[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
[dropcap]రా[/dropcap]జతరంగిణి కాక జోనరాజు రచించిన వ్యాఖ్యానాలు మూడు లభ్యమవుతున్నాయి. ఈ మూడు వ్యాఖ్యానాలను గమనిస్తే కశ్మీరు సుల్తానుల పాలన కాలంలో ఆనాటి కవుల స్పందన స్వరూపాన్ని ఊహించే వీలు చిక్కుతుంది.
సాధారణంగా సంస్కృత రచనలను వ్యాఖ్యానించేవారు ఆయా వ్యాఖ్యలలో వ్యాకరణ చర్చలు అధికంగా ఉండే రచనలకు ప్రాధాన్యం ఇస్తారు. చరిత్రను సంస్కృత రచనల ఆధారంగా నిర్మించాలనుకునేవారు ఆయా రచనలలో ద్యోతకమయ్యే చారిత్రకాంశాల వైపు దృష్టి సారిస్తారు. సాహితీ విమర్శకులు సాహిత్యాంశాల వైపు దృష్టి పెడతారు. కానీ రచనలో నిబిడీకృతమై ఉన్న రచయిత మానసిక స్థితిని, ఆనాటి సామాజిక మనస్తత్వాన్ని ప్రతిబింబించే అంశాలకు అంతగా ప్రాధాన్యమివ్వరు. జోనరాజు రచనలలో నిజానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలు ఇవే.
జోనరాజు వ్యాఖ్యానించిన కిరాతార్జునీయం, శ్రీకంఠ చరిత్ర, పృథ్వీరాజ విజయం అనే మూడు కావ్యాలు విభిన్నమైనవి. హఠాత్తుగా చూస్తే ఒకదానితో మరొకటి సంబంధం లేదనిపించేవి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి నడుమ సంబంధం కనిపించడమే కాదు, వ్యాఖ్యానానికి ఆయా రచనలను ఎన్నుకోవటంలో పథకం కనిపిస్తుంది. ‘కిరాతార్జునీయం’ కథ అందరికీ తెలిసిందే. శివుని మెప్పించి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించటం కిరాతార్జునీయం ప్రదర్శిస్తుంది. మంఖుడి ‘శ్రీకంఠ చరిత్ర’ ప్రధానంగా శైవమత ప్రధానమయినది. ఈ కావ్యంలో 25 అధ్యాయాలుంటాయి. కావ్యారంభంలో మంఖుడు కశ్మీరులోయను అందంగా వర్ణిస్తాడు. 12వ శతాబ్దంలో కశ్మీరు సమాజాన్ని వర్ణిస్తూ, ఆ సమాజంలో తన కుటుంబ స్థాయిని వివరిస్తాడు. కలలో అర్ధనారీశ్వరుడి రూపంలో తండ్రి కన్పించి దైవ ప్రశంస కల కావ్యం రాయమని కోరటం వల్ల తానీ కావ్యం రచిస్తున్నటు చెప్తాడు. తన కావ్యాన్ని సోదరుడు ‘లంకక’ ఇంట్లో మహా మహా పండితులు, కవులకు వినిపించి వారి ప్రశంసలు పొందుతాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న కవుల జాబితాలో ‘కల్హణుడు’ కూడా ఉన్నాడు. నందన, రమ్యదేవ, ప్రభాకర, శ్రీగర్భ, మందన, గర్గ, శ్రీకంఠ, శ్రీదేవాధర, జయసింహ, అలవార, నాగ, త్రైలోక్య, దామోదర, గోవింద, కల్యాణ (కల్హణ), అలకదత్త, పద్మరాజ, జనకరాజ, ఆనంద, లక్ష్మీదేవ, సుహల, జోగరాజు వంటి మహామహులు ఉన్న సభ అది. ఆ సమయంలో అక్కడ కొంకణరాజు అపరాదిత్య దూత ‘తేజఃకంఠ’ కూడా ఉన్నాడు.(ఇవి కొందరు ప్రధాన కవుల పేర్లు మాత్రమే..