[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
మహమ్మద్ రఫీతో నిర్మాత, నటులు ఎ. పుండరీకాక్షయ్య అనుభవం:
‘భలే తమ్ముడు’ 1969లో తారకరామ పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా. దీనికి నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య, దర్శకులు బి.ఎ. సుబ్బారావు. కె. ఆర్. విజయ, ఎన్.టి.రామారావులు నాయికానాయకులుగా నటించగా, టి.వి.రాజు సంగీతం అందించారు. ఇది 1962లో వచ్చిన హిందీ సినిమా ‘చైనా టౌన్’కు రీమేక్. ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫీతో తనకెదురయిన అనుభవాన్ని ఆ చిత్ర నిర్మాత పుండరీకాక్షయ్య వివరిస్తున్నారు. ఆయన మాటల్లోనే చదువుదాం.
~~
ఓ గాయకుడిగా మహమ్మద్ రఫీని పరిచయం చేయనవసరం లేదు. అసంఖ్యాకమైన తెలుగు ప్రజలు – రేడియోలో, సినిమాలో, గ్రామ్‍ఫోన్ రికార్డుల్లో ఆయన పాటలు వింటూంటారు. ఈ భూమి మీదకి ఓ ప్రత్యేక లక్ష్యంతో వచ్చిన ప్రత్యేక గాయకుడాయన. మంచివాడు, సహృదయుడు. ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు వెలుగుతూ ఉంటుంది. అంతటి గొప్ప గాయకుడైనా, ఆయన వినయానికి మేమంతా అబ్బురపడేవాళ్ళం. చాలా పట్టుదల కల వ్యక్తి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే – ఆయన లక్షణాలు మీకర్థం కావాలని. ఆయనతో నా అనుభవాలు చెప్తాను. మా ‘భలే తమ్ముడు’ సినిమాలో ఎన్.టి.రామారావు కోసం మహమ్మద్ రఫీతో పాడించాలని 1968లో అనుకున్నాం. అదే ‘శ్రీకృష్ణావతారం’ లాంటి ఏ పౌరాణిక సినిమానో అయ్యుంటే, ఈ ఆలోచనే చేసేవాళ్లం కాదు. రఫీ తీరిక లేని గాయకుడు, రోజుకు రెండు మూడు రికార్డింగులు ఉండేవి. మాకు టైమ్ ఇచ్చి, మద్రాస్ వచ్చి పాడతారా అని అనుకున్నాం. పాడటానికి అంగీకరించినా, తెలుగులో సరైన ఉచ్చారణ కోసం శిక్షణ తీసుకోడానికి ఒప్పుకుంటారా? అసలు తెలుగు పాటకి న్యాయం చేయగలరా? ఆల్ ఇండియా సింగర్ కావడం, భారీ పారితోషికం అందుకునే ఆయన మన చిన్న బడ్జెట్ పేమెంట్ ఆమోదిస్తారా అని ఎన్నో సంశయాలు.. అయితే మా శ్రేయోభిలాషులు మాత్రం రఫీని సంప్రదించమని ప్రోత్సహించారు. సరే, ఎట్టకేలకు ఆయన్ని సంప్రదించాలని నిర్ణయించుకున్నాం. మద్రాసులో నాకు ‘దా’ అనే స్నేహితుడున్నాడు. అతనికి బొంబాయిలో ఎస్.ఇ.మీనన్ అనే మిత్రుడున్నాడు. ఈ మీనన్ రఫీని కలిసి మా ప్రతిపాదన గురించి చెప్పారు. తెలుగులో పాడటానికి అభ్యంతరం లేదని చెప్తూ, తెలుగు ఉచ్చారణ విషయంలో సందేహం వ్యక్తం చేశారట. సంగీతానికి హద్దులు లేవని, ఓ గాయకుడు ఏ ఇతర భాషలోనైనా పాడవచ్చని మేం భావించాం. ఆయనకో ఉత్తరం రాసి, బొంబాయిలో కలిసేందుకు అపాయింట్‍మెంట్ తీసుకున్నాం.
