కొత్త కోణం

1
3

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకులకు యలమర్తి అనురాధ రచించిన ‘కొత్త కోణం’ అనే నాటికని అందిస్తున్నాము. [/box]

పాత్రలు:

ధర్మతేజ – హీరో తండ్రి – 45 సంవత్సరాలు

సుశీల – హీరో తల్లి – 40 సంవత్సరాలు

ఆకాష్ – హీరో – 25 సంవత్సరాలు

ధరణి – హీరోయిన్ – 23 సంవత్సరాలు

స్నేహిత్ – హీరో స్నేహితుడు – 25 సంవత్సరాలు

***

సాయంసమయం, పార్కు వాతావరణం. పక్షుల కిలకిలరావాలు, పిల్లల అరుపులు, గెంతులు, ఆటలు.

***

ధరణి : ఆకాష్! ఏమాలోచిస్తున్నావ్?

ఆకాష్ : అదే ధరణీ! మన ప్రేమ విషయం అమ్మానాన్నలకు ఎలా చెప్పాలా అని!

ధరణి : ఎలా చెప్పాలా కాదు, ఎలా ఒప్పించాలా అని.

ఆకాష్ : సముద్రంలోకి దిగకుండానే ఈదేద్దాం అన్నట్లుంది నీ మాట.

ధరణి : ఏదో… నీ సీరియస్‍నెస్‍ను కాస్త తగ్గిద్దామని….

స్నేహిత్ : (అరుస్తూ వస్తాడు) ఒరేయ్ ఆకాష్! సారీ చెల్లెమ్మా! మీ మధ్య ఇలా జొరబడుతున్నందుకు. ఇప్పుడే అందిన వార్తను మీకు వెంటనే అందించాలని.

ఆకాష్ : ఏమిటది?

స్నేహిత్ : ప్రేమజంటగా ఇన్నాళ్ళు ముచ్చటగా పిలుచుకుంటున్న స్వప్న, కళాధర్ పారిపోయారొహోచ్!

ధరణి : (ఆశ్చర్యంగా) అవునా?!

స్నేహిత్ : అందులో ఆశ్చర్యపోవడానికేముంది? ఇది అందరూ చేసే పనేగా!

ఆకాష్ : ఇది మారదా?

స్నేహిత్ : ఎందుకు మారుతుందిరా? పిల్లలు ప్రేమించామనగానే నా ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వను, బయటకు పొమ్మనే తండ్రులున్నంతవరకూ ఈ కథలింతే!

ధరణి : దీన్ని మేం ఒప్పుకోం. వీటిని తిరగరాస్తాం. మార్పు తీసుకొచ్చేదాకా మేం పెళ్ళే చేసుకోం.

స్నేహిత్ : అయిపోయారురా! ఇక మీరు పెళ్ళవకుండానే ముసలోళ్ళయిపోతారు. నో డౌట్.

ఆకాష్ : అదేంటిరా మమ్మల్ని ప్రోత్సాహించాల్సింది పోయి ఇలా నిరుత్సాహపరుస్తావేమిటి?

స్నేహిత్ : ఆకాశంలోకి విసిరిన బంతి క్రిందపడకుండా అక్కడే ఆగిపోతుందని అంటే నమ్ముతారా? ఇదీ అంతే!

ధరణి : అంటే జరగదంటావ్!

స్నేహిత్ : “ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజాలు నిజాలే! సరే, మీరు సాధిస్తానంటుంటే నేనెందుకు కాదనాలి? కారీయాన్. బై! రా!” అంటూ వెళ్ళిపోతాడు.

ఆకాష్ : ధరణీ! భయమేస్తోందా?

ధరణి : ఆకాష్! యుద్ధం చేద్దామా అనుకుంటే భయమేస్తుంది. సైనికునిలా యుద్ధరంగంలో దిగాక దాని జాడే దరికి రాదు.

ఆకాష్ : బ్రతికించావ్. వాడి మాటలకు వెనకడుగువేస్తావేమోనని భయపడ్డా.

ధరణి : ప్రేమికులకు ఏం లేకపోయినా ఫరవాలేదు కానీ ధైర్యం లేకపోతే వారు ప్రేమలో విజయాన్ని సాధించలేరు.

