[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. శాపగ్రస్తులు!
[dropcap]ఆ[/dropcap] పత్రికా కార్యాలయంలో సత్యసంధుడైన సత్యారావు పెళ్ళి ఒక పెద్ద సంచలనమైపోయింది. క్యాంటీన్‌లో, కారిడార్లలో, సంపాదక సమావేశాలు ఆలస్యమైనప్పుడూ.. ..సత్యారావు పెళ్ళే ప్రపంచ వింతల్లోకెల్లా వింతగా అంతా చెప్పుకుంటున్నారు. అందరూ తాము ముద్దుగా HR (Honest Rao) అని పిల్చుకునే సత్యారావు ఆ సంస్థలో భారీ చర్చనీయాంశమయ్యాడు. ఎందుకంటే, అతను అందగాడు, పొడగరి కూడా.
ఒక పదిహేనేళ్ళక్రితం ..
అప్పుడే జర్నలిజంలో పి.జి డిప్లొమా చేసిన సత్యారావుకి ‘ఈ ఉదయం’ పత్రికలో ట్రైనీ రిపోర్టర్‌గా ఉద్యోగం వచ్చింది. అతని శిక్షణాకాలంలో అతనికి తర్ఫీదు ఇచ్చిన సీనియర్ త్యాగరాజు. త్యాగరాజు ఉద్యోగంలో చేరిన కొంతకాలానికే, అతన్ని పత్రిక యాజమాన్యం రిపోర్టర్‌గా ఊరిమీదకి పంపింది. మూడేళ్ళకే అతని భార్య విడాకులు ఇవ్వకుండా ఊరొదిలి వెళ్ళిపోయింది. అయినా త్యాగరాజుకి పెద్దగా బాధ అనిపించలేదు.
ఈ విషయం గురించి చాలా సార్లు సత్యారావు ‘గురు’ త్యాగరాజుని అడుగుతూ వచ్చాడు. కాని త్యాగరాజు నవ్వేసి ఊరుకునేవాడు.
రిపోర్టర్‌గా ఉద్యోగంలో స్థిరపడగానే, మొదటిసారిగా HR అనబడే సత్యారావుకి ఓ పెళ్ళి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. గురువుగారిని సలహా అడిగాడు.
“నీకు అప్పుడే పెళ్ళేంటయ్యా?” అన్నాడు ‘గురు ‘ త్యాగరాజు.
“అదే నాకూ తెలియదు సర్. మా బామ్మ పట్టుబట్టింది.”
“అంతేనయ్యా, ఏ ఇంట్లోనయినా బామ్మలు, తాతయ్యలే ఇలా పట్టు పట్టి, పెళ్ళిళ్ళు కుదిర్చి, ఊపిరి పీల్చుకుంటారు. పెళ్ళయ్యాక మన ఊపిరి మనం పీల్చుకోవటానిక్కూడా మనకి అధికారం ఉండదు… నీ ఖర్మ!…అయితే, నువ్వు పాటిస్తానంటే నీకు ఒక మంత్రకథ చెబుతాను. నువ్వు నిజాయితీగా ఆ అమ్మాయికి ఈ కథ చెప్పు. ఆ అమ్మాయి, ఈ కథ విని కూడా పెళ్ళికి ఒప్పుకుందంటే, వెంటనే చేసేసుకో. ఒప్పుకోలేదనుకో …’
“ఆ… ఒప్పుకోకపోతే..?”
“ఎలాగూ చేసుకోలేవు కదా!” ఫెళ ఫెళా నవ్వాడు గురు.
ఆ కథ విని హెచ్చార్ ఆశ్చర్యపోయాడు.
“అలా జరిగిందా గురువుగారు?”
“ఆ అమ్మాయికి చెప్పి చూడవయ్యా.”
పెళ్ళి చూపుల్లో ఆ అమ్మాయి నచ్చిందనిపించి, మేడమీదకి తీసుకెళ్ళి కబుర్లాడుతున్నప్పుడు, హెచ్చార్ నిజాయితీగా ఆ కథ చెప్పాడు. అంతే! ఆ పెళ్ళివారు “పొరబాటయిందండీ. మాకో దూరపు మేనరికం ఉంది… విచారిస్తున్నాం” అని చెప్పి ఫైలు మూసేశారు.
“విచారించకోయీ… విశ్వం చాల విశాలమైనదోయీ..” అంటూ గురు ఓ షాయిరీ చదివాడు.
“ఓహో, అలాగా” అనుకున్నాడు హెచ్చార్.
