అలనాటి అపురూపాలు-47

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మహమ్మద్ రఫీ గురించి వారి భార్య బిల్కీస్ మాటల్లో:

సినీ ప్రముఖుల గురించి ఎవరేం చెప్పినా అభిమానులు ఆస్తకిగా వింటారు. ఆ చెప్పేది వారి దగ్గరి బంధువులు, ఆత్మీయులు అయితే… మరింత ఆతృతగా, ఇష్టంగా చెవి వొగ్గి వింటారు.

అమర గాయకుడు మహమ్మద్ రఫీ గురించి ఆయన భార్య బిల్కీస్ ఏమన్నారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం.

~~

నాకు తండ్రి లేరు. అమ్మ, అన్నయ్యా అంతే. అయితే నాకు గుర్తున్నంతవరకు రఫీ గారి పేరు ప్రతి ఇంటా వినబడేది. మా అక్క వారి అన్నయ్యని పెళ్ళి చేసుకుంది. ఆమె ద్వారా మా పెళ్ళి ప్రస్తావన వచ్చింది. అప్పుడే నేను ఆరో తరగతి పరీక్షలు పూర్తి చేసి, ఇంటికి తిరిగి వచ్చాను. అప్పుడు అక్క చెప్పింది, “రేపు నీకు పెళ్ళి” అని. అప్పుడు నా వయసు 13 ఏళ్ళు. రఫీ సాబ్‌కి 19. పెళ్ళి అనే పదానికి అర్థం తెలియదు… అయితే పెద్దలు చెప్పినట్టు చేశాను. పెళ్ళి గురించి పెద్దగా వివరించలేను… ఎందుకంటే అప్పటికి నేనింకా చిన్నపిల్లనే. ఏం జరుగుతోందో పెద్దగా అర్థం కాలేదు.

రఫీ సాబ్ తనకి 10వ ఏట నుంచి పాడుతున్నారు. మా పెళ్ళయ్యేటప్పటికే ఆయన ఘజళ్ళు, సినిమా పాటలు పాడుతున్నారు. అయితే నాది సాంప్రదాయకమైన పెంపకం కాబట్టి, నేనెప్పుడూ రేడియో పెట్టి పాటలు వినలేదు. ఆయన పాటల గురించి నాకు చెప్పారు, కానీ నా సంగీతమంటే పెద్దగా ఆసక్తిలేకపోవడంతో, పెద్దగా పట్టించుకోలేదు. మా పెళ్ళయ్యాకా కూడా తన పాటలు వినేందుకు రఫీ సాబ్ నన్ను ప్రోత్సహించలేదు. నాకేసి నవ్వుతూ చూస్తూ, “నువ్వు నా పాటలు వింటూ కూర్చుంటే ఇంటి బాధ్యతలు ఎవరు చూసుకుంటారు?” అనేవారు. హాయిగా నవ్వుకునేవాళ్ళం.

మా పెళ్ళి అయిన కొత్తలో మేం డోంగ్రీలో నివసించేవారం. నాకు అప్పట్లో ఏమీ లోపంగా అనిపించేది కాదు, ఎందుకంటే నా యువ భర్త ఏదో ఒక రోజు గొప్పవారవుతారని నాకు తెలుసు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మేం భేండీ బజార్‌కి మారాము, కానీ ఎందుకో రఫీ సాబ్‍కి ఆ ప్రాంతం నచ్చలేదు. అయితే మరికొన్ని రోజులకి, ఆ అల్లా దయ వల్ల కొలాబాలో మాకు సొంత ఫ్లాట్ ఏర్పడింది. ఆయన పనిలో నేనెన్నడూ జోక్యం చేసుకోలేదు, కానీ మా కోసం ఎన్నో ఎదురుచూస్తున్నాయని అనిపించేది. తన కీర్తి ప్రతిష్ఠల గురించి రఫీ సాబ్ ఎన్నడూ బయటపడనప్పటికీ – నిరాడంబరంగానే జీవించారు. మేం 1954లో బాంద్రాలోని మా ఇంటికి మారాము. అప్పట్నించి ఆ ఇంట్లోనే ఉన్నాం.  మా ఏడుగురి పిల్లల్లో (నలుగురు కొడుకులు ముగ్గురు అమ్మాయిలు) – ఈ ఇంట్లోనే ఆరుగురు జన్మించారు.

