ఆ నలుగురూ

10
3

[dropcap]ఆ[/dropcap] ముందు రోజే వినాయక చవితి పండగ జరిగింది. కరెన్సీనగర్ కాలనీ, విజయవాడలో గణేష్ అపార్ట్‌మెంట్స్‌లో లిఫ్ట్ పక్కన ముద్దులొలికే రంగు రంగుల అందమైన గణపతి విగ్రహాన్ని పెట్టారు. ఏటా తొమ్మిదిరోజులూ నవరాత్రులు సందడి సందడిగా జరుపుకోవడం ఆ ఫ్లాట్స్ లోని వారికలవాటు. ప్రతి పూటా భజన నైవేద్యాలతో అంతా బొజ్జ గణపతిని ముద్దుగా అపురూపంగా చూసుకుంటున్నారు. ఫ్లాట్స్ లోని ఆడవాళ్లూ, పిల్లలూ సాక్షాత్ వినాయకుడే మన ఇంటికి అతిథిగా వచ్చాడన్నంత సంబరంగా ఉన్నారు. బైటికి వెళ్లేముందు అంతా వరసగా వచ్చి దణ్ణం పెట్టుకుని బొట్టు పెట్టుకుని వెళుతున్నారు.

పార్కులో సాయంత్రపు నడక ముగించి ఫ్లాట్స్ ఆవరణలోకి ప్రవేశించింది సావిత్రి.

అప్పుడే భజన, పూజ పూర్తి చేసి ప్రసాదం పంచుతోంది మాధవి. ఆమెకి సాయం చేస్తున్నారు మహేశ్వరీ, ఉమాదేవి, పద్మా. సావిత్రిని చూస్తూ “రండి సావిత్రీ! ఇవాళ శనగలూ, రవ్వ కేసరీ చేశాను ప్రసాదంగా” అంది మాధవి.

“స్నానం చేసి వస్తాను” అంటూ అందరి వైపూ నవ్వుతూ చూసి లిఫ్ట్ లోకి వెళ్ళింది సావిత్రి.

నాలుగు నెలల క్రితం ఈ ఫ్లాట్స్ లోకి వచ్చినప్పుడు సావిత్రి తనను తాను పరిచయం చేసుకుంది నలుగురికీ. “మా ఆయన విజయవాడ ఆర్టీసీలో అకౌంటెంట్‌గా పని చేసేవారు. పంట కాలవ రోడ్‌లో ఉండేవాళ్ళం. మా అబ్బాయికి పదేళ్ళప్పుడు ఆయన హార్ట్ ఎటాక్‌తో పోయారు. అప్పుడొచ్చిన డబ్బుతో ఒక్క పిల్ల వాడినీ బి.టెక్. చదివించాను. వాడు ఎంటెక్ హైదరాబాద్‌లో చదువుకుని అక్కడే ఓ రెండేళ్లు పని చేసి వచ్చి రత్న జూనియర్ కాలేజ్ లో లెక్చరరుగా జాబ్ లో చేరాడు. మా కోడలు ఆ కాలేజ్ లోనే కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తుంది. వాళ్ళ కాలేజ్ కి దగ్గరగా ఉంటుందని ఈ ఫ్లాట్స్ లోకి వచ్చాము” అని.

ఆ బిల్డింగ్‌లో మొత్తం పన్నెండు ఫ్లాట్స్ ఉన్నాయి. సావిత్రి ఫస్ట్ ఫ్లోర్‍లో అద్దెకి ఉంటుంది. మిగిలిన ఏడు ఫ్లాట్స్ వాళ్ళూ చిన్న వయసుల వాళ్ళు. మహేశ్వరీ, ఉమాదేవి,పద్మ, మాధవి స్నేహితులు. అంతా మూడో ఫ్లోర్‌లో ఉంటారు. నలుగురివీ సొంత ఫ్లాట్స్. దాదాపు యాభై ఏళ్ల వయసున్నవాళ్ళు. అందరి పిల్లలూ కాలేజ్‌లో చదువుతున్నారు. మాధవి,మహేశ్వరిల భర్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఉమాదేవి, పద్మల భర్తలు ఇళ్ల నిర్మాణ రంగంలో కాంట్రాక్టర్స్‌గా ఉన్నారు. వీళ్ళు నలుగురూ షాపులకీ, ఎక్సిబిషన్‌లకీ, గుళ్ళకీ కలిసి తిరుగుతూ ఉంటారు. రోజుకొకరింట్లో అంతా తీరికగా సాయంత్రం నాలుగు గంటల వేళ కూర్చుని కాసిని స్నాక్స్ తిని టీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు.

