జ్ఞాపకాల పందిరి-39

60
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అలా జరగకుంటే ఎలా ఉండేదో..!!

[dropcap]అ[/dropcap]వసరానికి ఆదుకోవడం అనేది అందరివల్ల సాధ్యం కాని పని. ఎదుటి వారికి సమస్య ఉత్పన్నమైనపుడు, మనకు చాతనయినంతలో ఆదుకోవడానికి ప్రయత్నించడం కనీస ధర్మం. అయితే అంత త్వరగా స్పందించే సహృదయులు ఎంతమంది? బయటివారే కాదు, బంధువులు కూడా సాహసం చేయడానికి వెనుకాముందులాడతారు. సమయానికి ఆదుకోవడం అన్నది మనిషి మనస్తత్వం మీద, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అయితే, మామూలు సమయాల్లో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు, చాలామంది సహాయం చేయడానికి ముందుకి వస్తారు. చేతనయినంతగా సహాయం అందిస్తారు. కానీ కొన్ని సమస్యలు ఎవరూ ముందుకు రాలేని పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు స్వంతమనుషులు, శ్రేయోభిలాషులు కూడా దగ్గరికి రాలేని పరిస్థితి, ఎలాంటి సహాయాన్ని అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు ఎవరినీ నిందించే పరిస్థితులు కూడా వుండవు. ఎవరి ప్రాణం వారికి తీపి కదా!

ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా తమ ప్రాణాలకు తెగించి, ఎదుటివారి కష్టాలను అర్థం చేసుకుని, సహాయం అందించడానికి ముందుకు వచ్చే స్నేహితులు కూడా ఈ రోజుల్లో లేకపోలేదు. అయితే ఇలాంటివారు కేవలం వేళ్ళమీద లెక్కపెట్టదగ్గ వారే కనిపిస్తారు. వాళ్ళు చేతులెత్తి నిత్యం మొక్కదగ్గ మహానుభావులు.

గత పది నెలలుగా (ఫిబ్రవరి 2020 నుండి) యావత్ ప్రపంచ దేశాలను గజ గజలాడిస్తూ, ప్రశ్నార్థకంగా నిలిచి అనేక ప్రాణాలను బలితీసుకున్న/తీసుకుంటున్న, కరోనా (కోవిడ్ -19) అందరికీ సవాలుగా నిలిచింది. స్వంత మనుష్యులు చనిపోయినా, ఇంటికి వెళ్లి కనీసం పరామర్శించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతోమంది భాగ్యవంతులు సైతం అనాథలు మాదిరిగా దిక్కులేని చావు దాపురించిన దురదృష్టకర సందర్భం.

ఇలాంటి సమస్య స్వయంగా నేను అనుభవించక పోయినా, మా చిన్నన్న డా. కె. మధుసూదన్, కరోనా కోరల్లో చిక్కుకున్నప్పుడు, నేను అనుభవించిన వ్యథ అక్షరాల్లో వ్యక్తపరచలేనిది. ఆయన విశాఖలో, నేను హనంకొండలో! క్షణ క్షణం ఆందోళనలో మునిగి తేలిన క్షణాలు. అది ఎంతటి బాధాకరమైనదో మీరూ అర్థం చేసుకోండి.

అన్నయ్య విశాఖపట్నం వాసి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో అనౌన్సర్‌గా చేరి, సుమారు ముప్పై సంవత్సరాలపాటు అక్కడే సేవలందించి పదవీ విరమణ చేశారు. అందుకే ఆయనకు విశాఖ అంటే మక్కువ ఎక్కువ. ఆ పట్టణం వదిలి బయటకు వెళ్లిన సందర్భాలు బహు తక్కువ. పైగా బ్రహ్మచారి. ఒంటరి జీవితం. ఆయన మా ఇంటికి వచ్చిన సందర్భాలు బహు తక్కువ. ప్రధాన కారణం ఆయనకు వృత్తి మీద వున్న ప్రగాఢ గౌరవం, అంకితభావం.

