా! ఆ రోజు ఎంత వద్దు అనుకున్నా ఈ వెధవ శరీరం కక్కుర్తి పడింది. ఇంకెపుడు యిలా కక్కుర్తి పడకుండా చూసుకుంటాను.”

ఈసారి పరమేశ్వరరావుగారి కోపం తారాస్థాయి నందుకుంది. “నోరుముయ్! ఈ పరమేశ్వరరావు అన్న మాటకి తిరుగు లేదు. మాటంటే మాటే. అన్న మాటని వెనక్కి – నీ ఒక్క విషయం లోనే కాదు, నా స్వంత వాళ్ల విషయంలో నయినా అంతే. వెళ్లు గది ఖాళీ చెయ్!” అని సుజాత అక్కడకు వచ్చిందన్న ఉనికిని కూడా చూడకుండా రయ్ మని అక్కడ నుంచి లేచి తన గదిలోకి వెళ్లిపోయారు.

ఒక్కనిముషం సుజాతకు తల దిమ్మెరెక్కిపోయినట్లయింది. అంత వరకు తన తండ్రి మాట్లాడింది వంటవాడి విషయంలో కాకుండా తనను వుద్దేశించే అన్నట్లు అనిపించింది.

తండ్రి మాటల్లో నిజం లేకపోలేదు అనిపించింది. చిన్నతనం నుండి తను చూడటం లేదూ. వ్యాపార విషయంలోనే కాదు చివరకి భార్య విషయంలో తన మాటకు తిరుగులేనట్టు ప్రవర్తిస్తాడు.

అన్నీ తెలిసీ తను ప్రేమ అనే మైకంలో పడిందా? ‘ఉహూ కానే కాదు తనెంత అర్థం లేకుండా ఆలోచిస్తుంది. ఎంత మందికి అష్టఐశ్వర్యాలు, భోగభాగ్యాలు వుంటే మాత్రం సుదర్శన్ లాంటి వ్యక్తి భర్తగా దొరుకుతాడు? మనిషికి చివరిదాక కావలిసింది సుఖసంతోషాలు కాని ఐశ్వర్యం… అంతస్తు… హోదా ఇదేం కాదు. స్త్రీకి ముఖ్యంగా కావలసింది భర్త ప్రేమ… అనురాగాలు.’

తనకు ముఖ్యంగా కావలసింది ఇవే. అందుకే తను సుదర్శన్‌ని మనసారా ప్రేమించింది.

మొదటి నుంచి తనకు తల్లి దగ్గర చనువు ఆప్యాయత లభించలేదు. తన తల్లి తండ్రిని చూస్తేనే గజ గజ ఒణికిపోతుంది.

“పిల్లలకు అతిగా గారాబం, చనువు ఇస్తే పాడు చేసినట్లే అవుతుంది. నేను ఇంట్లో లేనని వాళ్లని అతి గారాబం చేయటం గాని దగ్గరకు తీసుకొని ముద్దు చేసి నెత్తి నెక్కించుకున్నావో, నాకంట ఎప్పుడైనా పడిందో ఊరుకునేది లేదు. జాగ్రత్త” అని మాష్టారు పిల్లలకు ఆర్డరు వేస్తే బుద్ధిమంతులైన విద్యార్ధులు తు.చ. తప్పకుండా విన్నట్లు తండ్రి మాటలు వినేది అమాయకురాలు తల్లి. అంతకి పిల్లల మీద ప్రేమ అనురాగాలు కురిసినపుడు దొంగచాటుగా ముద్దుల వర్షం కురిపించే తల్లంటే తనకి, చెల్లెలు సుమతికి అంతులేని అనురాగం, జాలి.

తన తల్లిని చూస్తుంటే ఎందుకో ఒక్కొక్కసారి మనసంతా చెల్లాచెదురై ఇంత వయసులో కూడా తండ్రి ఎదుట ధైర్యంగా నిలబడలేని తల్లి అమాయకత చూస్తుంటే చెప్పలేని జాలి కలిగేవి.

ఇక తండ్రిని చూస్తే ప్రేమ, ఆప్యాయత అటుంచి భయం చోటు చోసుకునేది.

అటువంటి సమయంలో ప్రేమ, అనురాగాలు చవిచూడటం ఒక గొప్ప వరంగా భావించింది సుజాత.

సుదర్శన్ కళ్లలో తనంటే ఎంత ప్రేమ, అనురాగాలు. ఒక్క నిముషం కనిపించకపోతే ఆ కళ్లల్లో గూడు కట్టుకున్న నిరాశ, నిస్పృహలు కొట్టవచ్చినట్లు కనబడేవి సుజాతకు.

ఆలోచనలతోనే ఆ రాత్రి సరిగా నిద్రపోలేకపోయింది సుజాత.

మరునాడు ఎండ బాగా వచ్చినాక లేచింది. ముఖం కడుక్కొని, స్నానం చేసి, హడావిడిగా తయారై బుక్స్ పట్టుకొని హలులోకి వచ్చేటప్పటికి తండ్రి ఎదురు వచ్చాడు.

అప్పటికే ఎక్కడికో పని మీద వెళ్లి వచ్చినట్లున్నారు. హాలులో అటు నుండి ఇటు, ఇటు నుండి అటు పచార్లు చేయసాగారు పరమేశ్వరరావుగారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here