రామాయణ మీమాంస పుస్తక పరిచయం

2
3

[dropcap]ఇ[/dropcap]ది కరపాత్రి స్వామి రచించిన రామాయణ మీమాంస అన్న పుస్తకం గురించిన వ్యాసం. కరపాత్రి స్వామి రాసిన ఈ పుస్తకం చదవాలని ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికి కుదిరింది నాకు. కరపాత్రి స్వామిని ధర్మసమ్రాట్ అని కీర్తించారు ఆయన జీవించిన కాలంలోని ఆర్ష ధర్మాభిమానులు. ఆయన సంప్రదాయ పార్టీ “అఖిల భారతీయ రామ రాజ్య పరిషత్” స్థాపించారు 1948లలో. 1952, 1957, 1962 లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి 1952 లో 3 సీట్లు, 1962లో 2 సీట్లు గెలిచింది ఆ పార్టీ. 1952, బీహార్ విధాన్ సభలో 1సీటు, ఉత్తర ప్రదేశ్ విధాన్ సభలో ఒక సీటు గెలిచింది. 1957లో రాజస్థాన్ ఏర్పడిన తరువాత జరిగిన విధాన్ సభ ఎన్నికలలో 60 సీట్లలో పోటీ చేసి 17 సీట్లు గెలిచింది. ఇప్పటి పూరి పీఠం శంకరాచార్యులు ద్వారకా జోషిమఠ్ శంకరాచార్యులు కూడా కరపాత్రి స్వామి శిష్యులే. నేను ఆయన పుస్తకాలు చాలా చదివాను. సనాతన ధర్మం – ఆధునికత అన్న విషయంపై ఆలోచించే వారందరు తప్పక చదవాల్సిన సాహిత్యం కరపాత్రి స్వామిది. ఐతే గొప్ప వ్యక్తులందరి లాగానే కరపాత్రి స్వామిని ద్వేషించేవారు ఉంటారు. ఆరాధించేవారు ఉంటారు (కరపాత్రి స్వామి గురించి మరింత సమాచారం వికీపీడియాలో లభ్యం. https://en.m.wikipedia.org/wiki/Swami_Karpatri). పెద్దగా పట్టించుకోనివారు కూడా ఉంటారు. నా వరకు నాకు ఆయన మీద గౌరవభావం. తెలుగు రాష్ట్రాలలో ఈయన సాహిత్యం అంతగా ప్రసిద్ధి చెందిన దాఖలాలు కనపడలేదు నాకు. హిందూకోడు బిల్లుకు వ్యతిరేకంగా కరపాత్రి స్వామి జరిపిన ప్రచారానికి సంబందించిన పుస్తకం తాలూకా అనువాదం ఒకటి తెనాలి సాధన గ్రంథ మండలి వారు ప్రచురించినట్టుగా ఉన్నారు అప్పట్లో. అది తప్పితే కరపాత్రి స్వామి రచనల అనువాద సాహిత్యం తారసపడలేదు నాకు. చాలా వరకు సాహిత్యం హిందీ లేదా సంస్కృతంలోనే లభ్యం.ఈ పుస్తకం హిందీలో ప్రచురించారు. ఆర్కైవ్ డాట్ ఆర్గ్‌లో పీడీఎఫ్ లభ్యం. ఫ్లిప్కార్టులో కొన్నాను నేను. ExoticIndiaart వారి సైటులో కూడా ఈ పుస్తకం లభ్యం.