మా సంగీత దర్శకులు టి.వి.రాజు గీత రచయిత సినారె గారితో నాలుగు పాటలు రాయించి సిద్ధంగా ఉన్నారు. 4 ఆగస్టు 1968 నాడు నేను, టి.వి. రాజు విమానంలో బొంబాయి వెళ్ళాం. రఫీ ఇల్లు ప్రశాంతమైన ప్రాంతం బాంద్రాలో ఉంది. సప్తస్వరాలకు ప్రతీకగా ఆయన ఇల్లు ఏడు పిల్లర్లపై కట్టారు. రెండు అంతస్తుల భవనం అది. పై వాటాలో ఆయన కుటుంబం ఉంటుంది. అతిథులను రఫీ గ్రౌండ్ ఫ్లౌర్‍లో కలుస్తారు. ఆయన ఇంట్లో మొదటి అంతస్తుకి వెళ్లడానికి కూడా లిఫ్ట్ ఉంది. డ్రాయింగ్ రూమ్ అందంగా అలంకరించి ఉంది. గొప్పవ్యక్తులతో ఆయన దిగిన ఫోటోలు, మెడల్స్, కప్పులు, మెమెంటోలు మొదలైన వన్నీ గాజు అద్దాల అలమారలో అమర్చబడి ఉన్నాయి. ఎక్కడా డాబుసరిగా అనిపించలేదు. రఫీ గళ్ళ లుంగీ, లాల్చీ ధరించి ఉన్నారు. తనదైన శైలిలో నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానించారు. “తెలుగు ప్రజలకు వీనుల విందు చేయడానికి తెలుగులో పాడే అవకాశం రావడం నా అదృష్టం. ఇది దేవుడిచ్చిన అవకాశం” అన్నవి ఆయన మాతో మాట్లాడిన మొదటి మాటలు. ఇక సమయం వృథా చేయకుండా రెండు తెలుగు పాటలని ఉర్దూలో రాసుకుని, తన హార్మోనియం ముందు కూర్చున్నారు. గీతాలకు అర్థం అడిగి, సంగీత దర్శకుడు టి.వి. రాజును – సందర్భం, వ్యక్తీకరణ చెప్పమని అడిగారు. చాలా ఓపికగా రెండు గంటల సేపు సాధన చేశారు. సాధన అయ్యాక, చిరునవ్వుతో, “మీ అందమైన తెలుగుని ఖూనీ చేశానా?” అని అడిగారు. ‘అయ్యో, భలేవారండీ’ అంటూ అదేం లేదన్నాం. ఆయన దైవదత్తమైన స్వరంతో తెలుగుకి కొత్త సొబగులు అద్దారని చెప్పాం. మర్నాడు ఆయన కాల్ షీట్స్ గురించి మాట్లాడేందుకు అపాయింట్‍మెంట్ తీసుకున్నాం.
మర్నాడు వెళ్ళినప్పుడు ఆయన హార్మోనియం ముందు కూర్చుని ఆ రెండు పాటలని ఎంతో చక్కగా పాడి వినిపించారు. అన్నీ సవ్యంగా ఉండాలనే ఉద్దేశంతో, రాత్రి మళ్ళీ సాధన చేశారని చెప్పినప్పుడు మేం విస్తుపోయాం. తన భార్య సోదరుడు, తన సెక్రటరీ అయిన జహీర్‍ని పిలిచి తన డేట్స్ డైరీ తీసుకు రమ్మన్నారు. కొన్ని పేజీలు తిరగేసి, కొన్ని తేదీలు పైకి చదివారు. శంకర్ జైకిషన్‍కి ఇచ్చిన డేట్లు వాయిదా వేసే అవకాశం ఉందా అని జహీర్‍ని అడిగారు. బొంబాయిలో ఉంటే ఆయన రోజుకి రెండు లేదా మూడు పాటలు పాడుతారు. అయితే మా సినిమాలోని ఆరు పాటల కోసం ఆయన మాకు ఆరు రోజుల కాల్ షీట్ ఇచ్చారు. ఒక్కో పాటని సరిగ్గా పాడేందుకు గాను పాటకి ఒక రోజు కేటాయించారు. అంత గొప్ప గాయకుడి పారితోషికం ఎంత ఇవ్వాలా అని మేం ఆలోచనల్లో ఉంటే, పారితోషికం ఆయనే నిర్ణయించారు. మా సినిమా బడ్జెట్ ప్రకారం, మేం ఆయనకు ఇవ్వాలనుకున్న మొత్తం కంటే తక్కువే తీసుకున్నారు. డబ్బు కంటే సంగీతానికి ఆయన విలువ ఎక్కువిస్తారనేందుకు ఇది ఒక ఉదాహరణ.
