రామం భజే శ్యామలం-21

1
3

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]దే[/dropcap]వానాంపియ్ర.. అంటే అర్థం తెలుసా? ఇది ఒక రాజాధిరాజుకు ఉన్న గొప్ప బిరుదు. భారతదేశంలో ఈ సమ్రాట్టును మించిన రాజు మరొకడు లేనేలేడని ప్రతీతి. ఈ దేశాన్ని వేల ఏండ్లుగా పరిపాలించిన రాజులెవరూ ఈ రాజుగారి ముందు బలాదూరే.. దేవానాంప్రియుడు అంటే అర్థం కూడా తెలియకుండానే.. భారతదేశ ఏకైక మహత్తర చక్రవర్తిగా కొనియాడబడుతున్న ఈ రారాజు కథ ఏమిటో విన్నంత.. కన్నంత తెలుసుకొందాం.

గ్రీకుచరిత్రకారులు రాసిన శాండ్రకొట్టస్‌ను యురోపియన్ చరిత్రకారులు పొరపాటుపడి.. మౌర్య చంద్రగుప్తుడన్నారు. అతనే అలెగ్జాండర్‌ను కలిశాడని చెప్పారు. ఈ విధంగా మన చరిత్రను ‘కొంచెం’గా మార్చడానికి యురోపియన్ చరిత్రకారుల దౌష్ట్యానికి మన దేశంలోని మార్క్సిస్టు చరిత్రకారులు, ఇస్లామిస్టు చరిత్రకారులు వంతపాడుకొంటూ వచ్చారు. ఈ దేశంలో ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాలు ఆమోదించిన చరిత్ర పుస్తకాలన్నీ.. మన దేశపు వ్యక్తుల పేర్లతో అచ్చయినవి. ఈ రచయితలు ఎవరూ కూడా తాము ఇక్కడి శాసనాలనో.. రాత ప్రతులనో.. పురావస్తు శిథిలాలనో.. ప్రాచీన గ్రంథాలనో శోధించి.. పరిశోధించి.. స్వతంత్రంగా నిర్ధారించి రాసినవేనా అని అనుమానం. యురోపియన్ చరిత్రకారులు.. వారికి ఏది అర్థమైతే వాటిని రాస్తే.. ఆ కథలనే మనవాళ్లు కాస్త అటూఇటూగా తిరగమోత వేసి మసాలా దట్టించి ప్రపంచంలోకి వదిలేశారేమో.

ఎందుకంటే ఈ చరిత్ర నిర్మాణం అంతా భారతీయ సమాజంలో వేనవేల ఏండ్లుగా గూడుకట్టుకొనిపోయిన చరిత్రను నామరూపాలు లేకుండా చేసే లక్ష్యంతోనే సాగింది. ఇందులోభాగంగానే సనాతన ధర్మానికి ప్రత్యామ్నాయం బౌద్ధ ధర్మం అవుతుందని ఈ సోకాల్డ్ చరిత్రకారులు భావించారు. మర్యాదాపురోషోత్తముడైన శ్రీరాముడికి ప్రత్యామ్నాయంగా.. సరిజోడుగా బౌద్ధ ధర్మాన్ని అనుసరించాడని భావించిన రాజుల్లో వెతికి వెతికి పర్టిక్యులర్‌గా మౌర్య చంద్రగుప్తుని మనుమడు, బిందుసారుని కొడుకైన అశోకుడిని ఐడెంటిఫైచేశారు. భారతదేశ చరిత్రలో అత్యున్నతస్థాయిలో ఓ సూపర్‌న్యూమరీ పోస్టును క్రియేట్‌చేసి అక్కడ కూర్చోబెట్టారు. భారతదేశ రాజుల్లో అశోకుడిని మించిన రాజు లేడంటే లేడన్నారు. అతని నాలుగు సింహాలు.. ధర్మచక్రాన్ని మించిన ఆదర్శం దొరకనే లేదన్నారు. చివరకు మనదేశ రాజచిహ్నాలుగా కూడా అవే అయ్యాయి.

ఈ చరిత్రకారులు.. భారత ప్రభుత్వాలు అదేపనిగా మార్కెటింగ్ చేసిన బౌద్ధం.. అశోకుడి చరిత్ర యురోపియన్ చరిత్రకారులు చెప్పినదాన్నే చర్వితచరణం చేశారు తప్ప.. స్వాతంత్య్రం వచ్చిన తరువాతైనా దానిపై లోతైన పరిశోధనలు చేయనేలేదు. మానవ పరిణామక్రమంలో మహాపురుషుడైన గౌతమ బుద్ధుడు, అశోకుడి చరిత్రను ఐరోపా చరిత్రకారులు సంకుచితం చేశారని.. వారిరువురు ప్రస్తుతం మనం చదువుకుంటున్న కాలంకంటే కనీసం పన్నెండు వందల సంవత్సరాలకు ముందున్నవారని అనేకమంది భారతీయ చరిత్రకారులు పదేపదే చెప్తున్నప్పుడు దానిపై పరిశోధనచేసి ఒక నిర్ధారణ చేయవచ్చుకదా..