కరపాత్రి స్వామి, image credit: https://www.varanasi.org.in/

ఇక ఈ పుస్తకం విషయానికి వస్తే ఇది ప్రధానంగా బెల్జియంకు చెందిన కామీల్ బూల్కే అనబడే క్రైస్తవ మిషనరీ రామకథ అని రామాయణం గురించి రాసిన సాహిత్యం యొక్క ఖండన. ఐతే ఇది కేవల ఖండన మాత్రమే కాకుండా రామాయణాన్ని వైదిక సంప్రదాయ దృష్టితో ఎలా అర్థం చేసుకోవాలో తెలిపే ఒక గొప్ప అధ్యయనం. అప్పుడెప్పుడో ఢిల్లీలో ఒక విశ్వవిద్యాలయం వారు ఏ.కె.రామానుజన్ రాసిన త్రీ హండ్రెడ్ రామాయణాస్ (మూడు వందల రామాయణాలు) అన్న వ్యాసం నిషేధించటం గురించి దుమారం రేగిన కాలంలో ఒక మిత్రుడు నాతో ఇలా అన్నాడు. “ఇన్ని వందల రామాయణాలు ఉంటే నేను ఏ రామాయణాన్ని నమ్మాలి నా పిల్లలకు ఏ రామాయణాన్ని చెప్పాలి” అని. హిందుత్వవాదులు భారతీయతలో ఉన్న సహజ వైవిధ్యతను నాశనం చేసి అసహజమైన ఏకీకృతను బలవంతంగా మన మీద నెడుతున్నారని అతని భావం. ఆ వాదనలోని రాజకీయాలు సత్యాసత్యాలను పక్కన పెడితే అతని సందేహంలో న్యాయం ఉంది. ఇన్ని రామాయణాలు ఉండగా ఏ రామాయణము ప్రామాణ్యము అన్నది మంచి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఈ పుస్తకంలో కరపాత్రి స్వామి సరైన సమాధానం ఇస్తారు. మరొక మిత్రుడు ఒకానొకప్పుడు ఇలా అన్నాడు నాతో మాట వరసకు. ఆ కాలంలో హ్యారీ పోట్టర్, డా విన్సీకోడ్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాగా రామాయణం కూడా ఒక సూపర్ హిట్ కాల్పనిక నవల అయ్యి ఉంటుందేమో. తర్వాతి తరాలు అదే నిజం కామోసు అనుకున్నాయేమో అని అన్నాడు నా మిత్రుడు అప్పట్లో. ఈ విషయంలో మా ఇద్దరికీ వాద ప్రతివాదాలయ్యాయి అప్పట్లో. ఇప్పటికీ మేము మంచి మిత్రులం అది వేరే విషయం. ఐతే ఈ రకం వాదనల గురించి కూడా ప్రస్తావించి కూలంకషంగా జవాబిచ్చారు కరపాత్రి స్వాములవారు ఈ పుస్తకంలో.

నేను సంస్కృత పండితుడిని కాను. నాకు తెలిసిన తెలుగు కూడా ఇంగ్లీషు మీడియమ్ స్కూలులో నేర్చినదే. ప్రబంధాలు పద్యకావ్యాలు చదివినవాడిని కాదు. సనాతన ధర్మ లోతుల్నిఆకళింపు చేసుకున్న మేధావిని అసలుకే కాను. నాకుండే రకరకాల సందేహాల నివృత్తి కొరకు కొంత సాహిత్యం చదివాను. దాని ఆధారంగా హిందూ ధర్మం గురించి కొంత తెలుసుకున్నాను. ఎలాగూ రోజువారీ జీవితంలో ఎంతకాదనుకున్నా హిందూ మతపు ఛాయలు పూర్తిగా తుడిచిపెట్టుకొనిపోలేదు ఇంకా మన సమాజంలో. కాబట్టి ఈ సమాజ జీవితమే చాలా నేర్పుతుంది మనకు హిందూ ధర్మం గురించి. నా వరకు నాకు సనాతన ధర్మ మూలాలను సాహిత్యం ద్వారా గట్టిగా పరిచయం చేసిన గురువులు కొందరున్నారు. ప్రధానంగా కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి ప్రవచనలు సంభాషణల సంకలనాలు మరియు విశ్వనాథ సత్యనారాయణ నవలా సాహిత్యం ఇతరత్రా గద్య సాహిత్యం నాకు చాలా విషయాలు నేర్పాయి. ఆనంద కుమారస్వామి రచనలు మరియు కరపాత్రి స్వామి సాహిత్యం చదివి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇంకా ఎన్నో చదివి ఉండచ్చును కానీ ఇక్కడ ప్రస్తావించిన వారి ప్రభావం ప్రధానం. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఈ రామాయణ మీమాంస అనే పుస్తకం కేవల కాలక్షేపం కోసం చదివాల్సినది కాదు. సనాతన ధర్మ దృక్పథంతో ఓ మోస్తరు పరిచయం ఉంటేనే ఈ పుస్తకంలోని అసలు సంగతి మనకి ఒంటబట్టేది లేదంటే మరీ కొరకరాని కొయ్యగా అనిపించచ్చు. ఇటువంటి ఆలోచనలతో కొంత పరిచయం ఉన్నందున మరీ ఎక్కువగా కష్టపడలేదు చదవటానికి ఎక్కడా. వెయ్యి పేజీల పుస్తకం. మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పుస్తకం. ఒకసారి చదివినంతనే అర్థం కాని పుస్తకం.