అప్పట్నుంచీ మరో పదిహేనేళ్ళలో హెచ్చార్‌కి వచ్చిన సంబంధాలకి స్వర్ణోత్సవం జరిగిపోయింది. కాని పెళ్ళికాలేదు. ఈలోగా మీసంలో ఒక తెల్ల వెంట్రుక కనుపించింది. ఆఫీసులో పెళ్ళయిపోయిన అమ్మాయిలంతా, హెచ్చార్ ఎదురుపడగానే, జాలిగా చూసేవారు. పొరబాటున ఎప్పుడన్నా క్యాంటీన్‌లో హెచ్చారు ఒంటరిగా కనబడితే,
“విచారించకు, హెచ్చారూ, నీకంటూ ఓ మంచి అమ్మాయిని దేవుడు పుట్టించే ఉంటాడు” అని సాంత్వన వచనాలు పలికేవారు. హెచ్చార్‌కి కడుపు మండిపోయేది. “ఎప్పుడు పుట్టించాడు? నిన్నా, మొన్నా? నా పెళ్ళిచూపులు ఎప్పుడు? ఎక్కడ?…” అని ఆ మంటని కక్కేసేవాడు.
అంతలో…. అకస్మాత్తుగా పెళ్ళి కుదిరిపోయింది. ఎగిరి దూకేస్తూ, గురు త్యాగానికి చెప్పాడు. గురు నిర్ఘాంతపోయాడు..
“ఆ మంత్ర కథ చెప్పావా?” అని అనుమానంగా అడిగాడు.
“నాకా అవకాశం రాలేదు.”
“మరి ?”
“ఏ జరిగిందంటే …” అంటూ తన పెళ్ళిచూపుల సినిమా చెప్పేశాడు.
ఆ అమ్మాయి (సత్యవాణి) కన్నా హెచ్చార్ నాజూగ్గా ఉన్నాడు. అయినా సత్యని నచ్చుకున్నాడు. ఈసారి చూపుల్లో వాళ్ళింటి పెరట్లోకెళ్ళి మాట్లాడుకుంటుంటే ఆ సత్య ఓ కథ చెప్పింది:
“రావణ సంహారం జరిగిపోయాక, రాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు, ఓ సాయంత్రం సీతాదేవి అంతఃపుర ఉద్యానవనంలో స్వేచ్ఛగా విహరిస్తూన్న యువదంపతుల్ని చూసి, వెంటనే రాముడిని పిలిచి చూపించింది. ‘నువ్వు రాజువి అయిపోయాక అలా స్వేచ్ఛగా మనం విహరించలేం కదా!’ అని అడిగింది.
రాముడికి తన సీత బాధ అర్థమైంది. ‘నీకిదే నా వరం. రేపు సాయంత్రం మనిద్దరం, భూతలస్వర్గంలాంటి ప్రకృతిమధ్య, పక్షులు, పూలూ తప్ప నరసంచారం లేని చోట విహరిద్దాం. ఆ తరువాత ప్రతిసాయంత్రం ఆ అనుభూతి నీకు తలపుకొచ్చి, అప్పుడే అనుభవిస్తున్న ఆనందాన్ని కలిగిస్తుంది’ అని అభయం ఇచ్చాడు.
ఆ ప్రకారం, మర్నాడు సాయంత్రం వాళ్ళిద్దరూ అణువణువునీ పరవశింపజేసే ప్రకృతిలో మమేకమై ఉండగా, సీత రాముడిని దూరంగా తోసేసింది. ‘నువ్వు, నేనూ తప్ప నరులెవ్వరూ ఉండరన్నావు. కాని ఎవడో అక్కడ తచ్చాడుతున్నాడు రామా…’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాముడు కోపంగా ‘ఎవరక్కడ?’ అనగానే ఒకాయన వీణ తగిలించుకొని వచ్చాడు. రాముడి క్రోధాగ్నికి భయపడి, ఆయన చెప్పాడు: ‘మహాప్రభో, నన్ను నారదుడు అంటారు. ముల్లోకాలూ తిరిగి వార్తలు సేకరించి, మళ్ళీ ముల్లోకాలకూ చేరవేయటం నా ఉద్యోగ ధర్మం ప్రభూ..’
అంతే! ‘ఓరీ, నీ ఉద్యోగధర్మం పేరుతో మా ఈ అపూర్వ, అపురూప సాయంత్రాన్ని భగ్నం చేశావు కనుక, కలియుగంలో పాత్రికేయుడివై పుట్టి, ప్రతి సాయంత్రం ఇలాగే ఉద్యోగధర్మంలోపడి కొట్టుకుంటూ, భార్యా పిల్లలతో సినిమాలూ, షికార్లూ లేని మహత్తర జీవితాన్ని అనుభవింతువుగాక అని శపించాడు’…ఆ శాపం వల్లనే నేను కూడా ‘ఈ సాయంత్రం’ పత్రికలో ఉపసంపాదకురాలిగా పనిచేస్తున్నా.. “
గురు త్యాగం విస్తుపోయాడు.
“నా కథ ఎలా లీకయిందబ్బా ?”