రఫీ సాబ్ చాలా నిరాడంబరమైన వ్యక్తి. ఆయన జీవితమంతా ఆయన పిల్లల చుట్టూనే తిరిగింది. నిజానికి, పిల్లలే ఆయన జీవితం. పిల్లల గురించి ఆయన అడగని క్షణమంటూ నాకు గుర్తు లేదు. ఇల్లు, రికార్డింగ్, ఇల్లు – ఇదే ఆయన దినచర్య. అదయ్యాకా, పిల్లలకేమయినా కావాలా అని అడిగేవారు. వాళ్ళడిగితే ఏవైనా తెచ్చిచ్చేవారు. అంతటి ప్రేమలోనూ మా పిల్లలు పాడయిపోకుండా ఉన్నారంటే అది ఆ దేవుడి దయే. పిల్లలు వాళ్ళ తండ్రిని ప్రేమించారు, ఆయన ఘనత పట్ల గర్వించారు.

అయితే పిల్లలకి వాళ్ళ నాన్నంటే ఒక విషయంలో మాత్రం ఇష్టం ఉందేది కాదు. ఆయన వాళ్ళని తనతో రికార్డింగులకి గానీ, వేడుకలకి గానీ, సినిమాలకి గానీ తీసుకువెళ్ళడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. అయినా పిల్లలకి కూడా వాళ్ళ నాన్నతో కలిసి సినిమాలకి వెళ్ళడం నచ్చేది కాదు, ఎందుకంటే సినిమాకి వెళ్ళిన ప్రతీసారీ ‘సినిమా మొదలయ్యాక థియేటర్‍లోకి వెళ్ళడం, సినిమా పూర్తి కాకుండానే బయటకి వచ్చేయడం’ జరిగేది. పాపం, పిల్లలు ఏ సినిమాను పూర్తిగా చూసింది లేదు.

ఇదంతా ఎందుకంటే – రఫీ సాబ్ ఎటువంటి ప్రచార ఆర్భాటాన్నీ కోరుకోలేదు కనుక. ఇదంతా తమాషాగా ఉందేది. మేం ఏదైనా పెళ్ళికి వెళ్ళినా, డ్రైవరు‍ని సిద్ధంగా ఉండమనేవారు. లోపలికి వెళ్ళడం, వధూవరులని ఆశీర్వదించడం, వెంటనే వెనక్కి వచ్చి కారులో కూర్చుని ఇంటికి వచ్చేయడం… జరిగేది. ఓ జోక్‍లా ఉండేది.

ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఆయనవి కావు. అంతకు ముందు రోజు రాత్రి ఆయన తన పెద్దన్నయ్య అబ్దుల్ అమీన్‍తో కూర్చుని జవాబులు ఏం చెప్పాలో తెలుసుకునేవారు. రఫీగారి అన్ని ఇంటర్వ్యూల జవాబులు వాళ్ళ పెద్దన్నయ్యగారివే. నిజానికి ఆయన అబ్దుల్ సాబ్‌ని సొంత తండ్రిలా చూసుకునేవారు. ఆయనే మావారి వేలు పట్టుకుని నడక నేర్పారు. మా ఆయన అంత గొప్పవారు కావడనికి కారణం అబ్దుల్ గారే.