వేదాలకూ రామాయణంలోని సీతారాముల కథకూ అసలు సంబంధం లేదు అన్న ఫాధర్ బుల్కె ఆక్షేపణను ఖండించటంతో ప్రారంభం అవుతుంది కరపాత్రి స్వామి రామాయణ మీమాంస. అసలు ఫాదర్ బుల్కె క్రైస్తవ ప్రచారం కోసమే రామకథ అనే గ్రంథం రాసేడేమో అని అంటారు కరపాత్రి స్వామి. 1974లో బుల్కెకు పద్మ భూషణ్ ఇచ్చి సత్కరించింది అప్పటి ప్రభుత్వం!

ఇక రాముని కథ లేదా రాముని ప్రస్తావన వేదాలలో లేదు అన్నది సాధారణంగా మనం ఎప్పుడు వినే ఆక్షేపణే. వేదాలలో అసలైతే ప్రకృతి ఆరాధన ఉంటుంది. తర్వాత ఆర్యులు వచ్చారు. వారు వారి దేవుళ్ళని దేవతారాధనను తెచ్చారు. వేదకాలం ఆటవికుల కాలం. బ్రాహ్మణ అరణ్యక ఉపనిషత్తులు వేదాలలో తర్వాత తర్వాత చేర్చబడ్డాయి. మంత్ర భాగం అసలైన ఒరిజినలు. ఇంతే కాక రుగ్వేదం ముందు రాసారు తర్వాత కాలంలో మరొక వేదం చేర్చారు. చివరాఖరి అథర్వ వేదం అసలు వేదమే కాదు. వైదిక సంస్కృతి క్రీస్తుశకం 1500 లేదా క్రీస్తు శకం 3000 కాలం నాటిది. అంతకు ముందు మనది ఆదిమ సమాజము. నిజానికి అందరం ఆఫ్రికా నుంచి వచ్చాము. అసలు మహాభారతం రామాయణం కంటే ముందు రచించినట్టుగా ఉందే. రామాయణం ఆర్యులు ద్రావిడులు మీద చేసిన దాడులకు సంకేతం వగైరా వగైరాలు. ఇటువంటి వాదనలు కోకొల్లలు విన్నాము మనము. ఇటువంటి వాదనలు వినిపించటమే పనిగా పెట్టుకున్న మేధావులు ఎందరో ఉన్నారు ఇప్పటికీ మన సమాజంలో. కొందరు సాహిత్యకారులకు రామాయణంలో కల్పవృక్షాన్ని కనిపిస్తే కొందరికి విషవృక్షం కనిపిస్తుంది అన్న విషయం తెలుగు పాఠకులకు తెల్సిందే. ఈ పుస్తకంలో ఈ వాదనలను అన్నిటిని తిప్పికొట్టారు కరపాత్రి స్వామి. వైదిక దృష్టితో ఆర్ష సంప్రదాయ దృక్కోణంలో రామాయణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇటువంటి ఆక్షేపణలకు ఎలా సమాధానమివ్వాలి రకరకాల రామాయణాలను సమన్వయ పరిచి ప్రామాణిక దృష్టితో ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాలను అద్భుతంగా విశదీకరించారు కరపాత్రి స్వామి ఈ పుస్తకంలో.