సావిత్రి వాళ్ళను తన ఇంటికి పిలిచేంత స్నేహం పెట్టుకోలేదు. అలా అని దూరంగా ఉండదు. తనకు వీలయినప్పుడు స్నేహంగా వచ్చి మాట్లాడి కొంచెం సేపు మాత్రమే ఉండి వెళుతూ ఉంటుంది.

మర్నాడు మాధవి ఇంట్లో సాయంత్రం నాలుగు గంటలకి అంతా సమావేశం అయ్యారు. సావిత్రి కూడా వెళ్ళింది అక్కడికి. “రండి సావిత్రీ!” అంటూ వాళ్ళు తింటున్న స్నాక్స్, టీ ఇవ్వబోయారు. “నేనిప్పుడే బిస్కట్ తిని టీ తాగొచ్చాను. మీరు తీసుకోండి” అని నవ్వుతూ కూర్చుందామె.

“నిన్న వస్తానన్నారని మీకోసం అయిదు నిముషాలు చూసి వెళ్లిపోయాం” అంది ఉమాదేవి నిష్టూరంగా.

“నేను స్నానం చేసి కుక్కర్ పెట్టి కొంచెం చపాతీ పిండి కలిపి వచ్చేసరికి పది నిమిషాలయ్యింది. ప్రసాదం అక్కడుంది కదా తీసుకున్నాను. అదే చెబుదామని వచ్చాను” అంది సావిత్రి.

“మేం రోజుకొకరం రెండు పూటలా ప్రసాదం చేస్తున్నాం. నిన్న నేను, ఈ రోజు పద్మ, మొన్న మహేశ్వరి, రేపు ఉమాదేవి అనుకున్నాం” అంది మాధవి.

“ఓహో, అలాగా బావుంది” అని మరో పది నిముషాలు కూర్చుని లేచింది సావిత్రి.

ఆమె వెళ్ళగానే “సావిత్రి గారు ఒక రోజు ప్రసాదం చేస్తానంటారేమో అనుకున్నాను, ఆమె ఏమీ మాట్లాడలేదు” అంది మాధవి.

“కొడుకూ, కోడలూ ఉద్యోగానికి వెళ్ళిపోయాక ఏం పని ఉందీవిడకి? కాస్త ప్రసాదం చెయ్యలేదా?” అంది పద్మ.

“ఇంకెవరూ ఇచ్చేట్టు లేరు. మనమే ఇంకో రౌండ్ చేసేద్దాం” అంది మహేశ్వరి.

“ఏంటో ఈ సావిత్రి వరస నాకేం అర్థం కాదు. మనకంటే పెద్దావిడ కూడా. అయినా భక్తీ లేదు, పాడూ లేదు. ఇంట్లో పని, వాకింగ్ మాత్రం ఠంచన్‌గా చేస్తుంది” అంది పద్మ.

“మా అమ్మ ఏ మంచి రోజు వచ్చినా ఫోన్ చేసి పూజ చేసావా లేదా? గుడికి వెళ్ళావా లేదా? అని పది సార్లడుగుతుంది” అంది ఉమాదేవి.

“మా అత్తగారైతే నిరంతరం దైవ ధ్యానంలోనే ఉండాలంటుంది. అంత వీలు కాకపోయినా ఏదో కాస్త వీలయినంతయినా చెయ్యాలి కదా” అంది మహేశ్వరి.

“ఇవన్నీ, మన సంప్రదాయాలు. వాటిని పాటించి తీరాలి. దేవుడి పట్ల భక్తి లేకపోయాక బతికేం లాభం? లేచామా? ఒండుకున్నామా తిన్నామా అంటే ఎవరికుపయోగం? దైవ చింతన లేని బతుకు వ్యర్థం” అంది మాధవి. అంతా అవున్నన్నట్టు చూసారు.