ఆకాష్ : ఇది ధరణి గారి సుభాషితమా?

ధరణి : కాదు. పెద్దలు చెప్పిన సత్యం. ఇంతకీ ఈ రోజు నాకేదో చెప్పాలని పిలిచానన్నావ్. అదేమిటో చెప్పనేలేదు. చెప్పు… చెప్పు… (ఆత్రంగా)

ఆకాష్ : ఏం లేదు ధరణీ! అమ్మా నాన్నలు ఎంతో ప్రేమతో మనల్ని పెంచి పెద్దచేశారు. ‘ఫలాలు’ అందించాల్సిన ఈ వయసులో పెళ్ళి పేరుతో వారికి దూరమవటం నాకిష్టం లేదు.

ధరణి : ఇది మనం ముందు అనుకున్నదేగా!

ఆకాష్ : ఏమో! ఈ రోజు నా మనసులో మాట మరింత విపులంగా చెప్పాలనిపిస్తోంది.

ధరణి : ఊఁ.

ఆకాష్ : ఈ వయసులో మన అండ వారికి చాలా అవసరం. ముందు జీవితం మనదని ఇన్నాళ్ళ వాళ్ళ ప్రేమను వదిలెయ్యలేను.

ధరణి : నేను ప్రేమించిందే ముందు మీ కుటుంబాన్ని. అదే లేదంటే మన పెళ్ళే లేదు.

ఆకాష్ : మన మనసులు కలసినట్లే మన కుటుంబాలూ కలవాలి. వారందరి ఆశీర్వచనాలు మన తోడై నిలవాలి.

ధరణి : (నవ్వుతూ) అదే పట్టుదల మీద మనమిద్దరం నిలబడితే విజయం ఎగురుకుంటూ వచ్చి మన ఒళ్ళో వాలాల్సిందే!

ఆకాష్ : నీలో నాకు అదే నచ్చుతుంది. ఒకవైపు సాంప్రదాయంగా మాట్లాడుతూనే అల్లరి చేస్తావ్.

ధరణి : సరే సరే! పొగడ్తలు వద్దు. విషయానికి రా!

ఆకాష్ : ఏం లేదు. మనం పక్షులం కాదుగా రెక్కలొచ్చాయని గూడు వదిలిపోవటానికి.

ధరణి : ఏది నా ఒంటిమీద ఎక్కడా రెక్కలు కనిపించడం లేదే? కొంపతీసి నీకు కనిపిస్తున్నాయా?

ఆకాష్ : ధరణీ! జోకులొద్దు!

ధరణి : అలాగే బాబూ! జీవితంలో ఎంత కష్టమొచ్చినా సరదాగా తీసుకోవాలనేది నా పాలసీ.

ఆకాష్ : కానీ మన ప్రేమ సీరియస్ మేటరే కదా!

ధరణి : అవును.

ఆకాష్ : రెక్కలు ముక్కలు చేసుకుని మన కోసం, మన భవిష్యత్తు కోసం కష్టపడ్డ అమ్మానాన్నల మనసుకు కష్టం కలిగించకూడదనిపిస్తుంది.

ధరణి : అలా ఎందుకు చేస్తాం? బాధ్యతగా మనలనింత వారిని చేసిన వారికి ఎప్పటికీ చేయుతగా నిలబడవలసిందే!

ఆకాష్ : వాళ్ళు ఒప్పుకోకపోతే ఆవేశంలో ఈ విషయం మరిచిపోతమేమోనని…

ధరణి : ఇవన్నీ మనకి గుర్తున్నాయి కాబట్టే ఓటమి ఎదురవ్వదని ధీమా.

ఆకాష్ : మొదట్లో వాళ్ళు కాదంటారు. అయినా మనం గజినీ మహమ్మద్‍ని ఆదర్శంగా తీసుకుని పోరాడాలి.

ధరణి : అంతేనా! వాళ్ళను వదిలివెళ్ళి పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదని చెప్పేద్దాం!

ఆకాష్ : వాళ్ళు కాదంటే ఇలాగే ఒంటరిగా ఉండిపోదామందాం.

ధరణి : అవునవును. జీవితాంతం ఒంటరిగా ఉంటామంటే భరించలేకపోయినా ఒప్పుకుంటారు.

