కొడిగట్టిన దీపాలు-27

0
3

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 27వ భాగం. [/box]

53

[dropcap]రా[/dropcap]జశేఖరానికి ఆశ్రమవాసుల క్రమశిక్షణ నచ్చింది. అక్కడి వాతావరణం నచ్చిందది. అక్కడున్న వాళ్ళందరూ క్రమశిక్షణ పాటిస్తూ ఎవరి దినచర్యలో వారు మునిగి తేలడం చూస్తున్న అతనికి చాలా ముచ్చటేసింది. అంత క్రమశిక్షణతో వారినందరిని ఏకతాటిపై పయనింప చేస్తున్న సుజాతమ్మను అతను అభినందించకుండా ఉండలేకపోయాడు.

ఆహ్లాదకరమైన వాతావరణంలో అతను మసలుతున్నా అతని మనస్సు మాత్రం దిగులుగానే ఉండేది. అతని దిగులు సుజాతమ్మ గురించే. అలా అని అతని ఆరోగ్యం కూడా బాగుందా అంటే అదీ లేదు. అతని ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే.

“తాతయ్యా! మీరు ఇక్కడ నాలుగు రోజులుండి రండి. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను.” అన్నాడు చైతన్య రాజశేఖరంతో.

“అలాగే చైతన్యా!” నీవు అసలే జర్నలిస్టువి, నీకు క్షణం తీరికుండదు. నీవు లేకపోతే ఎక్కడ వార్తలు అక్కడే ఆగిపోతాయి. అన్ని విషయాలూ కవర్ చేయాలి,” అని రాజశేఖరం చైతన్య వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. సుజాతమ్మ, చైతన్యకి మరో పర్యాయం కృతజ్ఞతలు తెలియజేసింది. చైతన్య చొరవ తీసుకోకపోతే తామిద్దరూ ఇలా కలుసుకుని ఉండేవారు కాదు. అలాగే వాళ్ళ జీవితాలు ముగిసిపోయేవి అని ఆమె భావన.

“కళ్యాణిని చూడాలని ఉంది. నీ అధ్వర్యంలో కళ్యాణి ఓ ఉన్నత స్థాయికి ఎదిగిందంటే అదంతా నీ గొప్పదనమే. అంతెందుకు? మా కుటుంబంలో ఎవర్ని తీసుకున్నా మా అందరి జీవితాలూ సవ్యంగా లేవు. చక్కగా సాగలేదు. అలా సక్రమంగా సాగిన జీవితం ఒక్క కళ్యాణిదే.

మరి ఆ రాజేషో? అతడ్ని నేను చూడకపోయినా విన్న విషయాలూ, అందరూ చెప్తున్న విషయాల బట్టి అతడు మంచి వాడనిపిస్తోంది. అతని మీద గౌరవం కలుగుతోంది. అతను చాలా ఉత్తముడనిపిస్తోంది,” సుజాతమ్మతో రాజశేఖరం అన్నాడు.

అతని మాటల్లో భావోద్వేగం అగుపించింది ఆమెకి. అతని మనసుని అర్థం చేసుకుంది. అతని భావాలు అర్థం చేసుకుంది. అతరి భావోద్వేగాలు అర్థం చేసుకుంది. అతని ప్రవృత్తిని అర్థం చేసుకుంది ఆమె.

‘మనసుని అర్థం చేసుకోవడమంటే మనిషిని అర్థం చేసుకున్నట్లే. కుటుంబంలో వ్యక్తుల మధ్య దూరానికి – దగ్గరవడానికి అదే ప్రధానం. మనసుని అర్థం చేసుకోవడం అంటే ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోవడం. వ్యక్తి స్వేచ్ఛను గౌరవించడం అంతే కాని మన అభిప్రాయాల్ని అధికారాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దుతే మనుష్యులు దూరమవుతారు,’ ఇలా అలోచిస్తోంది సుజాతమ్మ.

