[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]
మనసున కాచిన వెన్నెల-2
[dropcap]మ[/dropcap]హా శూన్యానికి మారు రూపంలా వుంది రాధమ్మ.
అప్పటికి మూడు రోజులయ్యింది అతడు కనిపించక.
ఉదయానే పొగమంచులో దిగంతాల పరిమళాన్ని ఆస్వాదిస్తూ వెన్నెల గానాన్ని ఆలాపిస్తూ అతని స్మరణలో బాల్కనీలో కూర్చునే రాధమ్మ అస్తమించే శశిని, ఉదయించే రవిని ఒకేసారి చూడటం జరుగుతోంది కాని నులి వెచ్చని ఊహలతో తన మనసులో వెన్నెల కురిపించే ఆమె చెలికాడి జాడే లేదు.
అయినా ప్రేమ కనిపించనక్కర లేదు… వినిపించనక్కరలేదు.
అదొక హృదయానుభూతి.
ఆ అనుభూతికి ఊహల రెక్కలు చాలు. హృదయ విహంగాన్ని గగన విహారం చేయించటానికి.
వున్నట్టుండి రాధమ్మ ఏదో గుర్తొచ్చి స్మిత వదనంతో కాసేపు నవ్వుకుంటుంది.
అంతలోనే ఎందుకో నొచ్చుకుని దిగాలు పడుతుంది.
లోపల చిత్తడి చేసే అలజడికి తడబడి అమాంతం ఎవరిగానో భ్రమిస్తున్న అతనికి ఫోను కలుపుతుంది.
శ్వేతకు మాటిచ్చిన పాలవాడు రాధమ్మ పిలుపుకి స్పందించడు.
ఫోను కలవక తన హృదయాలాపనను అతనికి చేరవేయలేక దిగులుతో కుంగి పోతుంది రాధమ్మ. అతను లేకుండా ఎలాగని కొంత ఆందోళనకు గురవుతుంది. అసలు అతను తనకింకా మిగిలే వున్నాడాని ఒకింత అస్థిమితం అవుతుంది. అంతలోనే అతని గోరువెచ్చని ఆలింగన స్పర్శను అనుభూతించి ఆవాహన చేస్తుంది. అనిర్వచనీయమైన తాదాత్మ్యంలో ఏ మహాకవి ఊహలకు అందనంత సమ్మోహనంగా ఇంద్రియాతీత ఆనందాన్ని ఆస్వాదిస్తుంది.
చిత్రవిచిత్ర భావోద్వేగాలతో రాధమ్మ ఏ క్షణం ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు.
శ్వేత పాలవాడిని మానిపించటమే కాకుండా కాశీకి, పనిమనిషి యాదమ్మకి, వంట మనిషికి గట్టిగా వార్నింగు ఇచ్చింది. పాలవాడికి అమ్మమ్మకి మధ్య రాయబారం నడప వద్దని.
వాళ్ళంతా శ్వేత మాటను శిరసా ఆచరిస్తారు.
ఆ రోజు రాధమ్మ పుట్టినరోజు. తన తలపుల్లో ఇప్పటికీ పరిమళిస్తున్న ఏవేవో పురా స్మృతుల్లో రాధమ్మ మంచు పల్లకీలో తూగుతోంది. ఆమె మనసు మనసులో లేదు. ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా వుంది. తిండి సయించదు. నిద్ర పట్టదు. తన ప్రేమను అర్థం చేసుకోలేని ప్రపంచం పైన విరక్తిగా వుంది రాధమ్మకు. ఆమె గుండె సవ్వడిని వినే వారెవరూ లేరు. ఆమె బాధను పంచుకునే తన వారెవరూ లేరు.
యాదమ్మ ఒక్కర్తీ తన మనసును ఎంతో కొంత అర్థం చేసుకుని ఆమె వ్యథను వింటుంది. శ్వేతకు ఆమె విషయాలు చేరవేయటానికే వింటుందని రాధమ్మకు తెలియదు.
అతడిని భార్యా సమేతంగా భోజనానికి ఆహ్వానించి దంపతులిద్దరికీ బట్టలు పెట్టాలి. ముందు రోజు కాశీతో చర్చించింది వాళ్ళకు బట్టలతో పాటు డబ్బు ఇస్తే బావుంటుందా లేక ఏమయినా నగ ఇస్తే బావుంటుందా అని.
కాశీ కంగారు పడి శ్వేతకు కాల్ చేసాడు. రాధమ్మ దగ్గర ఆ వయసులో బంగారం ఎందుకు వుంచారంటూ రాధమ్మ బుర్ర సరిగ్గా పని చేయటం లేదంటూ వాపోయాడు.