22 ఆగస్టు ఉదయం 8.30కి రఫీగారు జహీర్‌తో కలిసి మద్రాసులో దిగారు. ఆయన్ని రిసీస్ చేసుకోడానికి మేం వెళ్ళాము. ఆయన కారులో నా పక్కనే కూర్చున్నారు. కొన్ని కాగితాలు బయటకి తీసారు. వాటిలో ఉర్దూలో ఏవో రాసున్నాయి. అవి మా పాటలు. మాకేసి చూస్తూ నెమ్మదిగా ఆ పాటలను పాడసాగారు. ఉచ్చారణ సరిగా ఉందో లేదో అడిగి తెలుసుకున్నారు. నాకు నవ్వొచ్చింది. ఉచ్చారణ సరిగానే ఉందని చెప్పాను. ఆయన ప్రొఫెషనలిజంకి ఇది మరో ఉదాహరణ. ఆయన కోసం ఉడ్‌ల్యాండ్స్‌లో గది బుక్ చేశాం. గదిలో లగేజ్ ఉంచి, ఓ కప్పు టీ తాగి, కాసేపు కూడా విశ్రాంతి తీసుకోకుండా ‘ఇక రిహార్సల్స్ చేద్దామా?’ అని అడిగారు. ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర దాకా ఆయన సాధన చేశారు. మా బావ (ఎన్.టి.రామారావు తమ్ముడు) రిహార్సల్స్‌ని పర్యవేక్షించారు. మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నుండి ఏడున్నర వరకు పి. సుశీలతో కలిసి యుగళగీతాలు సాధన చేశారు. తాను రఫీతో కలిసి పాడబోతున్నట్టు అప్పటికి సుశీలగారికి తెలియదు. ఎప్పటికైనా రఫీతో పాట పాడాలన్న తన కోరిక ఇలా తీరినందుకు ఆమె సంతోషించారు. మాకు కృతజ్ఞతలు చెప్పారు. తాను తెలుగులో పాడుతున్నట్టే, సుశీల గారు కూడా హిందీలో పాడాలని రఫీ కోరారు.
సంగీత దర్శకులు టి.వి.రాజు, వారి సహాయకులు విజయ కృష్ణమూర్తి ఏవైనా కొత్త స్వరాలు వినిపిస్తే, రఫీ వాహ్, వాహ్ అంటూ మెచ్చుకునేవారు. మర్నాడు రిహార్సల్స్ స్టూడియోలో పెట్టుకున్నాం. అయితే రఫీ ఎన్.టి.రామారావుని కలవాలని అనుకోవడంతో ఒక చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను. ఎన్.టి.ఆర్‍ని లుసుకున్నందుకు రఫీ ఎంతో సంతోషించారు. ఎన్.టి.ఆర్. గొంతుకు తగ్గట్టుగా తన స్వరాన్ని మలచుకోవాలనున్నారు. షమ్మీ కపూర్, ధర్మేంద్ర వంటి ఒక్కో నటుడికి ఒక్కో విధంగా పాడుతానని రఫీ చెప్పారు. ఎన్.టి.ఆర్ నటించిన ‘శ్రీకృష్ణావతారం’ చూడాలని కోరుకున్నారు. ఎన్.టి.ఆర్.ని శ్రీ కృష్ణ పరమాత్మగా చూసి ఆనందించారు. ఆ తరువాతే ఆయన స్టూడియోలో రిహార్సల్స్ ప్రారంభించారు.
‘ఎంతవారు గానీ వేదాంతులైన గానీ’ అనే పాటని ప్రాక్టీస్ చేసి, పాడారు. ఉదయం పది గంటల నుంచి 11.30 వరకు ఇదే సరిపోయింది. పది టేకులైనా సరే, రఫీ మైక్ ముందు నిలబడే ఉంటారు. పాట ఓకే అయి, రికార్డింగ్ పూర్తయ్యేవరకు మంచినీళ్ళే తాగేవారు, ఆ తరువాతే టీ తాగేవారు. “ఇప్పుడొక కప్పు వేడి వేడి టీ తాగాలి” అనేవారు. ఈ పద్ధతిలో ఆయన మాకు ఆరు రోజులు కేటాయించినప్పటికీ, నాలుగు రోజులలో అన్ని పాటలు పాడేశారు. ఏదైనా పాట బాగా రాకపోతే, నిస్సంకోచంగా చెప్పమనీ, మళ్ళీ పాడతాననీ అన్నారు. పాట ఏదైనా పర్‍ఫెక్ట్‌గా రాకపోతే నేను ఓకే చేయనని చెప్పాను. మేము ఈ పాటలు రికార్డు చేస్తున్నప్పుడు విజయ గార్డెన్స్‌లో ధర్మేంద్ర చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఆయన మా పాటలు వినేందుకు వచ్చారు. అన్నీ పాటలు వినీ, సంతోషంతో, ఇకపై రఫీని ‘రఫీ రావ్’ అనీ, సుశీల గారిని ‘సుశీలా మంగేష్కర్’ అని పిలుస్తారని చమత్కరించారు. అందరం హాయిగా నవ్వుకున్నాం.