రాజశేఖరానికి కళ్యాణిని చూడాలని ఉంది అనుకుంది ఆమె. “కళ్యాణికి, రాజేష్‌కి పిల్లల్ని తీసుకుని రమ్మనమని ఫోను చేసాను. ఆ చేత్తోనే మా చెల్లెలు రాధకి ఆమె భర్త మోహను కృష్ణకి పిల్లల్ని తీసుకుని రమ్మనమని ఫోను చేసేను. అందరూ రావచ్చు. వాళ్ళందర్నీ చూడాలనిపిస్తోంది నాకు. అంతేకాదు మీరు వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియజేసాను. వాళ్ళు తప్పకుండా వస్తారు.” సుజాతమ్మ రాజశేఖరంతో అంది.

“అంతే కాదు నా పరిస్థితి చూస్తున్నారు కదా! ఎప్పుడు ఎలా ఉంటుందో? జీవన చరమాంకంలో నేనా నా అనుకున్న వాళ్ళంతా నా దగ్గర ఉండాలని అనేదే నా కోరిక.”

ఆమె మాటలు అతనికి బాధ కలిగించాయి. కొద్దిగా నొచ్చుకున్నాడు కూడా.

“అలా అనద్దు. నీవు అలా మాట్లాడుతుంటే బాధ కలుగుతోంది. దిగులుగా ఉంది. ప్రతీ ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు మరణం తథ్యం. ఇప్పటి వరకూ ఆ భగవంతుడు మనల్ని జీవింప చేసినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియ చేయాలి. అయితే ఒక్క విషయం. మనిషి మృత్యువు సమయంలో కూడా ఇంకా బ్రతకాలి. ఇంకా బ్రతకాలి అని కోరుకుంటాడుట. నీవు లేచి తిరగకపోయినా మా కళ్ళెదుట అలా మంచం మీద వుంటే అదే చాలు. అదే మాకు తృప్తి.

పుట్టుక వెనుక మరణం తప్పకుండా ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం ఇది ప్రకృతి విధానం. పుట్టుకల్ని ఆపు చేయడానికి మార్గం కనుగొన్న మనిషి మరణం నుండి రక్షించుకోలేకపోతున్నాడు. పుట్టుక సమయంలోనే మరణం కూడా పలానా సమయంలో అని వ్రాసి పెట్టి ఉంటుందంటారు.”

రాజశేఖరం ప్రసంగాన్ని మరోవేపు మళ్ళించాలనుకున్నాడు. “ఆశ్రమ నిర్వహణ ఎలా సాగుతోంది?” అని ప్రశ్నించాడు రాజశేఖరం.

“బాబు గారూ! అలా తిరిగి వద్దాంరండి. అన్ని విషయాలూ నేను చెప్తాను.” అన్నాడు ఆశ్రమవాసి.

రాజశేఖరాన్ని ఆశ్రమం వారు ఆశ్రమంలో త్రిప్పి చూపిస్తున్నారు. కొంత మంది ఆడవాళ్ళు కొవొత్తులు, సబ్బులు తయారు చేస్తున్నారు. మరి కొందరు అప్పడాలు వడియాలు తయారు చేస్తున్నారు. మరి కొంత మంది రకరకాల పొడులు తయారు చేస్తున్నారు. కొంతమంది ఆడ మగ మిషను మీద బట్టలు కుడున్నారు.

“ఇలా తయారయిన వస్తువుల్ని మార్కెట్టుకి తీసుకువెళ్ళి అమ్ముతారు. వచ్చిన డబ్బు ఆశ్రమ ఖర్చులకి వినియోగిస్తారు. అంతేకాదు దాతలు కూడా విరాళాలు విరివిగా ఇస్తున్నారు.” అన్నాడు ఆశ్రమవాసి.