“మీ పాత శ్రీమతిగారి కూతురే సర్ ఈ అమ్మాయి.”
“ఆ..!!!”
2. అమ్మ, ఓ చెత్తకుండీ!
కపిల్ దేవ్ ఆ రోజు మాత్రం అమ్మ మీద బాగా రెచ్చిపోయాడు.
“ఎప్పుడు చూసినా చద్దన్నంతో పులిహోర… చద్దన్నంతో దద్ధోజనం … లేకపోతే మాగాయ.. చింతకాయ..! తినలేక చస్తున్నా నీ వంటలూ నువ్వూను…” అంటూ తింటూన్న అన్నం కంచాన్ని దూరంగా విసిరేసి లేచి, విసురుగా బయటకెళ్ళిపోయాడు కపిల్.
అమ్మ తులసమ్మ మనసు మళ్ళీ గాయపడింది.
అప్పుడే వెళ్ళారు ఆ ఇంటికి శేషయ్య. కళ్ళతో జరిగింది చూశారు.
“ఏమ్మా, మీ వాడు ఇవ్వాళ మరీ రెచ్చిపోతున్నట్లున్నాడు?” శేషయ్య ప్రశ్న.
తులసమ్మ సిగ్గుపడింది.
“కొత్తగా ఏమీ లేదు అన్నయ్యగారు… ఎప్పుడూ ఉండేదే.” ఈ మాట అంటున్నప్పుడు గొంతు సరిగ్గా పెగల్లేదు. కొంచెం తమాయించుకుని, నోరు విప్పింది.
“సాధింపులు ఎక్కువయ్యాయి అన్నయ్యగారూ. బట్టలు సరిగ్గా ఉతకటం లేదంటాడు. ఆ బట్టలు తెచ్చి నా మొహాన పడేస్తాడు. ..తిపూటా వేడివేడిగా ఉంటేనే తింటానంటాడు… అన్నం ఒక్క ముద్ద తక్కువయినా సాధిస్తాడు… ఇంజినీరింగ్ పూర్తయి ఏడాది కావస్తున్నా, మంచి ఉద్యోగం రాలేదంటే కారణం నేనేనట… నేను ఎదురొచ్చాననే, ఒక మంచి ఉద్యోగం చేతికి అందినట్లే అంది జారిపోయిందని ఒకటే తిట్లు… ప్రతి చిన్న విషయంలోను నా అజ్ఞానాన్ని ఎత్తిచూపిస్తుంటాడు… నేను సవతి తల్లిలాగా చూస్తున్నానంటూ సాధిస్తాడు.. వాడి వస్తువు ఏది కనబడకపోయినా, ‘దాన్నెక్కడ తగలేసావే’ అంటూ కోపంతో అరుపులు, కేకలు. చొక్కా చిరిగిపోతే ‘కుట్టి చావు’ అంటూ దాన్ని తెచ్చి విసిరేస్తాడు..”
“మరి మా రామం.. అదే మీ ఆయన, వాడికి మచీ చెడూ ఏమీ చెప్పడా?”
“ఆయన చెప్పి చెప్పి విసిగిపోయారు. ఒకడే కొడుకు గదాని అతి గారాబం చేశాం. ఫలితం ఇది. అమ్మ అంటే, వాడికంటికి ఒక చెత్తకుండీలా కనుపిస్తోంది….” అంటూ ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది తులసి.
శేషయ్య మాత్రం ఏం చేయగలరు?
కాని ఒక మాట అన్నారు.
“అమ్మా, ఉద్యోగం రాలేదన్న నిరాశ, నిస్పృహ కూడా ఇందుకు కారణం కావచ్చు. చూద్దాం. నేనూ ఓ ప్రయత్నం చేస్తాను” అంటూ లేచారు శేషయ్య.
***
నాలుగు రోజుల తరువాత, రామానికి ఫోన్ చేసి,, కపిల్ కి ఒక ఉద్యోగం చూశాననీ, ఒక సారి తనదగ్గరికి పంపిస్తే, వివరాలు చెబుతాననీ చెప్పారు.
ఆ సాయంత్రం కపిల్ వచ్చి శేషయ్యని కలిశాడు.
“నమస్తే అంకుల్. మీరేదో ఒక ఉద్యోగం గురించి చెప్పారట…”
“అవునయ్యా. ఒక పెద్ద పెయింట్స్ కంపెనీ వాళ్ళకి కెమికల్ ఇంజినీరు కావాలిట. నీ వివరాలు పంపాను. కరోనా తగ్గాక తప్పకుండా తీసుకుంటామని ఆ సి.ఇ.ఓ చెప్పాడు…”
కపిల్ మొహం వికసించింది.
“చాల థాంక్స్ అంకుల్…అయితే నేను వాళ్ళని మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కలవాలి..”
