యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-8 & 9

0
4

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా పూతలపట్టు లోని ‘శ్రీ భీమేశ్వరాలయం’, కట్టమంచి లోని ‘శ్రీ కుళందేశ్వరస్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

8. పూతలపట్టు

పులిగుండులో 4-45కి బయల్దేరి అక్కడికి 10 కి.మీ.ల దూరంలో వున్న పూతలపట్టు భీమేశ్వరాలయానికి చేరుకున్నాం 5-20కి.

శ్రీ భీమేశ్వరాలయం

ఇది పెద్ద ఆలయమే. లోపలకు ప్రవేశించాక లోపల మండపంలో ఎడమవైపు చిన్న వినాయకుడు.. వెడల్పు ఎక్కువగా, ఎత్తు తక్కువగా వున్న విగ్రహం. లోపల ఒక చివర అయ్యప్ప పెద్ద విగ్రహమే. బహుశా అక్కడ భజనలు మాలాధారణ వగైరాలు జరుగుతాయేమో. ఒక చోట రుద్రాక్షలతో అలంకరించిన శివలింగం పొడుగ్గా వుంది. లోపల చుట్టూ విగ్రహాలు వున్నాయి కానీ పేర్లు తెలియలేదు. 3 అడుగుల ఎత్తున్న శివలింగం. నంది గర్భగుడికి ఇవతలవున్న మండపంలో వుంది.. చిన్నదే. శని త్రయోదశి కదా. ఇద్దరు బ్రాహ్మలు ప్రదోష కాల పూజలో వున్నారు.

వారిలో ఒకరి గురించి చెప్పారు మావాళ్ళు. ఆయన పేరు శంకర్ గారు. ముఖంలో వర్చస్సు ఉట్టిపడుతోంది. ఆయన ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరుట. 50 సంవత్సరాల పైనుంచి ఆయన ఆహారంగా ద్రవ పదార్ధాలే తీసుకుంటున్నారుట. ఘన పదార్ధలు తినరట.

శంకర్ గారితో మాట్లాడాలనిపించి నమస్కరించి మా వివరాలు చెబితే ఆయన ఆలయం గురించి కొన్ని వివరాలు చెప్పారు. ఆలయ నిర్మాణం క్రీ.శ. 1474లో జరిగిందిట. ఇంత చిన్న ఊరులో అంత పెద్ద ఆలయ నిర్మాణానికి కారణం ఏదో వుండి వుంటుందిగానీ, మనకి తెలియదన్నారు. ఉపాలయాల్లో పార్వతి, చండికేశుడు.

ఇక్కడ మరో విశేషం, శంకర్ గారు చెప్పిందే… స్వామి తూర్పు ముఖంగా వుంటే అమ్మ దక్షిణ ముఖంగా వుంటారు. దీనివల్ల చతుర్బాధా నివారణంట.

వేలూరు కోటలో లభ్యమైన శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని 7-1-1474న శ్రీ కృష్ణదేవరాయలు దర్శించారు.

9. కట్టమంచి

5-55 కి పూతలపట్టు నుంచి బయల్దేరి 17 కి.మీ.ల దూరంలో వున్న కట్టమంచి చేరుకున్నాము. ఇది విద్యావేత్త కట్టమంచి రామచంద్రరెడ్డి (సి.ఆర్. రెడ్డి) గారి స్వగ్రామం.

శ్రీ కుళందేశ్వరస్వామి ఆలయం

ఇక్కడ చోళులు కట్టించిన పురాతన ఆలయం శ్రీ కుళందేశ్వరస్వామిది వున్నది. వినాయకుడు, శనైశ్వరుడు, బాల కామాక్షి, దుర్గాదేవి, ఒక మండపంలో వినాయకుడు, నాగేంద్రుడు, మురుగన్, చంద్రుడు వగైరా మూర్తులు, ఉపాలయాలు వున్నాయి. భక్తులు బాగానే వున్నారు. పూజలు జరుగుతున్నాయి.

శ్రీ వరదరాజస్వామి ఆలయం

సాయంత్రం 6-40కి బయల్దేరి కట్టమంచిలోనే వున్న మహాలక్ష్మీ సమేత వరదరాజస్వామి ఆలయానికి వచ్చాము. ఇప్పటిదాకా చూసిన ఆలయాల్లో ఇక్కడే కొంత శిల్ప కళ వుంది శిల్పాలన్నింటికీ సేండ్ పాలిష్ చేశారుట. చూడటానికి బాగున్నాయి.

ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనది. చోళులు నిర్మించిన ఆలయం. చోళ రాజులు వారు శివాలయాలు నిర్మించిన ప్రతి చోటా శివ కేశవులకు బేధము లేదని నిరూపించటానికా అన్నట్లు విష్ణ్వాలయాలు కూడా నిర్మించారు. అందులో ఇది కూడా ఒకటి. భక్తుల సహకారంతో ఆలయం బాగానే నడుస్తోంది. ప్రతి రోజూ భక్తులు కూడా బాగానే వస్తారు. గుడి మాన్యాలున్నాయిగానీ అన్యాక్రాంతమయ్యాయి. స్వామిని పూలతో చక్కగా అలంకరించారు.

నిత్య పూజలు, పర్వదినాలలో విశేష పూజలతోబాటు రథ సప్తమికి, ఉగాదికి ఉత్సవాలు జరుగుతాయి. రథ సప్తమికి స్వామికి ఏడు వాహనాల సేవ వుంటుందిట.

అక్కడనుంచీ పొద్దున్న మొదలు పెట్టిన ఆలయం శ్రీ కామాక్షీ సమేత అగస్త్యేశ్వరస్వామి దర్శనం కాలేదుగదా అని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. శని త్రయోదశికి అన్ని శివాలయాలలో నందీశ్వరునికి ప్రదోషకాల పూజలు జరుగుతున్నాయి. అందుకని అన్నింటిలోనూ భక్తుల సంఖ్య ఎక్కువగానే వున్నది.

అప్పటికి 7-30 అయింది. ఇంక ఆ రోజుకి అలసిపోయామనుకున్నాము. సాంబశివరెడ్డిగారు వారి గురువుగారు శ్రీ యాగమూర్తి పిళ్ళెగారున్నారు. వారిదీ టి.పుత్తూరట. అక్కడ ఆలయం విషయాల్లో ఆయన కూడా సలహాలిస్తుంటే వీళ్ళు పాటిస్తారుట. ఆయన విశ్రాంత తెలుగు పండిట్. వారిని చూసి వెళ్దామంటే వారింటికెళ్ళాము. నా శ్రమని ఆయన మెచ్చుకున్నారు.

కొంత సేపు పిచ్చాపాటీ అయ్యాక బయల్దేరి విష్ణు భవన్‌లో టిఫెన్ తిని హోటల్‌కి వెళ్ళి పడుకున్నాము. హోటల్ బాగానే వుంది. అందులో రెడ్డిగారు అన్నీ కనుక్కుని, మా గురించి చెప్పి తీసుకోవటం వల్ల మాకు ప్రత్యేక మర్యాదలు కూడా. రేపటి విశేషాలు వచ్చేవారం మొదలు పెడతాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here