వీళ్లు భుజానికెత్తుకొన్నవాళ్లు జీవించిన కాలం మరింత ప్రాచీనమైనదని తేలితే.. అది మన దేశానికి గర్వకారణం కాదా? ఈ సోకాల్డ్ చరిత్రకారులకూ గర్వకారణమే కదా.. మరెందుకు చేయలేదు? అంతకుముందు ఎవడో ఒకడు చేశాడు.. వాడు పాశ్చాత్యుడు కావచ్చు.. ఇంకొకడు కావచ్చు.. వాడు చేశాక, రాశాక మనం కొత్తగా చేసి చేప్పేదేముంటుంది? ఐసీహెచ్‌ఆర్ వంటి సంస్థల నుంచి ప్రాజెక్టులు పొందాలి.. నిధులు సమీకరించాలి.. జేఎన్‌యూల్లో, ఏఎంయూల్లో.. సదస్సుల్లో మనకున్న అపారమైన ఆంగ్ల పరిజ్ఞానంతో వందలాది ఉపన్యాసాలు దంచేసి.. పుస్తకాలు అచ్చొత్తించి.. అవార్డులు పొందాలి. గొప్ప చరిత్రకారులుగా కిరీటాలు పెట్టుకోవాలి అన్న ఆలోచన తప్ప వీరు కొత్తగా చేసిందేమీ లేదు.. సాధించిందీ ఏమీ కనిపించదు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుపరిపాలనకు.. దేశ పునర్నిర్మాణానికి పునాది కావలసింది రామాయణం. కానీ అలా జరుగలేదు. రాముడే ఎందుకు రోల్ మోడల్ కావాలో చెప్పడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. వేదయుగం ముగిసిన తర్వాత.. సార్వకాలీనమైన రాజ్యవ్యవస్థను, సమాజ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను ఆదర్శంగా అందించిన వాడు శ్రీరామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మః అన్నది వాల్మీకి మాట. ధర్మానికి రూపం కల్పిస్తే.. దాని పేరు రాముడు. కొడుకుగా, అన్నగా, భర్తగా, స్నేహితుడిగా, గురువుగా, శిష్యుడిగా, రాజుగా.. రక్షకుడిగా.. సమాజంలోని సమస్తమైన సుగుణాలను పుణికిపుచ్చుకొన్న మహాపురుషుడిగా శ్రీరామచంద్రుడు యుగయుగాలకూ ఆదర్శుడే. మౌఖికంగా మొదలైన రామగానం.. టెలివిజన్ సెట్లలో సీరియల్ వరకూ అనేక రూపాలు సంతరించుకొని తారకమంత్రంగా మారిన విషయం వేరుగా చెప్పనక్కరలేదు. బాలకాండ మొదలు.. పట్టాభిషేకం దాకా అడుగడుగునా రాముడి వ్యక్తిత్వమేమిటో వ్యక్తమవుతూనే ఉంటుంది. ఒకే ఒక్క ఉదాహరణ తీసుకొందాం. ఈ మాట వాల్మీకి రామాయణం యుద్ధకాండలో రాముడి పట్టాభిషేకం అనంతరం ఆయన రాజ్యం ఎలా ఉన్నదో చెప్పినమాటలు యథాతథం..

‘రాముడు రాజ్యమును పాలించిన కాలంలో స్త్రీలు వైధవ్య దుఃఖమును పొందలేదు. క్రూర జంతువుల వల్ల భయం కానీ, వ్యాధుల వల్ల భయం కానీ లేదు. లోకంలో దొంగలు లేరు. ఎవరికీ ఏ అనర్థమూ జరుగలేదు. పెద్దవాళ్లు, చిన్నవాళ్లకు ప్రేతకార్యం చేసే అవసరం కలుగలేదు. అంతా ఆనందంగా ఉన్నది. అందరూ ధర్మపరులుగా ఉన్నారు. తప్పు చేస్తే రాముడెక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో ఉన్నారు. ప్రజలు ఒకరికొకరు హింసించుకోలేదు. ఆయా వృత్తులవారు వారి వారి వృత్తులను చేసుకొంటూ ఉన్నారు. కట్టుదిట్టమైన భదత్ర నడుమ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. వాతావరణం కలుషితం కాలేదు. వర్షాలు సకాలంలో పడ్డాయి. చెట్లు పండ్లు, పూలతో ఎప్పుడూ నిండుగా ఉన్నాయి.’ ఇది రామాయణంలో యుద్ధకాండ ముగింపులో చెప్పినమాటలు. రామరాజ్యం అని మన నాయకులు టీవీ మైకులముందు.. సభల్లో ఎందుకు ఊదరగొడతారంటే.. రాముడి రాజ్యం ఈ విధంగా ఉన్నందుకే. మరి స్వతంత్ర భారతదేశానికి ఇలాంటి రాజు కదా.. రోల్ మోడల్‌గా ఉండాల్సింది. సబ్బండవర్ణాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేందుకు అందించాల్సిన సుపరిపాలనకు ఈ రాముడు కదా ప్రేరణ కావాల్సింది? ఎందుకు కాలేదు? పోనీ.. ఇప్పటి ఓటుబ్యాంకులు.. మతాలు, కులాల లెక్కన చూసినా.. ఈ రాముడు బ్రాహ్మణుడు కాదు కదా.. అంతెందుకు? వశిష్ఠుడు, వ్యాసుడు, వాల్మీకి, కృష్ణుడు.. వీళ్లంతా ఆయా కులాలకు చెందినవాళ్లే కదా.. ఈ ఓటుబ్యాంకు లెక్కన చూసుకొన్నా.. ప్రమోట్ చేయదగిన క్యారెక్టరే కదా.. మరి ఎందుకు చేయలేదు?

