కాజాల్లాంటి బాజాలు-67: ఇంటర్నెట్‌ తో ఇబ్బందులెన్నో..

1
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]కొ[/dropcap]త్త సంవత్సరంలో మా వదిన కొత్త నిర్ణయాలు తీసుకుంది. వాటిలో నన్నూ, ఇంకొంతమందినీ భాగస్వాములని చేసింది. అవ్విధంబెట్టిదనిన…

ఒకరోజు పొద్దున్నే ఫోన్ చేసి, “మధ్యాహ్నం మూడుగంటలకి జూమ్ మీటింగ్ పెడుతున్నాను, నువ్వూ జాయిన్ అవూ” అంది..

ఈ కరోనా మహమ్మారి వలన ఎవరిని కలవాలన్నా జూమ్ లోనే కదా అనుకుంటూ..

“దేనికోసం వదినా..” అనడిగితే “మనందరికీ పనికొచ్చేదే. మర్చిపోయి, నిద్దరోకూ..” అని హెచ్చరించింది కూడా..

వదిన ఆర్డర్ వేసేక ఇంక నిద్రాదేవికి నా దగ్గరకొచ్చే ధైర్యం ఎక్కడ.. కళ్ళు మండుతున్నాసరే, సరిగ్గా మూడుగంటలకి సిస్టమ్ ముందు కూర్చుని లాగిన్ అయేను.

అప్పటికే వదిన, మా పెద్దమ్మ కూతురు సీత, వాళ్ల తోడికోడలు రమ వచ్చేరు. ఇంకా ముగ్గురెవరో రావాలని వదిన చెపుతుండగానే సీత వదిన మాట వినపడడంలేదని నోటికి అడ్డంగా చెయ్యాడిస్తూ సైగ చేసింది.

“వాల్యూమ్ పెంచూ..” అని వదిన చెపుతోంది కానీ అది సీతకి వినపట్టంలేదు. అలాగే నోటిముందు అడ్దంగా చెయ్యాడిస్తూనే వుంది. ఈ లోపల ఇంకోళ్ళెవరో వచ్చినట్టు పేరొచ్చింది కానీ మనిషెవరో కనపడలేదు.

ఇక్కణ్ణించి వదిన “నీరజా, నీ వీడియో ఆఫ్‌లో వుంది, ఆన్ చెయ్యి” అంది.

అవతలవాళ్ళు వీడియో ఆన్ చేసేరనుకుంటాను ఒక్కక్షణం మెరుపులా వచ్చి మాయమైపోయేరు.

ఈ లోపల రమ కనపడడం మానేసింది. “రమా, నీ వీడియో రావట్లేదు చూడు” అంది వదిన. సిస్టమ్‌లో యేం నొక్కిందో కానీ రమ మొత్తానికే కనపడడం మానేసింది.

ఓ వైపున సీత చెయ్యాడిస్తూనే వుంది.

ఇంకోవైపు లతట ఆవిడ పేరు… ఆవిడ జాయిన్ అయేరు. ఆవిడని నేనిదే మొదటిసారి చూడడం.. మనిషి నడివయసులో వున్నట్టుంది. కూర్చున్నప్పుడు మొహందాకానే కనపడతారు కదా.. అందుకని సరిగ్గా కనిపెట్టలేకపోయేను. నేనైతే ఏదో వదినే కదా పిలిచింది అన్నట్టు ఇంట్లో కట్టుకునే చీరతో, జుట్టు ముడేసుకుని సిస్టమ్ ముందుకి వచ్చేసేను కానీ ఆ లత మటుకు బాగా కోటింగ్ కొట్టుకుని, ఎంబ్రాయిడరీ చీరతో డిజైనర్ బ్లౌజ్ వేసుకుని వచ్చినట్టు స్పష్టంగా తెల్సిపోతోంది. మెడలో ఈ రోజుల్లో కొత్తగా వస్తున్న ఇమిటేషన్ జ్యుయలరీలాంటిదేదో పెట్టుకుంది. ఎంతో స్టయిల్‌గా “హాఆఆయ్..” అంది అందరితో చెప్పినట్టు చెయ్యూపుతూ..

“ఈవిడ లత. ముంబాయి నుంచి రెండ్రోజులక్రితమే మా ఎదురుకుండా వున్న ఫ్లాట్ లో దిగారు. కంప్యూటర్ నాలెడ్జ్ బాగా వుంది. ఇప్పుడు మనందరికీ ఆన్‌లైన్‌లో పనులు చేసుకునే అవసరం పడింది కదా! అందుకని వాటి గురించి మనందరికీ క్లాసులు తీసుకోమని ఆవిణ్ణి అడిగేను. ఆవిడ వెంటనే ఒప్పుకున్నారు. మనకేం కావాలో చెపితే అవన్నీ ఆవిడ మనకి నేర్పిస్తారన్నమాట. కోర్సుని బట్టి ఫీజన్నమాట. “

వదిన చేసిన పరిచయానికి ఆ లతన్నావిడ కాస్త హుందాగా సిగ్గు పడింది.