విశాఖలో ఆయన మంచి మిత్రమండలిని ఏర్పరచుకున్నారు. సాహితీ మిత్రులకు దగ్గర అయ్యారు. అనేక సాహిత్య సమావేశాలకు హాజరుకావడం, సాహితీ చర్చల్లో పాల్గొనడం ఆయనకు నిత్యకృత్యమై, వృత్తి ప్రవృత్తి ఆయన ఒంటరితనాన్ని దూరం చేశాయి. అలా బంధువులకంటే కూడా మనసున్న మంచి మిత్రులు ఆయనకు చేరువైనారు. అప్పుడప్పుడు శుభ కార్యాలకు మాత్రం వస్తూవుంటారు. నేనూ – నా పిల్లలు ఎప్పుడూ హనంకొండకు రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాము. కానీ అది ఆయనకు అంతగా వీలయ్యేది కాదు. మాకు ఒకరకమైన బాధ కలుగుతుండేది. ఉద్యోగ విరమణ చేసిన పిదప, ఆయన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో (తాను పదవీ విరమణ చేసిన చోట) కాంటాక్ట్ పద్దతిలో ‘డ్యూటీ – ఆఫీసర్’ గా ఉద్యోగంలో చేరడం వల్ల ఆయనకు జీవితం సాఫీగానే సరిపోతున్నశుభ తరుణంలో,ప్రపంచ వ్యాప్తంగా ‘కోవిద్ -19 ‘ఒక సునామీలా వ్యాపించి జనాలను భయ భ్రాంతులకు గురి చేసింది. వందలు, వేలు, లక్షల్లో ప్రజలకు ఈ వైరస్ సోకడం, వందలు – వేల సంఖ్యల్లో ప్రాణ నష్టం జరగడం మొదలైంది. అదిగో.. అలాంటి తరుణంలో,ప్రజా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వాలు ‘లాక్‌డౌన్’ ప్రకటించాయి. అందులో మన దేశము వుంది. అనేక కార్యాలయాలు మూతపడ్డాయి. తాత్కాలిక ఉద్యోగులను విధులనుండి తప్పించారు. అందులో మా చిన్నన్నయ్య కూడా ఉన్నాడు. అంతా మన మంచికే అనుకున్నాము.

ఆయన ఇంటికే పరిమితం అయినాడు. ఉదయం బీచ్ రోడ్‌లో వాకింగ్ చేసే అలవాటును మానుకున్నాడు. గతంలోలా, సభలు-సమావేశాలు, విందులు – వినోదాలలో పాల్గొనడం పూర్తిగా తగ్గించేసాడు. బ్రతుకు జీవుడా అనుకుని ఆయన ఆరోగ్యం విషయంలో నిశ్చింతగా వున్నాం. ఆయనతో కొందరు మిత్రులు మాత్రం ప్రతిరోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటారు, అందులో ఎస్. హనుమంతరావు గారు ఒకరు.

నేనూ వయసు పైబడినవాడినే కనుక పూర్తిగా మా అమ్మాయి నిహార సంరక్షణలో ఉంటున్నాను. అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. అందు చేత పూర్తిగా అమ్మాయి మీదే ఆధార పడవలసి వచ్చింది. గేటు దాటి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. మా జీవితం మేము జీవిస్తున్నాము. ఈ నేపథ్యంలో అన్నయ్య స్నేహితులు శ్రీ ఎస్. హనుమంత రావు గారి దగ్గరినుంచి ఫోన్ వచ్చింది.

హనుమంత రావుగారు అన్నయ్య రోజూ ఫోన్ చేసుకుని మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు. గత వారం రోజులుగా అన్నయ్యకు జ్వరం వస్తున్నట్టు, అది మామూలు జ్వరం అనుకుని తిండి మాని లంఖణాలు చేస్తున్నట్టు ఆయనకు తెలుసు. శివయ్య అనే శిష్య మిత్రుడు అన్నయ్యకు జతగా రాత్రిళ్ళు పడుకుంటున్న విషయమూ హనుమంత రావు గారికి తెలుసు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా అన్నయ్య ఫోన్ కాల్‌కు స్పందించడం లేదని, కాస్త ఆందోళనగా వున్నదని, ఆయన ఫోన్ కాల్ సారాంశం. పైగా ఆయన జబ్బు పడ్డ విషయం మాకు చెప్పొద్దని, మేము కంగారు పడతామని, గతంలో అన్నయ్య ఆయనతో అన్నాడట! రోజులు బాగోలేదు. ఎక్కడ విన్నా కరోనా మరణాల గురించే. హనుమంతరావు గారి సమాచారం నాలో భయాన్ని పెంచింది.

నాకు ఫోన్ చేసిన ఎస్. హనుమంత రావుగారు

డెబ్భై ఏళ్ళ అన్నయ్య జ్వరం కరోనా.. కాకూడదని మనసులో అనుకున్నాను. వెంటనే విజయనగరంలో ఉన్న సోదర మిత్రుడు ‘చలం’కు ఫోన్ చేసాను. విషయం ఆయనకు తెలియదన్నాడు. నాకు భయం మరింత ఎక్కువైంది. అనవసరంగా భయపడవద్దని, స్థానిక మిత్రులకు తెలియజేస్తానని, ఆందోళన పడవద్దని, చలం నన్ను ఓదార్చాడు. వెంటనే విశాఖలో వున్న అన్నయ్య ముఖ్య స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.