బిల్డింగ్ సెక్రటరీ గారు నిమజ్జనం రోజు గణేష్ ఫ్లాట్స్‌లో పెట్టిన పెద్ద వినాయకుడిని చిన్న లారీ ఎక్కి పంపుతుండగా ఫ్లాట్స్ లోని వాళ్లంతా తమ బుజ్జి గణేశుల్ని కూడాలారీ ఎక్కించి ఆనందంగా దగ్గరుండి సాగనంపారు.

***

ఆ తర్వాతి నెల ఆ నలుగురూ ఒక రోజు కనకదుర్గ గుడికి మాధవి గారి ‘ఇన్నోవా’ వెహికల్‌లో బయలుదేరారు.

“సావిత్రిని అడుగుదామా?” అంది పద్మ.

“ఆవిడకి దేవుడంటే పడదులే రాదు” అంది మహేశ్వరి.

అడిగి చూద్దాం ఏమంటుందో అన్నట్టుగా అడిగింది పద్మ. వస్తానంటూ బయలు దేరింది సావిత్రి. నాస్తికురాలు కాదన్నమాట అనుకున్నారు నలుగురూ కళ్ళతోనే.

“మీకు దేవుడూ పూజలంటే నమ్మకం లేదనుకుంటా!” దారిలో అడిగింది ఉమాదేవి.

“భలేవారే! నాకూ నమ్మకం ఉందండీ! కాకపోతే మనుషులూ దేవుడి రూపాలే కదా అనుకుంటానండీ” అంది సావిత్రి అందరివైపూ సాభిప్రాయంగా చూస్తూ.

“మనుషులు దేవుడి రూపాలా? మీరెక్కడో సత్తెకాలం మనిషిలా ఉన్నారు సావిత్రిగారూ” అంది మహేశ్వరి

నలుగురూ పక పకా నవ్వారు. సావిత్రి కూడా నవ్వేసింది, “మా అబ్బాయీ ఇలాగే అంటాడు. సరిగ్గా మీరూ అదే మాటన్నారు” అంటూ.

అంతా కలిసి కనకదుర్గ గుడికి బయలు దేరారు. అక్కడ వంద రూపాయల దర్శనం టికెట్లు కొనబోయింది మాధవి. “ఎందుకండీ ఇవాళ శనివారం రష్ ఉండదు.” అంది సావిత్రి. నిజంగానే జనం ఎక్కువగా లేరు. ప్రశాంతంగా ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూసి అంతా ఆనందంగా బైటికొచ్చారు.

“అమ్మవారి మొహంలో ఎంత కాంతో!” అంది సావిత్రి.. అవునవును అంటూ తలూపేరంతా. అక్కడినుండి మంగళగిరి నరసింహ స్వామి దర్శనం చేసుకుని కొండ పైనున్న పానకాలస్వామి గుడికి వెళ్లారు. పానకం బిందె కొనుక్కుని లోపలికి దారి తీసింది మాధవి.

దర్శనం అయ్యాక బైటికి రాగానే అక్కడున్న పంతులుగారు ఆమె చేతిలోని బిందె అందుకుని పక్కన పెట్టి తన గంగాళం లోంచి పానకం అందరికీ తలో అరగ్లాసూ ఇచ్చాడు. అంతా తాగి వెనుదిరుగుతుంటే “పానకం ఇచ్చాం కదా మీకు తోచింది ఏదైనా ఇవ్వండమ్మా” అన్నాడాయన.

వెంటనే సావిత్రి “ఏమండీ! బిందె పానకం కొని తెచ్చుకున్నాము. అది తీసుకుని మా పానకం మాకిచ్చి మళ్ళీ డబ్బులడుగుతారా? రెండు సార్లు ఒకే పానకం కొనుక్కోమంటున్నారా మమ్మల్ని?” అని గట్టిగా అడగ్గానే అతను మారు మాట్లాడకుండా పక్కకి తప్పుకున్నాడు.

“బాగా అడిగారు సావిత్రీ! నేనంత ఆలోచించలేదు. పర్సు లోంచి డబ్బులు తియ్యబోతున్నాను” అంది మహేశ్వరి.

“మనకి లోటు లేకపోయినా డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేయాలండీ! ఇలా అలవాటయ్యి అందరినీ పీడిస్తారు వాళ్ళు” అంది సావిత్రి.

“బాగా చెప్పారు సావిత్రీ! మీరన్నీచక్కగా ఆలోచిస్తారు” ఆమెను చూస్తూ అంది ఉమాదేవి మెచ్చుకోలుగా.

