లోకల్ క్లాసిక్స్ – 43: దొరల నుంచీ దొరల వరకూ తెలంగాణా

0
3

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా సి. రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ‘నిరంతరం’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘నిరంతరం’ (తెలుగు)

[dropcap]1[/dropcap]980లో విడుదలైన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట సినిమా ‘మా భూమి’ వంద గొప్ప భారతీయ చలన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయాక, 1995లో ‘నిరంతరం’ అని నిర్మించారు. సమాంతర సినిమా అయిన ‘మా భూమి’ ప్రధాన స్రవంతి వ్యాపార సినిమాలాగా వసూళ్లు సాధించింది. జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచింది. మళ్ళీ ఇలాటి సినిమా తీయాలంటే ఆలోచించాలన్నంతగా అధీకృత ముద్ర వేసుకుంది. అయినా సి. రాజేంద్రప్రసాద్ అనే దర్శకుడు ‘నిరంతరం’ అనే 99 నిమిషాల సినిమా తలపెట్టాడు. పుణె ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి అయిన ఈ హైదారాబాద్ నివాసి ఛాయాగ్రాహకుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. ఛాయాగ్రాహకుడుగా 17 వివిధ భాషల సినిమాలకి పనిచేశాడు. ‘నిరంతరం’ తర్వాత రెండు ఇంగ్లీషు సినిమాలకి దర్శకత్వం వహించాడు. ‘నిరంతరం’ని పుణె ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి చంద్ర సిద్ధార్థ నిర్మించారు. ఇందులో రఘువీర్ యాదవ్ అనే పేరున్న హిందీ నటుడు తప్పితే ఇతర తారాగణం కొత్త వాళ్ళే – ప్రధాన పాత్ర పోషించిన చిన్మయి సుర్వీ సహా.

అప్పటికి 1991లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన నక్సలిజం సినిమా ‘పీపుల్స్ ఎన్‌కౌంటర్’ విడుదలైంది. తర్వాత 1997లో వరుసగా మూడు నక్సల్ సినిమాలు ‘ఒసే రాములమ్మా’, ‘ఎన్‌కౌంటర్’, ‘సింధూరం’ విడుదలయ్యాయి. ఈ ప్రధాన స్రవంతి నక్సల్ సినిమాలన్నీ సంచలన విజయాలు సాధించాయి. మధ్యలో 1995లో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం మీద విడుదలైన సమాంతర సినిమా ‘నిరంతరం’ ఎవరి దృష్టిలోనూ పడలేదు. కైరో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకి నోచుకుంది. దీని కథా కమామిషేమిటో చూద్దాం…

కథ

లచ్చవ్వ (తన్మయి) కి నర్సిగాడు (రఘువీర్ యాదవ్) అనే భర్త, బాలిగాడు అనే కొడుకూ వుంటారు. నర్సిగాడు దొర దగ్గర వెట్టి చాకిరీ చేస్తూంటాడు. కొట్టి తన్ని హింసిస్తూ దొర చేయించుకునే వెట్టి కి తాళలేక పోతూంటాడు. ఎదురు తిరగకుండా హింసని భరిస్తున్న నర్సిగాడ్ని చూస్తే లచ్చవ్వకి మండిపోతూంటుంది. సంఘపోళ్ళ (కమ్యూనిస్టుల) దళంలో ఎందుకు చేరవని వేధిస్తూంటుంది. మరోపక్క దొరసాని చేతిలో తనూ తన్నులు తింటూంటుంది. ఇక లాభం లేదని తనే వెళ్ళి సంఘంలో చేరిపోదామని నిశ్చయించుకుంటుంది. ఈలోగా వేరే వూళ్ళో ఓ దొరని చంపేస్తారు కామ్రేడ్లు. ఈ దొర జీతగాడు పెళ్లి చేసుకుంటే ఆ కొత్త భార్యని తన దగ్గరికి రప్పించుకుని అనుభవించడం, ఇంకో దొర వూరుకొస్తే విందు భారం వూరి జనం మీదే వేయడం లాంటివి చేస్తూంటాడు. దళం ఇతణ్ణి చంపి గడీని తగులబెట్టేశాక, లచ్చవ్వ ఆ కామ్రేడ్లతో చేరిపోయి తుపాకీ పట్టుకుంటుంది. నర్సిగాడు కొడుకుని కాపాడుకుంటూ వెట్టి చేస్తూంటాడు.

సంఘంలో చేరే ప్రయత్నం చేసే గ్రామాల్లో ప్రజల్ని కొట్టడం, రజాకార్ల చేత చంపించడం వంటివి దొరలు యథేచ్ఛగా చేస్తూంటారు. దొరలకి రజాకార్లు తోడయ్యేసరికి జనం అల్లాడుతూంటారు. దళ కమాండర్ కామ్రేడ్ ప్రకాష్ నాయకత్వంలో లచ్చవ్వ పోరాటం చేస్తూంటుంది. ఆంధ్ర మహాసభ నాయకులు స్థావరాన్ని సందర్శించి లచ్చవ్వని ప్రోత్సహిస్తారు. ప్రకాష్ దళమంటే దొరలకి హడలెత్తి పోతూంటుంది.