అసలు ఈ పాశ్చాత్య చరిత్రకారులు సాహితీకారులు వైదిక వాఙ్మయం చూసేడి దృష్టిలోనే లోపం ఉందంటారు కరపాత్రి స్వామి. వేదాలు అనాది అపౌరుషేయం నిత్యం స్స్వతః ప్రమాణం అన్న విషయం వారికి అసలు మింగుడు పడని విషయం అంటారాయన. వేదాలలో సూత్రప్రాయంగా ఉన్న విషయాన్నే వాల్మీకి రామాయణంలో విస్తారంగా వర్ణించారని అంటారు కరపాత్రి స్వామి. వేదాలలో అక్కడక్కడా రాముడి ప్రస్తావన దశరథ ప్రస్తావన సీత ప్రస్తావన ఉంటే ఉండచ్చును గాక అయినప్పటికీ వారికీ రామాయణ పాత్రలకి బొత్తిగా సంబంధం లేదని తీర్మానించిన బుల్కె ఆలోచనాధోరణి సరైనదని కాదని వివరిస్తారు కరపాత్రి స్వామి. మేక్స్ ముల్లర్ లాగానే బుల్కె కూడా వైదిక సంస్కృతి మీద అభిమానంతో అధ్యయనం చేయలేదని వారిరువురి ప్రధాన ఉద్దేశం వేదముల విషయంలోనూ శాస్త్రప్రమాణాల విషయంలోనూ అనుమానాన్ని సంశయాన్ని పెంపొందించటం క్రైస్తవ ప్రచారం కోసం భావి తరాలకు మార్గం సుగమం చేయటమేనని అంటారు కరపాత్రి స్వామి.

రామాయణ రచనకాలం గురించి బుల్కె చేసిన ప్రతిపాదనలను త్రోసిపుచ్చుతూ కరపాత్రి స్వామి ఇలా అంటారు. క్రీస్తుకు పూర్వం సభ్య సమాజం అన్నది ఒకటి ఉంది అన్న విషయం ఒప్పుకోవటం పాశ్చాత్యులకు ఇష్టం ఉండదు. ఇతర సంస్కృతులలోని మహనీయుల జీవితాలని మహా గ్రంథాలని క్రీస్తు జీవిత కాలానికి అటుఇటుగా ఉండేటట్టుగా కాలనిర్ణయం చేయటానికి ఈ పాశ్చాత్యులు ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు వాల్మీకి రామాయణంలోనే ఆ గ్రంథ కాలము నిర్ణయించి ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ కాలనిర్ణయం చేయవలసిన అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తారు కరపాత్రి స్వామి. బాలకాండ ఉత్తరకాండ రామాయణ రచనానంతర కాలంలో చేర్చపడ్డ ప్రక్షిప్తాలు అన్న వాదనను కూడా త్రోసిపుచ్చుతారు కరపాత్రి స్వామి.

మన దగ్గర రకరకాల రామాయణ కథా పరంపరలు ప్రచారంలో ఉన్నాయి.అయితే వీటిని సమన్వయపరచటం అసాధ్యమేమీ కాదని అంటారు కరపాత్రి స్వామి. కల్పభేదం వల్ల అక్కడక్కడా కథా భేదం రావటం అన్నది సహజం అని ప్రతీ కల్పానికి ఒక వ్యాసుడు ఒక వాల్మీకి ఉంటాడని అందువలన కొన్ని కథా భేదాలు వస్తే రావచ్చునని అంటారాయన. రకరకాల జైన రామాయణాల గురించి బౌద్ధ రామాయణాల గురించి విపులంగా చర్చించాక ఒక చక్కని మాట అంటారు కరపాత్రి స్వామి. రాముడు రామాయణము కేవల కల్పనలు కావని నమ్మితే అప్పుడు ఆ రామునికి ప్రామాణిక రూపం అన్నది ఒకటి ఉందని గుర్తించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు రామచరిత్రకు ముఖ్య ప్రమాణము వాల్మీకి రామాయణము తప్పితే మరేదీ కాబోదు అన్న విషయాన్ని కూడా గుర్తించాల్సి వస్తుంది. రకరకాల రామాయణాల వైరుధ్యాలను వైవిధ్యతను సమన్వయ పరుస్తూ సత్య మిథ్య వివేచన వేద ప్రమాణాల ఆధారంగా చేయచ్చని నిరూపిస్తారు కరపాత్రి స్వామి ఈ పుస్తకంలో. రాముడు మరియు రామచరిత్ర కేవలం కాల్పనికం అని అనుకునే వారి కొదువేమి లేదు. అలాంటి వారు మనసుకు తోచిన కల్పన చేసి అదే రామాయణము అని అనవచ్చును. అయితే ప్రమాణ భావం గల వైదికులు ఇటువంటి నిష్ప్రమాణ రామాయణాలను తిరస్కరిస్తారని వారి దృష్టిలో రామాయణం కేవల కల్పన కాదని అది అనాది అపౌరుషేయం స్వతః ప్రమాణమైన వైదిక వాఙ్మయంలో అంతర్భాగమని వారు విశ్వసిస్తారని అంటారు కరపాత్రి స్వామి. రాముడు అనంతం అని నమ్మిన వారు కల్పభేధాలను రామ అవతార పరంపరను విశ్వసిస్తారని అటువంటి భక్తులకు కల్పభేధాన్ని బట్టి కథాభేదాన్ని స్వీకరించటంలో ఇబ్బందేం లేదని అంటారాయన. పాశ్చాత్యుల ఆలోచనా ధోరణితో ఇటువంటి సమన్వయం చేయటం అసాధ్యం అంటారు కరపాత్రి స్వామి. ఈ పుస్తకం అంతా కూడాను తన వాదనాక్రమంలో రకరకాల రామాయణాలను ప్రస్తావిస్తారు కరపాత్రి స్వామి. ఒకటే వాల్మీకి రామాయణం ప్రింటు బుక్కు అచ్చు వేసి అందరూ దానికే కట్టుబడి ఉండాలన్నది కరపాత్రి స్వామి వాదన కానేకాదు. ఆనంద రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, అద్భుత రామాయణం, రామచరిత మానస్, ద్విపద రామాయణం, మరెన్నో రామాయణ టీకాలు, భాగవతం, మహాభారతం, ఎన్నో పురాణాలు, యోగ వాశిష్టం ఇలా ఎన్నో గ్రంథాలను సమన్వయ పరుస్తూ బుల్కె వాదనలను తిప్పికొడతారు కరపాత్రి స్వామి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఈ వాదన వల్ల రామాయణాల వివిధతకు వచ్చిన ముప్పేమీ లేదు. ఐతే సరికొత్త రకమైన రామాయణమనో రామాయణం గురించిన విశ్లేషణనో విశృంఖలత్వం ప్రచారం చేయకూడదన్నదే కరపాత్రి స్వామి వాదనలోని సారాంశం.

