కథా సోపానములు-9

5
4

[box type=’note’ fontsize=’16’] డా. బి.వి.ఎన్. స్వామి ‘కథా సోపానములు’ అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘ముగింపు’ ఎంత అవసరమో వివరిస్తుంది. [/box]

ముగింపు

[dropcap]న[/dropcap]దులన్నీ సముద్రంలో కలుస్తాయి. వాటికి అది ముగింపు. కొన్ని నదులు, సగం వరకు వెళ్ళి ఎక్కడో అక్కడ మరో నదిలో కలుస్తాయి. వాటి ముగింపు అలా ఉంది. మరి కొన్ని మధ్యలోనే ఇంకిపోతవి. అవి కొనసాగకపోవడమే వాటి ముగింపు. ప్రారంభమైన ప్రతి దానికి ముగింపు ఉంటుంది. వివిధ స్థాయిల్లో దశల్లో ముగింపులు ఉంటాయి. పని సగంలో మానివేసినా అతని పని అక్కడికి ముగిసినట్లే. మరొకరు ఆ పనిని కొనసాగిస్తారు. నన్నయ మహాభారతాన్ని రెండున్నర పర్వాలు ఆంద్రీకరించి వదిలేసాడు. దానివల్ల భారతం ముగిసినట్లా? కాదు. నన్నయ పని ముగిసింది. మిగతా పని ఎఱ్ఱన ముగించాడు. అట్లా ముగింపులు రకరకాలు. ఈ న్యాయం కథకు కూడా వర్తిస్తుంది. కథకు జీవితం ముడిసరుకు. జీవితానికి ముగింపు ఉన్నట్లే, కథకు ముగింపు ఉంటుంది. జీవితం సంఘటనల సమాహారం. మనిషి తనకు ఎదురైన కష్టాలు కడగండ్లు, సుఖసంతోషాల మధ్య చస్తూ బతుకుతుంటాడు. ఆయా జీవితశకలాలను రచయిత కథగా మలుస్తుంటాడు. బాల్యంను కథగా చిత్రీకరిస్తే దానికి కొనసాగింపుగా కౌమారం వచ్చి చేరుతుంది. కాని కథకుడు బాల్యంను మాత్రమే కథా వస్తువుగా తీసికుంటే బాల్యం ఎక్కడ ముగుస్తుందో అది కథకు ముగింపు అవుతుంది. అంటే ముగింపులు మరో కథకు ప్రారంభాలుగా పనికి వస్తాయి. టెక్నికల్‌గా కథకు ముగింపు తప్పనిసరి. సాంప్రదాయిక కథ నీతి బోధనలతో ముగుస్తుంది. అలనాటి కథలన్నీ ముగింపులో నీతిని వాచ్యం చేసాయి. ఆధునిక కథ అందుకు భిన్నంగా ఉంది. రచయిత ఏ ఉద్దేశంతో కథ మొదలుపెడతాడో, ఆ ఉద్దేశం నెరవేరడంతో కథ ముగుస్తుంది. రచయిత కథెందుకు రాసాడో, అందులో ఏం చెప్పాడో ముగింపు ద్వారా పాఠకుడికి ఎరుక కలగాలి. కథనుండి ముగింపు జాలువారాలి. ఆది, అంతం మధ్య ఐక్యత కుదరాలి. కథ ముగింపుకు ముందు అంతిమ ఘట్టం ఉంటుంది. ఈ క్లైమాక్స్ వచ్చేసరికి కథ ముగుస్తుందని పాఠకుడు గ్రహిస్తాడు. ముగింపు ఎలా ఉంటుందో ఊహిస్తాడు. పాఠకుడి ఊహకు అందకుండా ఒక్కోసారి వ్యతిరేకంగా కూడా ఉత్కంఠ రేకెత్తించే విధంగా కొందరు రచయితలు కథను ముగిస్తారు. ఇలాంటి వాటిని కొసమెరుపు ముగింపులు అంటారు. అందుకు భిన్నంగా సహజంగా ముగిసే కథలు ఉంటాయి. అవి సాధారణ, సహజమైన ముగింపులు. ఇలాంటి వాటిలో క్లైమాక్స్ లేదా పతాకసన్నివేశం, ముగింపులు మమేకమవుతాయి.

నమ్మలేని నిజాలుంటాయి. అట్లే ముగింపుకాని ముగింపులుంటాయి. ఇవి పూర్తిగాని ముగింపులు. కొంతమంది కథకులు తాము చెప్పాల్సింది అయిపోయిందను కున్నప్పుడు కథను ఆపేస్తారు. అలాంటి ముగింపులు పాఠకుల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. టెక్నికల్‌గా కథకు అదే ముగింపు. కాని ఆ ముగింపు మరో కథకు ప్రారంభంగా ఉంటుంది. అలాంటివి అవధులు లేని ముగింపులు. ముగింపు ఎలాంటిదైనా ఎత్తుకున్న కథను దించేదిగా ఉండాలి. ఎత్తేసినట్లు ఉండకూడదు. అట్లా కథ ఉంటే అభాసుపాలు అవుతుంది. అద్భుతం, ఆనందం, విషాదం, వ్యంగ్యం, దుఃఖం, సుఖం, ప్రశ్నించడం లాంటి అనేక భావాలు ముగింపుల్లో కనిపిస్తాయి. మంచి ముగింపులన్నీ కీలక ఘట్టం సమాప్తం కాగానే ముగుస్తాయి. ముగింపు కథకు అతికినట్లుండాలి. అతికించినట్లుండరాదు. కథ కోసం ముగింపే కాని, ముగింపు కోసం కథ కాదు. కుక్క తోకను ఆడించాలి కాని తోక కుక్కను ఆడించరాదు. ముగింపును ముందుపెట్టుకొని కథ రాయకూడదు. ముగింపు పాఠకునిపై ముద్ర వేసేదిగా ఉండాలి. కొందరు కథలోని సమస్యకు ముగింపులో పరిష్కారం చూపుతారు. మరికొందరు చూపరు. పరిష్కారం లేని ముగింపులు కూడా ఉంటాయి. ముగింపు ఎలా ఉండాలి అనేది కథకుని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ముగించిన తర్వాత మాత్రం కథకుడు ఎలాంటి వివరణ, వ్యాఖ్యానం చేయకూడదు.

ఉదాహరణ

ప్రముఖ కథా రచయిత గీడిమపాసా రాసిన కథకు తెలుగు అనువాదం ‘ఒక జీవితం’. ఇందులో ‘జీన్’ అనే పాత్రది ప్రముఖ స్థానం. నాలుగు దిక్కుల నుండి కలిగిన పలురకాల అనుభవంతో పండిపోతుంది జీన్. ఆమె అనుభవసారంగా “జీవితం విచిత్రమైంది. అది మనం ఊహించుకున్నంత మంచిది కాదు. చెడ్డదీ కాదు” అనే వాక్యంతో కథ ముగుస్తుంది. కథలోనుండి ముగింపు వాక్యం జాలువారింది. కథా ప్రారంభంలో కూతురుకు (జీన్‌కు) ‘జీవిత వాస్తవాలు’ తెలియవు అని ఆమె తండ్రి అనుకోవడం కనిపిస్తుంది. జీవిత వాస్తవాలు తెలుసుకోవడంతో కథ ముగుస్తుంది.

(మరోసారి మరో అంశంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here