ఆకాష్ : ఇంకేం… ప్రేమ యుద్ధానికి పచ్చజెండా ఊపేద్దాం!

ధరణి, ఆకాష్ ఇద్దరూ కలిసి హాయిగా నవ్వుతారు.

***

ధర్మతేజ : సుశీలా! ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు.

సుశీల : ఏమండీ! సమస్యను గట్టెక్కించాలి అనుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది.

ధర్మతేజ (విసుగ్గా) : ఏదో ఒకటిలే! సంగతి చూడు.

సుశీల : ఏముంది ఇందులో చూడటానికి. అబ్బాయి ప్రేమ విషయమేగా! ఈ కాలం పిల్లాడిలా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్ళి చేసుకుంటాను అనటం లేదుగా.

ధర్మతేజ : అలా అనలేదని ఒప్పేసుకోమంటావా? (నొక్కి పలుకుతూ) కులం, గోత్రం, పరువు, ప్రతిష్ఠ ఏం చూసుకోనక్కర్లేదా?

సుశీల : సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి అవి కావాలి. కానీ అవే బ్రతుకును నిర్ణయించకూడదంటాను.

ధర్మతేజ : (కోపంగా) అంటే ఏమంటావ్?

సుశీల : శాంతంగా ఆలోచించమంటున్నాను. ఆ మధ్య గుడిలో నేను పడిపోతే ఆసుపత్రిలో చేర్పించి రక్తం ఇచ్చి బ్రతికించింది ఆ అమ్మాయేగా!

ధర్మతేజ : ఆఁ! అయితే! దానికే కోడలిని చేసుకుంటావా? సాయం చేసినందుకు ప్రతిఫలంగా ఏదో ఇచ్చి పంపు.

సుశీల : అన్నీ డబ్బుతో తీరిపోయే రుణాలు కావు. ఆ అమ్మాయి రక్తం దానమిచ్చినప్పుడు ఈ కులాలు, మతాలు చూశామా?

ధర్మతేజ : ఆ రోజు చూడలేదని ఈ రోజు వదిలేద్దామా? పెళ్ళంటే నూరేళ్ళ పంట (నొక్కి పలుకుతూ).

సుశీల : అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాను. విడిపోయి మనసులనూ, మనుషులనూ దూరం చేసుకునేకన్నా కాస్త పెద్దమనసు చేసుకుంటే….

ధర్మతేజ : ఆపు సుశీలా! పెద్దలు అటు ఏడు తరాలూ, ఇటు ఏడు తరాలూ చూసి పెళ్ళి నిశ్చయం చెయ్యమన్నారన్నది మర్చిపోయావా?

సుశీల : నన్ను క్షమించండి, మీ మాటలకు అడ్డుచెబుతున్నందుకు. అప్పటి తీరుతెన్నులు బట్టి ఆనాటి మాటలు. ఇప్పటి కాలాన్ని బట్టి ఈనాటి నిర్ణయాలు.

ధర్మతేజ : ఏమో! నువ్వెంత చెప్పినా నా మనసంగీకరించటం లేదు.

సుశీల : వాళ్ళ వైపు నుంచీ ఆలోచించి చూడండి.

ధర్మతేజ : ఎందుకాలోచించాలి? వాళ్ళేమన్నా మనకు చెప్పి ప్రేమించుకున్నారా?

సుశీల : ప్రేమ చెప్పి రాదండీ!

ధర్మతేజ : ఇంకేం? దగ్గరుండి వాళ్ళిద్దరి పెళ్ళిచేసి వాళ్ళ దగ్గరే నువ్వూ ఉండిపో.

సుశీల : ఆ పని ఎప్పుడో చేద్దును. మిమ్మల్ని విడిచి ఉండలేక ఈ తాపత్రయం.

ధర్మతేజ : లేకపోతే చేసేసేదానివన్నమాట.

సుశీల : అన్నమాటే. మా అత్తగారు నన్ను చూడకుండానే మీకు నచ్చానంటే పెళ్ళి చేసేశారుగా!

ధర్మతేజ : ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడ కొడతావు.

సుశీల : (నసుగుతూ) ఛ! ఛ! అదేం లేదండీ. ఆవిడ అంత చేస్తే వీళ్ళకోసం నేనింత కూడా చేయకపోతే బాగోదేమోనని.