రామాయణంలోని వానరులు వింధ్య పర్వత ప్రాంతానికో ఛోటా నాగపూర్ పీఠభూమికో చెందిన ఆదివాసులని వారు అనార్యులని బుల్కె చేసిన వాదనల గురించిన చర్చ చేసారు కరపాత్రి స్వామి. ఇదంతా ఇప్పటికీ మనము వినే వాదనలే. ఆర్యులు రావణుడనే ద్రావిడ రాజు మీద చేసిన దాడికి ప్రతిరూపమే రామాయణం అని వాదించిన మేధావులు ఎందరు లేరు మన దగ్గర.

తన వాదనకు అనుకూలంగా ఉన్న విషయానికి వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా చూపి తదనుకులంగా లేని అంశాలు అందులో కనపడినప్పుడు ఆ అంశాన్ని వాల్మీకి రామాయణంలో ప్రక్షిప్తంగా చేర్చబడింది అని చెప్పడం బుల్కె వంటి వారి ఆలోచనావిధానమనీ అది సరికాదని అంటారు కరపాత్రి స్వామి. అంతేకాక రాముడు మరియు సీతాదేవి శ్రీ మహా విష్ణువు మరియు లక్ష్మీ దేవి యొక్క అవతారాలు అన్న అంశాన్ని పాశ్చాత్య మేధావులు అర్థం చేసుకోలేరనీ అలా జరగటం అసంభవం అని అంటారనీ దానిని ప్రమాణసిద్ధంగా నిరూపించినా కూడా ఆ ప్రమాణాలను వారు ఒప్పుకోరనీ అంటారు కరపాత్రి స్వామి.ఇది కూడా మనం తరచూ వినే వాదనే. రాముడు అసలు దేవుడే కాడు. నిజానికి అతను ఒక గొప్ప రాజు. పోను పోనూ ఆయన్ను దేవుడ్ని చేసి అవతార పరంపర ఒకటి కనిపెట్టి కథలు అల్లారు అని. ఇటువంటి వాదనలకు చక్కని సమాధానం ఇచ్చారు కరపాత్రి స్వామి.