అశోకుడు.. చండాశోకుడు మాత్రమే స్వతంత్ర భారతంలో ఎందుకు ది గ్రేట్ కింగ్‌గా ఎందుకు ప్రమోట్ అయ్యాడు? అర్థంకాని ప్రశ్న.

అశోకుడికి సంబంధించిన మిగతా విషయాలను గురించి చర్చించాల్సివస్తే.. అడుగడుగునా సందేహాలు చుట్టుముడుతాయి. ఇంత అయోమయంగా.. ఒక దేశ చరిత్ర రాయడం బహుశా ప్రపంచంలో ఎక్కడా కనిపించదేమో.. ఒక్కొక్క సందేహం మన దేశ చరిత్ర నిర్మాణం ఎంత దారుణంగా జరిగిందనడానికి దర్పణం పడుతుంది. మీరే చదవండి.

నిజంగా ఈ అశోకుడు (అశోక ది గ్రేట్) గొప్పవాడేనా? ఇది మొదటి సమస్య. మళ్లీ మొట్టమొదలు వేసుకొన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతున్నది? దేవానాంప్రియ.. ఈ అశోకుడికే ఈ గొప్ప బిరుదు ఉన్నది.

మీరెవరైనా సరే.. దేవానాంప్రియ అన్న పదానికి వికీలోనో.. అశోకుడి చరిత్రలోనో.. పాఠాల్లోనో ఒక్కసారి వెతకండి.. ఈ బిరుదుకు అర్థం దేవుళ్లందరికీ అత్యంత ప్రియుడైనవాడు అని అద్భుతంగా చెప్తారు. దీనికి నిజమైన అర్థమేమిటో తెలుసా? సంస్కృత నిఘంటువు ప్రకారం దేవానామ్ప్రియ: అంటే.. జాల్మ: అని అర్థం. మరో అర్థం అవివేకి అని. ఈ జాల్మ: అంటే ఏమిటి? నీచ: అని అర్థం. అంటే..అల్పుడు అని తెలుగులో భావం. జాల్మ: అంటే అసమీక్ష్య కార్యకారీ, స్తబ్ద: అన్న రెండు అర్థాలు కూడా ఉన్నాయి. అంటే.. ఏమీ ఆలోచించకుండా పని చేసేవాడు.. స్తబ్ధుడు అని అర్థం. మరి అశోకుడికి ఈ బిరుదు ఎందుకు ఇచ్చారు? అతను నిజంగా ఈ విధమైన దేవానాంప్రియుడేనా? మన చరిత్రకారులు వాస్తవాలను విప్పిచెప్పాల్సిన సందేహం ఇది.

నందవంశం అంతమైన తర్వాత మౌర్య చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 1534లో రాజయ్యాడు. ఆయన కొడుకు బిందుసారుడు 1500లో రాజయ్యాడు. అతని కొడుకు అశోకుడు 1472లో పట్టాభిషక్తుడయ్యాడు. ఇది భారతీయ చరిత్రకారులు భారతీయ గణాంకాల ప్రకారం.. తేల్చిన లెక్కలు. కానీ ప్రస్తుత భారతీయులు చదువుకొంటున్న యురోపియన్ చరిత్రకారుల లెక్కల ప్రకారం వీళ్ల చరిత్ర 12 వందల సంవత్సరాలు ముందుకు జరిగి క్రీస్తుకు పూర్వం 320 ప్రాంతాలకు చేరుకొన్నది. అది అలా జరుగుతూ.. జరుగుతూ.. గుప్త చంద్రగుప్తుడు.. సముద్రగుప్తుడు.. కుమారగుప్తుల కాలాన్ని క్రీస్తు శకం 450 ప్రాంతాలకు జరిగిపోయింది. ఇందులో భాగంగానే అశోకుడి కాలం కూడా 260 బీసీలో ఫిక్స్ అయింది. ఇది కాల నిర్ణయానికి సంబంధించిన అనుమానం. ఇందులో తప్పొప్పులను చరిత్రకారులైనవారు తేల్చాలి.