పాలవాడు ఇంటి దరిదాపులకు రాడని, రాధమ్మ ఫోను తీయడని, కంగారు పడవద్దని శ్వేత కాశీని సముదాయించింది.
రాధమ్మ పుట్టినరోజని బంధువులంతా వచ్చారు. భోజనాలు చేసారు. రాధమ్మకు చీరలు కూడా తెచ్చారు. కాని రాధమ్మ అస్థిమితంగా అశాంతిగా వుంది. ఎందరు వచ్చినా తన మనసుకి నచ్చిన తను కోరుకుంటున్న అతను లేడు. రాధమ్మ ఫోను చేస్తే అతను రెస్పాండ్ అవటం లేదు. చాలా నిస్సహాయంగా వుంది.
ఎలా అయితే పిచ్చివాళ్ళు ఒక్కోసారి అఖండమైన తెలివిని ప్రదర్శిస్తారో అలాగే అమ్నేషియా వ్యాధిగ్రస్తుల మెదడు ఒక్కోసారి చురుగ్గా అతి తెలివిగా పని చేస్తుంది. ఆతిథ్యానికి వచ్చిన అక్క మనుమరాలి ఫోనుతో అతడికి ఫోను చేసింది. తెలియని నంబరు అవటంతో అతను బదులిచ్చాడు.
రాధమ్మ మొహంలో కోటి కాంతులు. ముడతలతో ముకుళించిన ఆ పసిడి మోము కెంజాయ ఛాయలో విప్పారింది. అది ఏ చిత్రకారుని కుంచెకూ అందని ఆనందోద్వేగం.
“నువ్వు నీ భార్యతో సాయంత్రం భోజనానికి తప్పకుండా రావాలి. ఇవాళ నా పుట్టినరోజు. నీ కోసం ఎదురు చూస్తుంటాను…” ఆనందంతో వెలిగిపోతున్న ఆ పిచ్చి తల్లి మొహం చూస్తే ఎంతటి శత్రువుకైనా ఆమె సంతోషం కోసం ఏం చేసినా తప్పు లేదనిపిస్తుంది.
తెలియని నంబరు నుండి వచ్చిన అనుకోని రాధమ్మ కాల్ కి పాలవాడు ఖంగు తిన్నాడు. కొంత శ్వేతకు భయపడ్డాడు కూడా.
“అట్నే వస్తనమ్మా..” అని వెంటనే ఫోను డిస్ కనెక్ట్ చేసేసాడు.
ఆ కురు వృద్ధురాలి ఆనందానికి అవధులు లేవు.
వచ్చిన బంధువులు ఎప్పుడెప్పుడు వెళ్ళి పోతారా అని ఎదురు చూసింది.
కాశీ కలవరానికి అంతు లేదు. ఎక్కడ సాయంత్రం పాలవాడు వస్తే రాధమ్మ ఏమేమి ఇచ్చేస్తుందోనని కాశీ ఆందోళన.
పాలవాడు నిజానికి రాలేదు. కాని రాధమ్మ ఊహల్లో వచ్చాడు. రాధమ్మ చేతి విందు ఆరగించాడు. ఆ సమయంలో రాధమ్మ ఇంటి లోపలికి అందరి ప్రవేశం నిషేధించింది. ఆ సమయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదామని చేసిన శ్వేత ఫోను కూడా తీయలేదు.
మళ్ళీ రాధమ్మ మరెవరి ఫోను నుండైనా పాలవాడికి ఫోను చేయవచ్చని అనుమానించిన కాశీ రాధమ్మ డైరీలో పాలవాడి నంబరులో ఒక అంకెను దిద్ది మార్చేసాడు.
తనను చూడటానికి ఇంటికి ఎవరు వచ్చినా, వారి ఫోను నుండి ప్రయత్నించే రాధమ్మకు తెలియదు తన డైరీలో వున్నది తన గుండె చప్పుడుని అతనికి చేరవేయలేని ఒక కలవని రాంగు నంబరని…
రాధమ్మ పాలవాడు పాలు వేయటం మానేయటానికి కారణాలు ఆలోచిస్తోంది.
ఇప్పుడు రాధమ్మ దృష్టిలో శ్వేత, కాశీలతో సహా అందరూ అనుమానాస్పదులే…అందరూ శత్రువులే. రాధమ్మకు చురకత్తుల్లాంటి కెమెరాల నిఘాలో తను శత్రు కూటమిలో చిక్కుకుపోయిన భావన.
పిచ్చివాళ్ళకు తెలివెక్కువంటారు. పాలవాడు రాకపోవటానికి కారణం ఇంట్లో పెట్టిన కెమెరాలని రాధమ్మకి అనుమానం రాజుకుంది.