అలవాట్లు? నాకు గుర్తున్నంతవరకు ఆయన తెల్లవారు జామున మూడు గంటలకే లేచి సాధన చేసేవారు. రెండున్నర గంటల సాధన అనంతరం బాడ్మింటన్ ఆడేవారు. ఆయనకున్న మరో తమాషా అలవాటు – గాలిపటాలు ఎగరేయడం… రికార్డింగుకీ, రికార్డింగుకీ మధ్య అరగంట ఖాళీ దొరికినా, ఇంటికొచ్చేసి గాలిపటాలు ఎగరవేసేవారు. గాలిపటాల విషయానికి వస్తే ఆయన చిన్న పిల్లాడితో సమానం. తన గాలిపటం తెగిపోతే తెగ బాధపడేవారు. ఈ అలవాటు ఆయనకి చివరిదాకా ఉంది.

నాకు తెలిసి, జనం పట్ల వినమ్రపూర్వక ధోరణే ఆయన గొప్పదనం. ఆయన గొప్ప భక్తుడు, తను సాధించినవాటికి, తనకి లభించినవాటికి ఆయన అల్లాకి ఎన్నడూ ఋణపడి ఉండేవారు. ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం మారేది, జనాలు మారేవారు – కానీ రఫీ సాబ్ మాత్రం – కాలంతో పాటు మారలేదు. ఎప్పుడూ ఒకేలా ఉన్నారు.

ఆయనకి కావల్సిందల్లా కుటుంబమంతా కలిసిమెలిసి ఉండటమే. మా చుట్టాలని పిలిపించి, అందరికీ వంటలు చేయించి, కబుర్లు చెప్పుకుంటూ తినడం ఆయనకి ఇష్టం. మా మొత్తం కుటుంబం కలిసి ఉండడమే రఫీ సాబ్‍కి కావలసింది.

మా వారికి అభిమాన గాయకులంటూ ఎవరూ లేరు. ఎవరు బాగా పాడిన మెచ్చుకునేవారు. ఒక గాయకుడి కంటే మరొకరు ఇష్టమైనా, బహిరంగంగా ఎప్పుడూ – మాక్కూడా – చెప్పేవారు కాదు. ఒకరి పక్షం వహిస్తే, మరొకరికి బాధ కలుగుతుందని ఆయన భావించేవారు. ఎవరైనా వచ్చి, “రఫీ సాబ్, మీరంత గొప్పగా పాడడం వల్లే సినిమా హిట్ అయ్యింది, హీరోకి పేరొచ్చింది” అని అంటే, “ఆ సంగీత దర్శకులు లేదా హీరో లేకపోతే, నాకు అవకాశం దొరికేదే కాదు. వాళ్ళ వల్లే నాకు పని దొరికింది” అనేవారు.

తను పని చేసిన సంగీత దర్శకులందరినీ సమాన గౌరవంతో చూసేవారు. ఉదాహరణకు – శంకర్ జైకిషన్ బృందంలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍ వయొలనిస్టులుగా ఉన్నప్పటికే రఫీ సాబ్ గొప్ప గాయకుడిగా పేరుపొందారు. అయినప్పటికీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍ సంగీత దర్శకులు కాగానే, రఫీ సాబ్ వాళ్ళను ఎన్నడూ కేవలం వయొలనిస్టులుగా చూడలేదు. ‘వారు నా గురువులు. వాళ్ళకి పాడడం ద్వారా నేనెంతో నేర్చుకుంటాను’ అనేవారు.

ఇష్టమైన పాటలు? నౌషాద్ గారి సంగీత దర్శకత్వంలో ‘దులారీ’ సినిమాకి ఆయన పాడిన ‘సుహానీ రాత్ ఢల్ చుకీ, న జానే తుమ్ కబ్ ఆవోగే’ అన్న పాట రఫీ సాబ్‌కి బాగా ఇష్టం. తనే పాడిన మరికొన్ని పాటలన్నా ఆయనకి ఇష్టమే. నాకెలా తెలుసంటే, రికార్డింగ్ అయిపోయాకా, పిల్లల్ని కూర్చోబెట్టుకుని హార్మోనియం వాయిస్తూ ఆ పాటలు పాడేవారు. సంతోషంగా ఉన్నప్పుడు ఇలా ఎన్నో పాటలు పాడేవారు.