అంటే ఆ కాలంలో కశ్మీరం ఎంత పాండిత్యంతో అలరారేదో అర్ధంచేసుకోవచ్చు) వారికి వినిపించిన కావ్యంలో శివుడు త్రిపురాసురుని సంహరించటం కేంద్రబిందువు. పృథ్వీరాజ విజయం కావ్యం ఘోరీని ఓడించి పృథ్వీరాజు ధర్మాన్ని రక్షించడం కథ. మొదటి రెండు కావ్యలపై వ్యాఖ్య శైవమత ప్రచారం కొసం రాసినవనీ, చివరి కావ్యంపై వ్యాఖ్య రాయటం ఆశ్చర్యంగా, అసంబద్ధంగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. సుల్తానుల పాలనలో ఇస్లామేతరుల మనుగడ ప్రశ్నార్థకమైన సమయంలో జోనరాజు తన వ్యాఖ్య ద్వారా ఈ మూడు కావ్యాలను సజీవంగా నాటి సమాజం ముందు నిలపటం, పైకి సుల్తానుల ఆదేశాల ప్రకారం సంస్కృత కావ్యాలను పరిచయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మరో కోణం లోంచి చూస్తే జోనరాజు వ్యాఖ్యానం సుల్తాను కోసం చేసినా, ‘ధర్మరక్షణ’ వైపు సమాజం దృష్టి మరల్చటం ప్రధానంగా అనిపిస్తుంది. షెల్డన్ పోలాక్, ‘పృథ్వీరాజ విజయ’ కావ్యం – “shows the formation of a nascent Hindu consciousness through the development of Ramayana symbols or themes” అని అభిప్రాయపడ్డాడు. కిరాతార్జునీయంలో అర్జునుడు పాశుపతం కోరింది ధర్మరక్షణార్థం. అర్జునుడు పోరాడేది ధర్మం వైపున. కాబట్టి అతడి వద్ద ఎలాంటి ఆయుధం ఉన్నా అది ధర్మ రక్షణ కోసమే ఉపయోగపడుతుంది. శ్రీకంఠ చరిత్రలో శివుడు త్రిపురాసురుల సంహారం చేస్తాడు. త్రిపురాసురులు ముగ్గురు సోదరులు, తారకాక్ష, విద్యున్మాలి, కమలాక్ష. ఈ ముగ్గురు బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు. బంగారం, వెండి, ఇనుములతో తయారైన నగరాలు కోరుతారు. ప్రతి వెయ్యి సంవత్సరాలకి ఈ మూడు నగరాలు ఏకమవుతాయి. తరువాత మళ్ళీ వెయ్యి సంవత్సరాల పాటు అజేయంగా నిలుస్తాయి. అలా ఏకమయిన కొద్ది కాలమే వాటిని నాశనం చేయవచ్చు. మిగత సమయంలో వాటికి ఎలాంటి ప్రమాదం ఉండదు. స్వర్గంలో, ఆకాశంలో, భూమిపై ఉంటాయి నగరాలు. దాంతొ అసురులకు అడ్డు అదుపు ఉండదు. వారిని నాశనం చేసేందుకు విష్ణువు ప్రత్యేకంగా ఓ మనిషిని సృజిస్తాడు. అతడు నూతన మతాన్ని ప్రవచిస్తాడు. ఆ మతం వేద వ్యతిరేకం. స్వర్గ నరకాలను నమ్మదు. మరణం తర్వాత జీవితాన్ని నమ్మదు. ధర్మ వ్యతిరేకమైన మతం ఇది. ఈ త్రిపురాసురులు ఆ మతాన్ని స్వీకరిస్తారు. వేదాలను విస్మరిస్తారు. శివపూజను విస్మరిస్తారు. దాంతో శివుడు, మూడు నగరాలు ఏకమయ్యే క్షణాన పాశుపతం ప్రయోగించి మూడు నగరాలను ఒకేసారి నాశనం చేస్తాడు. ఆనాటి నుండి అతనికి ‘త్రిపురాంతకుడు’ అన్న పేరు వచ్చింది. ఈ కథలో కూడా ధర్మవ్యతిరేకమైన మతాన్ని అవలంబించేవారిని సంహరించి ధర్మాన్ని నిలపటం ఉంది. చివరలో విష్ణువు సృష్టించిన వ్యక్తి ప్రవచించిన మతం కలియుగంలో విజృంభిస్తుందని, అది ఒక స్థాయికి చేరిన తరువాత దైవం దాన్ని సమూలంగా నాశనం చేస్తాడని చెప్పటం ఉంటుంది.