అంతా ఇళ్లకు తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయ్యింది.

***

ఒక రోజు రాత్రి పదకొండు గంటలకి సూరిబాబు గాభరాగా మాధవి గారి ఫ్లాట్ తలుపు తట్టాడు. తీసిన మాధవితో “అమ్మా! మా ఆవిడ దుర్గ కడుపు నెప్పితో మెలికలు తిరిగి పోతోందమ్మా! ఏం చెయ్యాలో తెలీట్లేదమ్మా!” అన్నాడు ఏడుస్తూ.

అప్పుడే నిద్ర పడుతూ ఉండగా లేచిన మాధవి అతని అభ్యర్ధనని వింటూనే “నా దగ్గర రెండు బిళ్ళలున్నాయి, కడుపునొప్పికి పనిచేస్తాయి. ఇవి వెయ్యి” అంటూ ఫ్రిజ్ లోంచి తీసి అతని చేతిలో పెట్టి తలుపేసుకుంది. ఇప్పుడు దుర్గ ఈ బిళ్ళలు మింగేంత స్థితిలో లేదమ్మా అని బాధగా అనుకుంటూ, ఉమాదేవి ఫ్లాట్ తలుపు తట్టి చెప్పాడు సూరిబాబు. అంతా విన్న ఉమాదేవి “అయ్యో! మా వారు లేరు నేనేం చెయ్యగలను?” అంది హిందీ సీరియల్ చూసుకుంటూ.

మూడో ఫ్లాట్ లోని పద్మ విని “మా వారు తిరిగి తిరిగి వచ్చి ఇప్పుడే పడుకున్నారయ్యా! లేపినా లేవరు, కాస్త మజ్జిగ ఇచ్చి చూడు” అంది నిర్లిప్తంగా.

నాలుగో ఫ్లాట్ మహేశ్వరి విసుక్కుంది. “బావుందయ్యా! నీ కబురు! అర్ధరాత్రి పదకొండు గంటలకి మాకు చెబితే మేమేం చేస్తాం? ఆ సెంటర్‌లో ఆటో లుంటాయి. వెళ్లి పిల్చుకొచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్ళు”

“చూశానమ్మా! చుట్టూ పక్కలెక్కడా ఆటోలు లేవమ్మా!” అన్నాడు సూరిబాబు బేలగా.

“ఇంకాస్త ముందు కెళ్ళి చూడవయ్యా! భలే వాడివిలే! ఇంత రాత్రి బెల్ కొట్టి లేపుతావా?” అంటూ కోప్పడింది.

***

మర్నాడు తొమ్మిది గంటలకి కారిడార్‌లు తుడుస్తున్న సూరిబాబు తమ్ముడిని “నువ్వొచ్చావేంటీ? మీ అన్న ఎక్కడ?” అనడిగారు మాధవీ, పద్మా.

“రాత్రి మా వదిన్ని ఆస్పటల్లో పెట్టాం కదండీ. అది ఇరవై నాలుగుగంటల నెప్పని చెప్పి ఆపరేషన్ చేసారండి. అందుకే నేనొచ్చానండి” అన్నాడు.

హాస్పిటల్‌కి ఎలా తీసుకెళ్లాడో? ఎవరు సాయం చేసారో? ఎవరికీ వివరం తెలీలేదు. అతడిని అడగడానికి మనస్కరించలేదు వాళ్ళిద్దరికీ. మాట్లాడకుండా ఇళ్లలోకి వెళ్లిపోయారు. ఆ సాయంత్రం నలుగురూ వాకింగ్ కోసం కిందికి వెళుతుండగా లిఫ్ట్‌లో సావిత్రి కలిసింది. అందరివేపూ నవ్వుతూ చూసి వెళ్ళిపోయింది పైకి.