అయితే రఫీ సాబ్ బాగా ఆస్వాదించినదేంటంటే – ఎవరైనా స్టార్‌తో కలిసి పాట పాడడం! ఉదాహరణకి ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ కోసం నందాతో పాడినప్పుడు, ‘అమన్’ కోసం సైరా బానుతో పాడినప్పుడు ఎంతో సంతోషించారు. అలాంటి రోజుల్లో ఇంటికి వచ్చాకా, ‘ఈ రోజు నేను ఫలానా వాళ్ళతో కలిగి పాడాను తెలుసా’ అని ఆనందంగా చెప్పేవారు.

ఇష్టమైన సినిమాలు? పెద్దగా తెలియదు, కానీ ఏం నచ్చిందో తెలియదు, ‘షోలే’ మాత్రం మూడు సార్లు చూసారు. ఇష్టమైన సినిమాల గురించి అడిగినా, ఏ ఒక్క సినిమా గురించో ఆయన చెప్పినట్టు నాకు గుర్తు లేదు.

ఇక నటుల విషయానికొస్తే, రఫీ సాబ్‍కి షమ్మీ కపూర్, ధర్మేంద్ర అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ప్రతీ రికార్డింగ్ లోనూ రఫీ సాబ్ పాటలు వినేవారు షమ్మీ కపూర్. ఒక వాక్యానికో, ఒక పదానికో తాను ఎలా అభినయిస్తారో చేసి చూపేవారట. రఫీ సాబ్‍ని బహిరంగంగా అభిమానించిన మరో నటుడు ధర్మేంద్ర. ఈ ఇద్దరు హీరోలకి రఫీ సాబ్‍ అంటే గొప్ప అభిమానం. అంతే కాదు, మా వారిని అభిమానించని సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తి లేరని అంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, ఆయన ఏ ఒక్కరి గురించి చెడుగా ఎప్పుడూ మాట్లాడలేదు.

31 జూలై 1980న ఆయన చనిపోయే వరకు – రఫీ సాబ్‍తో 35 ఏళ్ళ వైవాహిక జీవితం గడిపాను. ఇంకొన్ని రోజులు గడిచి ఉంటే ఆయనకి 54 ఏళ్ళు వచ్చేవి.

ఆ రోజున ఏం జరిగిందో నాకింకా గుర్తుంది. కాళీ పూజ ఆల్బమ్ కోసం ఒక బెంగాలీ పాటని రికార్డ్ చేయవల్సిందిగా కోరారు. ఆ మర్నాడు ఆయన నాతో, ‘నేను అలసిపోయాను. ఈ బెంగాలీ పాట పాడలేనేమో’ అని అన్నారు. ‘పోనీ వేరే వాళ్ళతో పాడించుకోమని వాళ్ళకి చెప్పండి’ అన్నాను. ‘వద్దు, వద్దు. వాళ్ళు అంత దూరం కలకత్తా నుంచి, నేను ఒప్పుకుంటాననే ఆశతో వస్తున్నారు. ఈ ఏడాదికి పాడుతాను. వచ్చే ఏడాది నుంచి మానేస్తాను’ అన్నారు.

ఆ మర్నాడు ఉదయం తొమ్మిదిన్నర నుంచి రిహార్సల్స్‌కి కూర్చున్నారు. కానీ ఏదో నొప్పితో బాధపడుతున్నారు. మధ్యాహ్నం 12.30 దాకా మాకేమీ చెప్పలేదు. ‘అయ్యో అదేంటి ఎందుకు చెప్పలేదు?’ అని అడిగితే, ‘రఫీ ఇంటికి వచ్చే వారు ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు’ అన్నారు. అవే ఆయన చివరి మాటలు.