ఈ నేపథ్యంలో చంద్రారెడ్డి దొర, అతడి కొడుకు వెంకట రెడ్డి దృశ్యంలో కొస్తారు. నగరానికి పారిపొమ్మని వీళ్ళని రజాకారు జాఫర్ హెచ్చరిస్తాడు. ఇది అవమానంగా భావిస్తాడు చంద్రారెడ్డి. అప్పటికి దొరలు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్ పట్వారీలూ నగరానికి ఉడాయిస్తూంటారు.

ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో లచ్చవ్వ ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. ఇంకో పక్క భర్త గురించీ కొడుకు గురించీ ఆందోళనతో వుంటుంది. దొరలతో, రజాకార్లతో చేస్తున్న పోరాటం కాస్తా, నిజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనమై పోలీసు దళాలు విరుచుకు పడ్డంతో తీవ్రస్థాయికి చేరుతుంది. కమ్యూనిస్టుల్నివెతికి వెతికి నిర్మూలిస్తూంటారు పోలీసులు. ఇప్పుడు ఆత్మ రక్షణలో పడ్డ చంద్రారెడ్డి ఎలా విజయ దరహాసం చేశాడు, లచ్చవ్వ జీవితం చివరికి ఏమైందీ అనేది మిగతా కథ.

ఎలావుంది కథ

1946 -51 మధ్య జరిగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట కథ తీసుకున్నారు. అయితే రజాకార్లని చూపిస్తూ కథ ప్రారంభించారు కాబట్టి, ఈ కథ 1947 నుంచీ తీసుకున్నట్టు భావించ వలసి వస్తుంది. 1939లో హిందూ ముస్లిం నాయకులు హైదారాబాద్‌లో ప్రారంభించిన కామ్రేడ్స్ అసోసియేషన్ తెలంగాణా పోరాటానికి నాంది. 1940-46 మధ్య కమ్యూనిస్టులు బలపడిన మొదటి దశ. ఈ దశలో దొర చేతిలో షేక్ బందగీ హత్య సాయుధ పోరాటానికి స్ఫూర్తి నిచ్చిన దశ. 1946-47 దొరలకి, వెట్టిచాకిరికీ వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన రెండో దశ. ఈ రెండు దశలూ కాకుండా, 1947-48 మధ్య నిజాంకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం, 1948-51 మధ్య భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం మాత్రం చూపించారు. అయితే ఈ భారత వ్యతిరేక సాయుధ పోరాటాన్ని కూడా చూపించకుండా, పోరాట విరమణని చూపించి ముగించారు. చూపించిన కథ, పాత్రలు, ప్రాంతాలు సమస్తం కాల్పనికం.

ఈ పోరాటాన్ని పోరాటంగానే తప్ప, మధ్యలో సాధించిన విజయాన్ని చూపించకపోవడం సినిమాటిక్‌గా చూసినా లోపమే. పోరాటం ప్రారంభించారు, దొరల్ని చంపేసి, కొందర్ని తరిమేసి, 3000 గ్రామాల్ని విముక్తం చేసి, పదిలక్షల ఎకరాల్ని విడిపించుకుని- సోవియెట్ రష్యా తరహా కమ్యూన్లని ఏర్పర్చిన విజయదశ చిత్రీకరణ లేకుండా పోరాటం -ఇంకా పోరాటం -ఆఖరికి విజయం లేని పోరాట విరమణే చూపించి ముగించేశారు.

ఇక్కడ 2008లో విడుదలైన ‘బతుకమ్మ’ గుర్తుకొస్తుంది. ఇది తెలంగాణాలో నక్సలిజం ముగిసిన నేపథ్యంలో కథ. నక్సల్బరీ ఉద్యమ ధాటికి దొరలు భూముల్ని పడావు పెట్టి వెళ్ళి పోయాక, ఎర్రజెండాలు పాతిన ఆ పడావు భూముల్లో బతుకమ్మ నాయకత్వంలో వ్యవసాయం చేసుకుంటారు. దొర తిరిగి వచ్చి ఆ భూముల్ని లాక్కుని బహుళ జాతి సంస్థకి అమ్మేయబోతాడు. అసలీ భూములు దొర పూర్వీకులు ప్రజలనుంచి లాక్కున్నవే.

