[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 54వ భాగం. [/box]
మోహన్ చారిత్రక నవల-4.3
[dropcap]ఆ[/dropcap] సాయంకాలం మహారాజు గారిని విశ్రాంతి మందిరం పరిచారకుడు దర్శించి ఒక విషయం చెప్పాడు.
“ప్రభువులకో మంచి వార్త. కరడు గట్టిన శ్రమణులు మెత్తబడుతున్నారు. ఉదయం జాము పొద్దెక్కిన తరువాత నిద్రలేచారు. స్నానానికి కవోష్ణ జలం ఉపయోగించారు. సున్నిపిండిలో గంధపు పొడి, కచూరాల పొడి కలిపి చాల సేపు శరీరం రుద్దుకొని స్నానం చేశారు. నామమాత్రానికే వినయఖండకాలను పఠించారు. చాల సేపు ఆమ్రవనంలో ఆలోచనలలో మునిగి నడిచారు”.
మహారాజు జేట్ఠతిస్సుడి పెదవులపై చిరునవ్వు నిలిచింది.
రెండవ రాత్రి శ్రమణుడు ఆ మండపంలోనే మేల్కొన్నా, దీపాలంకరణ వేరుగా ఉంది. వేదికకు అతనికి మధ్యనున్న స్థలంలో రంగు రంగుల పూలను వర్తులాకారంలోను, పద్మాకారంలోను అమర్చారు. వేదిక కూడా విశాలంగా ఉంది. ఈసారి ముగ్గురు పురుషులు, ముగ్గురు స్త్రీలు దానిమీద కనిపించారు. వారి చేతులలో వీణలు కాని, వేణువులు కాని లేవు. పురుషుల శరీరాలు కండలు తిరిగి ఉన్నవి. యువతుల శరీరాలు నాజూకుగా ఉన్నవి. పురుషులు సాముగారడీలు చేశారు. ఖడ్గయుద్ధం చేశారు. యువతులు చాల తక్కువ దుస్తులు ధరించారు. వారి వంటి వంపులు ప్రతి కదలికలోను కొత్త కొత్తగా కనిపించాయి. పురుషులు స్త్రీలను ఎత్తుకొని వలయంగా తిప్పారు. వారిని పైకెగుర వేసి చేతులలో పట్టుకొన్నారు.
ఈ విద్యలు శ్రమణుడు నేర్చినవి కావు. చూసినవి కూడా కావు. పురుషుల బలమైన శరీరాలను లతలవంటి సుకుమార స్త్రీ శరీరాలు పెనవేసుకున్నప్పుడు, వాళ్లు ధరించిన దుస్తులు స్థానాలు తప్పినప్పుడు శ్రమణుడు చలించేవాడు.
ఇదొక లోకం. వినోదం పుష్కలంగా దీనిలో లభిస్తున్నది. కన్నుల పండువుగ కాముకుల శరీరాలు కదులుతున్నాయి. యౌవన మిచ్చే ఆనందం ఇదే కాబోలు.
ఎవరో గవాక్షం తెరిచారు. చల్లని గాలి పూల పై తేలి శ్రమణుడిని చుట్టుకుంది. దీపకాంతి క్రమంగా తగ్గింది. ఆ పురుషులు, స్త్రీలు చీకటిలో కలిసిపోయారు. శ్రమణుడు శయ్యపై వాలిపోయాడు.
మూడవనాటి రాత్రి శ్రమణుడు మేల్కొనే సరికి ఎదురుగా వేదికమీద ఒక పూల పాన్పు అమర్చి ఉంది. దీపాల వెలుతురు శయ్యపై కేంద్రీకరించి ఉంది. ఎవరో మధురంగా వీణ వాయిస్తున్నారు. శ్రమణుడికి బాగా తెలివి వచ్చిన కొద్ది క్షణాలకు ప్రేమికుల జంట ఒకటి లోపలికి వచ్చింది. యువకుడు పాతికేళ్లవాడు. యువతి ఇరవై యేళ్లది. ఇద్దరూ సింహళ దేశీయులే. వారి శరీరాలు నల్లచేవ మానువలె ఉన్నాయి. తళతళ లాడుతున్నాయి.
