[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
[dropcap]తె[/dropcap]లుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి ఆచార్య పీఠాన్ని అధిరోహించిన ఎందరో మహానీయులు అవిరళ కృషి చేశారు. పాఠశాల స్థాయిలో తెలుగు అధ్యాపకులు నాటిన భాషాబీజాలు కళాశాల స్థాయిలో వృక్షాలై, విశ్వవిద్యాలయాలలో చేరేనాటికి ఫలపుష్పభరితమై విద్యార్థులకు జీవనోపాధిని కలిగించాయి. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలోని మదరాసు విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎం.ఎ. భాషా బోధనను ప్రవేశపెట్టాయి. ‘డిగ్రీలు లేని విద్య వన్నెకురాని పాడుకాలాన పుట్టి’ అని నానుడి బయలుదేరినా, పాండితీ ప్రకర్షలో ఎందరో మహానుభావులు కళాశాల స్థాయి తెలుగు అధ్యాపకులను తయారు చేశారు. 20వ శతాబ్ది తొలినాళ్లలో నిజాం ప్రభుత్వ హయాంలో 1917 సంవత్సరంలో హైదరాబాదులో ఏప్రిల్ 26న ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పట్టాభిషేక మహోత్సవ జ్ఞాపకార్థంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపనకు మహారాజు ఫర్మానా జారీ చేశారు. 2018లో ఉస్మానియా విశ్వవిద్యాలయ శతజయంతి వేడుకలు జరిగాయి.
తెలుగు శాఖ పురుడు పోసుకొన్న వేళ:
సరిగ్గా 80 ఏళ్ల క్రితం 1940లో తెలుగులో ఎం.ఏ. బోధనను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. రాయప్రోలు సుబ్బారావు, ఖండవల్లి లక్ష్మీరంజనం అధ్యాపకులు. ఒకే ఒక్క విద్యార్థి పల్లా దుర్గయ్య ఎం.ఏ.లో చేరారు. 1942లో ఎం.ఏ. పూర్తి చేసుకొన్నారు. నిజాం కాలేజి అధ్యాపకులు కురుగంటి సీతారామయ్య వచ్చి వారంలో రెండు రోజులు ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి పాఠాలు బోధించేవారు. ఒక్క విద్యార్థి అయినా సరే పాఠాలు శాస్త్రోక్తంగా చెప్పారని పల్లా దుర్గయ్య ఒక ఇంటర్వ్యూలో రవ్వా శ్రీహరితో ముచ్చటించారు. ఆ తర్వాత దుర్గయ్య 13 ఏళ్ల పాటు అదే విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో పని చేయడం విశేషం.
ఈ ధారావాహిక లక్ష్యం:
గతంలో సంచికలో నాలుగు ధారావాహికాలు మూడేళ్లుగా నిర్వహించి పుస్తకాల రూపంలో ప్రచురించాను. 1. అలనాటి ఆకాశవాణి 2. కావ్యపరిమళం 3.తిరుమలేశుని సన్నిధిలో 4. జ్ఞాపకాలు – వ్యాపకాలు. ఇది ఐదో ధారావాహిక. పది మందికీ ఆసక్తికరమైన సన్నివేశాలు వర్ణించడమే నా ఉద్దేశం. ‘గురుదేవోభవ’ శీర్షికలో గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయుల పరిచయానికి పూనుకున్నాను. మదరాసు, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు తొలి దశలో తెలుగు ఎం.ఏ. పాఠ్య ప్రణాళికను ప్రవేశ పెట్టాయి. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 1954లో ఆరంభమైంది. ఇప్పుడు దాదాపు 15 విశ్వవిద్యాలయాలలో తెలుగులో ఎం.ఏ., యం.ఫిల్., పి.హెచ్.డి.లు కొనసాగుతున్నాయి. ఆయా విశ్వవిద్యాలయాల తొలి గురువులను (కీర్తిశేషులను) ప్రస్తావిస్తాను. వికీపీడియా తదితర ఆధారాలు, ఆచార్య వెల్దండ నిత్యానందరావు వంటి పరిశోధకుల సమాచారం నాకు ఉపబలకం.
ఉస్మానియా తెలుగుశాఖ – ఒకే ఒక్క విద్యార్థి:
ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ 1919లో ఆరంభమైంది. అయితే అది ఇంటర్మీడియేట్, డిగ్రీ వరకు పరిమితం. 1938లో జరిగిన వందేమాతరం ఉద్యమ ఫలితంగా 1940లో ఎం.ఏ. తెలుగు ప్రారంభమైంది. తొలి విద్యార్థి పల్లా దుర్గయ్య. 1947లో ఈటూరి లక్ష్మణరావు, 49లో కొవ్వూరు గోపాలకృష్ణారావు ఉత్తీర్ణులయ్యారు. 1949లో బిరుదరాజు రామరాజు, ఇల్లిందల సుజాతాదేవి(తొలి ఎం.ఏ విద్యార్థిని) చేరారు. సూరి భగవంతం ఉపాద్యక్షులుగా వున్న సమయంలో 1952-53లో తెలుగు శాఖలో పరిశోధన ప్రారంభమై బిరుదురాజు రామరాజు అభ్యర్థిగా చేరి తొలి పరిశోధకులయ్యారు.
