ప్రేమించే మనసా… ద్వేషించకే!-4

0
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“ఛీ…[/dropcap] ఛీ… నా కడుపున యిద్దరు చెడపుట్టారే! తిరిగి చెడింది అది. తిరక్కుండానే చెడింది నువ్వూ. ఇంట్లో కూర్చుని బుద్ధిగా వున్నావు, నీలాంటి అణకువ గల కూతురు ఉండటం నా అదృష్టం అనుకున్నానే యిన్నాళ్లు! కాని నువ్వు ఆ క్రిస్టియన్‌ని ప్రేమిస్తావా? తరతరాలుగా మన తాతముత్తాల నుండి ఇలాంటి మచ్చలు ఎవరూ తీసుకురాలేదు. దరిద్రపు ముఖాల్లారా, ముందు నా ఎదురుగా కనిపించకండి. నాకు మీ ముఖాలు చూపెట్టకండి. కాని నేను మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్పగలను. ఆరు నూరయినా, నూరు ఆరయినా నేను మాత్రం చస్తే ఈ పెళ్ళిళ్లు ఒప్పుకోను. మీ యిద్దరి కాళ్ళ విరగొట్టి మెడలు వంచి నేను అనుకున్న సంబంధాలు చేస్తాను. మీరిద్దరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి.”

“సుజాతా ఇక మీదట వాడితో మాట్లాడటం కాని, వాడితో ఎటువంటి సంబంధ భాంధవ్యాలు పెట్టుకోవటం గాని చేసావో వాడి ప్రాణాలు నీ ప్రాణాలు కలిపి తీస్తాను. వంశ మర్యాదలు మంట గలుపుతారే!”

“ఏమే నిన్నే. ఈ గుమ్మం దాటి ఆ క్రిస్టియన్‌ని కలుసుకోటానికి ప్రయత్నించావో, నీ అక్కకు పట్టే గతే నీకూ పడుతుంది. వాడికీ పడుతుంది. జాగ్రత్త” అని డైనింగ్ టేబుల్ దగ్గర్నుండి విసురుగా వెళ్లిపోయారు.

“అక్కా!” అని బావురుమంది సమత. చిన్న పిల్లలా ఏడుస్తున్న సమతను చూస్తే జాలితో నిండిపోయింది సుజాత మనసు. ‘సమతా’ అని చెల్లెలు చేయిపట్టుకొని గదిలోకి తీసుకెళ్లింది సుజాత.

దుఃఖం పొంగి పొరలుతుంటే నోటికి అడ్డంగా పమిట పెట్టుకొని ఉండి ఉండి వెక్కి వెక్కి ఏడుస్తున్న సమతను ఎలా ఓదార్చాలో తెలియని దానిలా వీపు మీద చేయి వేసి నిమరసాగింది సుజాత.

నిముషాలు దొర్లుతున్నాయి.

“ఎంత పని చేసావు సమతా! నేను ఇలా అనడం నీకు ఆశ్చర్యంగాను, బాధగాను ఉండవచ్చు! నేను చేసిన పని నీవు చేస్తే తప్పు చేసావు అని అంటున్నందుకు…”

“కాని… నేను అన్నీ తెలిసి…. నాలుగు ముక్కలు చదివి విజ్ఞానం సంపాదించినా డాడీ ఆచార వ్యవహారాలు అన్నీ తెలిసీ మూర్ఖంగా ప్రవర్తించినందుకు నేను ఈ రోజు నిజంగా బాధ పడుతున్నాను. ఎంత పొరపాటు చేసానో యిపుడు కొట్టవచ్చినట్లు కనపడుతుంది. నా తోబుట్టువైయుండి నీవు నేను అనుభవిస్తున్న నరకం అనుభవిస్తున్నావంటే నా గుండె బాధతో ముడుచుకుపోతుంది. నేను చేసిన పొరపాటు తాలుకా బాధ నా గుండెను పిండుతుంది. నువ్వు చాలా దూకుడు మనిషివి. మొండిగా పట్టుదలగా మెలిగే తత్వంగాని, నిండు కుండలాంటి మనిషివని నేను అనుకున్నాను. కాని నువ్వు కూడా నాలాగా నరకం అనుభవిస్తున్నావంటే…. ” అని ఆపై మాట్లాడలేని దానిలా కంఠం బొంగురు బోతుండగా మాట్లాడలేకపోయింది సుజాత.

ఏడుస్తున్న సమత చప్పున కళ్ల నీళ్లు తుడుచుకుంది.

“అక్కా” అని నిశితంగా సుజాత కళ్లలోకి చూసింది.

“హృదయానికి ప్రేమంటూ తెలియాలే కాని ఆ ప్రేమతో నిండిన హృదయం ఎన్ని కష్టాలలైనా, ఎన్ని అవకతవకలనైనా ఎదుర్కొనడానికి వెనకాడదక్కా! డాడీయే కాదు డాడీ లాంటి లక్షమంది, కోటిమంది వచ్చినా నిర్ణయం మార్చుకోమన్నా మారదక్కా! ఇక నాన్నగారు నన్ను అన్నందుకు అంటావా, సతీష్ ప్రేమ ముందు ఇవి భరించడం పెద్ద కష్టం ఏం కాదు.”

“ప్రేమించిన హృదయం ఆ ప్రేమ సఫలీకృతం కానపుడు నరకం అనుభవిస్తుంది కాని…. ఎన్ని అడ్డంకులనైనా అవలీలగా ఎదుర్కునే వరం ఆ భగవంతుడిస్తాడక్కా” అంది.

శిలా ప్రతిమలా సమత చెబుతున్న మాటలు వినసాగింది. తన కళ్లెదుటే పుట్టి… తన ఎదుటే ఎదిగిన సమత, నలుగురిలోకి రావాటానికి బిడయపడే సమత, తండ్రి మాటకు ఎదురు చెప్పని సమత, ఎంత ధైర్యంగా ప్రేమ గురించి చెబుతుంది. ఇదేం గమనించనట్లు చెప్పుకుపోతుంది సమత.

“డాడీ ఒక్కరే కాదక్కా! డాడీ లాంటి వాళ్లు ఈ సృష్టి మొదలయినప్పటి నుండి వున్నారు. మనలాంటి వాళ్లు వున్నారు. కాని ఎటొచ్చి ప్రేమంటూ ఇరువురి మధ్యన ఏర్పడిన అనుబంధానికి ఇరువురు పంచుకోటానికి ఆరాటపడుతున్నపుడు డాడీలాంటి వాళ్లు అడ్డు నిలబడటం మామూలే. కాని ఆ మాత్రం దానికే భయపడి ఆ ప్రేమను మధ్యలోనే తెంచుకోవాలని చూసే వాళ్లంటే నాకు భలే కోపం.”

“ఒక విధంగా ఆలోచిస్తే జాలి కూడా! అంత ధైర్యంలేని వాళ్లు అసలెందుకు ప్రేమించకోవాలి? తీరా ప్రేమ అన్న ఒక పవిత్రమైన భావాన్ని మనసులోకి రానిచ్చాక చెరిపేసుకోవాలంటే మనసున్న మనిషికి సాధ్యమేనా! డాడీ నన్ను ఏమన్నా సరే, నేనీ విషయంలో డాడీకి ఎదురు తిరుగుతానక్కా!” అంది.

సమత చెబుతున్న మాటలు మాత్రము మూర్ఖురాలై వింటుంది సుజాత. వయసులో తన కన్నా చిన్నదయినా ప్రేమ గూర్చి ఎంత చక్కగా అవగాహన చేసుకుంది.

తనెంత పిరికిది?

సమత చెప్పింది నిజం!

ఎన్ని అడ్డంకులు ఏర్పడినా భయపడకుండా ఎదురు నిలిచి రెండు హృదయాలు దగ్గరైతేనే ఆ ప్రేమకు నిజమైన నిర్వచనం ఏర్పడుతుంది.

డాడీకి తను ఎదురు నిలబడాలి అన్న మొండి ధైర్యానికి వచ్చేసింది సుజాత.

తెలతెలవారక ముందే మెలకువ వచ్చేసింది సుజాతకు. నిన్న జరిగినది సుదర్శన్‌కు చెబితే, సుదర్శన్ మనసు ఎంత బాధ పడుతుందో? తన నిర్ణయం చెప్పాలి. పరీక్షలు అయిపోగానే తను, సుదర్శన్ వివాహం చేసుకోపోతే డాడీ అనుకున్నంత పని చేయగలడు. ఆలోచనలతో మంచం మీద వుండగానే బాల్కనీలో ఎవరో నిలబడినట్లు కన్పించడంతో మంచం మీద నుంచి తొంగి చూసింది.

సమత!

ఇంత పొద్దున్నే బాల్కనీలో ఎందుకు నిలబడి వుందా అనుకున్న సుజాతకు ఏదో అర్థం అయిన దానిలా పెదాలపై చిన్న చిరునవ్వు మెరిసింది.

‘సమతా! నీ ధైర్యానికి జోహారు! నీ ప్రేమ ఫలించాలని మనసారా కోరుతున్నాను’ అని మనసులోనే అనుకుంది.

మంచం మీద నుంచి లేచి, ముఖం కడుక్కుని, స్నానం వగైరాలన్నీ చకచకా ముగించుకొని కాలేజీకి టైం కాకుండానే అర్ధగంట ముందే బయలు దేరింది సుజాత.

హాల్లోకి అడుగు పెట్టిన సుజాత సోఫాలో పరమేశ్వరరావుగారు కూర్చుని ఉండటం చూసి అడుగులు పడని దానిలా ఒక్కనిముషం నిలబడిపోయింది.

“కాలేజీకి వెళ్లుతున్నట్లున్నావ్! వాడెవడితోనో మాట్లాడటం కాని, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవటం గాని చేయకు. అక్కడ ఏం చేసినా ఇక్కడ నాకు ఏం తెలియదనుకోకు! ఇక వెళ్లు” అన్నారు.

సుజాతకు నోటి వెంట మాట రాలేదు కాని ఎక్కడలేని దుఃఖం వచ్చింది. వస్తున్న దుఃఖాన్ని అదిమి పెట్టాలన్నట్లు మునిపంటితో పెదవిని నొక్కి అడుగులు వేసింది.

ఇంట్లో జరిగినదంతా సుదర్శన్‌కు చెప్పింది సుజాత. సుదర్శన్ ముఖం బాధతో నిండిపోయింది.

“సుజీ! మరి!… మీ డాడీ పట్టుదల చూస్తుంటే మనం ఒక్కటయ్యేటట్లు లేదు… నువ్వు నువ్వు నా గురించి ప్రేమ పిచ్చోడనుకున్నా ఏమనుకున్నా సరే, అలాగే జరిగే పక్షంలో ఈ సుదర్శన్ బ్రతకడు సుజీ! ఈ నిజం నా మనసుకు తప్ప వేరెవరికీ తెలియదు” అన్నాడు.

చివరి మాటలు అంటున్నపుడు బొంగురు పోయింది సుదర్శన్ కంఠం.

తన ఉనికిని తను మరచిన దానిలా మాట్లాడకుండా అలా వుండిపోయింది. సుదర్శన్‌ ప్రేమ తలచుకుంటే అనిర్వచనీయమైన భావోద్వేగంతో శరీరం జలదరించింది సుజాతకు.

***

ఇంటి ముదు జనం పోగయి వుండటం చూసి, కారణం తెలియకుండానే సుజాత గుండెలు ఎందుకో దడదడలాడాయి. సమత, సతీష్ పెళ్లి చేసుకొని డాడీ ఆశీర్వాదం కోసం వస్తే…. మొదలు చివర లేని ఆలోచనలతో, తడబడుతున్న అడుగులతో గేటు తీసింది.

హాల్లో చాప మీద ప్రశాంతంగా కళ్లు మూసుకొని పడుకున్నట్లు ఉన్న సమత తలని తల్లి ఒడిలో పెట్టుకొని గుండెలు పగిలేలా ఏడుస్తుంది.

పరమేశ్వరరావుగారు సోఫాలో ఒక ప్రక్కగా కూర్చొని ఉన్నారు. ఉండుండి కుడి చేత్తో నొసలు నొక్కుకుంటున్నారు. కళ్ల ముందు తిరుగుతున్న కూతురు పోయినందుకు విచారమో, దుఃఖమో తెలియదన్నట్లు అతని ముక్కుశిరాలు అదురుతున్నాయి. బలవంతంగా కన్నీటిని ఆపటానికి ప్రయత్నిస్తున్నారేమో జ్యోతుల్లా ఎర్రగా వున్నాయి కళ్లు. చూపు మాత్రం ఎవరికీ అందకుండా ఎటో చూస్తున్నారు. గుండె ఎగిరిపడుతుంది.

“చెల్లి” అంటూ చప్పున తల్లి ప్రక్కన కూర్చొని ‘ఏం జరిగిందమ్మా’ అని ఏడ్వసాగింది సుజాత.

వచ్చిన మనుషులు అందరూ తలొక రకంగా అనుకొని వెళ్లిపోయారు. పరమేశ్వరరావుగార్కి ఆప్తులైన వారు మాత్రం ఏం మాట్లాడాలో తెలియని వాళ్లలా తలలు దించి కూర్చున్నారు.

అసలు సమత ఇలా చేయటానికి కారణం ఏమిటి? ధైర్యం లేనపుడు ప్రేమంటు ఆ పవిత్ర బంధం జోలికి వెళ్లకూడదన్న సమత ఇంత పిరికిగా ఎందుకు ప్రవర్తించింది?

“మీకిది న్యాయంగా వుందా? చెప్పండి? తెలిసో తెలియకో నా చిన్నారి తల్లి అపరాధం చేసిందే అనుకోండి మనం నచ్చచెప్పుకోవాలి కాని ఆ కుర్రాడిని రాత్రికి రాత్రి యిల్లు ఖాళీ చేయిస్తారా?” అని ఎపుడు నోరెత్తి మాట్లాడని పార్వతమ్మగారు సూటిగా భర్త ముఖంలోకి చూసి అనడిగారు.

“నోర్ముయ్! మాటలొస్తున్నేయే? ఆ కిరస్తానీ వాడు దీనికి ఎక్కువైపోయాడా? వాడు దీన్ని చూసి కాదు, దీని డబ్బుని చూసి ప్రేమించాడు. ఆస్తిలో చిల్లిగవ్వ రాదు అని నేను చెప్పబట్టే రాత్రికి రాత్రికి పరారీ అయిపోయాడు. వయసులో వున్న మగవాడు ఆడపిల్లకు దగ్గర కాగానే వాడు ఎందుకు దగ్గరయ్యాడో ఏమిటో ఆలోచించకుండానే ప్రేమ అనే చక్కని పేరు పట్టేయడమేనా? ఛీ!…ఛీ!… వెధవ కాలం ఇంత దారుణంగా మారుతుందనుకోలేదు… అది చేసిన వెధవ పనికి వెనకేసుకొస్తున్నావా? ఇంకో సారి పిచ్చి పిచ్చిగా మాట్లాడావో జాగ్రత్త!” అని కేకలు వేసారు.

పరమేశ్వరరావుగారి కేకలతో నోరెత్తి మాట్లాడకుండా మూగగా రోదించసాగారు పార్వతమ్మగారు.

సుజాతకు ప్రొద్దున్న జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. సమత బాల్కనీలో నుండి ప్రక్కింటి వైపు తొంగి చూడటం…. గుర్తుకొచ్చింది.

ఎంత పని చేసింది తను?తన ఆలోచనలతో కాలేజీ కెళ్లే హడావిడిలో ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. ‘సమతా! ఎంత దారుణంగా నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకున్నావే? అక్కనై వుండి నీ విషయం పట్టించుకోలేని దుర్మార్లురాలిని’. భారమైన మనసుతో మంచం మీద వాలిపోయింది. తలగడ క్రిందటి నుంచి తెల్లటి కాగితం కనబడటంతో గభాలున తీసి ఆతృతగా విప్పి చదవసాగింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here