నొప్పి ఎక్కువైపోయింది. విపరీతంగా చెమటలు కారుతున్నాయి. అది రంజాన్ మాసం. అందుకని ఆయన ఏమీ తినలేదు. చేతులు, పాదాలు పచ్చగా మారాయి. వెంటనే ఆసుపత్రిలో చేర్చమని వైద్యులు చెప్పారు, రఫీ సాబ్‍కి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని చెప్పారు. తర్వాత అంత్యకాలమే…

ఈ రోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చక్కని సంతానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నా పిల్లలు మంచి పిల్లలు – తల్లిదండ్రులని అమితంగా ప్రేమించారు. రఫీ సాబ్ గతించినప్పటి నుండి, ఎన్నో ఏళ్ళుగా నా బలం వాళ్ళే. అయితే కొన్ని క్షణాలున్నాయి… నేను 13, ఆయన 19 ఏళ్ల వయసులో ఉండిపోతే బాగుందేది అనుకునే క్షణాలు. కొన్ని సార్లు ఆయన ప్రతీ రోజు సాయంత్రాలు నాకోసం వచ్చి, నాతో కూర్చుని, ‘ఏమిటి నీ బెంగ? నాతో చెప్పు… దెబ్బకి పోతుంది’ అని అనాలని కోరుకున్న కాలం ఉండేది.

~~

[రఫీ రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటిసారి తన కజిన్ బషీరా బీబీని స్వగ్రామంలో పెళ్ళి చేసుకున్నారు. దేశ విభజన జరిగినప్పుడు సంభవించిన మత కలహాలలో తన తల్లిదండ్రులను కోల్పోయిన బషీరా భారతదేశంలో ఉండడానికి ఇష్టపడక, పాకిస్తాన్‍లోని లాహోర్‍కి వెళ్ళిపోయారు. ఆయన బిల్కీస్ బానో గారిని రెండో పెళ్ళి చేసుకున్నారు.

రఫీ సాబ్‍కి నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. పెద్ద కొడుకు సయీద్ మొదటి భార్యకి జన్మించాడు].


ఛండీఘడ్ వీధుల్లో దిలీప్ కుమార్, రాజ్ కపూర్:

ఇది అనుకోకుండా జరిగింది. ‘జాగ్తే రహో’ బెంగాలీ వెర్షన్‍కి పొందిన అవార్డును స్వీకరించడానికి రాజ్ కపూర్ ఢిల్లీ వెళ్లారు. తన విశ్రాంతి రోజులని నైనిటాల్‍లో గడిపేందుకు దిలీప్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్ళారు. ఇద్దరూ ఢిల్లీలో ఒకే స్టార్ హోటల్‍లో బస చేశారు. రాజ్ కపూర్ హోటల్‍లో దిలీప్ కుమార్‌ని చూసి “హే యూసఫ్” అని పిలిచారట. దిలీప్ కుమార్ వెనక్కి తిరిగి చూసి, ఆత్మీయ మిత్రుడిని హత్తుకున్నట్టు రాజ్ కపూర్‍ని కౌగిలించుకున్నారట. వారిద్దరూ మంచి మిత్రులయినా, ఇద్దరి బిజీ షెడ్యూళ్ల కారణంగా తీరికగా కూర్చుని మాట్లాడుకునే సమయం ఉండేది కాదు.

ఇద్దరికీ కొన్ని రోజుల విశ్రాంతి దొరికిందని గ్రహించారు. ఛండీఘడ్ నగరమంతా తిరిగి, బాక్రా నంగల్ డ్యామ్ చూసొద్దామని దిలీప్ కుమార్ ప్రతిపాదించారట. కానీ అంతలోనే – రాజ్ కపూర్ చాలా ఆలస్యంగా నిద్ర పోతారని గుర్తు చేసుకుని – వద్దనుకున్నారట. తాను మర్నాడు ఉదయమే నిద్ర లేస్తానని రాజ్ కపూర్ పందెం కాశారట. అన్నట్టుగానే ఉదయం 5 గంటలకే నిద్రలేచి సిద్ధమయ్యారట. ఇంకా పూర్తిగా తెలవారకపోయేసరికి, దిలీప్ కుమార్ కారులో కొన్ని దిండ్లు, గలేబులు పెట్టుకుని, ఛండీఘడ్ నగర సంచారానికి బయల్దేరారు.

అటువంటి అద్భుతమైన నటులు ఇక రారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here