ఏ దేశమేగినా ఎందుకాలిడినా…:
ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో తొలి గురువు రాయప్రోలు సుబ్బారావు. ఆయన 1919 నుండి ఆ శాఖకు అధ్యక్షులు. 1941లో ఆచార్య పదవి అలంకరించారు. 1946లో వరంగల్లు విశ్వవిద్యాలయ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమించబడి రెండేళ్లు పని చేశారు. సుబ్బారావు 1892 మార్చి నెలలో గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించారు. ఆయన 1921లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపన్యాసకులుగా చేరి ఇంటర్మీడియెట్ బోధన కొనసాగించారు. ఆ తరువాత, రీడరు, ప్రొఫెసరు పదవులు అధిష్ఠించి రెండున్నర దశాబ్దులు పని చేశారు. ఆయన నవ్యకవితా పితామహుడు. భావకవితోద్యమానికి ఆద్యుడు. ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేసిన కవి. ఆయన రచనలలో తృణకంకణం, కష్టకమల, వనమాల, ఆంధ్రావళి రమ్యలోకము, మిశ్రమంజరి, స్నేహలతాదేవి, స్వప్నకుమారము, తెలుగు తోట, మాధురీ దర్శనం ప్రసిద్ధాలు. ఆయన రచించిన గీతం ‘ఏ దేశమేగినా, ఎందు కాలిడినా… పొగడరా నీ తల్లి భూమి భారతిని’ ప్రసిద్ధం. జాతీయోద్యమ సమయంలో ‘తృణకంకణం’ విస్తృత ప్రచారం పొందింది.
“అవమాన మేలరా? అనుమానమేల?
భరతపుత్రుడనంచు భక్తితో పలుక” – విశిష్టం.
“అమరావతీ పట్టణమున బౌద్ధులు
విశ్వవిద్యాలయము స్థాపించునాడు” వంటి పద్యాలు అజరామరం.
రాయప్రోలు వారు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ప్రారంభించిన తొలినాళ్లలో ఆచార్య పీఠాన్ని అధిరోహించారు. 1983లో నేను ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పని చేస్తున్నాను. ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు పరిచయమయ్యారు. వారికి రాయప్రోలు సుబ్బారావు మామగారు. వారి సౌజన్యంతో రికార్డింగు యూనిట్‌తో వెళ్లి రాయప్రోలు వారిని ఇంటర్వ్యూ రికార్డు చేశాం. అదే చివరి ఇంటర్వ్యూ. 1984 జూన్ 30న ఆయన కన్ను మూశారు. 1968లో ఉస్మానియా స్వర్ణోత్సవాలలో వారికి గౌరవ డి.లిట్ ప్రదానం చేశారు.
పురోగమనం:
రాయప్రోలు వారు ఆ విధంగా తెలుగుశాఖకు నాందీ ప్రవచనం పలుకగా క్రమక్రమాభివృద్ధి చెందుతూ భాషా సాహిత్యాలలో దిగ్దంతులైన పండితులకు స్థానం కల్పించింది. ఎందరో లబ్ధప్రతిష్ఠులు తెలుగు తేజాన్ని ప్రదీప్తం చేశారు. అధ్యయన అద్యాపనాల ద్వారా జాతీయస్థాయి కీర్తి ప్రతిష్ఠలు లభించాయి. ఎందరో పరిశోధకులు ఉత్తమ ప్రమాణాలు గల పరిశోధనలు చేసి గ్రంథాలు ప్రచురించారు. ఆచార్య పీఠాన్ని అలంకరించిన ప్రముఖులలో ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని, బిరుదరాజు రామరాజు, పాటిబండ మాధవశర్మ, పల్లా దుర్గయ్య, అమరేశం రాజేశ్వరశర్మ, సి.నారాయణరెడ్డి, యం.కులశేఖరరావు, నాయని కృష్ణకుమారి, మాదిరాజు రంగారావు, కె.గోపాలకృష్ణారావు, వెల్లటూరు రాఘవశర్మ, వేటూరి ఆనందమూర్తి, ఇరివెంటి కృష్ణమూర్తి, ముదిగొండ శివప్రసాద్, పాకాల యశోదా రెడ్డి, టి.కిషన్ రావు, బి.కేశవులు, సుమతీ నరేంద్ర, కసిరెడ్డి వెంకటరెడ్డి, రుక్నుద్దీన్, వి. సీతా కల్యాణి, చింతల యాదయ్య, యస్.ఆర్.వెంకటేశం ప్రభృతులున్నారు. ఈ తెలుగు శాఖ ఘనత పలువురు విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్లుగా పదవీ బాధ్యతలు చేపట్టడం. తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా సి.నారాయణ రెడ్డి, నాయని కృష్ణకుమారి, ఎల్లూరి శివారెడ్డి, యన్. గోపి, యస్.వి.సత్యనారాయణలు ప్రతిష్ఠను పెంచారు. రవ్వా శ్రీహరి కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యాక్షులయ్యారు. భాషాశాస్త్ర విభాగానికి చెందిన భద్రిరాజు కృష్ణమూర్తి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 1986-93 మధ్య పని చేశారు. తెలుగు సాహిత్యంలో రెండో జ్ఞానపీఠ బహుమతి నందుకొన్నారు సి.నా.రె. ఆయన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి కూడా ఉపకులపతి. బహుశా మరే విశ్వవిద్యాలయ తెలుగు శాఖ నుండి ఇంత మంది వైస్-ఛాన్సలర్లు కాలేదేమో!
