ప్రేమించే మనసా… ద్వేషించకే!-5

0
5

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“ప్రి[/dropcap]యమైన అక్కా!

ఇలా నేను ఇంత అర్ధాంతరంగా మిమ్ములందరిని విడిచి వెళ్లిపోతాను అనుకోలేదు కదూ! నేను యిలా చేయవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ప్రేమించే హృదయానికి ధైర్యం ఉండాలని అన్నాను. గుర్తుందా? డాడీకి ఎదురు నిలిచి వివాహం చేసుకొనే ధైర్యం లేక నేను ఈ పని చేయలేదు. నేను మనసా వాచా ప్రేమించిన సతీష్ డాడీ బెదిరింపులకు భయపడి పారిపోయాడు. అంతే కాదు నన్ను చూసి ప్రేమించలేదట. నా వెనక వున్న ఆస్తిని చూసి ప్రేమించాడట.”

“ఇక నీ కోసం ఎప్పటికైనా వస్తాను, ఏమో అని ఎదురుచూడటం మాత్రం చేయవద్దని – ప్రేమించిన హృదయానికి సూటిగా గుండెల్లోకి దిగిన కత్తి సూది మొనలాంటి ఉత్తరం నాకు అందించాడు ప్రక్కింటి ఇంటిగల వాళ్ల చేత.

కన్న వాళ్లను వదులుకోవటానికి సిద్ధపడి, ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాలని కలలుగనే ఆ కన్య మనసు, పిరికివాడై ఆ ప్రేమికుడు పారిపోతే ఎంత నరకం అనుభవిస్తుందో ఆలోచించక్కా!”

“పిరికివాడిని, మోసగాడిని ప్రేమించిన నా హృదయం పడుతున్న బాధ మాటల్లో వ్రాయలేనక్కా! కళ్లు పొరలు కమ్మి ఒక మోసగాడిని నమ్మి ప్రేమ అనే పదం నా హృదయంలో ఏర్పరచుకున్న పాపానికి నాకిదే తగిన శిక్ష అనిపించింది.”

“అక్కా! నువ్వు మాత్రం డాడీ బెదిరింపులకు భయపడి ఆత్మని చంపుకొని డాడీ మాటలకు తలవంచకు, నిన్ను ప్రేమించిన వాడి ప్రేమ నిర్మలమైనది అయితే!

“సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అని ఎవరన్నారో కాని సృష్టిలో తీయనిది ప్రేమించిన రెండు హృదయాలు ఒకటే కావటం తేనె పట్టులోని తేనెకన్నా తీయనిదని అనిపిస్తుంది నాకు.”

“ప్రేమించిన వాడు భర్త కావటం….. ఇల్లాలు…. తల్లి…., ఓహ్! ఊహ ఎంత తీయగా వుంది చెప్పు? ఊహలు, మనసు ఒకరితో పంచుకొని… మనువు వేరొకరితో ముడిపెట్టటం అంత పాపం… నరకం మరొకటి లేదక్కా. నా అనుభూతులు… ఊహలు అందుకొని ఆ పిరికి మోసగాడు పారిపోయాడు. ఇక ఊహలు… అనుభూతులు లేని శరీరం మరొకరికి డాడీ చెప్పినట్లు అప్పగించలేను. నేను వున్నా జీవచ్ఛవంలా బ్రతుకుదామన్నా డాడీకి, మమ్మీకి చివరికి నీ వివాహాంకి కూడా అడ్డే! అందుకే మనసు, కోరికలు లేని శరీరం ఉంటేనేం, ఉండకపోతేనేం అని వెళ్లిపోతున్నాను.”

~

చదవడం పూర్తి చేసి “చెల్లీ” అని పిచ్చిదానిలా అరచి పడిపోయింది సుజాత. ‘నువ్వు…. నువ్వు…. మనిషివి కావు దేవతవు. చదువులో మొద్దు, నలుగురిలోకి వచ్చి మాటాడలేని అమాయకురాలివి. అసలు ఇన్నాళ్లు నీలాంటి అమాయకురాలు ఈ లోకంలో ఉండదు అనుకున్నా. నీ అంతరంగం ఎంత పవిత్రమైనది. నీలాంటి పవిత్రమూర్తులు ఎంత మంది మన సమాజంలో కనిపిస్తారు చెల్లీ? నీలాంటి ఉత్తమురాలుని పోగొట్టుకున్న ఈ అక్క ఎంత దురదృష్టవంతురాలు’ అని కుప్పలా కూలిపోయింది సూజాత.