‘పృథ్వీరాజ విజయం’లో పృథ్వీరాజు ఘోరీపై విజయం సాధించటం ఉంది. ఈ ఘోరీ మ్లేచ్ఛుడు. ధర్మవ్యతిరేకి, అనాగరికుడు. రాక్షసుడి వంటి వాడు. అలాంటివాడి నుంచి ధర్మాన్ని రక్షించాడు పృథ్వీరాజు. ఇప్పుడు ఈ మూడు వ్యాఖ్యానాలలో పథకం తేటతెల్లం అవుతుంది. ధర్మం ప్రమాదంలో పడినప్పుడు ఆ ధర్మ రక్షణ కోసం భగవంతుడు పూనుకుంటాడు. ‘పృథ్వీరాజ విజయం’లో పృథ్వీరాజును రామావతారంలా చూపించటం వెనుక ఉన్న ఆలోచన ఇదే. దాన్ని పట్టుకుని అత్యంత నర్మగర్భితంగా ప్రకటించాడు జోనరాజు తన వ్యాఖ్యానాలలో. ఈ ప్రజల దృష్టిని ఈ గ్రంథాలలో ఉన్న ధర్మ రక్షణ వైపు మళ్ళించి, పృథ్వీరాజు విజయాన్ని ఇందుకు నిరూపణగా చూపించాలని ధర్మ రక్షణ కోసం సాహిత్యకారుడిగా జోనరాజు చేసిన సాహిత్య యుద్ధం పలువురు కశ్మీరీ ఇస్లామీ పండితులకు నచ్చలేదు. అందుకే వారు జోనరాజును పరుష పదజాలంతో తీసిపారేస్తారు. ముఖ్యంగా మహమ్మద్ ఇషాక్ ఖాన్ (1946-2013) అనే కశ్మీరీ చరిత్రకారుడు జోనరాజును “bigoted-closed minded Brahmin, writing only for his Hindu Brahminical community in the sacred Hindu language of Sanskrit to the exclusion of Muslim population of Kashmir” అని తీవ్రంగా విమర్శించాడు. అయితే ఈయన విస్మరించిన విషయం ఏంటంటే జోనరాజు తన వ్యాఖ్యానాలు కానీ రాజతరంగిణి కానీ సుల్తాన్ జైన్ ఉల్ అబీదీన్ ఆమోదంతోటే రచించాడు. అంటే ‘exclusion of Muslim population’ అన్నదీ, ‘writing only for his Hindu Brahminical community’ అన్నదీ వర్తించదన్న మాట. కానీ ఈ దృష్టితో చూస్తే, ఈనాటికీ జోనరాజు రచనలు ఇస్లాం పండితుల ద్వేషానికీ, క్రోధానికీ గురవటం జోనరాజు సాగించిన సాహిత్య యుద్ధం ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది. ఇక్కడే జోనరాజు తన వ్యాఖ్యానాలతో సుల్తానును మెప్పిస్తూ, తాను అందించదలచుకున్నది ప్రతీకాత్మకంగా, మార్మికంగా అందించటాన్ని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. అత్యంత నర్మ గర్భితంగా, అధర్మ పాలన కలకాలం సాగదన్న విశ్వాసాన్ని, ఆశను సమాజంలో కలిగించటం తెలుస్తుంది. ‘పృథ్వీరాజ విజయ’ కావ్యంలో జయానకుడు ఇస్లామీయులను ప్రస్తావించిన తీరుకు, దానిపై వ్యాఖ్యలో జోనరాజు ఇస్లామీయులను సంబోధించిన తీరులో తేడాను గమనిస్తే జోనరాజు ‘లౌక్యం’ తెలుస్తుంది.