నాయిక అలుక వహించింది. పురుషుడామెను సాంత్వనం చేస్తున్నాడు. పై నుండి మందంగా వస్తున్న వీణా నాదం వారి కదలికలకు అనుకూలంగా మంద్ర మధ్యతారక స్థాయీ భేదాలతో వినిపిస్తున్నది.
ప్రేమికులకు స్వేచ్చనివ్వడం కోసం శ్రమణుడున్న భాగం చీకటిలోను, వేదిక మాత్రం కాంతిలోను ఉన్నట్లు దీపాలను అమర్చారు. శ్రమణుడు చూస్తున్నాడు. పురుషుడు ప్రియురాలిని వశపరచుకోడానికి ప్రయత్నించినపుడు ఆమె కట్టిన పుట్టాలు ఒకటీ ఒకటి తొలగిపోతున్నవి.
క్రమంగా యువతి ముఖం మందహాసంతో వెలిగింది. పురుషుడు నగ్నంగా ఉన్న ప్రియురాలిని గాఢంగా కౌగిలించుకున్నాడు. తనివితీర చుంబించాడు. ఉద్రేకం పట్టలేక ఆమెను పైకొనే సమయంలో దీపాలు ఘనమైపోయాయి.
శ్రమణుడు మేలుకొనే సరికి ఎండవచ్చింది. స్నానాదులు ముగించుకున్నాడు. ఈ విధంగా తన్ను ఎందుక ప్రలోభపెడుతున్నారో తెలుసుకోడానికి ప్రయత్నించాడు. బహుశా ఇది రాజమర్యాదలలో ఒకటి కాబోలుననుకున్నాడు. పరిచారకులను అడగాలని అనుకున్నాడు. వాళ్లకి అన్నీ తెలుస్తాయి. కాని, ఆ పని చేయలేకపోయాడు. కళింగ భూపతి కోసం సాయంకాలం వరకు ఎదురుచూశాడు. ఎప్పటికీ అతను రాకపోతే ఒక పరిచారకుడిని అతని గురించి ప్రశ్నించాడు.
“భూపతి ప్రభువులు అరణ్యాలకు పోయారు. ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు”. నాలుగవనాటి రాత్రికి మూడవనాటి రాత్రికి అంతగా బేధం లేదు. ముగ్గురు పురుషులు, ముగ్గురు స్త్రీలు – సామూహిక శృంగార క్రీడలు.
అయిదవనాటి రాత్రి వేదికమీద ఒక్క రత్నకంబలం మాత్రమే పరచి ఉంది. ఎవరో మధురంగా వేణువు వాయిస్తున్నారు. శ్రమణుడి తల్పం వేదికకు సమీపంలో ఉంది. పరిసరాలు దివ్యమైన కాంతిలో నిండిపోయాయి.
శ్రమణుడికి బాగా మెలకువ వచ్చింది. మండపం పార్శ్వద్వారం నుండి నలుగురు యువతులు దోసిళ్లనిండా పూలు పట్టుకొని లోపలికి ప్రవేశించారు.
కొద్ది క్షణాలలో మేలిముసుగులో నున్న యువతి నొకతెను చెలికత్తె లోనికి తీసుకవచ్చింది. అపుడు ముందు వచ్చిన నలుగురు యువతులు శ్రమణుడిమీద పూలు విరజల్లుతూ గానం చేశారు.
స్వాగతం! స్వాగతం!!
ఆనందునికిదె స్వాగతం!
ఆనంగసఖునికి స్వాగతం!
అఖిల జనావళికారాధ్యుండగు
అమృత మూర్తి కిదె స్వాగతం!