రోజులు దొర్లుతున్నాయ్!

కాలేజీకి వెళ్ళాలన్నా, ఇంట్లో జరిగింది సుదర్శన్‌తో చెప్పాలన్నా మనసులో ఏదో జంకు, భయం బయలుదేరింది.

సతీష్‌కీ, సుదర్శన్‌కీ ఎంత తేడా? దుర్మార్గుడు డబ్బు కోసం ఆశపడి చెల్లెలులో లేని పోని ఆశలు రేపి పారిపోయాడు… కాని తన చెల్లెలు మరణంతో సుదర్శన్ ఎంత భయపడిపోతున్నాడు…. తన ప్రేమకు డాడీ ఎక్కడ అడ్డుగోడ కడతారో ఏమో! అని ఇన్నాళ్లు తను ప్రేమ అంటే నిర్మలమైనది, రెండు హృదయాలు స్పందించి దగ్గర అయ్యేదే ప్రేమ అనుకుంది కాని…. ప్రేమలో మోసాలు, అన్యాయాలు ఉంటాయని… మనిషి ప్రాణం బలి తీసుకొనే శక్తి వుందని తనకు తెలియదు. రోజు ఫోనులో తను కాలేజికి రావటం లేదని, ఎంత కంగారు, బాధపడిపోతున్నాడు. డాడీ జారీ చేసినవన్నీ చెబితే భరించగలడా సుదర్శన్! ఆ ఆలోచనలతోనే కాలేజీకి చేరుకుంది సుజాత కారులో. డ్రైవరు డోరు తీసి పట్టుకున్నాడు.

కారు దిగింది. చకచక అడుగులు వేసింది. ఎదురుగా చెట్టుకి ఆనుకొని సుదర్శన్ నిలబడి వున్నాడు. ఈ రోజు తను కాలేజికి వస్తానని ఫోనులో చెప్పింది కదూ? తన కోసం ఎదురు చూస్తున్నాడు. తనను చూడగానే అంత వరకు మాములుగా వున్న కళ్లలో కాంతి వచ్చినట్లు కనబడింది సుజాతకు.

“హల్లో సుదర్శన్” అంటూ ఎదురుగా వెళ్లింది సుజాత. ఆ నిముషంలో తండ్రి పెట్టిన షరతులు ఏమి గుర్తుకు రాలేదు సుజాతకు. సుదర్శన్ గబగబా నాలుగు అడుగులు వేసి సుజాత దగ్గరకు వచ్చి “ఎంత పని అయింది సుజాత! ఫోనులో వివరాలు ఏమి చెప్పలేదు? సమత ఎలా పోయింది? నువ్వు… నువ్వు ఎలా అయిపోయావో తెలుసా? నేను… నేను ఇక్కడ ఉన్నానే గాని నా మనసంతా అక్కడే వుంది.” అని అంటున్న సుదర్శన్ వైపు చూసిన సుజాత ఏవో చెప్పాలన్నట్లు నోరు తెరిచి ఏదో గుర్తు వచ్చిన దానిలా చివ్వున తల త్రిప్పి వెనక్కి చూసింది.

డ్రైవరు రాజు నిలబడి దర్పంగా, ఠీవిగా సి.ఐ.డి. ఆఫీసరులాగా చూస్తున్నాడు.

ఛీ!…ఛీ!… తన డాడీ ఎంతకి దిగజారాడు? ఇంటిగుట్టు రట్టు చేయటం కదూ? వెధవ ఎంత దర్జాగా చూస్తున్నాడు. వాడిని అలా చూస్తుంటే ఏదో తెలియని మొండి ధైర్యం వచ్చేసింది సుజాతకు.