శ్వేతకు పాలవాడు రావటం మానేసాడని ఫిర్యాదు చేసింది.
“అతనికి కరోనా వచ్చిందట. అందుకే మానేసాడు. ఈ వయసులో నీకు కరోనా సోకితే కోలుకోవటం కష్టం. పది ఇళ్ళల్లో పాలు వేసే వాళ్ళకి, పైగా కరోనా సోకిన వాళ్ళకి ఎంత దూరంగా వుంటే అంత మంచిది..” అంది శ్వేత పాపం పాలవాడికి లేని కరోనాను అంటగట్టి.
ఆ మాట విన్న రాధమ్మ దుఃఖం అంతకంతకూ పెరిగిపోయింది.
అతనికి కరోనా వచ్చిందన్న కఠోరమైన మాటను తట్టుకోలేక రాధమ్మ చెప్పలేనంత మానసికోద్వేగానికి లోనయ్యింది.
కరోనాతో ఇబ్బంది పడుతూ అతను చికిత్స కోసం డబ్బుకి ఎంత అవస్థ పడుతున్నాడోనన్న దిగులు ఆమెకు అంతకంతకూ ఎక్కువయ్యింది.
ఏదో విధంగా పాలవాడికి అందచేయాలని పాతిక వేలు కట్ట కట్టి పెట్టింది. తెలివిగా ఎవరికో వడ్డీకి అడిగాడు ఈ డబ్బు అతనికి అందచేయాలంటూ యాదమ్మని, వంటమనిషిని సాయం అడిగింది.
వారెవరూ ఆమె కోరికను మన్నించక పోవటంతో రాను రాను రాధమ్మకి అందరూ కలిసి తనను అతనికి దూరం చేయటానికి ఏదో కుట్ర పన్నుతున్నారన్న అనుమానం బలపడింది.
కాశీని కెమెరాలు తీయించేయమని వేధించసాగింది.
తనను చూడటానికి తరచూ వచ్చే మనుమలను కెమెరాలు తీసేయమని ప్రాధేయపడింది.
“కెమెరాలు తీయించకపోతే నేను ఇల్లు మారిపోతాను. చుట్టూ గురి పెట్టిన తుపాకుల్లా ఈ కెమెరాల మధ్య నాకు స్వేచ్ఛ లేని ఈ ఇంట్లో నేనుండలేను. ఈ ఇల్లు నాకు జైలులా వుంది” అంటూ రాద్దాంతం చేయటం మొదలు పెట్టింది.
ఎవ్వరూ తన మనసును అర్థం చేసుకోవటం లేదని, తన గోడును వినిపించుకోవటం లేదని తను ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవటమొక్కటే మార్గమని నిర్ణయించుకుంది.
కాశీ “మీ కజిన్ ను పిలిపించండి. ఏదోటి మాటాడుతూ ఒక మనిషి తోడుగా వుంటే రాధమ్మకి మైండ్ కొంచం డైవర్ట్ అవుతుంది” అని శ్వేతకు సలహా ఇచ్చాడు.
ఎన్ని విధాలుగా సముదాయించినా ససేమిరా రాధమ్మ అందుకు ఒప్పుకోలేదు.
పైగా రాధమ్మ “నీకు తెలియదయ్యా, ఆ పిల్ల అతను వచ్చినప్పుడు గుడ్లప్పగించి చూస్తుంది. అతను చాలా ఇబ్బంది పడి ఇంటికి రావటానికి మొహమాట పడుతున్నాడు. అందుకే పంపేసాను. మళ్ళీ ఈ మాట ఎవరి దగ్గరా అనకు” అని నమ్మిన బంటు కాశీకి రహస్యంగా చెప్పింది.
ఇంట్లో వున్న అమ్మాయిని రాధమ్మ వద్దని పంపించేశాక శ్వేత మాట మీద కాశీ రాధమ్మ ఇంట్లోనే హాలులో పడుకుంటున్నాడు.
రాధమ్మ ఆత్మ బంధువు తరచూ రావటం, తన కజిన్ గుడ్లప్పగించి చూడటం, అతను ఇబ్బంది పడటం…. అన్నీ విన్న శ్వేత చలించి పోయింది.
ఎప్పుడెప్పుడు అమ్మమ్మ దగ్గర వాలిపోదామా అని విశ్వ ప్రయత్నం చేస్తోంది.
అతను రాకపోవటంలో శ్వేత హస్తం కూడా వుందని కొంత కాలం శ్వేతతో మాటాడటం మానేసింది రాధమ్మ. ఆమె ఫోనుకి పలికేది కాదు. రాధమ్మతో మాటాడకపోతే శ్వేతకు మహా నరకంలా వుండేది. శ్వేత రోజూ వంటమనిషితో, యాదమ్మతో, కాశీతో, మాటాడి రాధమ్మ బాగోగులు తెలుసుకుంటూ, కెమెరాల్లో చూస్తూ వుండిపోయేది.
