[box type=’note’ fontsize=’16’] ది. 12-01-2021 జిజాబాయి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]
[dropcap]ప్రా[/dropcap]చీనకాలం నుండి భారతదేశం దేశభక్తులకు నిలయం. నాటి నుండి ఆధునిక యుగం వరకు దేశభక్తులు దర్శనమిస్తూనే ఉన్నారు. స్త్రీ, పురుష భేదం లేని దేశభక్తి మనది. మధ్యయుగంలో మొఘలులను ఎదిరించి హిందూ రాజ్యాన్ని (మరాఠా) స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర మనకు తెలుసు.
అయితే ఆ ఛత్రపతిని వీరునిగా మలచిన వీరమాత జిజాబాయి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది.
జిజాబాయి 1598వ సంవత్సరం జనవరి 12వ తేదీన సింధ్ ఖేడ్ రాజ్యం (ఈనాటి మహారాష్ట్ర) లోని బులంద్ జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మహల్యాబాయి, లక్కోజీ యాదవ్‌లు. లక్కోజీ అహమ్మద్ నగర్ పరిపాలకుడు నిజాం షాహి సుల్తాన్ ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగి.
నిజాంషాహి దౌత్య అధికారి కుమారుడు షాహ్‌జీ భోన్స్‌లే తో వీరి వివాహం జరిగింది. వీరికి ఎనిమిది మంది పిల్లలు. ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శంభాజీ, చిన్న కుమారుడు శివాజీ.
జిజాబాయి తండ్రికి, భర్తకి, వైరుధ్యం పెరిగింది. భర్తతోనే నడిచారు. భారతీయ మహిళ ఆదర్శం అదే గదా!
షాహ్‌జీకి పూనా, సూపే పరగణాలు జాగీర్లుగా లభించాయి. భార్యతో సహా పూనా వెళ్ళారు. ఆయన బయటకు వెళుతూ గర్భవతి అయిన భార్యని స్నేహితుడు, వైద్యుడు అయిన వైద్యరాజ్ నిర్గుడేఖర్ వద్ద వైద్యచికిత్స నిమిత్తం ‘శివనేం’ కోటలో అప్పగించి వెళ్ళారు. చాలా కాలం తరువాత జిజాబాయి తండ్రి ఆమెను కలిసి తోడుగా ఉన్నారు. అక్కడే శివాజీ జన్మించారు. తరువాత అహ్మద్ నగర్ అంతఃకలహాలలో జిజా బంధువులు మరణించారు.
షాహ్‌జీ శత్రువైన మొఘలాయిల అనుచరుడు మహల్దార్ ఖాన్ అహ్మద్ నగర్ మీద దాడి చేశాడు. జిజాబాయిని బందీని చేశారు. జిజా అనుచరులు, సేవకులు శివాజీని దాచి తమ రాజభక్తిని చాటుకున్నారు. జిజా భర్తకు, కుమారునికి దూరంగా ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు కలిగిన అభిప్రాయమే మరాఠీ రాజ్యస్థాపనకు బీజాన్ని వేసింది.
బాల్యం నుండి ఆమెకి భక్తి ఎక్కువ. భవానీమాతని పూజించేవారు. రామరాజ్యం కావాలని కోరుకునేవారు. రామాయణ, భారతాది ఇతిహాసాలను ఔపోసన పట్టారు. వాటిని గురించి ఐతిహాసిక వీరుల వీరగాథలను గురించి ఉగ్గు పాలతోనే శివాజీకి తెలియజేశారు. బాల్యంలోనే భారతవీరుల వీరత్వము అతని దేశభక్తిని పెంపొందింపజేసింది.
అన్యమత రాజులను కొలిచి సేవలందించిన తన కుటుంబ సభ్యులకు రక్షణ లేకపోవడంతో హిందూ మతం రాజ్య అవసరాన్ని గుర్తించారు. కుమారుని అందుకు సిద్ధం చేయడానికి పూనుకున్నారు.
నిజాంషాహిలకు వెన్నుదన్నుగా ఉన్న షాహ్‌జీని శక్తివంతులైన మొఘల్ సైన్యం చంపివేసింది. ఆయన మరణం జిజాబాయిని క్రుంగదీసింది. శివాజీ తల్లి ఇచ్చిన ధైర్య సాహసాలతో హిందూ మరాఠా రాజ్య సంస్థాపనకు పూనుకున్నాడు.
మరాఠా ప్రాంతయోధులందరినీ ఏకం చేశాడు. తల్లి నేర్పిన పాఠాలు ఇతనికి బాగా ఉపయోగపడ్డాయి. జిజాబాయి మనవడికి కూడా భారతేతిహాసాలను, యోధుల వీరగాథలను, యుద్ధ తంత్రాలను వివరించారు.