“రా సుదర్శన్” అని చేయిపట్టి లాగి క్రింద కూర్చుంటూ “ఇంకా చాలా టైం వుంది. నీతో చాలా మాట్లాడాలి” అని పచ్చగడ్డి మీద చతికిలపడింది.

సుజాతకు ఎదురుగా కూర్చున్నాడు సుదర్శన్. మోకాళ్ల మీద గడ్డం ఆనించి, పుస్తకాలు క్రింద పెట్టి గడ్డిని తెంచుతూ కళ్లు ఎత్తి కొంచెం తల ప్రక్కకు త్రిప్పి చూసింది. మరింత పోజుగా జేబులో చేయి పెట్టుకొని మరీ చూడసాగాడు రాజు. సుజాతలో ఎక్కడలేని కోపం, ఆవేశం చోటు చేసుకుంది. వాడికి తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన తోనే బలవంతాన నవ్వు తెచ్చుకొని సుదర్శన్ భుజం మీద ఏదో వున్నట్లు చేత్తో దులిపి రాజు వున్నాడా? లేడా? అన్నట్లు తిరిగి చూసింది.

రయ్ మని వాడు వెనక్కి తిరిగి కారులో కూర్చుని ధన్ మని డోర్ వేసుకున్నాడు. సుదర్శన్‌కి సుజాత ప్రవర్తన అర్థంకాక అయోమయంగా చూసాడు. “ఏమిటి సుజాత నువ్వీ రోజు..” అని సుదర్శన్ మాట పూర్తి చేయకుండానే “అటు చూడు సుదర్శన్ మా డ్రైవరు ఇటే చూస్తున్నాడు.” అని జరిగినదంతా చెప్పింది సుజాత.

ఆమె కళ్ల వెంట కన్నీళ్లు చెక్కిళ్ల మీద నుండి క్రిందకు జారసాగాయి. సుజాతంటే ప్రేమతో చూసే ఆ కళ్లు జాలిగా చూస్తున్నాయి. అతని మనసు వేదనతో వేగిపోతుంది.

***

కాలేజి నుండి వచ్చి హాల్లో అడుగు పెట్టిన సుజాతకు సోఫాలో కూర్చున్న పరమేశ్వరరావు గారు కనిపించారు.

ఎందుకో సుజాతకు తెలియకుండానే గుండెలో దడ ప్రారంభమయ్యింది. అడుగులు తడబడ్డాయి. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తన గది వైపు నడకసాగించింది సుజాత.

“ఆగు ఇలారా!” అన్న పరమేశ్వరరావుగారి కంఠం వినబడటంతో అడుగులు ముందుకు పడనట్లు ఆగిపోయాయి.

“నేనేం చెప్పాను? నువ్వేం చేసావు? నా మాట అంటే అంత లెక్క లేకుండా పోయిందన్నమాట. అసలు నీ ఉద్దేశం ఏమిటి చెప్పు!” అన్నారు కోపంగా పరమేశ్వరరావుగారు.

“నిన్నే! ఈ ఒక్కసారి ఊరుకుంటున్నాను. మరోసారి ఇలా జరిగిందో కన్న కూతురివైన నిన్ను క్షమించను. అర్థం అయిందా?” అన్నారు.

“డాడీ…. డాడీ మీరు యిలా అనటం న్యాయమేనా? నేను…. నేను…. ఈ రోజు మీరు…. అతన్ని చూడవద్దు…. మాట్లాడవద్దు అంటే ఎలా? నేను…. నేను…. ఎలా వున్నా అతను నన్ను చూడకుండా ఒక్క నిముషం ఉండలేడు…. నేను లేకపోతే అతను లేడు… అతను సతీష్ లాంటి మోసగాడు గాదు.”

చెంప చెళ్లు మంది. “నోరుముయ్! బెల్లం చుట్టూ ఈగలు చేరుతాయి. వెధవ! దరిద్రుడు నీ కోసం కాదు… నీ డబ్బు కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఉండడూ? వాడి మాట ఎత్తటం కాని, వాడి వైపు చూడడటం కాని చేశావో ఒళ్లు చీల్చేస్తాను.” అని కోపంగా ఊగిపోసాగారు.