ఆయా విశ్వవిద్యాలయాలకు ఒకేసారి ముగ్గురు తెలుగు శాఖ ఆచార్యులు ఉపాధ్యాక్షులుగా వున్న విషయం ఇక్కడ స్మరించుకోవాలి. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆచార్య తూమాటి దోణప్ప, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఆచార్య జి.యన్.రెడ్డి, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఆ గౌరవానికి అర్హులయ్యారు. తెలుగు భాషా సాహిత్యాలకు దక్కిన గౌరవమది.
2020-21 సంవత్సరం నాటికి ఉస్మానియా తెలుగు శాఖలో అధ్యాపక వర్గమిది.
ఆచార్య సూర్యధనంజయ (శాఖాధ్యాక్షులు) – ఆచార్య వెల్దండ నిత్యానందరావులు.
అద్యాపకులు: సాగి కమలాకర శర్మ, యస్.రాఘు, ఏలే విజయలక్ష్మి, వారిజారాణి, ఖాశింలున్నారు.
గోసా నాయక్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులుగా వెళ్లారు.
‘ఆంధ్రుల చరిత్ర’తో ఆరాధ్యుడు:
తెలుగు శాఖ చేసుకున్న అదృష్టం తొలిరోజుల్లో ఆ శాఖాధ్యక్షులుగా ఖండవల్లి లక్ష్మీరంజనం వంటి ఉద్దండులు చేరడం. ఆయన తూర్పుగోదావారి జిల్లా పెదపూడిలో 1908లో జన్మించారు. 1936లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృతం, తెలుగు ఎం.ఏ. పట్టభధ్రలయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా చేరారు. 1946లో రాయప్రోలు వారు రిటైరయిన తర్వాత ఖండవల్లి శాఖాధ్యక్షులై 18 సంవత్సరాలు తెలుగు శాఖకు దశ, దిశ నిర్దేశం చేశారు.
వారి హయాంలో ఆంధ్ర మహాభారత సంశోధిత ప్రతిని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించడానికి పునాదులు పడ్డాయి. 1978 వరకు దాని పర్యవేక్షణ బాధ్యత ఆయనే చూశారు. అధ్యాపకులేగాక విద్యార్థులు కూడా ఈ బృహత్ ప్రయత్నంలో పాలుపంచుకొన్నారు. తొలి సంపుటి విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాలలో 1968లో ప్రముఖ భాషాశాస్త్రవేత్త సునీత్ కుమార్ చటర్జీ ఆవిష్కరించారు. ఖండవల్లి వారి కాలంలో 1956లో ప్రాచ్యభాషాధ్యయనంలో డిగ్రీ తరగతులు ఆరంభమయ్యాయి. భారత సంశోధన ప్రతి తయారీకి 10 సంవత్సరాలు పట్టింది.
ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రాచ్యకళాశాల హైదరాబాదు నగరంలో ప్రారంభించబడటం ఆయన ప్రొద్బలం వల్లనే. 1980లో ఇంట్లోనే వేద పాఠాశాల ప్రారంభించారు. సోదరుడు బాలేందు శేఖరంతో కలసి ‘ఆంధ్రుల చరిత్ర -సంస్కృతి’ గ్రంథాన్ని రచించారు.
లక్ష్మీరంజనం కాలంలోనే తెలుగు శాఖ సర్వసభ్య సమావేశాల నిర్వహణ 1951లో ఆరంభమైంది. దాని ద్వారా పాఠ్యప్రణాళికలకూ, పరిశోధనాంశాలకూ సంబంధించిన అంశాలు చర్చించి నిర్ణయాలు తీసుకొని అకడెమిక్ కౌన్సిల్‌కు పంపేవారు. ఎం.ఏ.లో ద్రావిడ భాషాధ్యయనం కూడా వారి కృషి ఫలితమే. విద్యార్థి కన్నడ, తమిళ, మలయాళ భాషలలో ఏదో ఒకటి ఐచ్ఛికంగా తీసుకోవలసి వచ్చేది. ఆ విధంగా ద్రావిడ భాషలలో ఆదాన ప్రదానాలకు నాంది జరిగింది.
తెలుగు శాఖలో మరి కొందరు ఉద్దండులను గూర్చి మరో వారం….