ఇక అవతారవాదం గురించి ఫాథర్ బుల్కె ఇలా రాశారట. అవతారవాద ప్రస్తావన అన్నది ప్రప్రథమంగా శతపథ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఆ కాలానికి విష్ణువు కంటే కూడా ప్రజాపతి యొక్క మహత్యం గురించిన ప్రస్తావనే ఎక్కువ. నిజానికి మత్స్య కూర్మ వరాహావతారలను తొలుతటి వైదిక వాఙ్మయంలో ప్రజాపతి యొక్క అవతారాలుగానే గుర్తించారు అటు తర్వాత విష్ణు అవతారంగా రూపాంతరం చేయటం జరిగింది అని రాశారట ఫాదర్ బుల్కె. ఈ విషయమై కరపాత్రి స్వామి ఇలా అంటారు. రూపజ్ఞానమునకు నేత్రము స్వతంత్ర ప్రమాణము అన్నది ఎంత నిజమో అలాగే ధర్మము బ్రహ్మ జ్ఞాన విషయ సామాగ్రికి అనాది అపౌరుషేయమైన వేదములే ప్రమాణములు. విష్ణువు ఎవరు? ప్రజాపతి ఎవరు? వీరి అవతారాలు ఎప్పుడు జరిగాయి అది చూసిన వారెవరు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల ద్వారా లభించవు. ఆధునిక చరిత్రకారులు ఈ రెండు తప్పించి వేరే ఏ ప్రమాణాన్ని నమ్మరు కాబట్టి వారు ఈ ప్రశ్నలకు సమాధానము ఇవ్వలేరు. అవతారవాదం అన్నది కల్పితం కాదు. సూర్య చంద్రులు ఎంత నిజమో అవతార పరంపర అన్నది అంతకంటే నిజము. ఈ అవతార వాదానికి పరమ ప్రమాణము వేదము. దానిలో తుది మొదలు అన్న భేదాలు లేవు. ఫలానా కాలంలో విష్ణువు కంటే ప్రజాపతికి మహత్యం ఎక్కువ వంటివి నిస్సారమైన వాదనలు అని అంటారు కరపాత్రి స్వామి. రామావతార వర్ణన గురించి కూడా ఫాదర్ బుల్కె ఇలా రాశారట. రాముడిని ప్రాచీన కాలంలో విష్ణువు యొక్క అవతారంలాగా చూసే వారు కాదు. కృష్ణ భక్తి పెరిగాక రాముని గురించి కూడా ఎన్నో అలౌకిక కల్పనలు చేసి కృష్ణుని వలె రాముని కూడా ఒక అవతారంలాగా చూడటం ప్రారంభం అయ్యింది అని బుల్కె ఆక్షేపణ. ఇటువంటి వాదనలను సహేతుకంగా ఖండిస్తారు కరపాత్రి స్వామి.

బుల్కె వంటి పాశ్చాత్యులు వారి భారతీయ అనుయాయులు క్రీస్తు జనానంతరమే మానవసమాజ వికాసం జరిగింది అని బలంగా విశ్వసిస్తారనీ అంతకు ముందు మహా సభ్యత అన్నది ఉండేది అనే విషయం వారు జీర్ణించుకోలేరనీ అంటారు కరపాత్రి స్వామి. అందువల్లనే భారత రామాయణాలకే కాదు వేదాలకు కూడా కాల నిర్ణయము చేసి వాటిని క్రీస్తు పూర్వం మూడు వేల యేళ్ళకాలానికో రెండు వేల యేళ్ళ కాలానికో ఆపాదిస్తారు వారు. ఈ క్రైస్తవ కాలమానాన్ని దాటి వారు ఆలోచించలేరు అని అంటారు కరపాత్రి స్వామి. పాశ్చాత్యుల అనర్గళ కల్పనా చాతుర్యం మీద ఆధార పడి ఆలోచించటం మొదలుపెడితే అవతారపరంపర మరియు తీర్థ క్షేత్రాలు మరియు భక్తి పూజా పఠనాదుల విషయాలన్నిటిలో నమ్మకం సన్నగిల్లుతుందనీ వారు ప్రతిదానిని ఆలోచనల వికాసక్రమంలో చేసిన కేవల కల్పనగా భావిస్తారని అంటారు కరపాత్రి స్వామి. వాల్మీకి రామాయణంలో లేని విషయాలు కొన్ని ఇతర ఆర్ష గ్రంథాలలో ఉండటంలో ఆశ్చర్యం ఏమి లేదనీ ఒక వ్యక్తి జీవితకాలంలోని ప్రతీ ఒక్క ఘటన ఒకటే పుస్తకంలో ఉండాలని ఆశించటం సబబు కాదని అంటారు కరపాత్రి స్వామి.