అవగుంఠనంలో ఉన్న యువతిని చెలికత్తె ఆనందుని సమీపానికి తెచ్చి, మేలిముసుగును మెల్లగా పక్కకు తొలగించింది.
ఆమె –
నీల నిబడిడ కాందంబినిపై తోచిన శంపాలత!
నిర్మల సరోవరంలో రేకులు విడుతున్న తామరపూవు –
లోకాలలోని సౌందర్యాన్ని రాశిగా పోసిన కాంచన ప్రతిమ!
శ్రమణుడు రెప్ప వాల్చకుండా ఆమె సౌందర్యాన్ని దప్పిగొన్న వాడివలె పానం చేస్తున్నాడు. ఎప్పుడు దీపాలు ఆరిపోయాయో, ఎప్పుడామె వెళ్ళిపోయిందో అతనికి తెలియదు.
శ్రమణుడు తనకళ్లను తాను నమ్మలేకపోయాడు.
ఆ యువతి వేదికమీద కూర్చుంది. బంగారు కట్లు గల వీణను చెలికత్తె తెచ్చి ఆమెకిచ్చింది. తీవలు సవరిస్తూ ఆ సుందరి వాయించింది. ఆ నాదంలో ఏదో కొత్తదనం ప్రాచ్యదేశాల పద్ధతులకు భిన్నంగా ఉంది. శ్రమణుడు వారణాసిలో శాస్త్రీయ సంగీతం గురుమూలంగా నేర్చుకున్నవాడే. కాని, ఆలోచనలకు అతీతంగా ఉంది ఈ పద్ధతి.
కాలం చాలా తొందరగా గడచిపోయింది, ఆరవ నాటి రాత్రి. ఎప్పుడు దీపాలు ఘనమయాయో, ఎప్పుడామె వెళ్లిపోయిందో అతనికి తెలియలేదు.
యాంత్రికంగా శ్రమణుడు తన పనులను చేసుకుంటూ పోతున్నాడని, వేటియందు శ్రద్ధ చూపించడం లేదని, వచ్చిన రోగులను కూడా పంపివేస్తున్నాడని పరిచారకులు మహారాజుకు విన్నవించారు.
ఏడవరాత్రి రానే వచ్చింది. ఈ రాత్రి ఆ సుందరి తానే శ్రమణుడికి స్వాగతం పలికింది. కంఠమెత్తి సీహళ దేశపు గీతాలను, ప్రాకృత గాథలను గానం చేసింది.
శ్రమణుడు శరీరం, మనస్సు అన్ని స్వాధీనం తప్పిపోగా ఆమె సంగీతం వింటున్నాడు.
సంగీతం పూర్తి చేసిన తరువాత లోకసమ్మోహనంగా ఆ సుందరి శ్రమణుడిని వీక్షించి, వంగి అతని పాదాలకి అభివందనం చేసింది.
తనను సమీపించి, తన చూపులలో చూపులు కలిపి, పాదాభివందనం చేస్తున్న ఆమె సౌందర్యాన్ని చూస్తూ, శతకోటి సూర్యుల కాంతితో కొట్టబడ్డట్లు శ్రమణుడు చలించాడు.
“ఈమె సెలీనా! జగదేకమోహనమైన యవన సుందరి! ఈమెను మీరు స్వీకరించవలసింది.” చెలికత్తె పరిచయం చేసింది.
శ్రమణుడు ఒక్కసారి కళ్లుమూసుకున్నాడు. పద్మాసనం వేసుకున్నాడు.
అతని కళ్ల ముందు, నిద్రలేక లోతుకు పోయిన కళ్లతో యశోనిధి ముఖం కనిపించింది. “వనిత మృత్యువు! వనిత మృత్యువు!! వనిత మృత్యువు!!!
మృత్యువుకు భయపడని శ్రమణుని శరీరం అప్రయత్నంగా బిగుసుకుపోయింది. అతని ముఖం నుండి సుస్పష్టంగా త్రిరత్నాల స్మరణ వినవచ్చింది.
(సశేషం)