పార్క్‌లో బెంచ్‌లపై కూర్చుని రాత్రి వాచ్‌మాన్ భార్యని ఎవరు హాస్పిటల్‌కి తీసుకెళ్లి ఉంటారు? అన్న సంగతిపై చర్చించారు. సావిత్రి తన స్కూటీ మీద తీసుకెళ్లి జాయిన్ చేసిందని తెలిసి మౌనంగా ఉండిపోయారు నలుగురూ. మర్నాడు సాయంత్రం నాలుగు గంటల మీటింగ్‌కి మహేశ్వరి ఇంటికి వచ్చి కూర్చుంది సావిత్రి. నలుగురిలో ఎవరూ ఆ విషయమై మాట్లాడలేదు. సావిత్రి వాచ్‌మన్ భార్య దుర్గకి తాను చేసిన సాయం గురించి గొప్పగా చెబుతుందేమో అని భయపడ్డారు. సావిత్రి వాళ్లతో ఇంకేవో పిచ్చాపాటీ మాటలు మాట్లాడి వెళ్ళిపోయింది. ‘అమ్మయ్య’ అనుకున్నారంతా.

***

నాలుగు రోజులు గడిచాయి. సూరిబాబు తమ్ముడే అన్నగారు చేసే పనులు చేస్తున్నాడు.

ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఉదయంనుంచీ ఉపవాసం ఉన్నారు మాధవీ, ఉమాదేవీ, మహేశ్వరీ, పద్మా. సెల్లార్‌లో తులసి మొక్కకి నీళ్లు పోస్తూ ఉండగా అక్కడ కనబడిన సావిత్రిని అడిగింది పద్మ “కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉన్నారా?” అని. “లేదు” అంది సావిత్రి ఎక్కడికో హడావిడిగా స్కూటీ తీసుకుని బయలుదేరుతూ.

సావిత్రి వెళ్ళిపోయాక “ఆవిడకి దేవుడు, పూజలంటే పడవని తెలిసీ అడుగుతావేంటి?”అని విసుక్కుంది మాధవి పద్మని.

“కూరల కోసం మార్కెట్ కెళుతున్నట్టుంది. కొడుక్కీ, కోడలికీ వండి పెట్టడం, ఆరోగ్యం బాగా చూసుకోవడం రెండే పనులు ఈవిడకి” అంది ఉమాదేవి. ముగ్గురూ నవ్వుతూ చూసారు.

ఆ రోజు సాయంత్రం ఆరున్నరయ్యింది. రోజంతా ఉపవాసం తర్వాత పట్టు చీరలు కట్టుకుని శివాలయానికి వెళ్లి అక్కడ తాము తీసుకువెళ్లిన పూజాద్రవ్యాలతో పూజ చేసి దీపాలు వెలిగించి గేట్ తీసుకుని లోపలి వస్తున్నారు మిత్రురాళ్లు నలుగురూ.

సరిగ్గా అదే టైం కి గణేష్ అపార్ట్మెంట్స్ మరో గేట్ నుంచి ఒక ఆటో, ఆవరణ లోపలికి వచ్చి ఆగింది. నలుగురూ ఆగి పక్కకి తిరిగి చూసారు.

సావిత్రి ఒక పక్కనుంచి ఆటో దిగి వాచ్‌మాన్ భార్య దుర్గని దాదాపుగా బరువంతా తనమీద వేసుకుని దింపుతోంది. మరో పక్క సూరిబాబు పట్టుకున్నాడు. దుర్గ నీరసంగా తల వాల్చి ఉంది.

ఆ దృశ్యం చూస్తూనే, అప్పటి వరకూ పూజలు చేసి వచ్చిన ఆ నలుగురి చేతులూ దుర్గకి చేయూత నిస్తున్న సావిత్రి చేతుల్ని చూసి చిన్నబోయాయి, తక్షణమే వాళ్ళు వడి వడిగా లిఫ్టులోకి వెళ్లినా.

“సావిత్రమ్మ గారూ! దేవుడెక్కడో లేడమ్మ గారూ! మీ రూపంలో ఉన్నాడమ్మగారూ!” అంటున్న సూరిబాబు మాటలు వారి చెవుల్లో పడనే పడ్డాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒకరి మొహం మరొకరు చూసుకోకుండా అంతా వాళ్ళ వాళ్ళ ఫ్లాట్స్ లోకి వెళ్లిపోయారు.

ఆ తర్వాత ఆ నలుగురూ సావిత్రితో మాట్లాడడం మానేశారు. సావిత్రి పలరించబోయినా మొహాలు తిప్పుకుంటున్నారు. హఠాత్తుగా వాళ్ళు నలుగురూ అపరిచితులుగా ఎందుకు మారిపోయారో అర్థం కాని సావిత్రి ఇప్పుడు తను కూడా అపరిచితురాలిగానే ఉంటోంది వాళ్లతో.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here