ఇక ఈ అశోకుడు ఎందుకు ఇంత గొప్ప రాజు అయ్యాడో బుర్రబద్దలు కొట్టుకొన్నా అర్థం కాదు. కళింగ యుద్ధంచేశాడు.. అందులో లక్షమందిని హతమార్చాడు.. ఆ యుద్ధభూమిలో ఆ శవాలను.. రక్తకాసారాన్ని చూసి విచలితుడై.. ఒక్కసారిగా బౌద్ధంలోకి మారిపోయి.. అహింసామూర్తిగా మారాడు. వెంటనే ఆయన డ్రెస్‌కోడ్ మారిపోయింది. రోడ్లపక్కన చెట్లు నాటించాడు. వందలాది హాస్పిటల్స్ కట్టించాడు.. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించాడు. భారతదేశంలో సాటిలేని రారాజు అశోకుడి చరిత్ర ఇది అనే మనం ఏడున్నర దశాబ్దాలుగా చదువుకొంటూనేఉన్నాం. ఇదంతా నిజమేనా?

యురోపియన్ చరిత్రకారుల లెక్కల ప్రకారం అశోకుడు క్రీస్తుకు పూర్వం 304లో జన్మించాడు (భారతీయ చరిత్రకారుల కాలనిర్ణయం ప్రకారం 15వ శతాబ్దం). ఒకవేళ ఈ లెక్కలనే నిజమని భావిస్తే.. వీటితోపాటు.. బౌద్ధమత గ్రంథాలైన అశోకాకవదానం, దివ్యావదానం వంటి రచనలు, సిలోన్ అంటే శ్రీలంక బౌద్ధ సంప్రదాయ చరిత్ర ప్రకారం అశోకుడికి ముప్ఫై ఏండ్ల వయసులో (క్రీ.పూ.274) బిందుసారుడు హఠాత్తుగా అనారోగ్యంపాలయ్యాడు. విష ప్రయోగం జరిగిందని అనుమానం. తరువాత యువరాజు సుశిమను రాజ్యం నుంచి వెళ్లగొట్టిన అశోకుడు.. ఎక్కడో తూర్పు ప్రాంతాల్లో హతమార్చాడు. దాదాపు 99 మంది సవతి సోదరులను హతమార్చాడు.. (ఈ సంఖ్యలో అతిశయోక్తి ఉండవచ్చేమో.. కానీ సవతి సోదరులందరినీ చంపాడు). తిస్స అనే ఒకే ఒక్క సొంత సోదరుడిని మాత్రం బతకనిచ్చాడు. తన తండ్రికి విధేయులైన దాదాపు ఐదు వందలమంది అధికారులను నిర్దాక్షిణ్యంగా హత్యచేశాడు. మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. చండాశోకుడు, కామాశోకుడు.. ఇలా సవాలక్ష పేర్లతో ఇతను ప్రసిద్ధి చెందాడు. మొత్తం మీద 268 బీసీలో పట్టాభిషక్తుడయ్యాడు. ఇదంతా అశోకుడు రాజ్యానికి రావడానికి ముందు జరిగిన సీన్.

దివ్యావదాన వంటి గ్రంథాల్లో ప్రస్తావించిన ప్రకారం అశోకుడు తాను అధికారంలోకి వచ్చినతర్వాత నాలుగేండ్లకు (264 బీసీ)లో బౌద్ధం స్వీకరించి వేలాది విహారాలు కట్టాడు. (మరికొన్ని కథనాల ప్రకారం కళింగయుద్ధం తరువాత బౌద్ధాన్ని స్వీకరించాడు). బౌద్ధుల లెక్కల ప్రకారం ఒక్క అశోకుడే 84 వేల బౌద్ధ విహారాలు నిర్మించాడు. ఇది కూడా బౌద్ధం స్వీకరించిన ఏడాది తరువాత.. మొదలుపెట్టి.. రెండేండ్ల కాలవ్యవధి (263261) లో నిర్మించాడు. ఈ విహారాల లెక్క ఎలా తేలిందో.. ఎక్కడెక్కడ ఉన్నాయో అర్థంకాని విషయంలెండి. సరే.. ఈ వేలాది బౌద్ధ విహారాల నిర్మాణంలో ఫుల్లుగా తలమునకలై ఉన్న అశోకుడు ఉన్నట్టుండి 260 బీసీలో రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోయాడు.. ముందుగా పక్కనున్న కళింగరాజ్యంపై దండెత్తాడు. మానవాళి చరిత్రలోనే అత్యంత దారుణమైన మారణకాండ జరిగిన యుద్ధంగా యురోపియన్ చరిత్రకారులు దీన్ని ప్రవచించాడు. లక్షమందిని ఈ యుద్ధంలో అశోకుడు చంపాడు. మరో లక్షన్నర మందిని యుద్ధఖైదీలు చేసి తన రాజధానికి ఈడ్చుకొనిపోయాడు. ఈ లక్ష మందిని చంపి..  లక్షన్నర మందిని తీసుకొనిపోయే క్రమంలోనే అశోకుడికి ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. ఒక్కసారిగా బౌద్ధం గుర్తుకువచ్చింది. కత్తి కింద జారిపడింది. కిరీటం తొలిగిపోయింది. తెల్లబట్టలు వచ్చేశాయి. హింసాశోకుడు కాస్తా ‘దేవానాంప్రియుడై’పోయాడు.