కొన్ని వందల పేజీల పొడుగునా బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు వివిధ విషయాల పైన లోతైన చర్చలు చేస్తారు కరపాత్రి స్వామి. ఇదంతా అయ్యాక రామచరిత్ర సింహావలోకనం అని మరొక అధ్యాయం. ఈ అధ్యాయంలో రామాయణ మీమాంస గ్రంథ సారం అంతా ఇమిడి ఉన్నట్టే. పాశ్చాత్య పండితులకు ముఖ్యంగా యూదులకు క్రైస్తవులకు ముస్లిములకు అవతరవాదంతో పెద్ద చిక్కే ఉందని అంటారు కరపాత్రి స్వామి. ఈ మతానునాయులకు మనుష్య జన్మ అన్నది ఒకసారే అవుతుంది అన్న విశ్వాసం ఉందని వీరు ఏకేశ్వర వాదులని యెహోవా అల్లా ఆరాధకులని వారి “జడ్జిమెంట్ డే” భావనకు వారి స్వర్గ నరక కల్పనకు మన జన్మ పరంపరలు పాపపుణ్య వివేచనల ఆలోచనలకు అసలు పొసగదనీ అందుకనే మన అవతార పరంపర వారికి అర్థమవదని అంటారు కరపాత్రి స్వామి. ఈ పాశ్చాత్య మత సిద్ధాంతాలతోను మనిషి కోతిలో నుంచి పుట్టాడనే వికాసవాద (ఎవల్యూషన్) ఆలోచనలతోను భారతీయ జ్ఞానధారను అర్థం చేసుకోవటం అసాధ్యమని అంటారు కరపాత్రి స్వామి. అయితే ఈ పాశ్చాత్య వికాసవాద ఆలోచనలే ఇప్పుడు ప్రపంచ చరిత్రకు ఆధారశిలలు అయ్యాయి. ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ఈ ఆలోచనలే తెచ్చాయి. అనాది అయిన వేదాలకు 3000 బిసి అనో మరింకేదో అనో కాల నిర్ణయం చేయటం ఈ సిద్ధాంతాల ప్రభావం వల్లనే మొదలయ్యింది. ఉపనిషత్తులు క్షత్రియులు రాశారు.బ్రాహ్మణాలు వేదములో అంతర్భాగాలు కావు. ఇటువంటి ఆలోచనలన్నీ కేవలం ఒక శతాబ్ద కాలంలో ప్రచారంలోకి వచ్చినవని అంటారు కరపాత్రి స్వామి. రామాయణంలో రామభక్తితత్వం అన్నది అదిరామాయణ రచనా కాలానంతరం కృష్ణ భక్తి ప్రభావం మూలాన వాల్మీకి రామాయణంలో ప్రక్షిప్తం అయ్యిందన్న వాదన గురించి గాఢమైన వ్యాఖ్యలు చేసారు కరపాత్రి స్వామి. ఐతే ఈ క్రమంలో ఒక గొప్ప మాట అంటారు. నిజానికి రామచరిత పైన కృష్ణచరిత్ర ప్రభావం ఉండటం అన్నది ఒక దృక్కోణంలో చూస్తే సరి అయినదే అని ఐతే అది బుల్కె వంటి పాశ్చాత్య మేధావుల ఊహకు అందని విషయమని అంటూ ఇలా అంటారు. సనాతన సిద్ధాంతం ప్రకారం కృష్ణుడి ముందు రాముడు ఉన్నట్టే రాముని ముందు కృష్ణుడు కూడా అవతరిస్తాడు ఎందుకంటే ఇదంతా అనాది అనంతమైన అవతార పరంపర అని. నాకు చాలా నచ్చింది ఈ మాట.

ఇది కాక రామచరిత్రను ఉద్దేశించి గణేష్ చంద్ర జోషి రాసిన పుస్తక ఖండన గురించి మరొక అధ్యాయం. ఇందులో రామసేతువు గురించి, రామాయణ కాలం నాటి భారత భౌగోళిక పరిస్థితుల గురించి, ఆ కాలపు వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను గురించి ఇతరత్రా ఎన్నో విషయాలను గురించిన విశేషాలు ఉన్నాయి.