అంతే కాదు ఆశ్రమవాసులు అందరూ వృద్ధులు కూడా యోగా చేస్తారు. భజనలు చేస్తారు. మనస్సుకి ఉల్లాసం కలిగించే వినోద ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.

ఆశ్రమ వాతావరణం అక్కడి కార్యక్రమాలు అన్నీ రాజశేఖరానికి ఆనందం ఇచ్చాయి.

అయితే నచ్చనిదల్లా రాష్ట్రంలోని దేశంలోని రాజకీయ అస్థిర పరిస్థితులు. రోజు రోజుకీ హింసావాదం, పదవీ వ్యామోహం పెరిగిపోయాయి. వేర్పాటు భావం పెరగడం వలన ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఏ పార్టీకి సరియైన సిద్ధాంతం లేదు. లక్ష్యం అంతకన్నా లేదు. వాటి తీరు తెన్నులు చూస్తుంటే పబ్బం గడుపుకోడానికే ఈ పార్టీలు ఆవిర్భవించేవేమో అని అనిపిస్తుంది.

“రాజశేఖరం గారూ! సుజాతమ్మగారు నేటి అవినీతి సమాజంలో ముందుకు పోవడానికి ఎంతో కష్టపడవల్సి వచ్చింది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవల్సి వచ్చింది. అయితే ఈ భూమి మీద నూటికి నూరు పాళ్ళు అధర్మం ఇంకా చోటు చేసుకోలేదు. అధర్మం విలయ తాండవ నృత్యం చేస్తుంటే ధర్మం పూర్తిగా తొలగిపోలేదు. కొంతమంది దాతలు ఈ ఆశ్రమ నిర్వాహణకి సహకరిస్తున్నారు,” ఆశ్రమవాసి వివరించాడు.

54

రాజేష్, కళ్యాణిని పిల్లల్ని తీసుకుని వచ్చాడు. రాజశేఖరం వదనంలో ఆరాటం, అత్రుత, కుతూహలం.

“వదినా! మీ ఆరోగ్యం ఎలా ఉంది. ఇద్దరు డాక్టర్లమి వచ్చేసేమూ.  మీఁకేం భయం లేదు. టెన్షను పడద్దు. టెన్షను పడితే బి.పి. పెరుగుతుంది. మీరు పడిపోయారు, కాలు విరిగింది. కట్టు కట్టారు అని తెలిసి ఎంత గాబరాపడ్డామో!”

గల గల మాట్లాడిస్తోంది కళ్యాణి. ఆమె వేపు అపురూపంగా ఆపేక్షంగా చూస్తున్నాడు రాజశేఖరం.

“ఈ సమయంలో ఎవరు ఏఁ చేసినా లాభం లేదు కళ్యాణి. మృత్యువు ఒకవంక నన్ను కబళిస్తూ ఉంటే ఆ మృత్యువు నుండి తప్పించుకోడానికి చేసిన ప్రయత్నం మనం చేస్తాం. తరువాత దైవాదీనం,” సుజాతమ్మ మాటల్లో నిరాశా భావం.

“నీకేఁ భయం లేదు. ఇటువంటి సమయంలో నీకు సహాయంగా నిలబడకపోతే నీవు చెప్పించిన ఆ వైద్య విద్యకి సార్థకత ఏంటి?” కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడుతుండగా సుజాతమ్మతో కళ్యాణి అంది.

“కళ్యాణీ! మీరు ఎంత గొప్ప వైద్యులవచ్చు. ఈ మృత్యువు నోటి నుండి తప్పించుకోవడం అంటే పులి నోట్లో పడ్డ జంతువు తప్పించుకోడానికి చేసిన ప్రయత్నం లాంటిదే. ఏఁ లాభం లేదు. నా జీవిత ఆఖరి క్షణాల్లో నేనా నా వాళ్ళు అనుకున్న వారందరూ నా చెంత ఉంటారనే మీకు కబురు పంపాను.”