ఇంతలో వీడియో ఆన్ చేసిన నీరజ చెయ్యూపుతూ అందరికీ “హాయ్..” అని చెపుతుండగానే మళ్ళీ మాయమైపోయింది.

ఉపోద్ఘాతం ముగించిన వదిన వచ్చేవాళ్లందరినీ యాడ్ చేస్తూ మధ్య మధ్యలో ఎవరు వచ్చేరో ఇంకా ఎవరు రావాలో చూసుకుంటోంది.

ఇంతలో రమ మళ్ళీ జాయిన్ అయి గట్టిగా “నాకేం కనపట్టంలేదు..” అంది.

“ఓసారి లాగౌట్ అయి, మళ్ళీ లాగిన్ అవు..” అని సలహా ఇచ్చింది వదిన.

అలాగే చేసింది రమ. కానీ ఇలా కనపడి అలా మాయమైపోయింది మళ్ళీ.

“అక్కడే క్లిక్ చెయ్యి..” అంటోంది వదిన.

“చేసేను..రావట్లేదు..” అట్నుంచి రమ.

“ఎందుకు రాదూ.. గట్టిగా కొట్టు..”

“గట్టిగానే కొడుతున్నాను. రావట్లేదు”

“ఇంకా గట్టిగా కొట్టు..”

“గట్టిగానే కొడుతున్నాను..”

ఇదంతా చూస్తుంటే నాకు మతిపోయింది. ఎవరు ఎవర్ని ఎందుకు కొట్టమంటున్నారో అర్థం కాలేదు.

“ఎవర్ని కొట్టాలి వదినా ..ఎందుకూ!” అనడిగేను.

“స్వర్ణా.. “ వదిన కసురుకుంది నన్ను.

ఓ నిమిషానికి స్క్రీన్ మీద కనిపించినవాళ్ళు ఇంకో నిమిషానికి మాయమైపోతున్నారు. పోనీ వున్నవాళ్ళు ఏం చెపుతున్నారో విందామని చూస్తుంటే ఒకసారి వినిపిస్తోంది ఇంకోసారి వినిపించటం లేదు. కానీ కనిపిస్తున్నవాళ్ళు మాత్రం చేతులూ, మూతులూ తిప్పేసుకుంటూ ఏదో చెప్పాలన్నట్టు అభినయించేస్తున్నారు.

వదిన మటుకు ఒకరితో ఆడియో ఆన్ చేయమనీ, ఇంకోళ్ళతో వాల్యూమ్ పెంచమనీ, మరొకరితో వీడియో బటన్‌ని గట్టిగా  కొట్టమనీ చెపుతోంది.

ఈ హడావిడిలో ఆ లతన్నావిడ ఎక్కడికెళ్ళిపోయేరో కనిపించలేదు. ఆ విషయం వదిన్ని అడిగితే వదిన లతకి ఫోన్ చేసింది. వాళ్ళింట్లో ఇంటర్నెట్ కనెక్షన్ పోయిందనీ, మళ్ళీ రాగానే జాయిన్ అవుతాననీ చెప్పిందని మాతో వదిన చెపుతుండగానే మళ్ళీ ఆ లత దగ్గర్నుంచి యాడ్ చెయ్యమని మెసేజ్ వచ్చింది. వదిన వెంటనే యాడ్ చేసింది.

ఈ లోపల మా గుంపంతా కాస్త జూమ్‌కి అలవాటు పడి స్థిమితపడ్డారు. వదిన మా ఆన్‌లైన్ క్లాసుల మాట లత దగ్గర ఎత్తగానే ఆవిడ చాలా బాధ పడిపోతూ, “ముందు అందరూ ఇంటర్నెట్ కనెక్షన్లు సరిగ్గా చూసుకోండి. తర్వాత క్లాసులు మొదలెడదాం..” అంటూ శెలవు తీసుకుని వెళ్ళిపోయింది.

వదిన మా అందరికీ ఆన్‌లైన్‌లో ఏమేమి నేర్చుకోవాలో చెపుతుంటే నాకు మటుకు ఆ లతని తల్చుకుని పాపం అనిపించింది. నిజవేకదా.. ఆవిడ అంత కష్టపడి మేకప్ వేసుకొచ్చినంత సేపు నిలబడలేదీ ఇంటర్నెట్.. ఆవిడకి బాధగా వుందంటే వుండదూ మరీ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here