నా సమాచారం అందుకున్న సోదర మిత్రుడు శ్రీ జి.ఎస్.చలం

వాళ్ళు కూడా ఈ సంగతి విని ఆశ్చర్య పోయారట మరునాడు అందరు చినవాల్తేరులో ఉంటున్న అన్నయ్య దగ్గరకు వెళ్లి, వెంటనే కోవిడ్ -సెంటర్ కు తీసుకువెళ్లి పరీక్ష చేయిస్తే ‘కరోనా పాజిటివ్’ వచ్చిందట! ఫలితం తెలియగానే అన్నయ్యను ‘విమ్స్’ (విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో అడ్మిట్ చేశారు. ఆ సమయంలో అక్కడ అడ్మిషన్ దొరకడం అంత సులభమైన పని కానేకాదు. అన్నయ్య మిత్రులు అంతా వివిధహోదాలలో పలుకుబడి వున్నవారు కావడం వల్ల ఆ ఆసుపత్రిలో అడ్మిషన్ దొరకడం, ఉచిత వైద్యానికి కూడా అవకాశం కలిగింది. ఈ విషయంలో పూర్తి బాధ్యత తీసుకుని అన్నివేళలా అప్రమత్తంగా పని చేసినవారు, నాకు ఎంతో ధైర్యాన్ని అందించిన వారు శ్రీ వేణు (వేంకటపతి రాజు).

సహకారం అందించిన ముఖ్య వ్యక్తి శ్రీ వేణు

ఆయన రిటైర్డ్ ఉపాధ్యాయుడే కాకుండ, ఒక వామపక్ష పార్టీ నాయకుడు కూడా. ఆయన అందించిన సహకారం ఎన్నటికీ మరువరానిది. స్వంత రక్త సంబంధీకులు కూడా చేయలేని సహాయం ఆయన చేశారు. ఆయనతో పాటు సహాయం చేసిన మరొక సహృదయుడు, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ (విశాఖపట్నం) శ్రీ రాజు. పి. ఎ.

సహకారం అందించిన మరో వ్యక్తి శ్రీ పి.ఎ.రాజు

మానవత్వంతో కూడిన మైత్రిని కొనసాగిస్తున్న వీరు ప్రశంసనీయులు. జ్వరం అంటే కరోనా అని భయకంపితులవుతున్న రోజుల్లో శివయ్య గారు భార్య, చిన్న బిడ్డను ఇల్ట్లో వదిలి అన్నయ్యకు సహకారిగా ఉండడం,ఆశ్చర్యకరమైన విషయమే! ఆయనకు కూడా ఎంతో రుణపడి వున్నాము.

కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అనస్థటిస్ట్ (మత్తు ఇచ్చే వైద్యురాలు) డా. సుబ్బులక్ష్మి (జనగాంలో నా సహా ఉద్యోగిని) ఎప్పటికప్పుడు,అన్నయ్య ఆరోగ్య పరిస్థితిని నాకు అందించి నాకు ఎంతగానో మానసిక ప్రశాంతతను కలిగించారు. డా. లక్ష్మి చేసిన సహాయం కూడా ఎన్నటికీ మరువలేనిది. ఆసుపత్రిలో ఉన్న పద్నాలుగు రోజులు అన్నయ్యకు చక్కని అమూల్యమైన వైద్యం అందించిన వైద్య దేవుళ్ళకు,ఇతర ముఖ్య సిబ్బందికి ఎంతగానో రుణపడి వుంటాను. పెద్దన్నయ్యను, ఇద్దరు అక్కలను కోల్పోయిన నేను, చిన్నన్నయ్య కరోనా కోరల్లోనుంచి బ్రతికి బయట పడటం కేవలం నా అదృష్టంగానే భావిస్తాను. ఆ రోజున అలా జరగకుండా ఉంటే.. (అన్నయ్య మిత్రుడు నాకు ఫోన్ చెయ్యకుండా ఉంటే) పరిస్థితి ఎలా ఉండేదో…!! నా దృష్టికి రాని ఎందరో మహానుభావులు ఈ కథనం వెనుక వున్నారు. వారందరికీ వందనాలు.

ఆరోగ్యంగా బయట పడ్డ అన్నయ్య డా. మదుసూదన్ కానేటి

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here