“మీరు అలా నిరాశావాదంతో మాట్లాడవద్దు ప్లీజ్. ఆశావాదంతో బ్రతకడం నేర్చుకోవాలి. ఆశలేనిదే మానవ మనుగడే లేదు. తప్పకుండా మీ ఆరోగ్యం బాగుపడుతుంది,” రాజేష్ అన్నాడు.

వెంటనే సుజాతమ్మ దృష్టి అతని మీద నిలిచింది.

“మీ డాక్టర్ల తీరే అంతయ్య. మీరు అలా చనిపోబోతున్న వాళ్ళలో కూడ ఆశ కల్పిస్తారు. అలా ఆశ కల్పించకపోతే చనిపోతున్నామన్న చింతతో కొంతమంది విలవిల్లాడిపోతారు. ఎవరికైనా చావంటే భయమేకదా!” సుజాతమ్మ అంది.

వారి మాటల్ని వింటూ ఆలోచిస్తున్న రాజశేఖరం కళ్యాణి ఎంత పెద్దదయింది. పెద్ద ఆరిందాల్లా, మాట్లాడుతోంది? తన కళ్ళెదుట ఆ చిన్నప్పటి కళ్యాణే మెదులుతోంది. ఆ అమాయకమైన ముఖంతో బితుకు బితుకుమంటూ తిరిగే ఆ చిన్నారి కళ్యాణి ఎంతగా పెరిగిపోయింది. ముగ్గురు పిల్లలకి తల్లి కళ్యాణి అంటే గమ్మత్తుగా ఆనందంగా ఉంది. కళ్యాణి కళ్ళల్లో విజ్ఞానం తొణికిసలాడుతోంది. వయస్సుతో పాటే ఆమె మనస్సు పరిపక్వత చెందింది. కళ్యాణికి తగ్గవాడే ఆమె భర్త రాజేష్, అతని ముఖంలో వినయ విధేయతలు అగుపడున్నాయి. ఇప్పుడు తనకి ఎంతో గర్వంగా – ఆనందంగా ఉంది. రాజశేఖరం ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి.

“అటు చూడు కళ్యాణీ! అతను ఎవరో చెప్పగలవా?” సుజాతమ్మ  రాజశేఖరాన్ని చూపిస్తూ అంది. రాజేష్, కళ్యాణి దృష్టి అటు వేపు మళ్ళింది.

మొదట రాజశేఖరాన్ని పోల్చుకోలేకపోయింది కళ్యాణి. అయితే ఎక్కడో చూసినట్టు అనిపించింది ఆమెకి. చాలా చురుగ్గా ఆలోచిస్తోంది. తీక్షణంగా అతని వేపు చూస్తోంది. ఆమె కనుబొమ్మలు ముడిపడి విడిపోయాయి.

“పోనీ కళ్యాణీ! మీ అన్నయ్య ఇప్పుడు కనిపిస్తే పోల్చుకోగలవా?” తిరిగి అడిగింది సుజాతమ్మ. ఆమె ఆ క్లూ ఇచ్చేప్పటికి కళ్యాణికి పరిస్థితి అంతా అర్థమవుతోంది. తిరిగి అతని వంక తేరిపారా చూసింది.

ఆఁ!!! గుర్తుకు వచ్చింది. ఆఁ…! అతనే… అన్నయ్యే! తను అతడ్ని చాలా చిన్న వయస్సులో చూసింది.

అన్నయ్య తలంపుకి రాగానే ఆమె వొళ్ళంతా ఆనందంతో ఒక్కమారు జలదరించింది. ఆనందంతో పాటూ దుఃఖం కూడా భావోద్వేగం.

“అన్నయ్యా! అంటూ రాజశేఖరం దగ్గరికి ఒక్క ఉదుటన వెళ్ళింది. చెల్లెలు చేతిని ఆప్యాయతగా పట్టుకుని, “కళ్యాణీ!” అన్నాడు రాజశేఖరం. కళ్ళల్లో కన్నీరు చిమ్ముతుండగా ఆనందంలోనూ కన్నీరు వస్తుంది.