“చెబుతాను. అయితే వాళ్ళు, తమ కంపెనీ ‘పరిశ్రమల సామాజిక బాధ్యత’ (Corporate Social Responsibility) క్రింద ఈ నగరంలోని ఒక పెద్ద మాతా శిశు సంరక్షణాలయాన్ని ఎంచుకున్నారు. అక్కడ పేద కుటుంబాలలో నెలలు నిండిన ఆడవాళ్ళని కానుపుకి ఒక నెలముందుగా చేర్చుకొని, కానుపు జరిగాక నెల తరువాత ఇంటికి పంపిస్తారు. అది ఎలా పనిచేస్తోందీ, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయీ… వగైరా అన్నీ ఒక నెల పాటు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వటానికి ఒక మనిషి కావాలన్నారు. నీ పేరే ఇచ్చాను. అభ్యంతరం లేదు కదా?”
కపిల్ తొట్రుపాటు పడ్డాడు. “అబ్బె. అదేమీ లేదు అంకుల్. అయినా, మా నాన్నగారికి మీరంటే చాలా గౌరవం. మీ మాట కాదంటానా? …అలాగే చేస్తాను అంకుల్. ఆ కాంటాక్ట్ నుంబరు ఇవ్వండి” అంటూ వినయంగా అడిగాడు కపిల్.
***
నెల తరువాత కపిల్ వచ్చి శేషయ్యని కలిశాడు.
“అంకుల్, నేను ఆ కంపెనీకి ఓ వారం క్రితమే నా నివేదిక ఇచ్చాను …”
“అభినందనలయ్యా కపిల్. వాళ్ళకి నీ నివేదిక బాగా నచ్చింది. నీ నిశిత అధ్యయనాన్ని వాళ్ళు బాగా మెచ్చుకున్నారు. ఇంతకీ, నీ అధ్యయనం విశేషాలు ఏం రాశావేమిటి? సారాంశం చెప్పు. “
కపిల్ ఆనందపడ్డాడు. కాని అంతలో దిగులుపడ్డాడు.
“అంకుల్, వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నెలలు నిండినవాళ్ళకి పక్క సదుపాయం లేదు. వాళ్ళు ఎలా పడితే అలా కూర్చోలేరు కదా! అందుకు తగిన ప్రత్యేక కుర్చీలు లేవు… వాళ్ళకి నోటికి ఏదిపడితే అది సయించదు కదా! కాని వాళ్ళకి రుచించటం కోసం అని వంటలు వండరు. పోషకపదార్ధాలు అంటూ చప్పగా ఉండే ఏది వండితే అదే తినాలి… ఇంకా, కానుపు జరిగాక, శిశువులకి డైపర్లు లేవు. ప్రతి తల్లీ తన పిల్లలు పక్కలో తడిపేసిన బట్టల్ని ఉతుక్కొని ఆరేసుకోవాలి… ఎంత దుర్భరం? మనసు వికలమైపోయింది అంకుల్. ఇంకా …”
శేషయ్య అతన్ని ఆపారు. చిన్నగా చెబుతున్నారు.
“..ఒక స్త్రీ గర్భం దాల్చిన దగ్గర్నుంచి శిశువుకి ఊహ వచ్చే దాకా, కడుపులో బిడ్డకోసం తనకిష్టమైనది తినలేక, తాగలేక, సరిగా కూర్చోలేక, పడుకోలేక, కానుపులో మరణం అంచులదాకా వెళ్ళివచ్చి, కానుపు తరువాత కూడా తన తిండి, నిద్రకంటే తన శిశువు మలమూత్రాలు శుభ్రం చేయటం, ఆకలి పట్టించుకోవటం కోసమే జీవిస్తూ ఉంటుంది కదా!”
“సరిగ్గా చెప్పారు అంకుల్” అంటూ కపిల్ సంభ్రమంతో చూశాడు.
“మాసి మాసి కృతం కష్టం, వేదనా ప్రసవేషు చ;
తస్యనిష్క్రమణార్ధాయ మాతృపిండం దదామ్యహం’..
ఇది వాయుపురాణంలోని ఒక శ్లోకం. అన్ని కష్టాలు పడి పెంచే తల్లిరుణం తీర్చుకోలేం కనుక, ఆమె మరణానంతరం మాతృగయలో ఇలా పదహారు శ్లోకాలు చెప్పి, పిండాలు వదలాలి అని శాస్త్రం చెబుతోంది… అలాంటి తల్లిని ఒక చెత్తకుండీలా ఎలా చూడగలుతున్నావు కపిల్?”
కపిల్‌కి చెళ్ళున కొరడాతో కొట్టినట్లనిపించింది. సిగ్గు, బాధ, పశ్చాత్తాపం అతన్ని చుట్టేశాయి…!
తులసమ్మ మళ్ళీ ఎప్పుడూ కొడుకు కారణంగా కంటతడి పెట్టలేదు.