‘పృథ్వీరాజు సేనలు ఘోరీ సేనలను హతమార్చాయి. అప్పుడు నేలపై పడి ఉన్న ఇస్లామీ సైనికులను చూసి జాలిపడిన గాలి వారి వారి అంతిమ సంస్కార పద్ధతులను అనుసరించి ఇసుకను వారిపై కప్పింది’ అన్న శ్లోకానికి వ్యాఖ్యానంలో జోనరాజు ఇస్లామీయులకు ‘యవన’ అన్న పదం వాడతాడు. జయానకుడు ‘మ్లేచ్ఛ’, ‘తురుష్క’, ‘తాడిక’ వంటి ఆ కాలంలో ఇస్లామీయులను సూచించేందుకు వాడే చులకన పదాలు వాడతాడు. ‘మ్లేచ్ఛ’ అన్న పదానికి, ‘యవన’ అన్న పదానికి భావంలో తేడా ఉంది. ‘మ్లేచ్ఛ’ అన్న పదం అనాగరికుడిని, ధూర్తుడిని, దుష్టుడిని సూచిస్తుంది. ‘యవన’ అంత తీవ్రమైన పదం కాదు. యవన అన్న పదం కాలక్రమేణ గ్రీకులను, విదేశీయులను సూచించే పదంగా మారింది కానీ, వేద కాలంలో యవన పదం అర్ధం వేరే. వేద భ్రష్టులయిన క్షత్రియులు మ్లేఛ్చులు. వీరుండే ప్రాంతాలు యవన ప్రాంతాలు. ఈ యవనులలో వర్ణాలుండేవి. రాజతరంగిణి ప్రకారం వీరు యవన బ్రాహ్మణులు, యవన క్షత్రియులు, యవన వైశ్యులు, యవన శూద్రులు. వీరుండే యవన సామ్రాజ్యాలు: అభిసార, ఉరగ, సింగపుర, దివ్య కటక, ఉత్తర, జ్యోతిష….తరువాత కాలంలో యవన పదం పలు అర్ధాలను సంతరించుకుంది. జోనరాజు కాలంలో గౌరవ ప్రదంగా వ్యవహరించే వేద ధర్మేతరులు యవనులు. అంటే యవన గౌరవప్రదమయిన పదమేనన్నమాట.
జయానకుడు ‘సంస్కారం ఆత్మోచితం అంతకాలే’ అని వాడితే, దాని వ్యాఖ్యలో జోనరాజు ‘ప్రేతసంస్కారం’ అన్న పదం వాడతాడు. అంటే ‘యవన’ అన్న పదం ప్రత్యేక సంస్కారం, సంప్రదాయం కల జాతిని సూచించేట్టు వాడేడన్న మాట జోనరాజు.
ఘోరీని మ్లేచ్ఛుడిగా పరిగణిస్తూ వ్యాఖ్యానిస్తాడు జోనరాజు. అంటే వ్యాఖ్యానం ద్వారా ఘోరీ వేరు, జైన్ ఉల్ అబీదీన్ వేరు అని చూపిస్తున్నాడన్న మాట జోనరాజు. ఘోరీకి వ్యతిరేకంగా పృథ్వీరాజు పోరాడటం ఇస్లామీయుడికి వ్యతిరేకంగా పోరాడటం కాదు, మ్లేచ్ఛుడికి వ్యతిరేకంగా పోరాడటం. జైన్ ఉల్ అబీదీన్ మ్లేచ్ఛుడు కాదు, యవనుడు. ఈ భేదాన్ని స్పష్టం చేస్తూ జోనరాజు, ఘోరీ పేరు ఎంత సమంజసమో చూపించే శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తాడు.
భాషాదోష వాశాద్ గిరామ్ బలరాజ స్తోమైర్ దిశామ్ అంభషామ్
అక్షణమ్ భానురుచామ్ చ దుష్కృత భారా ద్యావా పృథ్వీ వోర్ అపి।
కాఠిన్యాత్ కులిశాస్య మారకఫలా సంగాధిశునామ్ వధాద్
ధేనూనామ్ ధారణ్య అరోధి దశధా భిధైర్ గోరిభిః॥
(పృథ్వీరాజ విజయం, 10.47)
పదాల ఉచ్చారణలోని దోషాలు, దిగంతాలను నింపిన ధూళి, జాలం, కళ్ళు, సూర్య కిరణాలు, పశువుల సంహారం, ఆయుధాల గట్టితనం, భూమిని కప్పటం, వంటి దశ విధాల వల్ల అతడికి ‘గోరి’ అన్న పేరు వచ్చింది.
