మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-10

2
5

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]మ[/dropcap]నోరమ తన అన్న మకరంద్‌ని వెతుకుతూ, చీకట్లో, కళామందిర్ పరిసర ప్రాంతాలన్నీ తిరుగుతూ, కనిపించిన మార్గాన్ని అనుసరించి వడివడిగా పోతుంటే, వెనక ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. చూస్తే లాల్మియా! “మా అన్న ఎక్కడున్నాడు? స్త్రీ వేషంలో నీ దగ్గరికి వచ్చాడు కదా” అని ధైర్యంగా అడిగింది. ‘ఓ, వాడా! చూపిస్తాను రా’ అని నమ్మకంగా ఆమెను ఒక పెద్ద గోరీ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అది ఒక పెద్ద రాతి కట్టడం. ‘లోపలవున్నాడు మీ అన్న’– అని చెప్పిన లాల్మియా మాటలు నమ్మి ఆ గోరి లోపలికి ప్రవేశించింది మనోరమ. వెంటనే తలుపులు బంధించి గబగబా వెళ్ళి పోతున్న లాల్మియాకి ఒక రక్షక భటుడు ఎదురయ్యాడు. అతడు పురుషవేషంలో ఉన్న అవంతి అని తెలియక, సాయం చేయమని అడిగాడు. “సింహళ ద్వీపం నుండి ఇక్కడకు వచ్చి వలువల వ్యాపారం చేస్తున్నాను. నా భార్య మాధురీ బేగంని వదిలించుకొని, తీరా వస్తే, ఇప్పుడు ఆమె నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. నువ్వు లోపలకి వెళ్లి వ్యాపారరీత్యా ఓడలో వెళుతున్న లాల్మియాని దొంగలు చంపి సముద్రంలో పడవేసారన్న వార్త అధికార రీత్యా అందిందని నమ్మించి చెప్పాలి. అప్పుడు మాధురి బేగం తిరిగి వెళ్ళిపోతుంది” అంటూ, తన ముద్రికను ఇచ్చాడు. “దీనిని చూపిస్తే లోపలున్న కాపలాదారుడు నిన్ను అనుమతిస్తాడు. ఈ ఉపకారం చెయ్యి” అని ముద్రికను ఇచ్చాడు లాల్మియా.

ముద్రికను తీసుకొని ధైర్యంగా లోపలికి ప్రవేశించింది అవంతి. అక్కడ ఉన్న కాపలాదారుడు ముద్రికను చూసిన తర్వాత, ఆమెను మాధురీ బేగం దగ్గరకు తీసుకు వెళ్ళాడు. తన పేరు జయంతుడు అని చెప్తూ, లాల్మియా మరణించాడు అని చెప్పింది అవంతి.’ పీడ వదిలింది’ అంటూ ఆనందంతో జయంతుని చేతులు పట్టుకొని ముద్దాడింది బేగం.