అశోకుడికి సంబంధించిన కొద్దో గొప్పో వివరాలు శ్రీలంక బౌద్ధ సంప్రదాయ గ్రంథాల్లో కనిపిస్తాయి. కల్హణుడి రాజతరంగిణిలోనూ అశోకుడి ప్రస్తావన ఉన్నది. రాజతరంగిణిలోని అశోకుడు.. మగధాశోకుడు ఒకరు కాదన్నది చరిత్రకారుల వాదన. శ్రీలంక చరిత్రకారుల లెక్కల ప్రకారమే ఆలోచిస్తే.. రాజ్యానికి వచ్చిన నాలుగో ఏట బౌద్ధాన్ని స్వీకరించిన అశోకుడు ఆ తర్వాత మరో రెండేండ్ల పాటు 84వేల బౌద్ధ విహారాలు కట్టడంలో తలమునకలైపోయాడు కదా.. ఎందుకంటే అన్ని వేల విహారాల నిర్మాణం సామాన్యమైన ప్రాజెక్టు ఏమీ కాదు. ఎప్పటికీ పూర్తికాని జాతీయ ప్రాజెక్టులాంటిది. బౌద్ధమతాన్ని ఇంత సీరియస్‌గా స్వీకరించిన మహారాజైన అశోకుడికి ఉన్నట్టుండి కళింగమీద యుద్ధంచేయాలని ఎందుకు అనిపించింది? అహింసను పరమధర్మంగా బోధించే బౌద్ధరాజు.. మహా మానవహననానికి ఎందుకు పూనుకొన్నాడు? ఆ తర్వాత అంటే.. జస్ట్ ఆ ఒక్క యుద్ధం ముగియడంతోనే మళ్లీ జ్ఞానోదయం అయి హింసను ఎలా విడనాడాడు.. ఇంత ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగటం నిజంగా అద్భుతం.. అమోఘం.. అపూర్వం!!

అశోకుడు కళింగయుద్ధం తరువాత బౌద్ధం స్వీకరించాడన్నది ఇంకో కథ. యుద్ధం తర్వాత లక్షన్నరమందిని ఖైదీలుగా పట్టుకొని పాట్నాకు (పాటలీపుత్రం)కు వెళ్లాడు. తర్వాత ఆయన సభకు ఓ బౌద్ధభిక్షువు వచ్చి.. రాజా నేను యుద్ధభూమి నుంచి వచ్చాను. అక్కడ చనిపోయినవారి మృతదేహాలను లెక్కబెట్టివచ్చాను. అక్షరాలా లక్ష శవాలున్నాయి. నువ్వు ఇట్ల చేస్తే ఎట్ల చెప్పు? అన్నాడట. వెంటనే అశోకుడు శోకంతో కుమిలిపోయి బౌద్ధాన్ని స్వీకరించాడట. వెంటనే అశోకుడు శోకించి బౌద్ధం స్వీకరించాడు. ఇది మరో కథనం.

బౌద్ధమతానికి సంబంధించిన ఏ మత గ్రంథాల్లోనూ అశోకుడి యుద్ధానికి, బౌద్ధమత స్వీకారానికి సంబంధం ఉన్నట్టు ఎక్కడా రాసిలేదు. అంతేకాదు.. అతను బౌద్ధాన్ని కేవలం రాజకీయాలకోసం వాడుకున్నాడా అన్న అనుమానమూ కలుగుతుంది. ఎందుకంటే.. మౌర్యులు వేద సంప్రదాయానికి చెందినవారు. వారి గురువులు బ్రాహ్మణ పురోహితులు కావడం వల్ల వైదిక సంప్రదాయాన్ని అనుసరించారు. అయితే మౌర్య చంద్రగుప్తుడికి జైనులతో, జైన మతంతో సంబంధం ఉన్నది. కర్ణాటకలోని గోమఠేశ్వరుడి జైనక్షేత్రం శ్రావణబెళగొళలో గోమఠేశ్వరుడి పర్వతం ఎదురుగా చంద్రగుప్తుడి పర్వతం ఉంటుంది. చంద్రగుప్తుడు ఆ కొండ మీద తపస్సు చేసినట్టుగా చెప్తారు. అతని కొడుకు బిందుసారుడికి ఆజవికులతో సంబంధం ఉన్నది. మనదేశంలో ఈ రకమైన పద్ధతి అసహజమేమీ కాదు. స్వర్ణదేవాలయానికి లక్షలాది హిందువులు వెళ్లి గురునానక్‌ను, గురుగ్రంథ్‌సాహెబ్‌ను దర్శించుకొని.. నమస్కరించుకొని వస్తారు. బౌద్ధదేశమైన థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో పెద్ద బ్రహ్మ విగ్రహం మనం చూడవచ్చు. అలాగే.. కుటుంబ సంప్రదాయం ఎలా ఉన్నప్పటికీ.. ఇతర మతాల వారితో సంబంధాలు పెట్టుకోవడం.. వారి మందిరాలకు వెళ్లడం.. ప్రార్థనలు చేయడం మనదగ్గర మొదట్నుంచీ ఉన్న సంప్రదాయమే. అందుకే మౌర్య చంద్రగుప్తుడు జైనులను ఆదరిస్తే.. బిందుసారుడు అజివికులను ఆదరించాడు. రాజ్యాధికారం దగ్గరకు వచ్చేసరికి క్రూరుడైన అశోకుడిని అందరూ తీవ్రంగా, నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా జైనులు, ఆజవికులతో సంబంధాలున్న కుటుంబసభ్యులు అశోకుడిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి అశోకుడికి ఒకే ఒక్క ప్రత్యామ్నాయంగా బౌద్ధం కనిపించింది. వెంటనే దాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత 18 వేల మంది ఆజవికులను, వందలాది జైనులను ఊచకోత కోశాడు. ఇదంతా బౌద్ధమతాన్ని స్వీకరించిన తర్వాతే జరిగింది. బౌద్ధం స్వీకరించిన తర్వాత కూడా క్రూరత్వంతో మానవహననానికి పాల్పడ్డాడంటే.. బౌద్ధం ఎందుకు స్వీకరించాడో అర్థం చేసుకోవచ్చు. బౌద్ధ మతగ్రంథం అశోకవదనంలో రాసిఉన్న ఒక సన్నివేశాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక జైనుడు పాట్నా (పాటలీపుత్రం)లో ఒక బొమ్మ వేశాడు. జైన తీర్ధంకరుడికి గౌతమబుద్ధుడు నమస్కరిస్తున్నట్టుగా ఆ బొమ్మ ఉన్నది. ఆ జైనుడిని అశోకుడు అతని ఇంట్లోనే కుటుంబసభ్యులతో సహా బంధించి.. ఇంటితో సహా సజీవంగా దగ్ధం చేశాడు. అంతేకాదు. జైనుల తలలు తెచ్చినవారికి తలకొక్కింటికి ఒక బంగారు నాణాన్ని బహూకరిస్తానని చాటింపుకూడా చేయించాడు. ఇదీ అశోకుడి బౌద్ధ ధర్మం.