రామాయణాన్ని చారిత్రక దృష్టితో వర్ణిస్తామని రకరకాల వక్రభాష్యాలు చేసే మేధావులు వేదాది శాస్త్ర ప్రమాణాన్ని ఒప్పుకోరు. అసలు వాళ్ళు వాల్మీకి రామాయణాన్నే ప్రమాణంగా ఒప్పుకోరు వారిని ఎవరూ సమాధాన పరచలేరు. రామాయణాన్ని కూలంకషంగా చదివి అర్థం చేసుకుని ప్రమాణ భావం ఉన్నవాడెవడు కూడానూ రామ రావణ యుద్ధంలో ఆర్య ద్రావిడ వైరాన్ని దర్శించలేడు. రావణ జన్మ వృత్తాంతం అదే రామాయణంలో ఉన్నప్పుడు సందేహానికి తావేది అసలు? నిజానికి ఆధునిక చరిత్రకారుల ఊహలో రాముడికి స్థానం లేదు. వారి ప్రకారం ఈ చరిత్ర అంతాను క్రీస్తు పూర్వం మూడువేల లోపే కుదించబడింది అప్పుడందులో రాముడికి రావణుడికి ఇరువురికి స్థానం లేదు అంటారు కరపాత్రి స్వామి. కాబట్టి ఇది ఉత్తర భారతీయులు దక్షిణ భారతం పైన చేసిన దాడి అన్న ఆలోచనలు నిష్ప్రమాణమైన ఆలోచనలు. ఇటువంటివన్నీ వృథా ప్రేలాపనలు వీటికి అసలు రామాయణంలోనే ప్రమాణం లేదు అని ధృవీకరిస్తారు కరపాత్రి స్వామి.

ఈ పుస్తకం గురించి ఒక వ్యాస పరంపరే వ్రాయవచ్చును గంటలకొద్దీ చర్చించుకోవచ్చును. ఇది కేవలం ఒక చిన్న పరిచయ వ్యాసం మాత్రమే. మళ్ళీ మళ్ళీ చదవలసిన పుస్తకం ఇది. అయితే తెలుగు అనువాదం ఉండి ఉంటే తెలుగు దేశాలలో ఈ సాహిత్యానికి మరికొంత ప్రచారం లభించేదేమో. ఇటువంటి రచనలు తెలుగులో రాసిన వారెవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. అయితే కరపాత్రి స్వామి నుంచి ఈ తరం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అది పాశ్చాత్య తత్వవేత్తల సాహిత్యం అయినా సరే లేదా క్రైస్తవ మిషనరీల పుస్తకాలో లేదా మార్క్సిస్టు పుస్తకాలైనా సరే ఆయన చదివి ఆకళింపు చేసుకొని వైదిక దృక్కోణంతో వాటిని పూర్వపక్ష దృష్టితో విశ్లేషించారు. ఇప్పటికాలానికి చెందిన ఆధునిక హిందువులకు కరపాత్రి స్వామి లాగా వేదశాస్త్ర పాండిత్యం లేకపోయినా కూడా కనీసం ఆయన వదిలి వెళ్ళిన సాహితీ సంపదను చదివి అర్థం చేసుకోటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రాచీన గురు పరంపరకు మనం ఆ విధంగానైనా ఋణం చెల్లించినట్టే. అలాగే ఇదివరకే హిందూ ధర్మం విషయంలో నిశ్చితాభిప్రాయాలు కలిగి రకరకాల విద్వేష భావాలూ సంస్కరణాభిలాష ఉన్న వారు కూడా ఈ సాహిత్యాన్ని చదవచ్చును. వారికి కూడా పూర్వపక్షం చేయటానికి పనికివస్తుంది ఈ ప్రామాణిక గురువాణి.

***

రామాయణ మీమాంస

రచన: కరపాత్రి స్వామి

ప్రాప్తి:

https://www.flipkart.com/ramayan-mimansa/p/itm5a6b0a75b0894

పుటలు: 980

వెల: ₹ 600/-

మరొక వెర్షన్:

https://www.exoticindiaart.com/m/book/details/book/ramayana-mimamsa-NZA485

పుటలు: 1045

వెల: ₹ 795/-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here