జోనరాజు దీన్ని వివరిస్తూ ‘గోరి’ పేరులో ‘గో’ అంటే ‘గోవు’ అని, ‘అరి’ అంటే శత్రువు అని, గోసంహారం కావిస్తాడు కాబట్టి అతడికి ‘గోరి’ అన్న పేరు సమంజసమే అని వ్యాఖ్యానిస్తాడు. ఈ పది అంశాల ఆధారంగా జోనరాజు మ్లేచ్ఛులను నిర్వచిస్తాడు. భూమికి భారం అయినవారు, అణచివేసేవారు, గోవులను హత్య చేసేవారు, అనాగరికంగా దోష భూయిష్టమైన పదాలను వాడుతూ మాట్లాడేవారు, ఆయుధాలపై ఆధారపడేవారు మ్లేచ్ఛులు. తమదైన ప్రత్యేక సంస్కారం, పద్ధతులు కలిగిన వారు యవనులు. అందుకే యవనులు మరణిస్తే గాలి జాలిపడి వారి పద్ధతి ప్రకారం అంతిమ సంస్కారం జరిపింది ఇసుకను కప్పి. ఇస్లామీయులు శవాన్ని పాతిపెడతారు. ఆ పద్ధతిని సూచిస్తున్నాడు ఇక్కడ. ఇలా సంస్కారం లేని మ్లేచ్ఛులు, పద్ధతి కల యవనులు అని తేడా చూపుతూ, ఇస్లామీయులు యవనులు, గోరీ మాత్రం మ్లేచ్ఛుడు అని నిరూపిస్తాడు జోనరాజు తన వ్యాఖ్యానంలో. అంటే మహమ్మద్ ఘోరీ ఇస్లామీయుడైనందుకు మ్లేచ్ఛుడు కాదు. అతని దౌష్ట్యం వల్ల, అనాగరిక చర్యల వల్ల, క్రూరమైన ప్రవర్తన వల్ల మ్లేచ్ఛుడయ్యాడు తప్ప అతను పాటించే మతం వల్ల కాదు అని స్పష్టం చేస్తాడు జోనరాజు. ఇలా తేడా చూపి వ్యాఖ్యానించటం వల్ల సుల్తానుకు కోపం రాదు. పృథ్వీరాజు మ్లేచ్ఛుడితో పోరాడేడు. ఇస్లామీయుడితో కాదు. ఇది సుల్తాన్ చుట్టూ ఉన్న ఇస్లామీయులకు ఆగ్రహం కలిగించదు. కానీ భారతీయులకు జోనరాజు చమత్కారం అర్థమవుతుంది.
ఇదే పద్ధతిని జోనరాజు రాజతరంగిణి రచనలోనూ పాటించాడు. ‘బుత్ షికన్’ సికందర్ దౌష్యాన్ని, క్రూర చర్యలను వర్ణిస్తూ, సికందర్ స్వతహాగా మంచివాడే కానీ, కొత్తగా ఇస్లామ్ స్వీకరించిన బ్రాహ్మణుడు ‘సుహాభట్టు’ దుష్టుడు. క్రూరుడు. అతడు ఇస్లామేతరులపై ఘోరమైన అత్యాచారాలు చేశాడు. క్రూరంగా వ్యవహరించాడు. యజ్ఞాలకు, పూజలకు, పండుగలకు, తీర్థయాత్రలకు అడ్దుపడి నిషేధించింది సికందర్‍కు తెలియకుండా సుహాభట్టేనని, సికందర్ దౌష్ట్యానికంతటికీ సుహాభట్టును బాధ్యుడిని చేస్తాడు జోనరాజు. ఇలా చేయటం వల్ల సికందర్ కాలంలో జరిగిన అకృత్యాల దోషం అతడిది కాకుండా పోయింది. కానీ ఆ కాలంలో జరిగిన అకృత్యాలు భవిష్యత్తు తరానికి అందుతున్నాయి సుల్తాన్ ఆమోదంతో. ఇది జోనరాజు రాజతరంగిణి రచనలో పాటించిన ‘లౌక్యం’. ‘న బ్రూయాత్ సత్య మప్రియం’ అన్న సూక్తిని పాటిస్తూ సత్యం బ్రూయాత్ ను అనుసరిస్తూ సత్యాన్ని చెప్తున్నాడన్న మాట.
(ఇంకా ఉంది)