ధర్మతేజ : సరే! చెప్పావుగా! ఆలోచిస్తా! ఇంతకీ అమ్మాయి వాళ్ళింట్లో ఒప్పుకున్నారా?

సుశీల : ఏమో!

ధర్మతేజ : ఎందుకు ఒప్పుకోరు? కట్నం లేకుండా లక్షలు సంపాదించే, ఆస్తులున్న అల్లుడు తేరగా దొరుకుతుంటే!

సుశీల : అదే వద్దన్నాను. వాళ్లకు ఆస్తి లేకపోయినా అమ్మాయికి చదువుంది. అబ్బాయితోపాటు సంపాదిస్తోంది. అంతకంటే ఏం కావాలేం?

ధర్మతేజ : చూస్తుంటే మీరు ముగ్గురూ కుమ్మక్కయిపోయినట్లున్నారే!

సుశీల : అబ్బెబ్బే! అలాంటిదేం లేదు. అనవసరమైన అభాండాలు నా నెత్తిన రుద్దకండి.

ధర్మతేజ : ఏమో నాకయితే నమ్మకం లేదు.

సుశీల : అయినా ఈ రోజుల్లో అమ్మాయిలదే రాజ్యం. వాళ్ళే అబ్బాయిలను సెలెక్ట్ చేసుకుంటున్నారు తెలుసా?

ధర్మతేజ : అంటే ఆ అమ్మాయి మనబ్బాయిని ప్రేమించటమే గొప్ప అంటావ్!

సుశీల : అలా అని నేనేమీ అనటం లేదు. ఆడపిల్ల అనగానే పురిటిలోనే పిల్లలను చంపేసిన పాపం ఇలా వెంటాడుతోందంటున్నానంతే!

ధర్మతేజ : నువ్వు చెప్పాల్సిందంతా చెప్పేశావుగా… ఇక నన్ను ఆలోచించుకోనీ!

సుశీల : పైకి అలా అంటాను కానీ మనిద్దరిదీ ఒకటే మాట, ఒకే బాట గదండీ! ఆ గీత ఎలా దాటుతాననుకొంటున్నారు?

ధర్మతేజ : (నవ్వుకుంటూ) నువ్వు చాలా తెలివైనదానివి సుశీలా. అలా బయటకు వెళ్ళివస్తాను కాస్త పనుంది.

***

సముద్రపు అలల హోరు….. బీచ్ వాతావరణం

పల్లీలండోయ్!…. పల్లీలు!… అరుపులు

మాటల సందడి.

మనుషుల కేరింతలు.

ఆకాష్ : ఎన్నాళ్ళో ఈ ఎదురుచూపులు?

ధరణి : ఎన్నేళ్ళయినా! అప్పుడే అలా నీరుగారిపోతే ఎలా?

ఆకాష్ : బాణాన్ని సంధించి వదిలాం. సరిగా తగిలిందో లేదో తెలియటం లేదే?

ధరణి : తొందరెందుకు? వేచి చూద్దాం?

ఆకాష్ : రోజులు గడిచిపోతున్నాయి.

ధరణి : మన విషయం తెలియగానే రాళ్ళలా బిగుసుకుపోయిన అమ్మానాన్నలు కరగటానికి టైమ్ పడుతుందిగా.

ఆకాష్ : మన కన్నీళ్ళు వాళ్ళ మనసులను కరిగిస్తాయంటావా?

ధరణి : హీరోగారు ఈ రోజు ఇలా బేలగా మాట్లాడుతున్నారేమిటి విచిత్రంగా.

ఆకాష్ : రోజు రోజుకీ ఆశ చచ్చిపోతోంది ధరణీ!

ధరణి : ఆశ ఎప్పుడూ చచ్చిపోకూడదు ఆకాష్. అది బ్రతికితేనే మనల్ని బ్రతికిస్తుంది.

ఆకాష్ : ఇలా ఒకళ్ళ కొకళ్ళు ధైర్యం చెప్పుకుంటూ ఎన్నాళ్ళుండాలో?

ధరణి : మన కోరిక తీరేదాకా?