రఫీది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఓ రోజున మా అమ్మ రికార్డింగ్ స్టూడియోకి వచ్చిందని ఆయనకి తెలిసింది. పాట రికార్డింగ్ అయిపోయాకా, మా అమ్మని చూడాలని అన్నారు. అమ్మని కలిసాకా, “అమ్మా, ఈ రోజునుంచి నేనూ మీ బిడ్డనే. మీకు ఇక ముగ్గురు కొడుకులు” అన్నారు, అమ్మ ఎంతో సంతోషించింది. లక్షలాది మందికి వీనుల విందు చేస్తూనే ఉండమని ఆయన్ని ఆశీర్వదించింది. రఫీ శాకాహారి. ఆహారం పరిమితంగా తీసుకునేవారు. ఇడ్లీలు బాగా ఇష్టంగా తినేవారు. ఉదయాన్నే ఐదు గంటలకే నిద్రలేచి హోటల్ నుంచి బయల్దేరి ఎడ్వర్డ్స్ ఇలియట్ రోడ్డు వరకు వెళ్ళి అక్కడ్నించి బీచ్ వరకు నడిచేవారు. బొంబాయిలో ఉంటే రోజూ టెన్నిస్ ఆడతారని తెలిసింది. నటీనటులు దేహదారుఢ్యం, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ప్రయత్నించడం అందరికీ తెలిసిందే, కానీ ఒక గాయకుడు ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోడం విశేషం! రఫీ మాతోనే కాకుండా అందరితోనూ మర్యాదగా ఉండేవారు. మా ఆఫీస్ బోయ్ టీ అందించినా, నవ్వుతూ ‘షుక్రియా’ అనేవారు. బొంబాయికి వెళ్ళేముందు మా అమ్మని మళ్ళీ కలిసి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయనది అద్భుతమైన స్వరసంపద అని అమ్మ అంటే, ‘అంతా భగవత్ప్రాసాదం’ అన్నారు. ఆయన వెళ్ళిపోయినా, ఏదో ప్రత్యేకమైన భావన మాలో ఎప్పటికీ ఉండిపోయింది. దీన్ని నేను అందరితో పంచుకోవాలనుకున్నాను. అలాంటి వారు లక్షల్లో ఒకరుంటారు. గొప్ప గాయకుడు.. మంచి వ్యక్తి…
మా సినిమా పాటలని గ్రామ్‌ఫోన్ రికార్డులు విడుదల చేశాం.. అవి గొప్ప హిట్ అయ్యాయి. మహమ్మద్ రఫీ జిందాబాద్!
~~
ఇలా రఫీ గురించి చెప్పారు పుండరీకాక్షయ్య.
టైగర్ పటౌడీ, షర్మిలా ఠాగూర్‍ల ప్రేమ కథ:
బాలీవుడ్‌కీ, క్రికెట్‍కీ మధ్య ఏదో ఉంది, అందుకే ఈ రెండూ ఎప్పడూ గొప్ప ప్రేమకథలకు నెలవవుతాయి. కారణం గ్లామర్ కావచ్చు లేదా రెండిటిలోనూ ఉండే ఆకర్షణ కావచ్చు. లేదా ఆయా రంగాలలో విజయవంతమైనవారు ప్రేమలో పడడం కారణం కావచ్చు.