మరో తీవ్రమైన సందేహం ఏమిటంటే.. అశోకుడు కళింగపై ఎందుకు యుద్ధంచేశాడన్నది.? ఎందుకంటే.. మౌర్యరాజ్యస్థాపనకు ముందే నందరాజైన మహాపద్మనందుడు కళింగపై యుద్ధంచేసి నందరాజ్యంలో కలుపుకొన్నాడు. నందులను ఓడించిన చంద్రగుప్తుడు నందరాజ్యాన్ని తన వశం చేసుకొని మౌర్యవంశాన్ని స్థాపించాడు. అంటే.. అశోకుడి తాతగారికంటే ముందే.. మౌర్యరాజ్యంలో కళింగ అంతర్భాగంగా ఉన్నది.

పైగా కళింగరాజ్యం అన్నది మౌర్య సామ్రాజ్యాన్ని చాలాచాలా దగ్గరగా ఉంటుంది. (ఒడిశా పక్కనే బీహార్ ఉంటుందన్నది తెలిసిందే). అటువంటప్పుడు భారతదేశమంతటా విస్తరించిన మౌర్యసామ్రాజ్యం.. పక్కనే ఉన్న కళింగను స్వతంత్రంగా ఉండనివ్వడం అన్నది సాధ్యంకానిపని. చంద్రగుప్తుడు, ఆ తరువాత బిందుసారుడి టైంలో కళింగ అన్నది మౌర్యసామ్రాజ్యంలో ఒక రాష్ర్టంగానో.. సామంత రాజ్యంగానో ఉండిఉండాలి.

అశోకుడి సమయానికి వచ్చేసరికి మార్పు వచ్చిఉండాలి. ఎందుకంటే.. చుట్టూరా శత్రువులను పెట్టుకొని రాజ్యాధికారాన్ని సంపాదించుకొన్నవాడు అశోకుడు. ఈ నేపథ్యంలో అతని శత్రువులు.. కళింగరాజు.. లేదా అధికారితో కలిసిపోయి ఉండాలి. ఈ పరిణామం యుద్ధానికి దారి తీసి ఉండవచ్చు. ఏమైతేనేం.. ప్రస్తుత భువనేశ్వర్ దగ్గర ఉన్న దయా నదీ తీరం వద్ద కళింగయుద్ధం జరిగినట్టు చరిత్రకారుల అభిప్రాయం.