ఆకాష్ : అదెప్పుడో అనేదే అర్థం కావటం లేదు. చూడు ఆ అలలు తీరాన్ని చేరటం, మళ్ళీ సముద్రంలో కలిసిపోవటం.

ధరణి : ఏమనిపిస్తోందేం?

ఆకాష్ : మనమూ వాటిలాగానే వస్తున్నాం, వెళ్తున్నామని.

ధరణి : కానీ నాకలా అనిపించటం లేదు.

ఆకాష్ : ఎలా అనిపిస్తోంది?

ధరణి : ప్రేమికుల్లా ఆ తీరాన బయలుదేరి, భార్యాభర్తల్లా మధ్యలో కలిసిపోయి ఈ జీవనతీరాన్ని చేరుతున్నామని.

ఆకాష్ : అన్నీ మంచిగా ఆలోచించటం నీ దగ్గిరే నేర్చుకోవాలోయ్!

ధరణి : చెప్పిన మాటను శ్రద్ధగా వినటం, నీ నుంచి నేనూ తెలుసుకోవాలి.

ఆకాష్ : ఇక వెళ్దామా?

ధరణి : అలాగే!

***

గుడి వాతావరణం….

గుడిగంటల మ్రోతలు వినిపిస్తుంటాయి.

మైకులో భగవద్గీత.

***

సుశీల : ఆకాష్‍ని చూడలేకపోతున్నాను. ఇదివరకటి హుషారులేదు వాడిలో.

ధర్మతేజ : పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించటం అంటే ఇదే!

సుశీల : అదేంమాట?

ధర్మతేజ : మరంతే! నీ మనసు వాడ్ని ఎలా చూస్తే అలానే కనిపిస్తాడు. మరి నాకు మామూలుగానే కనిపిస్తున్నాడే!

సుశీల : (వ్యంగ్యంగా) తల్లి మనసుకి కాస్త లోతు ఎక్కువలేండి.

ధర్మతేజ : అబ్బో!

సుశీల : బెండకాయ ముదిరితే… అంటారు గుర్తుందా అని.

ధర్మతేజ : మాకూ సామెతలు వచ్చు.

సుశీల : అదే! మీకు ఆలోచించ (వత్తిపలుకుతూ) టానికి ఇంకా ఎన్నేళ్ళు కావాలనేదే నేను అడిగేది.

ధర్మతేజ : ష్! నెమ్మదిగా! ఇది గుడి.

సుశీల : ఇంట్లో వాడిముందు మాట్లాడటానికి కుదరటం లేదు. అందుకే ఈ వంకతో బయటకు తీసుకొచ్చాను మిమ్మల్ని.

ధర్మతేజ : బాబోయ్! ఈ పథకం వెనుక ఇంత కుట్ర ఉందా?

సుశీల : కుట్రలు, గిట్రలు మీలాంటి వాళ్ళకు. మేము స్వచ్ఛమైన పాలలాంటి వాళ్ళం.

ధర్మతేజ : అదే జరిగితే… ఇద్దరిలో ఒకరు లేచిపోయేవారు.

సుశీల : ఏదో నేను సరదాకి అన్నాను. అంత పాపం మనకెందుకులేండి. కలిపితే కలపండి. లేదంటే ఊరుకోండి. వాళ్ళకు విడదియ్యాలని చూస్తే మాత్రం ఊరుకోను.

ధర్మతేజ : ఏం చేస్తావేం?

సుశీల : నేను మీకు విడాకులిచ్చేస్తాను.

ధర్మతేజ : బాబోయ్! అంత పని మాత్రం చెయ్యకు. వేడికిరణాల్ల చురుక్కుమనిపించే నీ మాటలు తగలకపోతే నాకు తెల్లవారనే తెల్లవారదు.

సుశీల, ధర్మతేజ కలగలిపిన నవ్వు.

***

క్లబ్ వాతావరణం….

సన్నగా మ్యూజిక్….

స్నేహిత్ : ఏరా ఆకాష్! మీ ప్రేమ మజిలీ ఎంతదాకా వచ్చింది?

ఆకాష్ : ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లాగే అనుకుంటా. అమ్మ చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుందని నమ్మకం. ఏం జరుగుతుందో?

స్నేహిత్ : (వెక్కిరింతగా) నేను ముందే చెప్పలా.