జిజాబాయి పెద్దకుమారుడు శంభాజీని అప్ఘల్ ఖాన్ చంపాడు. భర్త, కుమారుల మరణం ఎంత క్రుంగదీసినా ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈషణ్మాత్రం సడలలేదు. శివాజీ తల్లి సలహాలు, తన తెలివితేటలతో అప్ఘల్ ఖాన్‌ను వధించి అన్న ఋణం తీర్చుకున్నాడు. తల్లిని సంతోషపరిచాడు.
శివాజీతో పాటు తానాజీ, బాజీ ప్రభు, సూర్యజీ వంటి మరాఠా యోధులకు కూడా స్ఫూర్తినందించారు జిజాబాయి. వీరందరూ కలిసి సాధించిన విజయాలకు ఆమె హృదయం ఉప్పొంగిపోయింది.
కుమారుడు ‘థొరంగాడ్’ కోటను గెలిచినపుడు ఆమె సంబరాలు జరిపించారు. కుమారుడు ఒక్కొక్క విజయాన్ని సాధించినపుడు ఆమె సంబరపడిపోయేవారు. తన కలలు నెరవేరబోతున్నందుకు హిందూ మరాఠా రాజ్యం ఏర్పడుతున్నందుకు సంతోషించారు.
ఈ విజయానికి దోహదపడిన సైన్యాన్ని, రాజ పరివారాన్ని అభిందించారామె. కసబా గణపతి ఆలయాన్ని పునరుద్ధరించారు. తంబి జోగేశ్వరి, కెవెరేశ్వర్ వంటి చాలా ఆలయాలను, ముస్లింల చేతులలో దెబ్బతిన్న అనేక దేవాలయాలను కూడా పునరుద్ధరించారు.
అయితే హిందూమత రాజ్యము, హిందూ మత పునరుద్ధరణకు కంకణం కట్టుకున్నప్పటికీ/మత సహనాన్ని పాటించారామె. కుమారునికి, అతని తోటి యోధులకీ పరమత సహనాన్నే నేర్పారు. పరమత స్త్రీలను కూడా గౌరవించాలని బోధించారు.
కుమారుడు ఒక్కొక్క విజయాన్ని సాధించి కోటలను గెలుచుకుంటున్నపుడు ఆమె సంతోషం అవధులు దాటేది.
పశ్చిమ కనుమలలో గొప్ప పేరు పొందిన ‘రాయఘడ్’ కోటను జయించిన శివాజీ 1674వ సంవత్సరం జూన్ నెలలో పట్టాభిషేకం చేసుకున్నారు. ఆ విధంగా తల్లి ఆశయం నెరవేర్చారు. కన్నులపండువగా పట్టాభిషేక మహోత్సవం కల్గించిన సంతోషం తీరకముందే/పట్టాభిషేకమయిన 12వ రోజునే 1674వ సంవత్సరం జూన్ 17వ తేదీన జిజాబాయి మరణించారు.
తను కోరుకున్న స్వతంత్ర హిందూ మరాఠా రాజ్యంలోని ‘రాయఘడ్’లోని ‘పచాద్’లో మరణించిన అదృష్టవంతురాలు.
500 ఏళ్ళ క్రితమే ఒక భారతీయ మహిళ కుటుంబ సభ్యులను పోగొట్టుకుని, హిందూ మత స్థాపన లక్ష్యంతో కుమారుని ప్రోత్సహించి/హైందవ గ్రంథాలను ఔపోసన పట్టించి/యుద్ధ తంత్రాలను నేర్పించి/మత సహనాన్ని అవలంబిస్తూనే స్వరాజ్యాన్ని స్థాపించిన వీరుని కన్న వీర మాతగా భాసిల్లారు.
అన్యభాషలు నేర్చుకుంటే వారి యుద్ధతంత్రాలు, నైపుణ్యమును తెలుసుకోవచ్చని అవగాహన చేసుకున్న మహిళ ఆమె.
కుమార్తె, సోదరి, భార్య, కోడలు, తల్లి, అత్త, నానమ్మ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన వనిత. అందరిపట్ల ఆస్యాయతానురాగాలను ప్రదర్శించి/శత్రువులను బంధించినా, వారి స్త్రీ జనాన్ని రక్షించిన రాజ మాత ఆమె.
ఆ వీరమాత జిజాబాయి జ్ఞాపకార్థం 1999వ సంవత్సరం జూలై 7వ తేదీన రూ. 3.00ల విలువ గల స్టాంపును విడుదల చేసి నివాళిని అర్పించింది భారత తపాలా శాఖ. బాల శివాజీని వడిలో కూర్చోబెట్టి పాఠాలు నేర్పుతున్న జిజాబాయి దర్శనమిస్తారు ఈ స్టాంపు మీద.
ది. 12-01-2021 జిజాబాయి జయంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet