పల్లె‘టూర్’

0
3

[box type=’note’ fontsize=’16’] పిల్లలన్నా, వారితో సావాసం చేయటమన్నా నాకెంతో ఇష్టం. తరగతి గదిలో, ఆటస్థలంలో, ఇంట్లో, ఎక్కడైనా సరే పిల్లల ఆటపాటలు ఉంటే సందడే సందడి. ఆ సందడి నాకెంతో ఇష్టం. ఉమయవన్ తమిళంలో రాసిన ‘పరక్కుమ్ యానై’ కథలు చదివిన తరువాత అవి బాగా నచ్చి వాటిని మన తెలుగు పిల్లలకు దగ్గరచేయాలనే ఉద్దేశంతో తెలుగులోకి అనువదించాను. అందులోని కథలే మీరిప్పుడు చదువుతున్నది! – రచయిత్రి (అనువాదకురాలు)

~ ~

పన్నెండేళ్ల లోపు పిల్లలకు ఈ పది కథలూ చాలా సరదాగా అనిపిస్తాయి. వీటిలో కల్పన ఉన్నా, పర్యావరణ స్పృహ, సమాజం పట్ల బాధ్యత అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి నీతిని బోధించే కథలు కావు. గంభీరంగా ఉండవు. కాని, చిన్న చిన్న అంశాలతోనే ఎంతో పెద్ద విషయాన్ని పిల్లలకు అర్థమయేట్లుగా, వారు పాటించేటట్లుగా బోధపరుస్తాయి. అదే వీటి విలక్షణత. [/box]

[dropcap]చూ[/dropcap]స్తుండగానే వేసవి వచ్చేసింది. ఇంకేం? పాఠశాలలన్నీ తమ విద్యార్థులందరికీ రెండు నెలల పాటు వేసవి సెలవులు ప్రకటించేశాయి. ప్రొద్దున్నే నిద్ర లేవనక్కరలేదు, స్కూలుకు తయారవనక్కరలేదు – ఈ ఆలోచనలు చంద్రు ముఖంలో చిరునవ్వులను పూయించినై. ఇప్పుడు చంద్రు తన సమయమంతా కూడా తన స్నేహితులతో గడపడానికి, ఆటపాటలకు, సరదాలకు మాత్రమే కేటాయించాలని నిర్ణయించుకున్నాడు.

ఒక రోజు చంద్రు ఉదయం నుండి తన స్నేహితులతో ఆడి పాడి ఆనందంగా గడిపి బాగా అలసిపోయాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ ఒడిలో చేరాడు. వాడి ముఖం చూస్తూనే వాడు ఎందుకో కలవరంగా,  నిస్పృహతో ఉన్నట్లు అనిపించింది వాళ్ళ అమ్మకు. “ఏమైంది కన్నా, ఎందుకలా ఉన్నావు?” అని ఎంతో ప్రేమగా అడిగింది. చంద్రు వెంటనే జవాబు ఇవ్వకుండా ఒక్క క్షణం ఊపిరి బిగపట్టి “అమ్మా, మనమందరం ఒక వారం రోజులపాటు సెలవులలో ఎక్కడికైనా వెళ్దామా?” అని అడిగాడు. ఆమె చంద్రును ప్రేమగా దగ్గరకు తీసుకుని “మీ నాన్నకు నీ మనసులోని మాట చెప్పు, సరేనా? ఒక వారం పాటు వెళ్ళలేకపోయినా ఏదైనా మంచి చూడదగ్గ ప్రదేశానికి అయితే తప్పక వెళదాము. నేను మీ నాన్నతో తప్పకుండా ఈ విషయం చర్చిస్తాను. నిజంగా” అని వాడికి మాట ఇచ్చింది.

ఆ రాత్రికి చంద్రు వాళ్ళ నాన్నగారితో మాట కదుపుతూ అమ్మ ఇలా అన్నది- “చూడండి, మన చంద్రుకు వేసవి సెలవులు మొదలైనాయి. మరి మనమందరం కలిసి ఈ సెలవులలో కొన్నాళ్లు ఎక్కడికైనా అలా తిరిగి వద్దామా? మనకు కూడా కొంత మార్పుగా ఉంటుంది కదా!” ఆమె మాటలకు ఒక్కసారిగా తుళ్లిపడిన నాన్న ఆమె ఆలోచనకు ఎంతగానో సంతోషించాడు. ఆయన అమ్మతో “అసలు నేనే మిమ్మల్ని మన పల్లెకు తీసుకు వెళ్లి ఆశ్చర్యపరచాలని అనుకున్నాను. ఇంతలోకే నువ్వు ఇలా అన్నావు!” అన్నాడు. 

తండ్రి చెప్పిన విషయాలన్నీ వాళ్ళ అమ్మ చంద్రుకి చెప్పింది. తన కోరిక ఇంత త్వరలో తీరబోతున్నదని అమ్మ మాటల ద్వారా తెలిసిన తరువాత చంద్రు సంతోషానికి హద్దులు లేవన్నట్లు ఎగిరి గంతులు వేశాడు.

వాడు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వాళ్ళ పల్లెకు వెళ్ళడానికి చంద్రు, అమ్మ, నాన్న – ముగ్గురూ రైలు బండి ఎక్కారు. కిటికీ పక్కన సీటులో కూర్చున్న చంద్రు చెట్లను, పిట్టలను, ఎన్నెన్నో ఎన్నెన్నో వస్తువులను చూస్తూ అమితమైన ఆనందాన్ని పొందుతున్నాడు. రైలు వేగం పుంజుకున్న కొద్దీ తాను చూస్తున్నవన్నీ అంతే వేగంగా వెనక్కి వెళ్ళినట్లు ఉండటం వాడికి భలే వింతగా, గమ్మత్తుగా అనిపించసాగింది. సమయం గడిచే కొద్దీ ఆకాశంలో దిక్కులు మారిపోతున్న మబ్బులను, సూర్యుడిని చూస్తూనే ఉన్నాడు చంద్రు. అలా సాయంకాలం వరకు ప్రయాణించిన వాళ్ళు ముగ్గురూ చిరుచీకటివేళకు వాళ్ల స్వగ్రామం చేరుకున్నారు. వీరి రాక కోసం స్టేషన్ ముందర వేచి ఉన్న ఒక ఎద్దుబండి వీళ్ళు ముగ్గురూ ఎక్కగానే తాతగారి ఇంటికి బయల్దేరింది. దారి మొత్తం ఎగుడు దిగుడుగా ఉండి బండి అటు ఇటు కుదుపులతో ముందుకు పోతున్నది. అయినా, చంద్రుకి మాత్రం ఆ ప్రయాణం తానెప్పుడూ చేయనిది కావడంతో చెప్పలేనంత ఆనందంగా ఉన్నది.

వాళ్లు ఇల్లు చేరేసరికి చంద్రువాళ్ల నాయనమ్మ ప్లేట్ల నిండా మురుకులు, అరిసెలు, రకరకాల మిఠాయిలు, నోరూరించే రుచులతో వాళ్లకు స్వాగతం చెప్పింది. చంద్రు ఇంటిలో అన్ని గదులు కలయ తిరిగి వచ్చాడు. ప్రతి గదిలో ఒక కిరోసిన్ లాంతరు వెలిగించి ఉంది. అయితే, విద్యుత్ బల్బులు కూడా కనిపించాయి. ‘ఇదేమిటి ఇలా!’ అనుకుంటూ ఉంటే నాయనమ్మ వాడి సందేహం తీర్చింది. “పల్లెల్లో ఇరవై నాలుగు గంటలూ కరెంటు సరఫరా ఉండడం సాధ్యపడదు కనుక ఇలాంటి ఏర్పాటు చేసుకుంటామన్నమాట” అని వివరంగా చెప్పింది. ఇంతలో భోజనాల సమయం కావడంతో ఇంటిలోని వారందరూ ఒకేసారి కలిసి భోజనాలు చేశారు. ఇలా భోజనాలు అయినాయో లేదో చంద్రుకు అలా నిద్రపట్టేసింది. పెద్దవాళ్లంతా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుండిపోయారు.

మరునాడు పొద్దున్న తాతగారి గొంతు గట్టిగా వినిపించడంతో చంద్రుకి మెలకువ వచ్చేసింది. ఆయన ఎవరితోనో “నేను వెళ్లి పాలు తీసుకొని ఒక గంటలో వచ్చేస్తాను” అని చెబుతున్నారు. మామూలుగా నగరాలలో అయితే పాలవాళ్లు చీకటితోనే ఇళ్ళ దగ్గరకే పాలు తెచ్చి పోసి వెళతారు. కాని ఇదేమిటి? ఈ పల్లెటూళ్లో ఇలా తాతగారు ఎక్కడికో వెళ్లి పాలు తేవాలా? చంద్రు కిటికీలోనుండి బయటకు చూస్తే ఇంకా సూర్యోదయం కానేలేదు కాని పక్షులు కిలకిలరవాలు చేస్తున్నాయి అప్పటికే.

చిన్నారి చంద్రు మంచం మీద నుండి క్రిందకు దూకి అలా చూసేసరికి వాళ్ళ తాతగారు దొడ్డి వైపున ఉన్న పశువుల కోష్ఠములో ఒక అందమైన, బలమైన, గోధుమవన్నె ఆవు పొదుగు నుండి పాలు పితుకుతూ కనిపించారు. అక్కడ ఇంకా చాలా ఆవులు కనిపించాయి చంద్రుకు. ఒక చిన్న దూడ తన తల్లిఆవు దగ్గర పాలు తాగుతూ ఉండడం గమనించాడు వాడు. చంద్రువాళ్ళ తాతగారు దాని తాడును పట్టుకొని దూరంగా ఉన్న ఒక గుంజకు కట్టేశారు.

చంద్రుకు ఆ దూడను అలా ఎందుకు కట్టేశారో తెలుసుకోవాలని ఆరాటంగా ఉన్నది. తండ్రి దగ్గరకు వెళ్లి ఆవు గురించి చెప్పాడు. తనను చిన్న దూడ దగ్గరకు తీసుకు వెళ్ళమని కూడా గారంగా అడిగాడు చంద్రు. వాళ్ళ నాన్న సరే అని, చంద్రుని వెంట పెట్టుకొని పశువుల కోష్ఠం వైపు నడుస్తూ “చూడు చంద్రు, మనం ఈ పశువులను దూరం నుంచి మాత్రమే చూడడం మంచిది. ఎందుకంటే పశువులకు మనం అలవాటు అయ్యేసరికి కొంత సమయం పడుతుంది. అర్థమైందా” అని చెప్పాడు.

చంద్రు ఆవుల పాలు పాత్రలో అంత వేగంగా ఎలా పడుతున్నాయో కనిపించేంత దూరంలో నిలబడి చూడసాగాడు. పాలను పొదుగులో నుండి పిండడం ఎలా ఉంటుందో వాడెప్పుడూ చూడలేదు, అసలు వాడికి తెలియదు! వాడలా చూస్తుండగానే తాతగారు బకెట్లన్నీ పాలతో నింపేశారు. రెండు బకెట్ల నిండా స్వచ్ఛంగా, నురుగతో కూడిన పాలతో వీళ్ల దగ్గరకు వచ్చారు. చంద్రుకు ఆవు పొదుగు నుండి పాలు పితకడం ఎలాగో వివరంగా తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నది. అందుకే వాడు తాతగారిని తనకు ఆ విషయాలన్నీ చెప్పమని కోరాడు. తాతగారు వెంటనే ఒప్పుకొని చంద్రుతో ఓపికగా ఇలా చెప్పసాగారు –

“పాలు పితకడానికి వెళ్లేముందు మనం మన రెండు చేతులకు నూనె రాసుకోవాలి. ఎందుకో తెలుసా? ఆవు పొదుగు చాలా సున్నితంగా ఉంటుంది. మన చేతుల గరకుదనం ఆవు పొదుగుకు ఎటువంటి గాయం చేయకూడదు. నా చేతులు, వేళ్లు చూడు ఎలా తిప్పుతున్నానో! ఇలా పొదుగు నుంచి ఆవుకు ఎంత మాత్రమూ ఇబ్బంది కలుగకుండా పాలు పితకాలి, తెలిసిందా?” ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ నడుస్తూ వుండగానే ఇల్లు వచ్చేసింది. నాయనమ్మ వేడి వేడి కాఫీతో వాళ్ళను స్వాగతించింది.

చంద్రు ఆ ఉదయం గమనించిన ఇంకో కొత్త సంగతి ఏమిటంటే ఇంట్లోవాళ్లు అందరూ వేపచెట్టు పుల్లలతో పండ్లు తోముకున్నారు. కుతూహలం ఆపుకోలేని చంద్రు తాతగారిని “ఎందుకు మీరంతా పండ్లు తోముకోవడానికి వేపపుల్లలని వాడుతున్నారు తాతయ్యా?” అని అడిగేశాడు. తాతగారు “వేపపుల్లలు ఏ రకమైన రసాయనాలతో తయారు చేసినవి కావు, అందుకని అవి వాడతాం. నగరాలలో మీరు ఉపయోగించే టూత్ పేస్టులన్నీ రసాయన పదార్థాలతో చేసినవే. కాని వేపపుల్లలు సహజమైనవి. అందుకే మన దేశంలోని అన్ని పల్లెల్లోనూ ప్రజలు ఎప్పుడూ వేపపుల్లలతోనే దంతాలను శుభ్రం చేసుకుంటారు” అని చంద్రుకు వివరంగా చెప్పారు.

ఇక స్నానాలు చేసే సమయంలో మరో కొత్త విషయం తెలుసుకున్నాడు చంద్రు. బావిలో నుండి చేదతో నీరు తోడుకుని అవే తమ శరీరంపై అలా పోసుకుంటున్నారు. తాతగారు చంద్రు అడగక ముందే వాడివంక నవ్వుతూ చూసి “బావిలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఆ నీటిని స్నానానికి వాడతాము. బావినీరు వేసవిలో చల్లగాను, చలికాలంలో వెచ్చగాను ఉంటుంది తెలుసా? మేమెప్పుడూ సబ్బు ఉపయోగించము. ఇదిగో ఈ పొడి చూడు” అన్నారు. మట్టి రంగులో ఉన్న పొడిని అయిష్టంగా చూస్తున్న చంద్రుకి “ఇది మట్టి కాదు, శరీరం శుభ్రపరచుకోవడానికి సహజమైన చిరుధాన్యాల గింజలు దంచి చేసిన పొడి అన్నమాట” అని వివరించారు తాతగారు.

తరువాత చంద్రువాళ్ళ నాన్నగారు ‘గ్రామంలో అలా తిరిగి వద్దాం పద’ అంటూ తీసుకువెళ్లారు. దారిలో నాన్నగారు చంద్రకు ఒక పెద్ద బావి ఎదురుగా ఉన్న పంపు సెట్టును చూపించారు. ఆ పంపుసెట్ తన వెడల్పాటి ముఖంతో చుట్టూ ఉన్న పొలాలనన్నిటినీ ఆ బావి నీటితో తడుపుతూ ఉన్నది. “మా చిన్నతనంలో ఇలాంటి పంపుసెట్లు ఉండేవి కాదు. ఇలా యంత్రాలు, కరెంటుతో పొలానికి నీళ్లు పెట్టడం మాకు  తెలియనే తెలియదు. బావుల నుండి చెక్క బాల్చీతో నీళ్లు తోడటం, ఆ నీటిని పొలంలోకి చేదలతో పంపటం చేసేవాళ్లము. ఈ మోటార్ల వల్ల ఇప్పుడు అంత కష్టం లేదులే. మీకు ఇలాంటి పనులు చేతకావని నేను పందెం పెట్టగలను” అని చెబుతూ ఉంటే చంద్రు ఎంతో ఆశ్చర్యంగా వింటూ నడుస్తున్నాడు.

ఇలా తండ్రీకొడుకులు నడుస్తూ నడుస్తూ చెరకు తోటలు, కొబ్బరి తోపులు, పసుపు పొలాలు దాటుకుంటూ వరి పండే పొలాల వద్దకు చేరుకున్నారు. ఇప్పుడు సరిగ్గా పంట కోతలు కోసే సమయం. అక్కడ ఎవరిని చూసినా పంట కోసే పనిలో మునిగిపోయి ఉన్నారు. కొంతమంది ధాన్యపు కంకులను కట్టలు కట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరికొంతమంది రాల్చిన వరికంకులని పక్కకు పెట్టి రాలిన ధాన్యాన్ని మరలో పోసి ఆడిస్తున్నారు. గింజలు విడిగా, పొట్టు విడిగా మరలో నుండి బయటకు వస్తున్నాయి. ఎవరిని చూసినా ఏదో ఒక పనిలో మునిగిపోయి ఉన్నారు. చంద్రు వాళ్ళను నోట మాట లేకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. మనం తినే అన్నం వండటానికి బియ్యం కావాలి కదా. ఆ బియ్యం ధాన్యం పండించి, కోత కోసి, కుప్ప నూర్చి ఇలా మర ఆడించిన తరువాత మాత్రమే మనకు బియ్యంగా దొరుకుతుందన్న మాట! అమ్మయ్యో ఎంత కష్టం ఈ పనులన్నీ!!  ఇంతమంది కష్టం మనం తినే అన్నం వెనుక ఉన్నదని తనకు ఇంతవరకూ తెలియనే తెలియదు కదా.

చంద్రు ముఖంలో భావాలన్నీ చదవగలిగిన నాన్నగారు వాడితో ఇలా చెప్పడం మొదలుపెట్టారు “ఒకప్పుడు ఇలా మరలు లేనే లేవు తెలుసా. ఈ పనులన్నీ మనిషి తన కాయకష్టంతో, పొలంలో అయితే పశువుల సాయంతో చేసుకునేవాడు. పంట కోశాక మిగిలినవన్నీ మన శరీరకష్టంతో మాత్రమే పూర్తి చేసుకోవలసి వచ్చేది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు వ్యవసాయం ఎంతో కష్టంతో కూడిన పని. పంటలు కోతకు వచ్చే సమయంలో రైతు కుటుంబాలలో అందరూ ఒళ్లు వంచి పనులన్నీ పూర్తి చేసుకునేవారు”. ఇలా చెబుతూ చంద్రువాళ్ల నాన్నగారు వాడిని వేరే పొలంలోకి తీసుకువెళ్లారు. అక్కడ రైతులు పొలం ఎలా దున్నుతారో, నాట్లు ఎలా వేస్తారో, ఈ పనులన్నీ చేయటానికి ఏయే యంత్రాలు, పనిముట్లు వాడుతారో వివరంగా చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రుకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. వాడికి పల్లెలో జీవించడం అంటే ఎంతో ఇష్టంగా అనిపించసాగింది.

వాళ్ల పల్లె‘టూర్’ పూర్తి అయి ఇంటికి వెళ్ళిన తరువాత కూడా వాడి మనసులో ఆ పొలాలు, అక్కడి మనుషులు, వాళ్ళ మాటలు, వాళ్ళ పనిపాటలు, ఆ జీవన విధానం – ఇవే కదలాడాయి. కొద్ది సమయం తరువాత “పల్లెలో గాలి ఎంత స్వచ్ఛంగా ఉన్నదో కదా. త్రాగే నీరు ఎంత తీయగా ఉన్నదో కదా! ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. పల్లెల్లో జీవితం ఎంత ప్రశాంతంగా, ఆనందమయంగా ఉన్నదో కదా నాన్నగారూ” అంటూ చంద్రు తన సంతోషాన్ని వాళ్ల నాన్నగారితో పంచుకున్నాడు.

చంద్రును వాళ్ళ నాన్న ఎప్పుడూ “పెద్దయ్యాక నీవు ఏమి కావాలని అనుకుంటున్నావు?” అని అడుగుతూ ఉండేవారు. ఆ ప్రశ్నకు తాను చెప్పవలసిన జవాబేమిటో చంద్రుకు ఇప్పుడు బాగా అర్థమైంది. అందుకే వాడు “నాన్నగారూ, నేను పెద్దయ్యాక ఒక సుప్రసిద్ధుడైన, సఫలుడైన వ్యవసాయదారునిగా అవ్వాలని అనుకుంటున్నాను” అని ఎంతో గర్వంగా చెప్పాడు. చంద్రు చెప్పిన మాటలు విన్న నాన్నగారికి కళ్ళ వెంట ఆనంద భాష్పాలు ఆగకుండా వచ్చాయి. ‘నేనొక గొప్ప తండ్రిని’ అన్న భావంతో ఆయన పులకించిపోయాడు. మనస్ఫూర్తిగా కొడుకును తన గుండెకు హత్తుకున్నాడు.

తరువాత రోజులు గడుస్తున్న కొద్దీ చంద్రు పల్లె జీవితం పట్ల మరింత సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వాళ్ళు మళ్ళీ తమ నగరానికి వెళ్లవలసిన సమయం రానే వచ్చింది. వాడు బరువెక్కిన గుండెతో ‘ఇంక మళ్ళీ ఈ పల్లెను ఎప్పటికి చూస్తానో కదా’ అని అనుకుంటూ వదలలేక వదలలేక గ్రామాన్ని వదిలి తన అమ్మానాన్నలతో బయలుదేరాడు. ఇంటికి వెళ్ళిన దగ్గరనుంచి వాడు మళ్లీ వేసవి సెలవలు ఎప్పుడు వస్తాయో,  నేనెప్పుడు మళ్లీ తాతగారు నాయనమ్మలను చూస్తానో, పల్లెలోని ఆనందమయమైన జీవితం ఎప్పుడు పొందగలనో కదా అన్న కోరికతో ఎదురుచూస్తూనే ఉన్నాడు.

విన్నారుగా పిల్లలూ! మరి మీరందరూ మీ తల్లిదండ్రులతో కలసి మీ పల్లెలకు ఎప్పుడు వెళ్లాలని అనుకుంటున్నారు? ఈ వేసవిలో తప్పక ఒక గట్టి ప్రణాళిక వేసుకుంటారు కదూ?!

మూలం: ఉమయవన్ రామసామి

తెలుగు: వల్లూరు లీలావతి

వల్లూరు లీలావతి – కృతజ్ఞతలు

‘ఎగిరే ఏనుగు’ పది కథలు ఈ వారంతో సమాప్తమవుతున్నాయి. ఈ కథలు మీకు కలిగించిన అనుభూతులను మీరు పెద్దలయితే, మీ పిల్లలతో; మీరు పిల్లలయితే, మీ స్నేహితులతోను కలిసి పంచుకోండి. సహజ గ్రామీణ జీవితానికి వారిని పరిచయం చేయండి. పర్యావరణానికి, ప్రకృతికి హితుడు మానవుడు అనే భావాన్ని వారిలో పాదుకొనేలా చేయండి. ఈ పది వారాలూ నా కథలను ఆదరించిన పాఠకులకు కృతజ్ఞతలు. ప్రచురించిన ‘సంచిక’ పత్రికకు అనేకానేక కృతజ్ఞతలు.


ఆంగ్ల అనువాదకురాలు శ్రీమతి తులసి భట్

‘పరక్కుమ్ యానై’ కథలను తమిళంలో చదివిన వెంటనే ఇటువంటి రత్నం లాంటి పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించాలని నిర్ణయం చేసేసుకున్నాను. ఎందుకంటే, వీటిలోని సందేశాలు కేవలం తమిళులకు పరిమితం అవడం కంటె, ఇంకా విస్తృతమైన పాఠకలోకాన్ని చేరాలని నాకు చాలా బలంగా అనిపించింది. నేను ఈ నిర్ణయం తీసుకుని, అనువాద క్రియ మొదలుపెట్టే లోపల ఈ పుస్తక రచయిత ఉమయవాన్ అనేక అవార్డులను గెలుచుకున్నాడు – అదీ ఈ పుస్తకం కోసమే!! ప్రతి నెల తన పుస్తకం గెలుచుకున్న కొత్త అవార్డు గురించి నాకు తెలియజేయడానికి ఫోన్ చేసేవాడు. ఇది నా నిర్ణయాన్ని ధృవీకరించింది, ప్రతి కాల్ ఈ పుస్తకంపై నా విశ్వాసాన్ని బలపరిచింది. ఇక ఆలస్యం చేయకూడదని వెంటనే (కొత్తగా అమ్మమ్మని అయినా కూడా, సమయాభావాన్ని లెక్కచేయకుండా) అనువాదం చేశాను. నా మనుమడి పుట్టినరోజున ఆంగ్లంలో ఈ పుస్తకం ఆవిష్కరించి పిల్లలకు ఉచితంగా పంచిపెట్టాను.  వృత్తిరీత్యా జర్నలిస్టునయినా, అనేక సాంస్కృతిక కార్యక్రమాలను చేస్తుండటం చేత నా జీవిత ప్రయాణం నేను ఎల్లపుడూ పిల్లలకు చేరువలో ఉండేలా చేసింది- నా స్వంత పిల్లలు, నేను బోధించినపుడు నా విద్యార్థులు, ట్యూషన్ తరగతుల పిల్లలు, ఇప్పుడు నా మనుమలు, మనవరాళ్ళు! పిల్లలంటే నాకు ప్రాణమని మరి చెప్పక్కర్లేదుగా?! పిల్లల స్నేహపూర్వక ప్రపంచాన్ని నిర్మించే దిశగా ఈ పుస్తకం నా చిన్న సహకారం! గ్రామీణ భారతదేశం యొక్క సారాన్ని కమనీయంగా ఈ పుస్తకంలో ఆవిష్కరించారు ఉమయవన్. ఇప్పుడు శ్రీమతి వల్లూరు లీలావతి ‘ఎగిరే ఏనుగు’గా ఈ కథలను తెలుగులోకి తీసుకురావటం, ‘సంచిక’ పత్రిక వారు ప్రకటించటం నాకు చాల సంతోషంగా ఉంది. తెలుగు పిల్లలకు కూడా నేను దగ్గరయ్యాను అనే సంతృప్తి కలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here