ఆకాష్ : నాకూ టైము వస్తుంది నిన్ను ఏడిపించటానికి.

స్నేహిత్ : అంత లేదు లేరా నాన్నా!

ఆకాష్ : ఎంతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది. ఏదో నీకు హుషారు రావటానికి అలా మాట్లాడానంతే.

స్నేహిత్ : అయితే ఇంట్లో ఒప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయా?

ఆకాష్ : ఏమోఁ!

స్నేహిత్ : అబ్బా! నీతో ఏ నిజమూ చెప్పించలేం. హాయిగా రిజిష్టర్ మేరేజ్ చేసేసుకో. సాక్షి సంతకం నేను పెడతానులే!

ఆకాష్ : అంత శ్రమ నీకివ్వనులే! ఆ సంతకాలు కూడా మా అమ్మా నాన్నలే పెట్టాలి.

స్నేహిత్ : హతవిధీ! ఇవన్నీ ఈ లోకంలో జరిగేవేనా?

ఆకాష్ : నువ్వే చూద్దువుగానీ!

స్నేహిత్ : ఏమిటి? ‘రేపు’ అని గోడమీద రాసుకుని రోజూ చూసుకోవటమా?

ఆకాష్ : అంత వెటకారాలొద్దు. ఈ రోజు మనది కాకపోవచ్చు. కానీ రేపు తప్పకుండా మనదవుతుంది.

స్నేహిత్ : ఓ.కే. బెస్టాఫ్ లక్. ఆఁ! అన్నట్లు మరిచా… మా చెల్లాయికి కూడా చెప్పు.

ఆకాష్ : అలాగే థాంక్స్! మా ఇద్దరి తరుపున కూడా!

స్నేహిత్ : బాయ్!

ఆకాష్ : బాయ్!

***

ఉషోదయం….

సన్నగా రేడియోలో సుప్రభాతం….

***

సుశీల : నాన్నా! ఆకాష్! నిద్రలేవరా!

ఆకాష్ : ఏంటమ్మా! ఏమన్నా విశేషమా!

సుశీల : ఈ రోజు ప్రేమికుల రోజురా!

ఆకాష్ : అయితే!

సుశీల : నాన్నగారూ, నేనూ కలిసి ఈ రోజు నీకో బహుమతి ఇద్దామనుకుంటున్నాం.

ఆకాష్ : నిజమాఁ! ఏమిటది?

సుశీల, ధర్మతేజ : ఇదుగో చూడు.

ఆకాష్ : (ఆశ్చర్యంగా) శుభలేఖ!

సుశీల : ఎవరిదో చూడు కన్నా

ఆకాష్ (స్వగతంగా) : మెరుస్తూ కనిపిస్తున్న ఆ జంట పేర్లు తమవే ఆకాష్…. ధరణి…. నింగీ నేల ఏకమవుతున్న నేపథ్యంలో…. అమ్మా!! (నోటమాట రానట్లు ఆనందంతో)

***

ఫోన్ చేస్తున్న శబ్దం…..

ఆకాష్ : (స్వగతంలో) అబ్బా! ఎంతకీ ఈ ఫోను కలవదేం? ఎంత తొందరగా ఈ విషయం ధరణికి చెప్పేద్దామా అనుకుంటుంటే…. మళ్ళీ రింగు చేస్తున్న శబ్దం..

అబ్బా! చేసి చేసి వ్రేళ్ళు నొప్పి పుడుతున్నాయి. దీనికన్నా తన దగ్గరకి వెళ్ళటమే బెటర్ అనుకుంటా…

లలలా…. లలలా…. లలలా… హుషారుగా….

ఫోన్ రింగయిన శబ్దం.

ధరణి : హలో!

ఆకాష్ : హలో!

ధరణి : అబ్బా! ఇందకటినుంచీ ఒక గుడ్‍న్యూస్ చెప్పాలని ప్రయత్నిస్తున్నా! నీ ఫోన్ ఎంగేజ్…. ఎంగేజ్…

ఆకాష్ : నేనూ అదే పనిలో ఉన్నా.

ధరణి, ఆకాష్ : (ఒకేసారి గట్టిగా) మన పెళ్ళికి అమ్మా, నాన్న ఒప్పుకున్నారోచ్!

సమాప్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here