దొరల చరిత్ర అదో విశేషం. అప్పట్లో సాయుధ పోరాటం ఫలితంగా భూములు వదిలి వెళ్ళి పోయిన దొరలు- భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపి కమ్యూనిస్టుల్ని ఏరేయడంతో, తిరిగి వెళ్ళి భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. ముప్పయ్యేళ్ళ తర్వాత, నక్సలిజం రావడంతో మళ్ళీ భూముల్ని వదిలి వెళ్ళి పోయారు దొరలు. వాళ్ళ భూమి దయాదాక్షిణ్యాలు లేకుండా మరీ గుండ్రంగా వున్నట్టుంది.

ప్రశ్నార్ధకంగా కథానాయిక

ప్రధాన పాత్ర లచ్చవ్వగా నటించిన తన్మయి చాకలి ఐలమ్మ పాత్రనుకుంటాం. కానీ కాదు. ఈ కల్పిత కథలో ఇది కూడా ఓ కల్పిత పాత్ర. ఈ ప్రధాన పాత్రలో తన్మయి ప్రతిభగల నటియే, భావోద్వేగాలు దిగ్విజయంగా వెల్లడించగల టాలెంటే గానీ, పాత్ర చిత్రణకి న్యాయం జరగలేదు. ప్రధాన పాత్రలో కథానాయిక అన్నాక కథకి నాయకత్వం వహించే లక్షణాలు లేక సినిమా సూత్రాలకి దూరంగా వుండిపోయింది. ఆర్ట్ సినిమా అయినా సరే, కథానాయకుడి పరంగానో, కథా నాయిక పరంగానో కథ నడపకపోతే కథలా వుండదు. డాక్యుమెంటరీలా వుంటుంది. కథానాయిక పగ్గాలు ఆమెకందిస్తే, దళ నాయకురాలిగా ఈ కల్పిత పాత్రని చూపిస్తే – వాస్తవ దూరంగా, అతీయోశక్తిగా వుండొచ్చనేమో. అలాంటప్పుడు ఆనాటి పోరాట వనితల్లో ఒకరు ప్రతిబింబించేలా ఆధారంగా చేసుకుని వుండొచ్చు. లచ్చవ్వ పాత్ర ఆసాంతం ఓ మామూలు దళ సభ్యురాలిగానే వుండిపోయింది. దళ నాయకురాలిగా ప్రమోట్ కాలేదు. దీంతో కథా నాయకత్వం ఆమెకి లేక కథ ఎలా పడితే అలా సాగింది. ప్రతినాయక పాత్ర అయిన చంద్రారెడ్డితో సైతం ఘర్షణ పడకుండా, పాత్ర ఎత్తుగడకి తగ్గ కొనసాగింపు లేకా చతికిలబడింది.

పైగా పాత్రకి దళ కమాండర్ ప్రకాష్‌తో ప్రేమాయణం పెట్టారు. దొరకి ఎదురు తిరగని బానిస భర్త నర్సిగాడంటే ఆమెకున్న వ్యతిరేకత కొద్దీ ప్రకాష్ వైపు మొగ్గు చూపుతుంది. నా ఇంటిది లేచిపోయింది, నీ మొగుడు చేతకాని వాడు- మనిద్దరి పరిస్థితి ఒకటేనని రెండు సందర్భాల్లో అతనన్నప్పుడు, ఇది నిజమేనన్నట్టు మౌనంగా వుంటుంది. ఇక్కడ ఆమె పాత్ర దెబ్బతిని పోయింది. తను పోరాటానికి దిగిందే బానిసల విముక్తికి. అందులో భర్త కూడా ఒకడు. ఇంకా భర్త చేతగాని వాడని ఎలా ద్వేషిస్తుంది. అతణ్ణి కూడా విడిపించుకోవాలి. ఆ మాటకొస్తే ముందు దొరకే తుపాకి పెట్టి భర్తని విడిపించుకుని పారిపోవాలి. తర్వాత బానిస భర్తని చంపేసినప్పుడు, కొడుకుని కూడా చంపేసినప్పుడూ, నిర్ఘాంత పోవడమే తప్ప ప్రతి చర్యకి పూనుకోదు. ఇలా ఈ పోరాట పాత్ర అన్నిటా పాసివ్ పాత్రగానే మిగిలిపోయింది.

నర్సిగాడి పాత్రలో రఘువీర్ యాదవ్ వృథాగా వుంటాడు. బానిస పాత్రలో మార్పుండదు. ఎలావున్న పాత్ర అలాగే ముగుస్తుంది, బోనస్‌గా చావుతో. పైగా దృశ్యాలు తక్కువ. దాదాపూ రఘువీర్ యాదవ్ అనే ప్రముఖ నటుణ్ణి సినిమాలో మర్చిపోతాం. దొరని చంపేసే స్థాయికి అతడి భావోద్వేగాలు చేరవు, చంపేసి పారిపోయి భార్యతో చేతులు కలిపే వీరత్వముండదు. ఈ పోరాట కథ రక్తి కట్టక పోవడానికి ప్రధాన కారణమేమిటంటే, పాత్రలకి క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) లోపించడం. సినిమా పరిభాష మృగ్యం కావడం.