దుఃఖంలోనీ కన్నీరు వస్తుంది. కన్నీరు ఒక్కటే అయినా అది వచ్చే సందర్భాలు వేరు వేరు.

రాజేష్ రాజశేఖరం, కళ్యాణి వేపు చూస్తూ వారి మధ్య గల అనుబంధాన్ని అర్థం చేసుకుంటున్నాడు.

“అన్నయ్యా! రాజేష్!” తన భర్తని రాజశేఖరానికి పరిచయం చేసింది కళ్యాణి.

రాజేష్ రాజశేఖరానికి పాదాభివందనం చేశాడు. అతని భుజాలు పట్టుకుని లేవనెత్తి ఆప్యాయతగా ఆలింగనం చేసుకున్నాడు రాజశేఖరం.

“రాజేష్! నీ వంటి భర్తను పొందిన నా చెల్లి కళ్యాణి చాలా అదృష్టవంతురాలు.”

“నేనూ అదృష్టవంతుడ్నే కళ్యాణి వంటి భార్య నాకు లభించినందుకు నా భావాలు – నా ఆలోచన్లు, నా అభిరుచులు తెలుసుకుని వాటి ప్రకారమే కళ్యాణి నడుచుకుంటుంది.”

“ఆ క్రెడిట్ అంతా సుజాతది. ఆమె అధ్వర్యంలో పెరిగి కళ్యాణికి అలాంటి గుణాలు రాకుండా ఉంటాయా?” రాజశేఖరం అన్నాడు. నిజమే అని అనిపించింది రాజేష్‍కి.

“అమ్మగారూ! మీ చెల్లెమ్మ గారూ వాళ్ళూ కూడా వచ్చారమ్మా!” ఆశ్రమవాసి సుజాతమ్మకి తెలియ చేసింది. ఆమె ముఖం ఆనందంతో విప్పారింది. ఇంకేఁటి తన వాళ్ళందరూ వచ్చారు. ఇక తన ప్రాణం ఏమయినా పరవాలేదు.

సుజాతమ్మ మోహను కృష్ణకి రాజేష్‌ని, రాజశేఖరాన్ని పరిచయం చేసింది. రాజేష్, మోహను కృష్ణ రాజశేఖరం ఒకరికి మరొకరు కరచాలనం చేసుకున్నారు.

రాధని రాజశేఖరానికి, రాజేష్‌కి పరిచయం చేసింది కళ్యాణి. రాధ రాజశేఖరాన్ని గురించి విందే కాని చూడలేదు.

సుజాత, రాజశేఖరాన్ని గురించి మొదట్లో తనింట్లో చర్చకి వచ్చినప్పుడు అతని గురించి వింది. చూడలేదు. అతడ్ని చూడ్డం ఇదే మొదటిసారి. రాజశేఖరానికి నమస్కరించింది రాధ. అతను కూడా ప్రతి నమస్కారం చేశాడు.

“మా గురించి విన్నాను. మీలాంటి నిస్వార్థ సమరయోధులు అరుదుగా ఉంటారు. ఈ కలుషిత రాజకీయ వాతావరణానికి మీలాంటి వాళ్ళు కలవలేరు. ఇమిడిపోలేరు. మరి సుజాత గారూ – మీలాంటి పవిత్ర ప్రేమికులకు జోహార్లు” మోహను కృష్ణ సుజాతమ్మని, రాజశేఖరాన్ని ప్రశంసల జల్లులో ముంచెత్తుతూ అన్నారు. ఇబ్బందిగా మొహం పెట్టిన రాజశేఖరాన్ని చూసి ‘ఇతనికి పొగడ్తలు ఇష్టం ఉండవు’ అనుకున్నాడు మోహను కృష్ణ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here