టైగర్ పటౌడీగా చిరపరిచితులైన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ షర్మీలా ఠాగూర్‍ని తొలిసారిగా 1965లో కలిశారు. అప్పుడాయన భారత క్రికెట్ జట్టు కెప్టెన్… అతి పిన్న వయస్కుడైన కెప్టెన్… ఆవిడేమో బాలీవుడ్‍లోనే అత్యంత అందగత్తెలలో ఒకరు. 1965లో ఢిల్లీలో ఒక మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో మొదటిసారి కలుసుకున్నారు. మ్యాచ్ ఆడేందుకు తన జట్టుతో కలిసి పటౌడీ రాగా, మ్యాచ్ చూసేందుకు వచ్చారు షర్మిలా. వాళ్ళిద్దరూ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పినట్టు – పటౌడీ షర్మిలా సినిమాలు పెద్దగా చూడలేదు. ఆవిడకేమీ క్రికెట్ అంటే పెద్దగా తెలియదు. కానీ ఏదో జరిగింది… హెడ్‍లైన్స్‌లో నిలిచిన వారి బంధం పెళ్ళిగా మారింది.
పటౌడీ ఒక సంస్కారవంతమైన నవాబు. అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఇక షర్మిలా బాలీవుడ్‍కి బెంగాల్ కానుక. తెర మీద అందంగా కనిపించడమే కాకుండా గొప్ప నటించే నాయిక. వ్యక్తిగతంగా వారిద్దరూ సమానంగా విజయవంతమైనవారు, స్వతంత్ర భావాలున్నవారు.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ అయిన పటౌడీ ఆ కాలం నాటి మగవాళ్ళలా ఉండేవారు కాదు. ఆయనది పాశ్చాత్య శైలి, గొప్ప నడవడి. తోటివారిలా అందరితో రాసుకుపూసుకుని తిరగడం కన్నా, పుస్తకాలను ఇష్టపడే వ్యక్తి. క్రికెట్ విషయానికొస్తే చిన్న వయసులోనే ఎంతో సాధించారు. ఆటలో కుడికన్నుని శాశ్వతంగా పోగొట్టుకున్నప్పటికీ, జట్టుకి నేతృత్వం వహించిన గొప్ప నాయకులలో ఒకరు.
సత్యజిత్ రాయ్ ఆధ్వర్యంలో 13 ఏళ్ళకే సినీరంగంలో ప్రవేశించిన షర్మిలా ఏం తక్కువ కాదు. త్వరలోనే బాలీవుడ్‍లో అందరూ కోరుకునే హీరోయిన్‍గా ఎదిగారు. గొప్ప నటి. రొమాంటిక్ హీరోయిన్‍గా పేరొచ్చినప్పటికీ, ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు.
అయితే, ఇద్దరి మధ్యా పోలికలు ఎన్ని ఉన్నప్పటికీ, షర్మిలా, పటౌడీల మధ్య వైరుధ్యాలు కూడా ఉన్నాయి. ఆయన ముస్లిం రాజ కుటుంబానికి చెందినవారు కాగా, ఆమె ప్రసిద్ధ ఠాగూర్‍ల కుటుంబానికి చెందినవారు. వారి నవాబు కుటుంబంలో సినిమాల గురించి పెద్దగా మంచి అభిప్రాయం లేదు. కాగా, పటౌడీల విలాసవంతమైన జీవన శైలి గురించి చెడ్డగా వినలేదు షర్మిలా కుటుంబం.
షర్మిలా, పటౌడీలు ప్రేమలో పడ్డారు, వాళ్ళ ప్రేమకి ఆటంకాలు ఎదురవలేదు. రెండేళ్ళ పాటు ప్రేమించుకున్నాకా, డిసెంబరు 1968లో పెళ్ళి చేసుకున్నారు. అప్పట్లో ఈ వివాహం వార్తల్లో నిలిచింది. నిజానికి పెళ్ళి చేసుకుందామని పటౌడీ పారిస్‍లో ప్రతిపాదించారట! అయితే పెళ్ళికి ముందే రెండు కుటుంబాల పెద్దలు వివాహానికి ఆమోదం పొందారు వీరిద్దరూ. వీరి ప్రేమ విఫలమయిందని మీడియాలో వార్తలు వస్తున్న సమయంలోనే వారి పెళ్ళి వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది.