కొట్టిన చెంప మీద చేయి ఆన్చి, కళ్ల నుండి కారుతున్న కన్నీళ్లు కుడి చేత్తో తుడుచుకొని…. నిర్భయంగా తండ్రి కళ్లల్లోకి చూస్తు “డాడీ… మీరు ఈ రోజు నన్ను మరచిపొమ్మంటే, అతనితో మాట్లాడవద్దు అంటే సరిపోదు. మీరు నన్ను చంపినా సరే! నా చివరి ఊపిరి ఉన్నంత వరకూ నేను… నేను…. అతనిని అతను నన్ను మరచిపోలేం డాడీ.” అని దృఢ నిశ్చయం చేసుకున్న దానిలా అంది.

“ఛీ… ఛీ… దరిద్రపు మొఖమా! ఇంకా నన్ను ఆ పేరు పెట్టి పిలవకే. నేను… నేను… చూస్తానే… నీవు వాడిని… వాడు నిన్ను ఎలా మర్చిపోరో? ఈ పరమేశ్వరరావు కులం కోసం… మాట కోసం ఎంత పనైనా చేస్తాడే! నా కడుపున ఇద్దరు చెడపుట్టారే” అన్నారు ఆవేశంగా.

వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవాలన్నట్లు తన గదిలోకి పరుగెత్తింది సుజాత.

***

బుక్సు పట్టుకొని బయలుదేరుతున్న సుజాత దగ్గర కొచ్చి “ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్లటానికి వీలు లేదు” అన్నారు పరమేశ్వరరావుగారు.

“డాడీ” అంది కంగారుగా.

“మనం కాశీ వెళుతున్నాం” అన్నారు.

“డాడీ, ఎగ్జామ్స్ మరో పదిరోజుల్లో వున్నాయి. మీరు మమ్మీ వెళ్లండి” అంది అంత కన్నా ఏమనాలో తెలియదన్నట్లు.

“లేదు, రిజర్వేషను ముగ్గురికి అయిపోయింది. బయలుదేరటానికి సిద్ధం చేసుకో. నాలుగు రోజుల్లో తిరిగి వచ్చేస్తాం” అని మరో మాటకు అవకాశం యివ్వకుండా చకా చకా నాలుగు అంగల్లో గది దాటి బయటకు వెళ్లిపోయారు.

తండ్రి వెళ్లిన మరు క్షణం సుజాత మనసు రకరకాల ఆలోచనలతో సతమతం కాసాగింది…

‘డాడీ నోరు తెరచి చెప్పటం ఇష్టం లేక కాని యిపుడు కాశీ ఎందుకు? కన్న కూతురు… తనకి ఇష్టం లేని మార్గంలో అడుగు పెట్టిందని కోపం తెచ్చుకున్నారు గాని… వాత్సల్యం ఎక్కడికి పోతుంది?… మన సాంప్రదాయాలు… ఆచారాలు చిత్రమైనవి… క్రూరమైనవి అయినా విలువనిచ్చే పూర్వకాలపు మనిషి… అంతే కాదు నిష్ఠనియమంగల కుటంబంలో పుట్టిన మనిషి…. పైకి చెప్పుకోలేక, లోపలకు దిగ మింగలేక కూతురు పోయినందుకు డాడీ మనసు ఎంత రంపపుకోత అనుభవిస్తుందో? సమత మీద ఎంత వాత్సల్యం లేకపోతే అస్తికలు కలుపడానికి ఎందుకు బయలుదేరుతారు కాశీ!….’ చెల్లెలు సమత గుర్తుకు రాగానే బాధతో నిండిపోయింది సుజాత మనసు.

ఎగ్జామ్సు రెండు రోజులుండాయనగా కాలేజికి వచ్చింది సుజాత. ఇన్నాళ్లు అల్లరి చేస్తూ… కాలేజి అన్నా, చదువన్నా మాకు లెక్కలేదనట్లు ప్రవర్తించిన విద్యార్థులే పరీక్షల్లో ఏం వస్తాయో! ఏం చదవాలో మొదలైన విషయాలపై ఒకరితో ఒకరు చర్చించుకోవటం మొదలు పెట్టారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here