పాత్రలకి సహజంగానే తెలంగాణా భాష వాడారు, దళ కమాండర్ ప్రకాష్ పాత్రకి తప్ప. పైలం అనే పదం విరివిగా వాడ్డంతో ఈ కథని ఉత్తర తెలంగాణాలో స్థాపించారనుకోవచ్చు. నాల్గు పాటలున్నాయి. సాంకేతికంగా బడ్జెట్ పరిమితులకి లోబడి కాస్త బలహీనంగానే వుంది.

ముగింపు మతలబు

పోరాట విరమణ అంటూ సంఘం చెప్పే కారణాలు పైపైనే వుంటాయి. రజాకార్లూ నిజామూ పోయాక ప్రజలు మనవైపు లేరనీ, మనం ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడున్న ప్ర్రభుత్వ విధానాలపైన పోరాడాలన్న అర్థంలో ఆంధ్ర మహాసభ నాయకుడు కూడా మాట్లాడతాడు. పైనుంచి ఆదేశాలొచ్చాయంటాడు. పై నుంచి అంటే సోవియెట్ రష్యా నుంచా? అసలు పోలీసు చర్య ముసుగులో సైనిక చర్య జరపడం నిజాంని లొంగదీయడానికా, కమ్యూనిస్టుల్ని తరిమేయడానికా? చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ బ్రిటన్నుంచి కమ్యూనిస్టుల రాజ్యం ప్రబలుతోందని చేసిన హెచ్చరిక వల్ల పోలీసు యాక్షన్ జరిగిందా? పోలీసు యాక్షన్ పేరుతో సైనిక చర్య జరపడం ఐక్య రాజ్య సమితి కన్ను గప్పడానికా? 1969లో ఇందిరా గాంధీ ప్రత్యేక తెలంగాణాని ఒప్పుకోకపోవడానికి కూడా ఐక్యరాజ్య సమితియే కారణమా? ఇవన్నీ ప్రశ్నలు. చరిత్ర ఎప్పుడూ ప్రశ్నల మయమే, వదిలేద్దాం. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, తీన్ మూర్తి హౌస్ లైబ్రరీల్లో గుప్తంగా వుండిపోయిన క్లాసిఫైడ్ పత్రాల్ని దృష్టికి తెస్తూ, ‘ఇండియా టుడే’ పత్రిక వెలుగులోకి తెచ్చిన రహస్యాల్ని కూడా వదిలేద్దాం.

సంఘం నాయకుడు చెప్పే మాటల ప్రకారమే చూస్తే, చివరికి కథలో పారిపోయిన దొరలు తిరిగి గ్రామాల్లోకి వచ్చేసి వుంటారు. దీన్ని పక్కనబెట్టి నాయకుడు మాట్లాడ్డం – ఇక దొరలతో మనకి సహజీవనమూ బానిసత్వమూ షరా మామూలుగా తప్పవన్న అర్థం వచ్చేలా వుంది. చివరికి కమ్యూనిస్టుల భూమి కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా మరీ గుండ్రంగా వున్నట్టుంది.

ఆఖర్న చంద్రారెడ్డి దొర హేపీగా మిద్దె మీద పావురాన్ని చూస్తాడు. దాన్ని కరువుదీరా గుప్పెట బంధించి తెచ్చి పంజరంలో పెట్టేస్తాడు. గ్రాంఫోన్లో పాట పెట్టుకుంటాడు. అశోక్ కుమార్ – దేవికా రాణి ల మీద ‘అఛూత్ కన్య’ (1934) పాట వస్తూంటుంది… ‘మై బన్ కీ చిడియా బన్ కే బన్ బన్ బోలూఁ రే…’ అని. ఎంజాయ్ చేస్తూంటాడు. చివరికి స్వేచ్ఛ పొంది వనం వనం పాడుకున్న తెలంగాణ పిట్ట -ఇంతలో తన పుణ్య హస్తాల్లో తిరిగి ఇలా సేద దీరుతోందన్న మాట … చంద్రారెడ్డికి పాలపిట్ట దొరికి వుండాల్సింది. సినిమా ప్రారంభంలో వేరే దొర గ్రాంఫోన్లో ‘స్వప్నసుందరి’లో అక్కినేని- అంజలీదేవి పాట ‘నటనలు తెలుసునులే’ ఎంజాయ్ చేస్తూంటాడు. అయితే ‘స్వప్నసుందరి’ 1950లో విడుదలైంది. ఈ కథా ప్రారంభం 1947లో. ఈ సినిమా జియో సినిమాలో, అమెజాన్‌లో వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here