1960లలో భారతదేశం పురోగామి దేశంగా భావించబడేది కాదు. అందుకే వీరిద్దరి జోడీ దేశంలో కెల్లా అత్యంత అందమైన జంటగా భావించబడింది. వారి మతాలు వేరయినా పరస్పర విశ్వాసాలతో వివాహం జరిగింది. అందుకే షర్మిలా ఒకసారి చాలా అందంగా – ‘మతాలెన్నడూ ముఖ్యం కాదు. మేం పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు మేం సెక్యులరా, కమ్యునలా అని ఆలోచించలేదు. అప్పట్లో మేం యవ్వనంలో ఉండేవాళ్ళం. మా చుట్టూ జరుగుతున్న గందరగోళాన్ని మేం పెద్దగా పట్టించుకునేవాళ్ళం కాదు. పర్యవసానాలు కూడా పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే మాకిద్దరికీ మేమే ఒక లోకంగా ఉండేది. కలిసి ఉండాలనుకునేది ఆచారాలను ఉల్లంఘించడానికి కాదు, కలిసి జీవించాలనే ప్రగాఢమైన కోరిక ఉన్నందున’ అని చెప్పారు.
ఎవరికైనా గుర్తుందా? 1967లో షర్మిలా బికిని ధరించిన తొలి ఆధునిక నటి అయ్యారని? అప్పట్లో ఆమె పటౌడీతో ప్రేమలో ఉన్నారు. అయితే వారిద్దరికీ అదో పెద్ద సమస్య కాలేదు. తాను చేసే పనిపై పూర్తి అవగాహన ఉందామెకి, పైగా ఆయన మద్దతు కూడా ఉంది. పెళ్ళి తరువాత కూడా వాళ్ళిద్దరూ ఎన్నో మూస పద్ధతులను చెరిపివేశారు. పెళ్ళయిన తరువాత సినిమాలు మానేసే హీరోయిన్ల వలె కాకుండా, పెళ్ళి తరువాత, తల్లి అయిన తర్వాత కూడా షర్మిలా ఎన్నో సినిమాలలో నటించారు. ఆమెకెంతో పేరు తెచ్చిన ‘ఆరాధన’, ‘అమర్ ప్రేమ్’ వంటి సినిమాలు ఆమె కొడుకు సైఫ్ ఆలీ ఖాన్ జన్మించిన తర్వాతే విడుడలయ్యాయి. అయితే వీరి వైవాహిక బంధం ఎక్కువకాలం నిలవదని మీడియా భావించగా, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ, వారి బంధం కలకాలం నిలిచింది. మతపరమైన, సాంస్కృతిక పరమైన వైరుధ్యాల కారణంగా, ఇంకా క్రికెటర్లకీ, యాక్టర్లకీ ఉన్న ప్రతిష్ఠల కారణంగా వీరి బంధం ఎక్కువ కాలం నిలవదని చాలామంది భావించారు. వారందరి అభిప్రాయాలని త్రోసిరాజంటూ, పటౌడీ, షర్మిలా తమ వైరుధ్యాలను అధిగమించి, తమ వ్యక్తిగత పురోగామి భావాలను పరస్కరం గౌరవించుకున్నారు వారిద్దరూ. 2011లో పటౌడీ మరణం వరకూ 42 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా కొనసాగింది వారి వైవాహిక బంధం!
పటౌడీతో పెళ్ళి సందర్భంగా – అన్యమతం వారిని వివాహం చేసుకోవడం తనకి ఎన్ని రకాలుగా ప్రయోజనమో షర్మిలా గొప్పగా చెప్పారు. “ఈ పెళ్ళి వల్ల నేను కోల్పోయిందీ ఏదీ లేదు. ఆయన అభిప్రాయాలు సంకుచితమైనవి కావు. గొప్ప అనుభవాలు సంపాదించుకున్నాను. మరో సంస్కృతి గురించి తెలుసుకున్నాను. నాకు తెలియని వంటకాలు నేర్చుకున్నాను. కొత్త రకంగా దుస్తులు ధరించడం తెలుసుకున్నాను. ఎంతో ప్రయోజనం పొందాను.”
వాళ్ళది – ఇద్దరు సమాన స్థాయి వ్యక్తుల వివాహం. ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం ఉండేవి. సమాజపు నమూనాలను చెదరగొట్టారు. తమ సొంత షరతుల ప్రకారం జీవించారు. ఇద్దరూ కలిసి ఒక జీవితకాలపు ప్రేమ కథను మనకి అందించారు. బంధం లోని లక్ష్యాలను సాధించాలంటే – నవాబ్ పటౌడీ, బాలీవుడ్ యొక్క బెంగాలీ సుందరిల ప్రేమ బంధాన్ని మించినది వేరే ఏది ఉంటుంది?