కళింగయుద్ధానికి సంబంధించిన శిలా శాసనం (13) గిర్నార్‌లో లభించింది. గిర్నార్ గుజరాత్‌లో ఉన్నది. కళింగ అన్నది ఆధునిక ఒడిశాలో ఉన్నది. అశోకుడికి సంబంధించిన ప్రధానశాసనంగా దీన్ని చెప్తారు. ఈ శిలాశాసనంలో అశోకుడు (పియదస్సి అన్న పేరు ఉన్నది.. ప్రియదర్శి అని అర్థం చెప్పారు. ఈ ప్రియదర్శే అశోకుడని చరిత్రకారులు అన్నారు.) యుద్ధంలో లక్షమందిని హతమార్చి.. యుద్ధం తరువాత మరో లక్షన్నర మందిని యుద్ధఖైదీలుగా పట్టుకెళ్లాడని కనిపిస్తుందే తప్ప క్షమాపణ చెప్పినట్టు లేనేలేదు. వీళ్లలో ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. ప్రస్తుత భువనేశ్వర్ దగ్గర ఉన్న ధౌలిలో లభించిన ఒక శాసనంలో తాను చేసిన యుద్ధానికి అశోకుడు బాధపడ్డాడని ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. కానీ.. ఆ శాసనం అశోకుడి పశ్చాత్తాపం కంటే.. మరో తీవ్రమైన హింసకు పాల్పడుతానన్నట్టుగా ఉన్నదే తప్ప క్షమాపణ చెప్పినట్టు అనిపించదు. ‘దేవానాంప్రియుడు బాధపడుతున్నాడు కానీ.. ఈ ఆటవిక ప్రజలు.. తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపపడితే.. వారిని ఎవరూ చంపరు. లేకపోతే తీవ్రంగా శిక్షించగల శక్తి ఈ దేవానాంప్రియుడికి ఇంకా ఉన్నది.’

ప్రాచీన రాజులు తమ శాసనాల ద్వారా తమ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియడం కోసం రాయిస్తారు. కానీ అశోకుడి శాసనాలను గమనిస్తే.. తన తీవ్రమైన హింసాప్రవృత్తిని, నియంతృత్వాన్ని సమకాలికులైన ఇతర రాజులు, అధికారులు, గవర్నర్లకు తెలియజేయడం కోసమే రాశాడా అన్నట్టు కనిపిస్తాయి. తన రాజకీయ ఆధిపత్యాన్ని తిరుగులేనివిధంగా ప్రదర్శించడంకోసమే రాసినట్లు అనిపిస్తాయి. గిర్నార్, ఎర్రగుడి, మనేష్రా, షాబాద్‌గడీ, కాందహార్ తదితర ప్రాంతాల్లో అశోకుడి శాసనాలు ఉన్నాయి. కళింగ ప్రాంతంలో అశోకుడు తాను వేయించిన శాసనాల్లోని 13, 14 శాసనాలను మార్చి వాటి స్థానంలో మరో రెండు శాసనాలను వేయించాడు. 13వ శాసనం గిర్నార్ లో కనిపిస్తుంది. ఈ మార్చిన శాసనాల్లో కళింగయుద్ధంపై దుఃఖపడినట్లు లేనేలేదు. బహుశా కళింగ ప్రజలకు క్షమాపణ చెప్పడం రాజకీయంగా తనకు అనుకూలం కాదని అనుకొని ఉండవచ్చు. మొత్తం మీద ఈ శాసనాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే.. కళింగయుద్ధం అన్నది వాస్తవం కంటే.. ఊహాపోహలే ఎక్కువగా ఉన్నట్టు అభిప్రాయం కలుగుతుంది.

అశోకుడి శాసనాలతోపాటు.. శ్రీలంక బౌద్ధ సంప్రదాయ గ్రంథాల్లో (అశోకావదాన, దివావదాన, సామంతపసాదిక) మరింత అయోమయం కల్పించే ఘటనలు కనిపిస్తాయి.

శ్రీలంక గ్రంథాల ప్రకారం.. పట్టాభిషేకం 268 బీసీలో జరిగింది.

నాలుగేండ్లతరువాత అంటే.. 264 బీసీలో బౌద్ధం స్వీకరించాడు.

ఐదు నుంచి ఏడేండ్ల హయాంలో 84 వేల విహారాలు నిర్మించాడు.

దీనికి కొనసాగింపుగా అశోకుడి శాసనాలు చెప్తున్నదేమంటే..

పట్టాభిషేకం అయిన తర్వాత 8, 9 సంవత్సరాల్లో గయలోని బోధి వృక్షానికి తీర్థయాత్రకు వెళ్లాడు. బౌద్ధ ధమ్మాన్ని (ధర్మం) ప్రచారం చేశాడు. వైద్య సదుపాయాలు, చెట్లు నాటించడం, బావులు తవ్వించడం వంటి సామాజిక కార్యకలాపాలు నిర్వహించాడు. అశోకుడు చేపట్టిన ఈ పనులన్నీ.. పొరుగుదేశాలైన చోళ, పాండ్య వంటి రాజ్యాలకు రోల్‌మోడల్‌గా మారి అక్కడ కూడా అమలుచేశారు.

పట్టాభిషేకం జరిగిన తర్వాత 10,11 సంవత్సరాల్లో బౌద్ధసంఘానికి దగ్గరయ్యాడు. 256 రోజులు తన రాజ్యంలో పర్యటించాడు.

12వ సంవత్సరంలో ధమ్మను ప్రచారం చేసే శాసనాలు వేయించాడు.

19వ సంవత్సరంలో అశోకుడి కూతురు సంఘమిత్ర శ్రీలంకకు పోయి నన్‌గా మారి బౌద్ధమతాన్ని ప్రచారంచేసింది. అక్కడికి బోధి మొక్కను పట్టుకొని వెళ్లి నాటింది.