ఈ మధ్య వంటమనిషితో తరచూ ఒక అతిథి భోజనానికి వస్తున్నాడంటూ ఇద్దరికి వంట చేయించటం మొదలెట్టింది రాధమ్మ. ఒక్క మనిషని మాటాడినంక ఇద్దరికి నేను వంట చేయనని వంటమనిషి మొరాయించింది. దానితో రాధమ్మ తన కోసం చేసిన పప్పు, కూరలు దాచి వుంచి తను పచ్చడి, పెరుగుతో భోజనం ముగిస్తోంది.
ఒక రోజున రాధమ్మను చూడటానికి వచ్చిన శ్వేత కజిన్ ఫ్రిడ్జిలో వున్న వారం రోజుల కూరలు చూసి వంట మనిషిని ఏమిటని ఆరా తీస్తే, “ఎవరో దోస్తు వస్తాడని అమ్మ తినుడు బంద్ చేసి కూరలన్నీ ఫ్రిడ్జిల దాపెడుతుంది” అని చెప్పింది.
కాశీ రాధమ్మ భోజనం తినడం తగ్గించేసారని మనిషి మనోవ్యాధితో శుష్కించిపోతున్నారని శ్వేత త్వరగా వచ్చేస్తే బావుంటుందని శ్వేతతో అన్నాడు.
ఆ ఉదయాన్నే రాధమ్మ కాశీతో “కాశీ, క్రితం రాత్రి, అర్ధరాత్రి వేళ మూడింటికి అతడు వచ్చాడు. నువ్వు హాలులో పడుకుని వుండటం కిటికీలో నుండి చూసి సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు” ముగ్గ పండిన పసుపు పచ్చని మొహాన్ని నల్లగా మాడ్చుకుని బుంగ మూతితో చెప్పింది.
ఆ మాటలు విన్న కాశీకి రాధమ్మ ముందు ముందు తనను ఇంట్లో పడుకోవద్దంటుందేమోనని అనుమానం వచ్చింది.
“అంతా మీ భ్రమేనమ్మా. లోపల దళసరి కిటికీ తెరలుండగా కిటికీ అద్దాల్లో నుండి నేనెలా కనిపిస్తానమ్మా అతనికి…” అన్నాడు కాశీ.
“అవును కదూ..” అంటూ సాలోచనగా గందరగోళంలో పడిపోయింది రాధమ్మ.
శ్వేత ఇండియాకి టిక్కెట్లు బుక్ చేసుకుంది. శ్వేత వస్తోందని తెలియగానే రాధమ్మకి అతనితో తన ఏకాంతానికి భంగం వాటిల్లుతుందని చాలా ఉద్వేగానికి లోనయ్యింది.
యాదమ్మతో శ్వేత వచ్చే లోపు తనకు వేరే ఇల్లు చూడమని రోజూ హడావుడి చేయసాగింది.
యాదమ్మ “నీ మన్మరాలు నీ కోసం వస్తంటే నువ్వు పోతానంటవేందమ్మా. సొంత ఇల్లు ఇడిసి పెట్టి యాడికి పోతవు. ఒక్కదానివే ఎట్టుంటవు” అని అడిగింది.
“ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు వుండాలి యాదీ” అని ఖచ్చితంగా బదులు చెప్పింది రాధమ్మ.
“నువ్వు వేరే ఇంటికి పోతే నేను పనికి రాను” అంది యాదమ్మ అంతే ఖచ్చితంగా.
తన గోడు వినే, తన గురించి ఆలోచించే ఒక్క ప్రాణి యాదమ్మ పని మానేస్తే ఎలాగని చెప్పలేనంత వేదనకు గురయ్యింది రాధమ్మ.
రాధమ్మ ఒక రసాత్మక ఊహల పందిరి అల్లుకుని భ్రమల లోకంలో ఒక ట్రాన్స్‌లో జీవిస్తోంది. ఆమె ఊహా సౌధానికి అంతరాయం కలిగించే మనుమరాలు శ్వేత రాక రాధమ్మకు ఇప్పుడు ఇష్టం లేదు.
శ్వేత త్వరలో వచ్చేస్తుందని తెలిసిన రాధమ్మ మనసు ప్రస్తుతం చాలా అలజడిగా అల్లకల్లోలంగా వుంది.
ఆమె ఇల్లు మారిపోయే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది…
(The end of never ending love)
(మళ్ళీ కలుద్దాం)