“ఇప్పటికీ ఎనిమిది తరాల నుండి సింహళ ద్వీపమును మా పూర్వీకులు పరిపాలిస్తున్నారు. తొమ్మిదవ తరం నేను రాణిని కావలసింది. లాల్మియా మా అమ్మకి తమ్ముడు, నాకు రెట్టింపు వయసు ఉన్నవాడు. చిన్నప్పటినుంచి జులాయిగా తిరుగుతూ ఏవేవో మంత్ర తంత్రాలు నేర్చుకొని ఎన్నెన్నో దుర్మార్గపు పనులన్నీ చేస్తూ ఉండేవాడు. మారుతాడేమోనన్న అమ్మమ్మ ఆశ, కోరిక వలన వీడిని వివాహ మాడినందుకు ఎన్నో కష్టాలు పడ్డాను. వాడి దుర్మార్గాలన్ని అడ్డగిస్తానని వాడికి నా మీద ద్వేషం. వాడి కంటే నాకు మరింత మంత్ర శక్తి ఉంది కాబట్టి వాడి విద్యలన్నీ తిరగకొట్టేదాన్ని, అందుకని నా ముందు నిలవలేక పారిపోయాడు. రెండేళ్ళ తర్వాత కొందరు గూఢచారుల వల్ల అతను ఇక్కడ ఏదో వ్యాపారం చేస్తున్నాడని తెలిసి కడసారి బుద్ధి చెప్పాలని వచ్చాను. ఆ అవసరం లేకుండా వాడు చచ్చాడు అన్న శుభవార్త నీ వల్ల తెలుసుకున్నాను. నన్ను చపలచిత్తురాలిననుకోవద్దు. ఈ శుభవార్త చెప్పిన నీ యందు నా మనసు లగ్నం అయిపోయింది. భగవంతుడు నిన్ను నా దగ్గరకు పంపించాడు” అన్నది మాధురీ బేగం. అంతలో పులి గాండ్రింపులు విన్న జయంతుడు అదేమిటని ప్రశ్నించాడు. ‘వికారి’ అనే పులి అనీ, ఇటీవల ఒక యువకుడిని దానికి ఆహారంగా వేశారని చెప్పింది బేగం. తన భయాందోళనలను మనసులోనే దాచుకుని “నేను ఆ పులిని చూడవచ్చా” అని అడిగాడు జయంతుడు. కొందరు భటులు దారి చూపగా మాధురీ బేగం జయంతుని ఆ పులి ఉన్న బోను దగ్గరికి తీసుకు వెళ్ళింది. అక్కడ పులితో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మకరంద్‌ని చూసి , జయంతుని ప్రాణాలు ఎగిరి పోతున్నంత పని అయింది. “అతడు నా స్నేహితుడు రక్షించండి” అని బేగంని ప్రార్థించాడు జయంతుడు. అప్పటికే అతని మీద ప్రేమ పెంచుకున్న రాణీ బేగం, భటులచే పులిని బంధించి మకరంద్‌ని విడిపించింది. వైద్యులను పిలిపించి మకరంద్ గాయాలన్నింటికి వైద్యం చేయించింది. శ్రద్ధగా పరిచర్యలు చేసి మకరంద్ కోలుకునేటట్లు సేవ చేసింది జయంతుని వేషంలో ఉన్న అవంతి.

మనోరమ గోరి లోకి ప్రవేశించిన తర్వాత తాను మోసపోయానని గ్రహించింది. కానీ లాల్మియా లోనికి ప్రవేశించకుండా లోపల గడియ వేసుకుంది. ఆ చీకటిలోనే మసకగా కనిపిస్తున్న మెట్లు దిగుతూ కిందకి వెళ్ళసాగింది. అంతలో ఆమెకి ఒక ఛాయా రూపం ఎదురుగా గోచరించడంతో భయంతో స్తంభించిపోయింది.

***    

తెలతెలవారుతుండగా కథను ఆపింది సారంగి. మహారాజు శయనాగారమును వదిలి వెళ్ళాక రాగలత సారంగిని తీసుకుని “కొంత తడవు ఫల వృక్షాలతో ఉన్న ఉద్యానవనానికి వెళ్తాను” అని చెలులతో చెప్పి బయలుదేరింది. సారంగి దారి చూపుతుండగా, మొగలి పొదలు వద్దకు వెళ్లింది రాగలత. అక్కడ చిలుక శరీరాన్ని వదిలి, గుబురుగా ఉన్న ఆ మొగలి పొదల లోపల దాచి ఉంచిన తన శరీరంలోకి ప్రవేశించాడు జయదేవ్. అద్భుత రూపు రేఖా విలాసములతో, తన ఎదుట నిలిచిన జయదేవుని చూచి ఆనంద పరవశం అయినది రాగలత. ఇరువురు సర్వం మరచి ఆ ఉద్యానవనంలో విహరించారు. కొద్దిసేపటికి ఏదో సవ్వడి విన వచ్చినది. అది ఒక విధమైన గంటల సవ్వడి. అంతలో చెలుల పిలుపులు విన్న జయదేవ్, తన శరీరాన్ని పొదలమాటున దాచి, చిలుక లోకి పరకాయ ప్రవేశం చేశాడు. చెలులు సమీపించి భయకంపితులై “ఎవరో ఒక విచిత్రాకారుడు రంగురంగుల గుడ్డ పేలికలు చుట్టుకొని, ఒంటినిండా చిరుగంటలు కట్టుకొని, చింపిరి జుట్టు పొడవు గడ్డంతో, మమ్మల్ని పట్టుకోవాలని చూశాడు. మేము పారిపోయి మీకోసం వెతుక్కుంటూ వచ్చాము” అని చెప్పారు. రాగాలత సారంగిని తీసుకొని వాళ్ళ వెంట రాణి వాసాభి ముఖముగా బయలుదేరింది.

***

(మనోరమకి గోచరించిన ఛాయా రూపం ఎవరిది?  మాధురి బేగం లాల్మియాల మధ్య వైరం ఏమిటి? అది ఏ రూపంగా పరిణమించబోతుంది? తరువాయి భాగంలో…..)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here