ఇదంతా బాగానే ఉన్నది. పట్టాభిషేకం అయిన ఎనిమిదోఏట బోధి వృక్షాన్ని చూడటానికి తీర్థయాత్రకు వెళ్లిన అశోకుడు కళింగరాజ్యంపైన ఎప్పుడు దండెత్తాడు.. యుద్ధం జరిగిన తరువాత వెళ్లాడా? ముందే వెళ్లాడా? ఈ టైంలైన్ ఏదీ కూడా ఉత్తర భారతంలోని ఏ ఒక్క శాసనంలో కనిపించదు. సంఘమిత్ర శ్రీలంకకు వెళ్లిన విషయం అశోకుడి శాసనాల్లో ఎక్కడా కనిపించదు. పట్టాభిషేకం అయిన 19వ ఏట కాలాతిక అనే గుహను బౌద్ధగురువులకు దానం చేసినట్టు మాత్రమే ఆయన శాసనాల్లో కనిపిస్తుంది. అంతే తప్ప సంఘమిత్ర ప్రస్తావన లేదు. ఆ తరువాతి సంవత్సరం బుద్ధుడి జన్మస్థలం అయిన లుంబిని వనం, బుద్ధ శాక్యముని స్థూపాన్ని సందర్శించడానికి వెళ్లాడు.

ఏ విధంగా చూసినా.. అశోకుడు హింసాశోకుడే అయ్యాడు తప్ప సుపరిపాలకుడు కాలేకపోయాడు. తొలినాళ్లలో ఎంత నియంతగా సమస్తమౌర్య సామ్రాజ్యాన్ని కంటిచూపుతో శాసించాడో.. తన చివరిరోజుల్లో.. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత తన కండ్లముందే రాజ్య పతనాన్ని కూడాచూశాడు. దేశంలో తిరుగుబాట్లు చెలరేగాయి. పలు ప్రాంతాల్లో స్థానిక అధికారులు స్వతంత్రతను ప్రకటించుకొన్నారు. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అతని మరణం తర్వాత (232 బీసీ) శాతవాహనులు దక్షిణభారతాన్ని (కళింగతో కలుపుకొని) తమ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఒక రకంగా చూస్తే ఔరంగజేబ్ ను ముఘల్ అశోకుడనవచ్చు. అశోకుడి మరణం తరువాత 50 ఏళ్ళలో మౌర్య ఆధిపత్యం అంతమయింది. చివరి మౌర్య రాజును పుష్యమిత్రుడు చంపటంతో శుంగ వంశ పాలన ప్రారంభమయింది. ఔరంగజేబ్ మరణించిన 50 ఏళ్ళకు డిల్లీపై ముఘల్ ఆధిపత్యం అంతరించింది. వీరిద్దరినీ పోలుస్తూ అధ్యయనం చేస్తే ఆశ్చర్యకరమయిన సంగతులు తెలుస్తాయి. ( ఇది మరో వ్యాసపరంపర అవుతుంది. కాబట్టి ఇప్పటికి ఈ విషయంపై ఇంతే)

ఇదంతా జాగ్రత్తగా గమనిస్తే.. అశోకుడు ఏ విధంగానే గొప్పరాజు కాడు.. కాలేడు. అశోకుడు క్రూరుడు. విమనైజర్. అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకొని అనుభవించినవాడు. తన తండ్రి, తాత ఎంతో గొప్పగా నిర్మించిన సుస్థిర సామ్రాజ్యాన్ని నాశనం కావడానికి కారణభూతుడయ్యాడు. ఇప్పుడు మనం చూసే రాజకీయ నాయకుల్లాగానే.. తనను తాను ఎక్కువగా మార్కెటింగ్ చేసుకొన్నాడు. బౌద్ధంపేరుతో నటించాడు.

వాస్తవానికి అశోకుడు.. జేమ్స్ ప్రిన్సెప్ వంటి చరిత్రకారుల వల్ల 19వ శతాబ్దంలోనే మళ్లీ బయటకొచ్చాడే తప్ప అంతకు ముందు మన చరిత్రలో అతనికి పెద్ద స్థానం లేనేలేదు. అంతేకాదు.. భారతదేశానికి స్వాతంత్య్రోద్యమ కాలంలో ఏర్పడిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే అశోక ది గ్రేట్ అన్న మాట పుట్టుకొచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ అశోక ది గ్రేట్ అన్న మాటను మరింత మసాలా జోడించి మార్కెటింగ్ చేశారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సోషలిస్ట్ ఇమేజిని నిలబెట్టడం కోసం అయన అనుచర చరిత్రకారులు అశోకుడిని అదేపనిగా నెత్తిన పెట్టుకొని దేశమంతా పాఠ్యపుస్తకాల్లో ఊరేగారు. ఎక్కడో ఏదో బీరకాయ పీచు ఆధారం పట్టుకొని ఈ అకడమిక్ చరిత్రకారులు ఇలాంటి కథలను అల్లి ప్రచారం చేస్తుంటే.. భారతీయులంగా గొర్రెల్లా అంగీకరించి.. వల్లెవేస్తుండటమే.. ఈ దేశం చేసుకొన్న దురదృష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here